యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 1

ఒకరోజు, నంపిళ్ళై వారు తమ కాలక్షేప దినచర్యను ముగించుకుని, ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటుండగా, వారి శిష్యుడు వడక్కు తిరువీధి ప్పిళ్ళై తల్లిగారు ‘అమ్మి’ వచ్చి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకొని ప్రక్కన నిలబడింది. వారు ఆమెను దయతో చూస్తూ, ఆమెను కుశల క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి సంభాషణ ఈ విధంగా ఉంది:

“ఏమి చెప్పమంటారు? నా కొడుకు అదుపుతప్పాడు”

“ఎందుకని?”

“అతనికి ఒక అమ్మాయితో మీరు పెళ్ళి కుదుర్చారు, మీకు గుర్తుందా? ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. వారికి పెళ్లి చేశాము. అతను గాబరాగా అరిచాడు. ఏమి జరిగిందని మేము లోపలికి వెళ్లి చుస్తే, పూర్తి చెమటలు పట్టి వణుకుతున్న స్థితిలో అతడిని చూశాము. ఏం జరిగింది అని అడిగితే  “అమ్మా! ఈ అమ్మాయి నాకు పాములా కనిపిస్తుంది. నాకు భయం వేస్తుంది. ఆమె ఇప్పటికీ అలానే ఉంది” అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయి ఆమెను వదిలి వెళ్ళమని చెప్పాను. మరోక సందర్భంలో కూడా ఇలాగే జరిగింది.”

గట్టిగా నవ్వి “మీకేమి అనిపిస్తుంది?” అని పిళ్ళై ఆమెను అడిగారు.

“మీరు అలా ఉండగలరా? ఆ అమ్మాయి హాయిగా జీవించకూడదా? వంశోద్దారకుడు ఒకడు ఉండాలి కదా?” అని అడుగుతూ వారి పాదాలపై పడి దుఃఖించింది.

దయతో పిళ్లై వారు ఆమెతో “అమ్మీ! లే. దుఃఖించకు. తగిన సమయంలో మీ కోడలిని ఇక్కడకి తీసుకురా” అని చెప్పారు. ఆమె ఒకరోజు తన కోడలిని వారి వద్దకు తీసుకు వెళ్లింది. నంపిళ్ళై తమ దివ్య హస్తాన్ని ఆమె ఉదరముపైన పెట్టి, “నీకు నాలాంటి కొడుకు పుట్టుగాకా” అని పలికారు. వడక్కు తిరువీధి ప్పిళ్ళైని పిలిచి, “నీకు భయం ఉండకూడదు. మన శాస్త్రాను సారమైన (పవిత్ర గ్రంథాలు) విషయాల పట్ల మీ నిర్లిప్తతకు ఎటువంటి లోటు ఉండదు. నా మాటలను అనుసరించి ఈ రాత్రి ఆమెతో ఉండు.”

కోడలు సక్రమంగా గర్భం ధరించి ఐప్పశి మాసంలో తిరువోణం నక్షత్రం రోజున ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. పుట్టిన పన్నెండవ రోజున, అతనికి నంపిళ్లై (లోకాచార్య) అనే విశిష్ట నామానికి అనుగుణంగా “లోకాచార్య పిళ్ళై” అనే దివ్య నామకరణము చేయబడింది. ఆ బాలుడు ఒక సంవత్సరం పూర్తి చేసుకోగానే, నంపెరుమాళ్ ని సేవించుటకై పల్లకి, నాదస్వరాలతో ఆలయానికి తీసుకువెళ్లారు. నంపెరుమాళ్ వారిని చూసి చాలా సంతోషించి, అర్చక ముఖేన వారి తీర్థ ప్రసాదాలు, శ్రీ శఠారి, చందనము, దండలు ప్రసాదించిరి. అర్చక ముఖేన “నీవంటి కొడుకును అతనికి ప్రసాదించావు; ఇప్పుడు అతనికి మా వంటి కుమారుడిని ప్రసాదించుము” అని పలికించారు, నంపిళ్ళై వెంటనే అంగీకరించారు. ఆ విధంగా వారి కృపతో అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ జన్మించారు.

ఈ విధంగా అటువంటి గొప్పతము ఉన్న నంపిళ్లై వారి అనుగ్రహంతో అవతరించిన పిళ్ళై లోకాచార్యులు మరియు వారి [పిళ్ళై లోకాచార్యులు] అనుగ్రహంతో ఎదిగిన వారి తమ్ముడు కలిసి పెరిగారు. శ్రీరంగంలో వారిరువురు కలిసి నడుచుచున్నప్పుడు, శ్రీ రామ లక్ష్మణులు కలిసి నడుస్తున్నారా లేదా బలరామ కృష్ణులు కలిసి నడుస్తున్నారా అని అక్కడి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఈ అర్థాన్ని వెణ్బ (తమిళ భాషలో ఒక రకమైన పద్యం) లో పిళ్లై లోకం జీయర్ వారు అతి సుందరముగా వర్ణించారు.

తంబియుడన్ దాశరథియానుం శంగవణ్ణ
నంబియుడన్ పిన్నడందు వందానుం – పొంగుపునల్
ఓంగు ముడుంబై ఉలగారియనుం అఱన్
దాంగు మణవాళనుమే తాన్

(ముడుంబై అనే ఉత్తమ వంశానికి చెందిన పిళ్లై లోకాచార్యులు మరియు వారి తమ్ముడు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు, శంఖ వర్ణంతో ఉన్న బలరాముడు మరియు కృష్ణుడిలా,  శ్రీ రామ లక్ష్మణులులా నడుచుచున్నారు అని అర్థము)

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://granthams.koyil.org/2021/07/17/yathindhra-pravana-prabhavam-2-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment