ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 24

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 23

ఉపనిషత్ వాక్యాలు పరస్పర విరుద్ధంగా గోచరిస్తాయి, వేరు వేరు అర్థాలను చెప్పినట్లుగా కనపడతాయి. కానీ తరచి చూస్తె సత్యం బోధపడుతుంది.

కొన్ని వాక్యాలు జీవాత్మ పరమాత్మా వేరని చెప్పగా మరికొన్ని అభేదం చెపుతాయి.

               వేదాంతులెవరూ జీవాత్మ తత్వాన్ని తృణీకరించలేరు. లోకంలో సుఖదుఃఖాలను అనుభవించేది ఎవరు? అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఏతత్వజ్ఞాని కూడా పరమాత్మ అని చెప్పరు. కావున జీవాత్మ భావాన్ని అంగీకరించేతీరాల్సి వుంటుంది.  పైగా పరమాత్మ, జీవాత్మ ఒకటే అని సిధ్దాంతికరించిన వారు కూడా లోకంలో సుఖదుఃఖాలను అనుభ వించే జీవాత్మ పరమాత్మను పోలిన వాడని చెపుతారు కానీ పరమాత్మ అని చెప్పారు.. ఇలా చెప్పటం వలన జీవపర ఐక్యం అన్న వాదన బోధింపబడుతుంది . జీవాత్మ పరమాత్మ భావాలు ఒకటి కాదు, అందుకని వ్యతిరేకమైనవి కావు. జీవాత్మ అనేవాడు పరమాత్మ యొక్క మనో, జ్ఞాన, ఉపాదుల వలన ఏర్పడిన వాడు అని చెప్పటం వలన జీవాత్మ పరమాత్మా ఒక్కటే అన్న సిద్దాంతం చేయబడింది. వేదాంత సిద్దాంతలన్నింటిలో జీవాత్మ పరమాత్మ భావాలను ఒప్పుకుంటారు. కానీ అన్వయంలోనే భేదాలు వస్తాయి.

                జీవాత్మ పరమాత్మ సంబంధ విషయమైన ప్రశ్నను పరిష్కరించడంలో వేదాంతులలో భిన్న స్వరాలు వినిపిస్తాయి. అద్వైతులు ఈ భేదభావాన్ని గౌణంగా పరిగణిస్తారు. అద్వైతుల వాదనలో జీవపరభావం  జీవుడికి అజ్ఞానం ఉన్నంత వరకే, ఒకసారి అజ్ఞానం తొలగి జ్ఞానం ఏర్పడితే  జీవుడు పరమాత్మలో ఐక్యం చెందుతాడు. అప్పుడు జీవపర భేదం అన్న ప్రశ్నకు అవకాశమే లేదు అని చెపుతారు. ఈ సిద్దాంతాన్ని నిరూపించటానికి ఉపనిషత్తుల నుండి, వేదాల నుండి అనేక వాక్యాలను ఉటంకిస్తారు.

                 భేద శృతిని చెప్పేవారు విభిన్నమైన రీతిలో వాదిస్తారు. వీరు అద్వైతులు దర్శించిన అభేద శ్రుతులను అంగీకరించరు. జీవాత్మ, పరమాత్మ  వేరు వేరు అన్న తత్వాలని అంగీకరిస్తారు. అచేతన భౌతిక ప్రపంచంలాకాక జీవాత్మ, పరమాత్మ ఇద్దరు స్వతంత్ర ఆత్మలని, చేతనులని, ఇద్దరి మధ్య భేదం ఉందని భావిస్తారు. అజ్ఞానమేజీవాత్మ,పరమాత్మల మధ్య భేద భావానికి కారణమని అద్వైతులు చెప్పే సిధ్దాంతాన్ని పూర్తిగా ఖండిస్తారు. దీనికి వారు లెక్క లేనన్ని ఉపనిషత్ వాక్యాలను ఉదాహరణగా ఉటంకిస్తారు.

                  వీరు తమ వాదనకు అనుకూలమైన శృతి వాఖ్యాలను మాత్రం గ్రహించి, వ్యతిరేకంగా ఉన్నవాటిని పూర్తిగా తృణీకరిస్తారు. అనుకూలమైన వాటిని మాత్రంగ్రహించి  వ్యతిరేకమైన వాటిని వదిలివేయటం శాస్త్ర సమ్మతం కాదు.

                   భేదాభేద వాదులు రెండు ఆత్మలను అంగీకరిస్తున్నారు.  అయితే అది ఎంత వరకు అంటే వాళ్ళు ఏ వాదానికి సంబంధించిన వాళ్ళో అంతవరకు మాత్రమే. వీరు కొత్త విధమైన తత్వావిచారం ఎమీ చేయటం లేదు. ఉన్న దానినే మళ్ళి చెప్పారు. ఈ భేదాభేద వాదాన్ని స్వీకరిం చడానికి కానీ, తృణీకరించడానికి కానీ సరి అయిన ఉపనిషత్ వాక్యాలను ఏవి  ఉదాహరించి చూపటం లేదు.

