శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రియః పతి శ్రీమన్నారాయణుడు కలియుగంలోని సంసారులను ఉద్దరించుటకై పరాంకుశ (నమ్మాళ్వార్), పరకాల (తిరుమంగై ఆళ్వార్), భట్టనాథ (పెరియాళ్వార్) మొదలైన ఆళ్వార్లని కరుణాపూర్వకంగా సృష్టించారు. అనంతరం, ఆతడు దయతో నాథముని, ఆళవందార్ ఆపై ఇతర ఆచార్యులను సృష్టించి వారి ద్వారా ఈ ప్రపంచాన్ని సంరక్షించాడు. ఆళ్వార్లు, ఆచార్యులు వారి తరువాత అవతరించిన వారి గొప్పతనాన్ని గురుపరంపర ప్రభావం (ఆళ్వార్లు, పూర్వాచార్యుల పరంపర గొప్పతనం) పిన్‌బళగియ పెరుమాళ్ జీయర్ ద్వారా ప్రజలకు తెలియపరచారు. అంతటితో ఆగకుండా, చిత్ మరియు అచిత్ రెండింటికి శేషి (స్వామి) అయిన శ్రియః పతి దయతో యతీంద్రప్రవణార్ ని (సన్యాసులకు అధిపతి అయిన శ్రీ రామానుజుల పట్ల ప్రపత్తి కలవారు. మణవాళ మాముణులను సూచిస్తున్నారు) ఈ లోకములోకి పంపి వారి (జీయర్) పలుకులు అనుష్ఠానముల ద్వారా చేతనుల సంరక్షిణకై పంపారు. పిళ్ళై లోకం జీయర్ తమ ఆచార్యులు (వారి తండ్రి అయిన శ్రీ శఠకోపాచార్యులు) మరియు కందాడై నాయన్ (ముదలియాండాన్ వంశీయులు మరియు కోయిల్ కందాడై వారి తిరుకుమారుడు) వారి అనుగ్రహం ద్వారా, మణవాళ మాముణుల గొప్పతనాన్ని తమ యతీంద్ర ప్రవణ ప్రభావము గ్రంధములో వెలికి తీసి చాటారు.
పూర్వాచార్యులపై గతంలో రచించిన ప్రబంధాలకు (గురుపరంపర ప్రభవం మొదలైనవి) ఈ ప్రబంధం కొనసాగింపుగా ఉంటుంది. పిళ్ళై లోకం జీయర్ వారు ప్రారంభంలోనే మణవాళ మాముణుల గొప్పతనం గురించి మాట్లాడే బదులు, సత్ సంప్రదాయ అర్థాలు మణవాళ మాముణులకు ఎలా చేరాయో వాటి గురించి వివరించారు. వారు ఈ క్రింది శ్లోకాన్ని పేర్కొన్నారు.
శ్రీవత్సచిన్న భవతశ్చరణారవింద సేవామృతైక రసికాన్ కరుణాసుపూర్ణాన్।
భట్టార్యవర్య నిగమాంతమునీంద్ర లోకగుర్వాది దేశికవరాన్ శరణం ప్రపద్యే॥
ఓ కూరత్తాళ్వాన్! కృపతో నిండి మీ దివ్య చరణాల యందు కైంకర్య అమృతాన్ని నిత్యమూ అనుభవించు భట్టర్ (కురత్తాళ్వాన్ తిరు కుమారులైన పరాంకుశ భట్టర్), నంజీయర్, నంపిళ్ళై మొదలైన గొప్ప ఆచార్యులకు నేను శరణాగతి చేయు చున్నాను. నంపిళ్ళై తరువాత అవతరించిన ఆచార్యులలో, సాంప్రదాయ తత్వశాస్త్ర సూత్రాలు మణవాళ మాముణులకి ఎలా చేరుకున్నాయో చూపించడానికి పిళ్లై లోకం జీయర్ మొదట పిళ్ళై లోకాచార్యుల కథనాన్ని వివరించారు. ఇది క్రింది పాశురము ద్వారా వివరించబడింది:
కోదిల్ ఉలగాశిరియన్ కూరకులోత్తమ తాదర్
తీదిల్ తిరుమలైయాళ్వార్ శెళుం కురవై మణవాళర్
ఓదరియపుగళ్ తిరునావీఱుడైయ పిరాన్ తాదరుడన్
పోద మణవాళముని పొన్నడిగళ్ పోఱ్ఱువనే
(మనము మొదట 1) నిష్కల్మశమైన పిళ్ళై లోకాచార్యులు (2) కూరకులోత్తమ దాసర్, (3) తిరువాయ్మొళి ప్పిళ్ళై అని కూడా పిలువబడే తిరుమలైయాళ్వార్ (4) కురువై నగర్లో జన్మించిన కొత్తూర్ అళగియ మణవాళర్, 5) గొప్ప కీర్తిని కలిగి ఉన్న తిగళక్కిడందాన్ తిరుణావీఱుడైయ పిరాన్ దాసర్ (6) కమలముల వంటి చరణములు కలిగి ఉన్న మణవాళ మాముణుల దివ్య పాదాలను స్తుతిద్దాము). [ఈ పాశురము శ్రీ వచన భూషణం పఠనం ఆఖరున సేవించ బడుతుంది; పైన పేర్కొన్న ఆరుగురు గొప్ప ఆచార్యులలో, కొత్తూర్ అళగియ మణవాళ దాసర్ వారు మణవాళ మాముణుల తాతగారు, తిగళక్కిడందాన్ తిరుణావీఱుడైయ పిరాన్ దాసర్ మాముణుల తండ్రిగారు].
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://granthams.koyil.org/2021/07/16/yathindhra-pravana-prabhavam-1-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org