శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.
దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/08/08/virodhi-pariharangal-34-telugu/
ఆప్త అంటే నమ్మదగిన వ్యక్తి / అంశం లేదా శ్రేయోభిలాషి అని అర్థం. సాధారణంగా ఫలాన్ని ఆశించకుండా ఇతరుల శ్రేయస్సుకై పాటుపడే వాడిని ఆప్తుడు అంటారు – స్నేహితులలో ఉత్తమమైనవాడు (ఆప్త మిత్రుడు). తిరువాయ్మొళి 10.1.6 లో నమ్మాళ్వార్ తిరుమోగూర్ పెరుమాళ్ని తిరుమోగూర్ ఆత్తన్ అని ప్రశంసించారు. ఆత్తన్ (తమిళ పదం) అంటే ఆప్తుడు అని అర్థం. అనువాదకుల గమనిక: ఈ విభాగంలో, ప్రప్పన్నుని శ్రేయస్సుకు అవసరమైన అంశాలు చర్చింబడ్డాయి – ఇందులో తమ స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, భగవాన్, భాగవతులు, ఆచార్యులు మొదలైన వారి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం కూడా చర్చించబడ్డాయి.
- భగవత్ / భాగవత సంబంధము ఉన్న వారిని నిర్లక్ష్యం చేయడం ఒక అడ్డంకి. భగవాన్ మరియు భాగవతులతో సంబంధము ఉన్న వారెవరైనా సరే – వారిని మన శ్రేయోభిలాషులుగా భావించి వారిని ఆదరించాలి. అనువాదకుల గమనిక: శ్రీకృష్ణుడు స్వయంగా భవవద్గీత 7.19 లో “బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే| వాసుదేవ సర్వమితి స మహాత్మా సు దుర్లబః ||”. జీవాత్మ ఎన్నో జన్మల తరువాత నిజమైన జ్ఞనాన్ని పొంది నన్నాశ్రయిస్తాడు. వాసుదేవుడే సర్వాధారం (మాధ్యమం, లక్ష్యం మొదలైనవి) అని అర్థం చేసుకున్నవాడు గొప్ప వ్యక్తి, చాలా అరుదుగా కనిపిస్తారు. అదేవిధంగా, భగవాన్ స్వయంగా వైష్ణవుల ఎనిమిది విశేష లక్షణాలను వివరిస్తున్నారు. వాటిలో, మొదటి వైష్ణవ గుణం “మద్భక్త జన వాత్సల్య” – తన భక్తుల పట్ల విశేష అనురాగం ఉండటం. అది కూడా “వాత్సల్య” అనే పదాన్ని ఇక్కడ ఎమ్పెరుమాన్ ఉపయోగిస్తున్నారు. వాత్సల్యం అంటే తల్లి ప్రేమ / సహనం – పిల్లల లోపాలతో సంబంధం లేకుండా ఒక తల్లి తన బిడ్డలను ప్రేమిస్తుంది, వైష్ణవుడు ఇతర వైష్ణవుల లోపాలను చూడకుండా వారికి గౌరవించాలి. ఈ రెండు ప్రమాణాల ద్వారా, భగవాన్ మరియు భాగవతుల పట్ల భక్తి ప్రేమలు ఉన్న వైష్ణవులను గౌరవించాలన్న ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. వైష్ణవులను నిర్లక్ష్యం చేయడం తగదని మనం అర్ధం చేసుకోవాలి, ఎందుకంటే అది వారిని అగౌరవించినట్లవుతుంది కాబట్టి.
- భగవత్ / భాగవత సంబంధము లేని వారిపై ప్రేమ / అనురాగం చూపించడం ఒక అడ్డంకి. ఇది మునుపటి వివరణకు సంబంధించినది. భౌతికవాదుల పట్ల మనం ఆసక్తి చూపకూడదు. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యులు శ్రీవైష్ణవుల దినచర్యను వివరిస్తున్నారు. అనేక విషయాలలో వారు “అహంకార అర్థ కామంగల్ మూన్ఱుమ్ అనుకూలర్ పక్కలిలే అనాధరత్తైయుమ్ ప్రతికూలర్ పక్కలిలే ప్రావణ్యత్తైయుం, ఉపేక్షిక్కుమవర్గళ్ పక్కలిలే అపేక్షైయుం పిఱప్పిక్కుం” అని వివరిస్తున్నారు. మాముణులు ఈ అంశానికి అందమైన వివరణ ఇచ్చారు. ముఖ్యమైన మూడు అంశాలు ఇక్కడ చర్చించబడ్డాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. 1. శ్రీవైష్ణవులు మనకి అనుకూలర్లు (అనుకూలమైనవారు) – వాళ్ళు మన ప్రభువులు. మనం వారిని చూసినప్పుడు, వారి పట్ల ఎంతో గౌరవంతో వెంటనే నిలబడాలి. కానీ, అహంకారం (తమను తాము స్వతంత్రుడని భావించడం) వారిని విస్మరించడానికి దారితీస్తుంది. అహంకారం తనను గొప్పవాడిగా భావింప జేసి, ఇతరులను గౌరవించకుండా ఆపుతుంది. 2. భౌతిక వ్యక్తులు మనకి ప్రతికూలర్లు (ప్రతికూలమైనవారు). అర్ధం అంటే భౌతిక సంపద. మనం సంపదను కోరడం ప్రారంభించినప్పుడు, ఆ సంపదను పొందడానికి ఎవరినైనా ప్రశంసించేందుకు సిద్ధపడతాము. అందువల్ల భౌతిక సంపద, కీర్తి మొదలైన వాటిపై ఉన్న కోరిక, ప్రతికూల వ్యక్తులను ప్రశంసకు దారితీస్తుంది. 3. కామంతో ఉన్న స్త్రీలను ఉపేక్షిక్కుమవర్ (మన గురించి పట్టించుకోని వారు) అని అంటారు. అపేక్ష అంటే కోరిక. తమలో కామము పెరిగినప్పుడు, ఆ స్త్రీ అతన్ని పట్టించుకోకపోయినా/ అవమానించినా, తన పరువుపోయినా సిగ్గుపడకుండా ఆమెను పొందటానికి వెనుకాడాడు. అందువల్ల, ఈ 3 ఆపదలను తెలుసుకొని జాగ్రత్తగా వాటికి దూరంగా ఉండాలి .
- స్వకీయ స్వీకార నిష్ఠ (మన కృషిలో నమ్మకం) ఉండటం ఒక అడ్డంకి. మనం దేనినైనా కోరుకున్నప్పుడు, “ఇది నాది, నా స్వంత ప్రయత్నంతో నేను దీనిని సాధించాను” అనే ఆలోచనతో ప్రయత్నించడం మానుకోవాలి. ప్రతిదీ భగవాన్ యాజమాన్యంలో ఉన్నందున, భగవత్ ప్రసాదంగా (భగవాన్ కృప), ఆచార్య ప్రసాదం (ఆచార్య కృప) గా భావించాలి. అనువాదకుల గమనిక: ప్రపత్తి (శరణాగతి) రెండు రకాలు – స్వగత స్వీకారం మరియు పరగత స్వీకారం. స్వగత స్వీకారం అనేది స్వీయ ప్రయత్నానికి ప్రాధాన్యతనిచ్చే శరణాగతి. పరగత స్వీకారం అనేది భగవత్ కృపతో చేసిన శరణాగతి. ఈ రెండింటిలో, భగవాన్ మన సంరక్షకుడని, తన కృపాతో మనల్ని ఉద్ధరిస్తున్నాడని అంగీకరించే పరగత స్వీకార మార్గాన్ని మన పూర్వాచార్యులు నొక్కిచెప్పారు. భగవానుడికి శరణాగతి చేయుట జీవాత్మకు తగినది ఎందుకంటే శరణాగతి అనేది జీవాత్మ యొక్క సహజసిద్ధమైన స్థితి. .
- స్వప్రయోజన ప్రవృత్తిలో పాల్గొనడం (కోరికలను తీర్చుకోడానికి చేసే ప్రయత్నాలు) ఒక అడ్డంకి. మన ఆత్మ సంతృప్తిపై దృష్టి పెట్టకుండా ఎల్లప్పుడూ ఇతరుల అభ్యున్నతికి మరియు శ్రేయస్సుకై ప్రయత్నించాలి. అనువాదకుల గమనిక: “విచిత్రా దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా బ్రహ్మణ్ హస్తపాధాది సమ్యుతా”- లయం సమయంలో సూక్ష్మ స్థితిలో ఉన్న జీవాత్మ ఎటువంటి ఇంద్రియాలు / శరీరం లేకుండా ప్రాపంచిక సుఖాలు/ ముక్తి ప్రయత్నాలలో పాల్గొనలేక పోవడంతో, అత్యంత కృపతో సర్వేశ్వరుడు, తన పాద పద్మాలను సమీపించే ప్రక్రియను ప్రారంభించడానికి ఇంద్రియాలను / శరీరాన్ని జీవాత్మకు ప్రసాదిస్తారు. జీవాత్మ, ఇంద్రియాలతో / శరీరంతో భగవాన్ను ఆశ్రయించడానికి బదులుగా, తిరువాయ్మొళి 3.2.1 లో “నమ్మాళ్వార్” చెప్పినట్లుగా, “అన్నాల్ నీ తంత ఆక్కైయిన్ వళి ఉళల్వేన్”, శరీర / ఇంద్రియ సుఖాలను పొందాలనుకుంటాడు. ఒక నది దాటడానికి మనిషికి తెప్ప ఇస్తే ఆ నీటి ప్రవాహంతో కొట్టుకెళ్లి సముద్రంలో కలిసాడట. ఈ సంసారం నుండి ఉద్ధరింపబడడానికి జీవత్మాకు ఇంద్రియాలను / శరీరాన్ని ప్రసాదిస్తే ఈ సంసారంలో మరింత కూరుకుపోడానికి ఆ ఇంద్రియాలలు ఉపయోగించబడుతున్నాయి. తిరువరంగత్తు అముదనార్ కూడా ఇదే సూత్రాన్ని రామానుస నూత్తందాది పాసురం 67లో ఇలా వివరిస్తున్నారు – “మాయవన్ తన్నై వణంగ వైత్త కరణం ఇవై” – భగవాన్ ఈ శరీరాన్ని తనను ఆరాదించేందుకు మరియు భాగవతులను సేవించడం కోసం ఇచ్చారు. ఈ విధంగా ఈ పుట్టుక ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకొని దానికణుగుణంగా ప్రవర్తించాలి.
- కేవలం శేషత్వ (దాస్యం) జ్ఞానం ఉండి, పారతంత్రియం (సంపూర్ణంగా అధారపడం) జ్ఞానం లేకపోవడం ఒక అడ్డంకి. ఆత్మ యొక్క స్వభావం రెండు దశల్లో ఉంటుంది: శేషత్వం – యజమాని ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉండటం; పారతంత్రియం – యజమాని కోరికలను తీర్చడం. స్వామి యొక్క కోరికలను తీర్చడం, కేవలం యజమాని సేవ చేయడానికి ఎదురుచూడడం కంటే ముఖ్యమైనదని అర్థంచేసుకోవాలి. భరతుడు శ్రీ రామునితో పాటు వెళ్లాలని అనుకున్నప్పటికీ, 14 సంవత్సరాలు శ్రీ రాముడు లేనప్పుడు అయోధ్య రాజ్యాన్ని పరిపాలించే సేవను చేపట్టాడని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు.
