విరోధి పరిహారాలు – 36

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/08/12/virodhi-pariharangal-35-telugu/

70. అనాప్త  విరోధి  –  అప్రామాణికమైన సూత్రాలను అర్థం చేసుకోవడంలో అవరోధాలు

ఎమ్పెరుమానార్ పట్ల ఎంతో అంకితభావంతో ఉండిన వడుగ నంబి

అనాప్త (ప్రామాణికం కాని అంశాలు/వ్యక్తులు, మనకు అనుకూలం కాని అంశాలు) ఆప్త (ప్రామాణికమైన అంశాలు/వ్యక్తులు, మనకు అనుకూలమైన అంశాలు)కు వ్యతిరేకమైనది. ఈ విభాగంలో చర్చించిన విషయాలు కూడా అదే సూత్రాన్ని ప్రతిబింబిస్తాయి. అనువాదకుల గమనిక: ఈ విభాగం మునుపటి భాగాన్ని ఇంకొంచం ముందుకు తీసుకెళుతుంది. జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలం కాని అంశాలు ఈ శీర్షికలో చర్చించబడ్డాయి.

  • ప్రపత్తికి (సంపూర్ణ శరణాగతి) విరుద్ధమైన ఉపాయాంతరములపై ​​(కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు భగవానుడి నిత్య కైంకార్యం సాధించడనికి సాధనాలని) నమ్మకం కలిగి ఉండటం ఒక అడ్డంకి. భగవానుడి నిత్య కైంకర్యం పొందడానికి ఏకైక మార్గము భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేయడమేనని ఆళ్వారులు వివరించారు, ఆచరించారు కూడా. కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైన వివిధ ప్రక్రియలు మన సొంత ప్రయత్నంపై ఆధారపడి ఉంటాయి, అందుకని భగవాన్ నిత్య దాసుడన్న జీవాత్మ యొక్క స్వరూపానికి అది విరుద్ధం. అందువల్ల, అటువంటి ఉపాయాంతరములపై విశ్వాసం కలిగి ఉండటం అననుకూలమైనది కాదు. జీవాత్మ యొక్క నిజమైన స్వరూపానికి తగినది కాదు. అనువాదకుల గమనిక: భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేయుట, ఆయనకు శాశ్వతమైన కైంకార్యాన్ని సాధించే ఏకైక మార్గమని మన ఆళ్వారులు / ఆచార్యులు పూర్తిగా నిర్ధారించారు. పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క రెండవ ప్రకరణంలో వివరించారు. ఈ సుత్రాంలో, ఉపాయాంతర త్యాగం చేయడం అవసరమని వివరిస్తున్నారు. ఎందుకంటే మనం సంపూర్ణంగా భగవత్ ఆధీనులం అన్న దానికి ఉపాయాంతరాలు విరుద్ధం కావడం వల్ల కానీ, జ్ఞానం లేదా సామర్థ్యం లేక కాదు. తరువాతి సూత్రాలలో, వారు ఈ సూత్రాన్ని చాలా వివరంగా వివరించారు.  సూత్రం 127 లో ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు, “వేదాంతాలు వీటిని (కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు) ఉపాయములుగా ఎందుకు కీర్తిస్తారు?” తరువాత వారే ఇలా బదులిస్తున్నారు, ఒక వ్యాధి ఉన్నవారికి వైద్యం చేసేటప్పుడు, వాళ్ళు (అమ్మలు మొదలైనవారు) వారికి ఇష్ఠమైన ఆహార పదార్ధాలలో ఔషదాన్ని కలిపిస్తారు. ఇక్కడ శాస్త్రం (జివత్మాను సంరక్షించే తల్లి లాంటిది) భగవాన్ను (నిజమైన ఔషధం) ఉపాయాంతరములతో (అవి స్వయం ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి) కలిపి ఇస్తుంది.  వ్యాధి నయమయ్యేది ఔషధంతోనే కాని ఆహార పదార్థాలతో కాదు అని మాముణులు అందంగా వివరిస్తున్నారు. అదేవిధంగా, మనకి భగవానుడే ఈ సంసారం నుండి ఉపశమనం పొందే నిజమైన ఉపాయం (సాధనం),  ఉపాయాంతరములు ఎప్పటికీ నిజమైన ఉపాయములు కాలేవు. ఔషదాన్ని ఇతర ఆహార పదార్ధాలతో కలిపినప్పుడు, వ్యాధిని నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని వారు వివరించారు. అదేవిధంగా, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల ద్వారా వెళితే, సంసార బారి నుండి విరుగుడు పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ సూటిగా ఎమ్పెరుమాన్ని ఆశ్రయించడం అనేది వ్యాధిని నయం చేయడానికి నేరుగా ఔషధం తీసుకోవడం లాంటిది – ఫలితం వెంటనే ఉంటుంది. తరువాతి సుత్రాములలో, ఎన్నో అద్భుతమైన అర్ధాలను పిళ్ళై లోకాచార్యులు మరియు మాముణులు వెల్లడించారు – వీటిని ఆచార్యుల నుండి కాలక్షేప రూపంగా వినడం ప్రయోజనకరం.
  • అనుకూలం కాని వ్యక్తులతో స్నేహం చేయడం మానేయాలని తెలుసుకున్న తరువాత కూడా, అయోమయ స్థితితో ఉండటం ఒక అడ్డంకి. అనుకూలం కాని వ్యక్తులతో సంబంధాన్ని వదులుకోవాలని బలమైన నిశ్చయంతో ఉండాలి. అనువాదకుల గమనిక: ఇక్కడ అనుకూలం కాని వ్యక్తులు అంటే సాధారణంగా దేవతాంతరములుతో సంబంధం ఉన్నవారు,  భౌతిక సాధనలు చేయువారు, నిరంతరం భగవత్, భాగవత, ఆచార్య అపచారాలు చేయువారు అని అర్థం. ఎందుకంటే ఈ రకమైన వ్యక్తులు క్రమేణా మన ఆలోచనలను కూడా ప్రభావితం చేసి చివరికి వారిలాగా మారేలా  చేస్తారు.
  • మన అంతిమ లక్ష్యానికి అడ్డంకులుగా ఉన్న నిగూఢ ప్రయోజనాలలో ఆసక్తి కలిగి ఉండటం ఒక అడ్డంకి. కేవలం తమ సుఖం కోసం మాత్రమే అయ్యుండి, భగవాన్ యొక్క శాశ్వతమైన కైంకర్యానికి విరుద్ధమైన దేనినైనా ప్రయోజనాంతరం అంటారు. ఇటువంటి ఉద్దేశ్యాలను వదులుకోవాలి. అనువాదకుల గమనిక: మన అంతిమ లక్ష్యం ఏమిటంటే, పరమపదంలో శాశ్వతంగా భగవానుడికి భగవదానందం కొరకు మాత్రమే సేవ చేయడం. భౌతిక / ఇంద్రియ సుఖాలు, దేవతాంతరములకు సేవ చేయడం, భౌతిక వ్యక్తులకు సేవ చేయడం, కైవల్యం – తాను ఆనందం పొందడం, వ్యక్తి తమ ఆనందం కొరకు భగవాన్ని సేవించడం, అహంకారంతో భగవాన్కు సేవ చేయడం మొదలైన ఇతర లక్ష్యాలు జీవాత్మ స్వరూపానికి అనుకూలమైనవి కావు, అందువలన వాటికి దూరంగా ఉండటం మంచిది.
  • శ్రీమన్నారాయణుడే పూజించగల దేవుడు అన్న సూత్రానికి విరుద్ధమైన దేవతాంతరములపై విశ్వాసం కలిగి ఉండటం ఒక అడ్డంకి. ఒక వైష్ణవుడికి, శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆరాధించగల దేవుడు అన్న ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకోవాలి, నిష్ఠగా అనుసరించాలి. దేవతాంతర భజనం (ఆరాధించడం) ఆ సూత్రానికి విరుద్ధం కాబట్టి చేయకూడదు. అనువాదకుల గమనిక: మహోన్నత నాధుడు స్వయంగా శ్రీమన్నారాయణుడు కావడం వలన, ప్రాపంచిక కార్య వ్యవహారాలకై, అనేక  తామస, రాజస స్వభావం గల ఆరాధకులకై, వాళ్ళు నెమ్మదిగా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి దేవతాంతరములను శ్రీమన్నారాయణుడు  సృష్ఠించాడు. లేకపోతే నాస్తికత్వం ప్రబలమౌతుంది కాబట్టి. కానీ పూర్తిగా సత్వ గుణంలో ఉన్న వారి శుద్ధ భక్తులకు అతను మాత్రమే పూజ్యనీయుడు. వైష్ణవుడంటే శ్రీమన్నారాయణుడకు, అతని శుద్ధమైన భక్తులకు పూర్తి విశ్వాసకులుగా ఉండటం, వారిని మాత్రమే ఆరాధించడం అని అర్థం.