                 విశిష్టాద్వైతంలో ఉపనిషత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వీరు భేదం లేక ఐఖ్యం అన్న అర్థాన్ని స్పురింపజేసే  ఉపనిషత్ వాక్యాలను గొప్పవని అంగికరించట, తక్కువని త్రుణీకరించటమో లేదు. ఈ ప్రశ్నకు జవాబు ఉపనిషత్ లోనే దొరుకుతుంది దీనికోసం ప్రత్యేకమైన గ్రంధాల నుంచి ఉదాహరించాల్సిన అవసరం లేదు. ఉపనిషత్ చూపే మార్గంలో పొతే చాలు పరిష్కారం దొరుకుతుంది అన్నది వీరి భావాన.

విశిష్టాద్వైతంలో మూడు రకాల ఉపనిషత్ వాక్యాలను పరిగణనలోకి తీసుకుంటారు.

  1. భేదశృతి – జీవాత్మ పరమాత్మా వేరు వేరు అని తెలిపే శృతి వాక్యాలు.
  2. అభేద శృతి –  జీవాత్మ పరమాత్మా వేరు కాదు. ఒకటే అని తెలిపే శృతి వాక్యాలు.
  3. ఘటక శృతి –  జీవాత్మ పరమాత్మా వేరు కాదు అని, వేరు వేరు తత్వాలని తెలిపే శ్రుతులకు భిన్నంగా ఉన్నరెండు రకాల శృతి వాక్యాలను ఏకంగా క్రోడీకరించినవి.

మొదటి రెండు వాదనలను చూసాము కాబట్టి మూడవ వాదనను చూద్దాం.

                   వీటిలో ముఖ్యమైన భాగాలు ప్రాచీన ఉపనిషత్తులుగా చెప్పబడే అంతర్యామి బ్రాహ్మణంలోను, సుభాలోపనిషత్తులోను కనపడతాయి . వీటిలో జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం శరీరాత్మ సంబంధం వంటిదిగా చెప్పబడింది. జీవాత్మ పరమాత్మ ఆధ్యాత్మిక శరీరం, పరమాత్మ చేతనాచేతనములన్నింటిని తన శరీరముగా ఉన్నవాడు. కావున పరమాత్మ జీవాత్మకు అంతర్యామి, అంతరాత్మ. ఈ సంబంధము జీవాత్మకు, పరమత్మకు నిత్యమైంది. ఇది లేకపోతె వారు లేరు. అర్తాత్ జీవాత్మ పరమాత్మ ఇద్దరూ ఒకటే, కానీ. కావున శరీర భేదంతో ఇద్దరూ వేరుగా ఉన్నారు. వాళ్ళు ఒకే వ్యక్తిగా ఉన్నారు. స్వామి రామానుజులు శరీరం, ఆత్మ రెంటిని స్పష్టంగా వివరించారు, ఇది ఇక్కడ అప్రస్తుతం.

            విశిష్టాద్వైతులు అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం మూడు నిత్యమని చెపుతారు. జీవాత్మ స్వరూపం, స్థితి, కర్మాచరణ అన్ని పరమాత్మలోనే చేరి వున్నాయి. జీవాత్మ లేకుండా పరమాత్మ, పరమాత్మ లేకుండా జీవాత్మ లేరు. ఈ తత్వంలోనే వారిరువురి స్వరూపం సిద్దిస్తుంది. స్వభావ రీత్యా ఆ రెండు వేరు వేరుగా ఉంటాయి, పరమాత్మ ఈ సంసారంలో కట్టుబడడు, వీటికి అతీతమైన వాడు.  పరమాత్మ సకల కల్యాణగుణ పరిపూర్ణుడు, అపహతపాప్మ.  ఏ పాపములు అంటని వాడు. సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, సర్వాంతర్యామి. సృష్టి, స్థితి, సంహారం చేయగల వాడు. కాలప్రమాణాలకు అందనివాడు .జీవాత్మ, సంసారం, సుఖం దుఃఖం కర్మబంధనాలకు కట్టుబడ్డ వాడు తనను తాను రక్షించుకోలేనివాడు, పూర్తిగా పరమాత్మ మీద ఆధారపడిన వాడు, వాడికే స్వాభావికంగా దాసుడు, ఈ విషయాన్ని మరచిపోయిననాడు దుఃఖిస్తున్నాడు. ఈ రకంగా పరమాత్మా, జీవాత్మ పూర్తిగా వేరువేరు తత్వాలు. ఉపనిషత్తులలోని ఘటక శృతి ఆధారంగా ఈ శరీర శరీరీ భావాన్నిబట్టి ఈ రెండు ఒకే సమయంలో వేరుగానూ, ఒకటిగాను  అర్థం చేసుకోవచ్చు . ఈవిధంగా  ఉపనిషత్తులలోని భేదాభేద గందరగోళానికి విశిష్టా ద్వైతంలో పరిష్కారం లభిస్తుంది. విశిష్టాద్వైతం కొత్తదో లేక విప్లవాత్మకమైన మార్పో కాదు. బోధాయనులు, వేదాంతులు,  టంకణులు, ద్రమిడులు, గుహదేవులు, వంటి మహర్షుల మనోభావాలకు సంబందించిన స్మృతి, శృతి, ఇతిహాస, పురాణాలకు సరిపోయే విధంగా వివరించటమే దీని లక్ష్యం. వైధికమైన భారతదేశపు ఉన్నతమైన సంప్రదాయాలను, అర్థవిశేషాలను కాపాడటం, ఈ దేశ ప్రాచిన వేదాంత పరంపరను రక్షించటం విశిష్టాద్వైతం యొక్క లక్ష్యం. ఒక రకమైన వాదన చేసేవారు తక్కువ అని మరొకరు ఎక్కువ అని భావించక అందరిని, అన్నింటిని సమన్వయపరచటయే ఈ సిధ్దాంతంలోని గొప్పదనం. ఉపనిషత్తులలోని సకల వాక్యాలను సమన్వయపరచేదే విశిష్టాద్వైతం. ఉపనిషత్తుల నుండి కర్మ, జ్ఞాన, భక్తి , ప్రపత్తి మార్గాలకు సంబంధించిన సూత్రాలను  క్రోడికరించి ఆచరింప చేయటమే విశిష్టాద్వైతం ఔన్నత్యం.

