ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 23

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 22

భగవద్రామానుజులు అనుగ్రహించిన గ్రంధాల లోతైన అధ్యయనము:

                  భగవద్రామానుజుల గ్రంధాలను లోతుగా అధ్యయనము చేస్తేగాని అర్థం కావు.  వారి మాటలలోని అంతరార్థాలను తెలుసుకోకుండా పై పై పదాలను మాత్రమే చదివితే అర్థం కావు. ఆళవందార్లు, ఆళ్వార్లు , భట్టరు , వేదాంతదేశికులు మొదలైన వారి రచనలతో పోల్చి చూసినప్పుడు వీరి శైలి, పదవిన్యాసంలో, వాక్యనిర్మాణంలో అంతరార్థాల  విషయంలో ఈ భేదం స్పష్టంగా కనపడుతుంది.

                  భగవద్రామానుజుల గ్రంధాల అధ్యయనము చేయడానికి ఉద్యమించినవారు పదాలకూర్పును, చెప్పే శైలిని చూసి మురుసిపోయి అక్కడే ఆగిపోతే అంతరార్థాలు బోధపడవు, రామానుజుల మనసు అర్థంకాదు. భగవద్రామానుజుల గ్రంధాలు నమ్మాళ్వార్ల రచనలనే కాక ఇతర గ్రంధాలను కూడా ఎంత విస్తారంగా ప్రతిధ్వనిస్తున్నాయో ఒక్కసారి చూద్దాము.

గీతా భాష్యం ప్రారంభంలో భగవద్రామానుజులు ఆళవందార్లను స్తుతిస్తూ చేసిన తనియన్ ను మొదట చూద్దాం .

యత్పదాంభోరుహధ్యానవిద్వాస్తాశేషకల్మషః  !

వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం !!

               భగవద్రామానుజులు పంచాచార్య పదాశ్రితులన్న విషయం జగద్విదితం. ఎందుకు వీరు పంచా చార్యులను ఆశ్రయించారంటే ఆళవందార్లను ప్రత్యక్షంగా ఆశ్రయించలేక పోయారు. భగవద్రామానుజులు శ్రీరంగం చేరక ముందే ఆళవందార్లు పరమపదించటం వలన వారి దగ్గర అధ్యయనం చేయలేక పోయారు. ఆళవందార్లు అప్పటికే తమ ప్రియశిష్యులు ఐదు గురిని రామానుజులకు శ్రీవైష్ణవ సాంప్రదాయ విషయాలన్నింటిని విశదపరచమని ఏర్పాటు చేశారు.  శ్రీకృష్ణుడికి సాందీపుడు అరవై నాలుగు కళలు నేర్పినట్లు ఐదుగురు ఆచార్యులు రామానుజులకు సంప్రదాయ రహస్యాలను బోధించారు. అర్థాత్ భగవద్రామానుజులు ఆళవందార్ల మనోభావాలను ఐదుగురు ఆచార్యుల ముఖంగా అందుకున్నారు. అందువలననే గీతాభాష్య ప్రారంభంలో తమకు ప్రత్యక్షంగా బోధించిన ఆచార్యులను కాక తమ పరమాచార్యులైన ఆళవందార్లను స్తుతించారు.

                  కూరత్తాళ్వాన్,  పరాశరభట్టర్, వేదాంత దేశికులవారు వారి గ్రంధాలలో గురుపరంపరతో సహ ఆచార్యులందరిని ప్రస్తావించారు.  రామానుజులు మాత్రం ఎందుకు గురుపరంపరను, తమ ఆచార్యులను స్తుతించలేదన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది.

            రామానుజులు ఈ తనియన్లో వారందరిని ప్రత్యక్షంగా ప్రస్తావవించకపోయినా పరోక్షంగా ప్రస్తావన చేశారన్నది స్పష్టంగా కనపడుతుంది. అదెలాగంటే …….

              “యత్పదాంబోరుహ”  అన్న పదంలో “య్, అ, త్ , ప్, అ, త్, అ, మ్, ప్,  ఓ, ర్, ఉ, హ్, అ” అన్న పద్నాలుగు అక్షరాలు ఉన్నాయి. వాటిని ఏడు పాదాలజంటలకు సంకేతంగా తీసుకోవాలి. ఈ ఏడుగురు ఎవరంటే వారి ఆచార్యులైన ఐదుగురు, ఆళవందార్లు , నమ్మాళ్వార్లవిగా స్వీకరించాలి .

                 ఇదే విషయాన్ని మరొక విధంగా చూస్తె “యత్పదాంబోరుహ”  అన్న పదం షష్టి తత్పురుష సమాసంగా తీసుకుంటే ‘యస్య- పదాంబోరుహ ’ అని విడదీయాలి . “ఎవరి పాద పద్మాలో !….” అన్న అర్థం లో

దీనికి  మళ్ళి మూడు రకాలుగా  అర్థం చెప్పుకోవచ్చు .

  1. ఆళవందార్ల శ్రీపాద పద్మాలను వారి తిరుమేనిలో చూసి నమస్కరించటం .
  2. ఆళవందార్ల శ్రీపాదాలు – అంటే … వారిచే అర్చించబడ్డ పరమాత్మ .
  3. ఆళవందార్ల శ్రీపాదాలు – అంటే …  శిష్యులను ఆచార్యుల శ్రీపాదాలుగా భావించడం మన సంప్రదాయం కావున  ఆళవందార్ల శ్రీపాదాలంటే వారి శిష్యులైన రామానుజుల ఆచార్యులు ఐదుగురు.

* “పదాంబోరుహ” అన్న శబ్దం ‘ప’ అన్న అక్షరంతో మొదలవుతుంది. పెరియనంబులు రామానుజులకు పంచ సంస్కారం చేసి మంత్రోపదేశం చేశారు. వారి తిరునామం పరాంజ్ఞుశ దాసులు, ఇక్కడ ‘ప’ అన్న అక్షరం పరాంజ్ఞుశ దాసులకు సంకేతంగా స్వీకరించాలి .

                            పై వివరణ ప్రకారం రామానుజులు తమ గీతా భాష్యంలోని ఆచార్య తనియన్లో గురుపరం పరను స్మరించారని పెద్దలు నిర్వహం చేశారు. కూరత్తాళ్వాన్ శిష్యులైన తిరువరంగత్తముదనార్లు తమ రామానుస నూత్తందాదిలో రామానుజులకు వారి పూర్వాచార్యులతో ఉన్న సంబంధాన్నే ప్రముఖంగా ప్రస్తావించారు.

                           జ్ఞాన సంపన్నుల లక్షణము ఇక్కడ చక్కగా వవరించబడింది. సాధారణ కవులయితే పదముల అర్థంతో ఆగుతారు. జ్ఞానుల రచనలలో అంతరార్థాలను తరచి చూడకపోతే విషయం బోధపడదు. రామానుజులవారు అనుగ్రహించిన గ్రంధాలకు కాలం ఎంత పెరిగినా అర్థాలు మాత్రం నిత్య నూతనంగానే ఉంటాయి.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://granthams.koyil.org/2018/02/21/dramidopanishat-prabhava-sarvasvam-23-english/

archived in https://granthams.koyil.org/

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org

Leave a Comment