  •  ద్వయ మహామంత్రంలో వివరించిన సూత్రాలకు విరుద్ధమైన మంత్రాలపై విశ్వాసం కలిగి ఉండటం ఒక అడ్డంకి. ద్వయ మహామంత్ర యొక్క మాధుర్యం మరియు లోతైన అర్థాల కారణంగా శ్రీవైష్ణవులు నిరంతరం పఠించాలి, ధ్యానించాలి. రహస్య త్రయం ఈ మంత్రసంబంధిత స్వభావం ఉన్నందున, ద్వయ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా రహస్య త్రయం (తిరుమంత్రం – అష్టాక్షరం, ద్వయ మహామంత్రం మరియు గీతా చరమ స్లోకం) ఇక్కడ సూచించబడింది. కాబట్టి శ్రీవైష్ణవులు రహస్య త్రయాన్ని అనుసరించాలి. ఇతర మంత్రాలేవైనా – ప్రధానంగా దేవతాంతరములకు  సంబంధించిన మంత్రాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అనువాదకుల గమనిక: ముముక్షుప్పడిలో, పిళ్ళై లోకాచార్యులు తిరుమంత్రము యొక్క కీర్తిని వివరిస్తున్నారు. శ్రీమన్నారాయణుడకు సంబంధించిన మంత్రాలు రెండు రకాలు అని వారు వివరింస్తున్నారు – వ్యాపకం (భగవాన్ యొక్క సర్వవ్యాపకత్వాన్ని వివరించేవి) మరియు అవ్యాపకం (భగవాన్ వివిధ రూపాల్లో వెల్లడి చేసిన ఇతర గుణాలను వివరించేవి). విష్ణు గాయత్రిలో కీర్తించ బడినందున విష్ణు మంత్రాలకు (నారాయణ, వాసుదేవ, విష్ణు) ఎక్కువ ప్రాముఖ్యత ఉందని వారు నొక్కిచెబుతున్నారు. విష్ణు గయిత్రి మంత్రం నారాయణ మంత్రంతో మొదలవుతుంది కాబట్టి, అన్ని విష్ణు మంత్రాలలో ఇది గొప్పదని వారు వివరిస్తున్నారు. ఇతర మంత్రాలలో లేని అన్ని ప్రథానాంశ అర్ధాలను వివరించడంలో నారాయణ మంత్రం పూర్ణమైనదని వారు వివరిస్తున్నారు. ఇక్కడ ప్రథానాంశ అర్ధాలు అంటే అర్థపంచకాన్ని (ఐదు తత్వాలు / సూత్రాలు అనగా – జీవత్మ (ఆత్మ), పరమాత్మ (దేవుడు), ఉపాయం (సాధనాలు), ఉపేయం (లక్ష్యం) మరియు వీరోధి (ఆటంకాలు))  సూచిస్తుంది. వేదానికి, ఋషులకు, ఆళ్వారులకు, ఆచార్యులకు నారాయణ మంత్రం చాలా ప్రియమైనదని వారు వివరిస్తున్నారు. ద్వయ మహామంత్రం కేవలం నారాయణ మంత్రం యొక్క వివరణ, చరమ శ్లోకం అదే సూత్రానికి మరింత వివరణ. ఈ విధంగా, ముముక్షువులకు (పరమపదంలో శ్రీమన్నారాయణుని శాశ్వత కైంకర్యమైన మోక్షాన్ని కోరుకునే వాడు)  రాహస్య త్రయం ప్రధాన కేంద్రంగా ఉండాలి.
  • భగవత్ ప్రీతి అనే అత్యున్నత స్థితికి విరుద్ధమైన ప్రాపంచిక / ఇంద్రియ సుఖాలపై ఆసక్తి కలిగి ఉండటం ఒక అడ్డంకి. భోగ్యం – ఆనందించేది. భగవాన్ / భాగవతులకు కైంకార్యం చేస్తున్న జీవాత్మ భగవానుడిని ఆనందపరుస్తాడు/సంతృప్తిపరుస్తాడు. భగవదానందాన్ని చూసి, జీవాత్మ కూడా ఆనందిస్తాడు.  మరే ఇతర ప్రాపంచిక సుఖాలైనా సరే జీవాత్మ యొక్క ఈ స్థాయికి అడ్డంకి.  అనువాదకుల గమనిక: కులశేఖర ఆళ్వారులు పెరుమాల్ తిరుమోళి 4.9 పాసురంలో ఇలా వివరిస్తున్నారు, “పడియాక్కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” – ఇక్కడ ఆళ్వార్ తిరుమల వేంకటేశ్వరుని సన్నిధి ఎదుట మెట్టుగా కావాలని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. పైగా ఆ వేంకటేశ్వరుని దివ్య చిరునవ్వుని కూడా చూడాలని అంటున్నారు. మెట్టుగా ఉండటం అంటే అచిత్ (జ్ఞానం ఉండదు) లాంటిది, కాని