                మన ఆచార్యులు ఇతర సిధ్ధాంతపరులని చూడకుండా వదిలివేసిన ఘటక శృతులను ఉపనిషత్తులలో శోధించి ప్రవచించగలిగారంటే ఆళ్వార్ల దివ్యప్రబంధమే దానికి పక్కబలంగా ఉపకరించిందని పెద్దల అభిప్రాయము. తిరువాయ్మొళి మొదటి రెండు పత్తులు (రెండు వందల పాశురాలు) బ్రహ్మ సూత్ర సారాన్నే చెపుతున్నది.

                    ఆళ్వార్ల  “ఉడల్ మిసై ఉయిరెన కరన్దెగుం పరన్దుళన్” (తిరువాయ్మొళి 1-1-7) అన్న పాశుర భాగం ఉపనిషత్ వ్యాక్యాలు చెప్పే ఘటక శృతినే వివరిస్తున్నది.

                      శరీర శరీరి  భావాన్ని ఇక్కడ ఆళ్వార్లు చక్కగా చూపించారు. స్వామి రామానుజులు ఈ పాశురాలలో ఉపనిషత్ సారాన్ని, బ్రహ్మసూత్రాలను దర్శించగలిగారు .

                     ఇక్కడ మాత్రమే కాదు మరొక సందర్భంలో కూడా ఉపనిషత్తులలోని ప్రశ్నలకు ఆళ్వార్ల తిరువాయ్మొళిలో జవాబు లభిస్తుంది. అది కూడా చూద్దాం.

                    ఉపనిషత్ వాక్యాలు కొన్ని బ్రహ్మ నిర్గుణుడని చెపుతుంది. మరికొన్ని సూత్రాలు బ్రహ్మ సగుణుడని, సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడని చెపుతుంది. వివిధ వ్యాఖ్యానాలలో వేరు వేరుగా వివరణ ఇవ్వబడింది. విశిష్టా ద్వైతులు దీనిని రెండు పక్కలుగా వివరించారు. బ్రహ్మకు హేయగుణములు లేవు కానీ కళ్యాణ గుణములున్నాయి అని ఉపనిషత్ వాక్యాల ఆధారంగా  విశిష్టాద్వైతులు వివరణ ఇచ్చారు. హేయగుణములు నిర్గుణం. కళ్యాణ గుణములు సగుణం.

                      ఆళ్వార్ల తిరువాయ్మొళిలోనే ఈ వివరణ కూడా కనపడుతుంది. సకల చరాచర ప్రపంచానికి నాయకుడైన పరమాత్మ సకల కళ్యాణ గుణములు కలవాడు .

                       బ్రహ్మ అన్న పదమే ‘బృ’ అన్న ధాతువు నుండి పుట్టింది. ‘బృ’అంటే పెద్ద అని అర్థము కదా!

                   స్వామి రామానుజులు బ్రహ్మ అన్న శబ్దాన్ని ఆళ్వార్ల తిరువాయ్మొళిలోని పాశురాన్నే తీసుకొని  వివరణ ఇచ్చారు.

‘ఉయర్వర ఉయర్నలం ఉడైయవన్ ఎవన్ వన్’

ఉయర్ వర = అనవధికాతిశయ

ఉయర్ =అసంఖ్యేయ

నలం ఉడైయవన్= పురుషోత్తముడు

ఆళ్వార్ల మనసు ఆచార్యులైన స్వామి రామానుజుల నోట పలకగా విన్నవారే అదృష్టవంతులు కదా!

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://granthams.koyil.org/2018/02/22/dramidopanishat-prabhava-sarvasvam-24-english/

archived in https://granthams.koyil.org/

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org

Leave a Comment