- భోక్తుడుగా ఉండటం మరియు భోగ్యుడిగా ఉండకపోవడం ఒక అడ్డంకి. భోగ్యం – ఆనందించేది, భోక్తా – ఆనందించేవాడు. శ్రీవైష్ణవులు తమను తాము భగవాన్ యొక్క ఆనందం కోసం ఉపయోగపడే వస్తువుగా భావించాలి. తమ సంపూర్ణ ఉనికి భగవత్ప్రీతి కోసం అని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలాంటి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. తాను భోగించే వ్యక్తిగా భావించడం, భగవాన్ యొక్క ఆనందం కోసం ఉపయోగపడే వస్తువుగా ఉండటానికి విరుద్ధం. అనువాదకుని గమనిక: – అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం చూర్ణిక 21లో ఇలా వివరించారు “శేషత్వ భోక్తృత్వంగళ్ పోలన్రే పారతంత్రియ భోగ్యతైగళ్” – పారతంత్రియం (సంపూర్ణంగా ఆధారపడటం) మరియు భోగ్యత్తైగళ్ (భోగ్య వస్తువు), శేషత్వం (దాస్యం) మరియు భోక్తృత్వంగళ్(భోగించేవాడు) కన్నా గొప్పది. ఇక్కడ శేషత్వం అంటే బంగారు ఇటుక లాంటిదని (విలువైనది కానీ రూపాన్ని మార్చిన తరువాత మాత్రమే ఉపయోగించ గలము) మరియు పారతంత్రియం అంటే స్వర్ణాభరణం లాంటిది (అప్పడికప్పుడే ఉపయోగించ గలము) అని మాముణులు అందంగా వర్ణించారు. ఇది చాలా నిగూఢమైన మూల సూత్రం, ఆచార్యుల నుండి కాలక్షేప రూపంగా అర్థం చేసుకోవాలి.
- తాను భోగ్య వస్తువైనందుకు సంతృప్తి చెందడం, ఆ ఆనందం తనదని బ్రమపడుట ఒక అడ్డంకి. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.9.4 లో ఇల ప్రకటించారు, “తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమీతే చిఱప్పు” – సంపూర్ణ భగవత్ సుఖానికై తానుండటం ఉత్తమము. భగవాన్ శ్రీ ముఖంలో కనిపించే సంతోషం కోసమే మన శేషత్వం (దాస్యం) మరియు పారతంత్రియం (ఆధారపడటం) ఉండాలి. అనువాదకుల గమనిక: కులశేఖర ఆళ్వారులు, పెరుమాళ్ తిరుమోళి 4.9లో ఈ విషయాన్ని ఇలా వివరించారు, “పాడియాయ్ క్కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” – నేను నీ సన్నిధి ఎదుట మెట్టులా/గడపలా (వివేకము లేని అచిత్ వలె) ఉండి ఆనందంగా చిరు మందహాసంతో ఉన్న మీ అధరాలను చూసి ప్రతిస్పందిస్తాను (వివేకము ఉన్న చిత్ వలె). (అనువాదకుల గమనిక: “అచిత్వత్ పారతంత్రియం” మన సత్ సాంప్రదాయంలో ఈ సూత్రం అత్యున్నతమైనది – అచిత్ వలే సంపూర్ణంగా భగవతాధీనుడై ఉండి, భగవాన్ తమ ఆనందాన్ని వ్యక్త పరచినపుడు జివత్మ వలే వారి ఆనందానికి ప్రతిస్పందించడం). ఈ సూత్రం (స్వయ – కేంద్రీకృతమైన ఆనందాన్ని నిర్మూలించడం) ద్వయ మహా మంత్రం యొక్క రెండవ భాగంలో “నమః”లో వివరించబడింది. ఆళవందారులు తమ స్తోత్ర రత్నం 46లో ఇదే సూత్రాన్ని వివరించారు, “కదా ..ప్రహర్శయిశ్యామి” – భగవత్ ప్రీతిని ఆశించడం. జీవాత్మ భగవత్సుఖానికి ప్రతిస్పందించినప్పుడు , భగవాన్ సంపూర్ణంగా సంతోషిస్తారు. వారి ఆనందమే మన కైంకార్యం యొక్క ఏకైక లక్ష్యం. వేరే మార్గాల గురించి ఆలోచించడం ఒక అడ్డంకి.
- భగవత్ ప్రీతికై ఉనికిలో ఉండటం జీవత్మ యొక్క నిజమైన స్వభావమని తెలియకపోవడం, అంతర్లీన గుణాలు కూడా భగవత్ సుఖంపై కేంద్రీకృతమై ఉన్నాయని తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవత్ సుఖమే జీవాత్మ యొక్క నిజమైన స్వభావం మరియు భగవతాధీనుడై ఉండటం జీవాత్మ యొక్క నిజమైన స్వభావం . భగవాన్ యొక్క నిజమైన దాసుడిగా ఉండటం దీని సారాంశం. తిరువాయ్మొళి 2.9.4 లో -“తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమీతే చిఱప్పు” చూపిన విధంగా – మనం నిరంతరం భగవత్ సుఖానికై పాటుపడాలి. అనువాదకుల గమనిక: “అకిన్చిత్కరస్య శేషత్వ అనుపపత్తిః” లో చెప్పినట్లుగా – నిజమైన దాస్యభావం (కనీసం) చిన్న చిన్న కైంకార్యాలలో పాల్గొనడం ద్వారానే నిలబడి ఉంటుంది.
- మనకు తెలియని మూలసూత్రములను తెలియజేసిన ఆచార్యులను భగవంతునితో సమానమని పరిగణించకపోవడం ఒక అడ్డంకి. తిరువాయ్మొళి 2.3.2 లో చెప్పినట్లుగా “అఱియాధన అఱివిత్తు అత్తా!” (మనకు తెలియని భగవత్ విషయానుభవాలను తెలియజేసి శాశ్వతసంబంధం ఉన్నవాడు భగవానుడు మరియు ఆయనే ప్రథమాచార్యడు (మొట్టమొదటి ఆచార్య) అని. మన ఆచార్యులను భగవానుని మానవరూపంగా పరిగణించాలి. అటువంటి ఆచార్యులపై పూర్తి విశ్వాసం కలిగి ఉండకపోవడం, వారిని భగవంతునిగ పరిగణించకపోవడం అవరోధాలు. అనువాదకుల గమనిక: దయచేసి https://granthams.koyil.org/2013/06/anthimopaya-nishtai-12/ చదవండి – ఈ వ్యాసం లో ఆచార్యులను భగవానుడిగా ఎలా పరిగణిస్తారో వివరించబడింది .
- చరమ పర్వం (ఆచార్యుడు) అత్యున్నత మార్గం/ లక్ష్యమని విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం సూత్రం 447 లో ఇలా వివరించారు “ఆచార్య అభిమానమే ఉత్తారకం” – ఆచార్యుల ఆశ్రయంలో ఉండడం మన మోక్షానికి అత్యున్నత మార్గం. శిష్యుడి గురించి “ఇతను నా ప్రియమైన శిష్యుడు” అని ఆచార్యుడు భావించే స్థితికి ఎదగాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సూత్రం 446 లో, పిళ్ళై లోకాచార్యులు ఇలా వివరించారు, “ఆచార్యనైయుం తాన్ పత్తుం పత్తు అహంకార గర్భమోపాధి కాలన్ కొణ్డు మోదిరమిడుమాపోలే” – ఆచార్యులను ఆశ్రయించే ప్రయత్నంలో కూడా, స్వగత స్వీకారం (సొంతంగా ప్రయత్నించి ఆచార్యులను ఆశ్రయించినట్లయితే) అది జీవాత్మ స్వభావానికి విరుద్ధం, ఎందుకంటే స్వతంత్రుడనే అహంకారంతో జరుగుతుంది కాబట్టి. ఆచార్యులు శిష్యుడిని కృపతో ఆశీర్వదించారు అని భావించాలి (నిరంతరం శిష్యుడు ఈ భావనతో ఉండాలి). శిష్యుడు అహంకారంతో చేసినపుడు, అది ఒక అందమైన బంగారపు ఉంగరాన్ని తయారు చేసి, కాల (యమ ధర్మరాజు – మన మరణాన్ని నియంత్రించేవాడు) నుండి స్వీకరించడం లాంటిది.
తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : https://granthams.koyil.org/2014/09/virodhi-pariharangal-35/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org