భగవత్ ఆనందాన్ని దర్శించడం అంటే భగవాన్ యొక్క ఆనందాన్ని ప్రతిస్పందించడం అని అర్థం. ప్రతిస్పందన జ్ఞానం యొక్క ఉనికిని సూచిస్తున్నందున, ఇక్కడ శ్రీవైష్ణవ సత్సాంప్రదాయం యొక్క అత్యున్నత సూత్రం తెలుస్తుంది. అనగా, తమ యజమాని సంపూర్ణ నియంత్రణలో ఉన్న ఒక నిర్జీవ వస్తువు ఉన్నట్లుగా ఉండాలి, అయినప్పటికీ, భగవానుడి ఆనందానికి ప్రతిస్పందిస్తే భాగవాన్ అమితానందాన్ని పొందుతారు. ఇది ఒక అమాయక పిల్లవాడి లాంటిది, పూర్తిగా తండ్రి నియంత్రణలో ఉంటాడు, అయినప్పటికీ, తండ్రి పిల్లవాడిని సంతోషపెట్టినప్పుడు, పిల్లవాడు అ తండ్రికి స్పందిస్తాడు, అప్పుడు ఆ తండ్రి అమితానందాన్ని పొందుతాడు. అందువలన, చివరికి, భగవానుడే ప్రథమంగా ఆనందించేవాడు, మాధ్యమిక ఆనందం పొందేవాడు జీవాత్మ – అదీ కూడా భగవత్సుఖాన్నే అనుభవిస్తాడు.
  • మోక్ష శాస్త్రానికి విరుద్ధమైన బంధ శాస్త్రం (భౌతిక సంపద, భాగ్యము, సమృద్ధి మొదలైన వాటికి సంబంధించిన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం) పై దృష్టి పెట్టడం ఒక అడ్డంకి. మోక్ష శాస్త్రం అంటే భగవానుడికి శాశ్వతమైన కైంకర్యం చేసే మార్గాన్ని చూపిస్తుంది. బంధ శాస్త్రం అంటే ఇంద్రియ సుఖసాధన,  ఈ సంసారంలో అనేక జన్మలకు దారితీస్తుంది. మోక్ష శాస్త్రంపై దృష్టి పెట్టాలి, బంధ శాస్త్రాన్ని విస్మరించాలి.
  • తమ సొంత శరీరాంశాలు, శారీరిక జాగ్రత్తలపై ఎక్కువ ఆసక్తి కలిగిఉండటం మన అత్యున్నత లక్ష్యమైన ఆచర్య సేవకది విరుద్ధము, అది ఒక అడ్డంకి. చరమ కైంకర్యం – చరమ  పర్వ నిష్ఠ – అత్యున్నత సేవ, ఇది “ఆచార్యులే సర్వస్వం అని భావించి అటువంటి ఆచార్యలకు సేవలందించడం”. ఉపదేశ రత్నమాలలో, మాముణులు పాసురం 65లో “ఆచార్యన్ చిచ్చన్ ఆరుయిరైప్ పేణుమవన్ తేచారుం చిచ్చన్ అవన్ చీర్ వడివై ఆచైయుడన్ నోక్కుమవన్” – ఆచార్యుడు శిష్యుని వాస్తవ స్వభావంపై దృష్ఠిపెట్టాలి, శిష్యుడు ఆచార్యుని పట్ల సంపూర్ణ భక్తితో వారి తిరుమేనిని (దేహాన్ని) మరియు వారి శారీరక అవసరాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆచార్యుని యొక్క రోజువారీ అవసరాల (ఆహారం, వస్త్రం,  ఆశ్రయం మొదలైనవి) బాధ్యత శిష్యుడిది కాబట్టి, శిష్యుడు తమ సొంత  అవసరాలకు మించి వారిని చూసుకోవాలి. మన శారీరిక జాగ్రత్తలపై ఆసక్తి మానుకోవాలి. అనువాదకుల గమనిక: ఉపదేశ రత్తమాల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క సారాన్ని వెలికితీస్తుంది. మాముణులు పిళ్ళై లోకాచార్యుల చేత వివరించబడిన సూత్రాల సారాన్ని అందంగా సంగ్రహించి వాటిని అర్థం చేసుకోవడానికి చాలా తేలికగా తమిళ్ పాసురాల రూపంలో అందించారు. ఆచార్యులపై దృష్టి కేంద్రీకరించడం, మరియు వారికి సేవలందించే ప్రాముఖ్యత  పిళ్ళై లోకాచార్యుల చేత  నొక్కి చెప్పబడింది, అదే ఇక్కడ మాముణులు చేత వివరించబడింది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : https://granthams.koyil.org/2014/09/virodhi-pariharangal-36/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment