యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 3

ఆ సమయంలో, దేవరాజర్ అనే ఒక వ్యక్తి (నంబూర్ వరదరాజర్ అని కూడా పిలుస్తారు) పడుగై చక్రవర్తి ఆలయానికి సమీపంలో నివసిస్తుండేవారు. వారు పండితులు పామరులు అన్న తేడా లేకుండా అందరి మన్ననలు పొందినవారు. అతి దయాశీలుడు మరియు సత్వ గుణ పంపన్నులు. ఒక రోజు నంజీయర్‌ వారికి స్వప్నంలో దేవరాజర్‌ ని పిలవమని, విశిష్టాధ్వైత తత్వానికి సంబంధించిన విషయాల గురించి అతనికి ఉపదేశించమని, అతనికి ఒన్బదినాయిరప్పడి అనుకరణ తయారి గురించి వివరించమని దివ్య పిలుపు వచ్చెను. ఇది ఆళ్వార్ల అనుగ్రహం వల్లనే జరిగిందని నంజీయార్ భావించి, దేవరాజర్ గురించి తన శిష్యులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు దేవరాజర్‌ ని తమ వద్దకు తీసుకువచ్చారు. నంజీయార్ అతనిని ఆశీర్వదించి, ఒక తాళపత్రాన్ని ఇచ్చి దానిపై వ్రాయమని ఆదేశించారు. దేవరాజర్‌ వారు “నంజీయార్ యొక్క దివ్య చరాణాలే శరణు, భట్టార్ యొక్క దివ్య చరాణాలే శరణు” అని వ్రాసి, నంజీయార్ ముందు సాష్టాంగ నమస్కారములు చేస్తూ వారి దివ్య పాదాలను పట్టుకున్నారు. నంజీయార్ సంతోషించి అతనిని ఆశీర్వదించి, దయతో వారికి తిరువాయ్మొళి అర్థాలను క్లుప్తంగా వివరించారు. దేవరాజర్‌ వారికి కొన్ని తాళపత్రాలను ఇచ్చి, ఒన్బదినాయిరప్పడికి చక్కని కాపీలను తయారు చేయమని చెప్పారు. నంజీయార్ నుండి సెలవు తీసుకొని దేవరజర్ కవేరి నదిని దాటుతుండగా నదిలో వరద సంభవించెను. నిపుణుడైన ఈతగాడు కావడంతో, దేవరజర్ ఒన్బదినాయిరప్పడి మూల రాతప్రతులతో పాటు ఖాళీ తాళపత్రాలను తమ శిరస్సుపై కట్టి ఈదడం ప్రారంభించారు. వరద తీవ్రంగా ఉండటంతో, వ్రాతప్రతులు మరియు ఖాళీ తాళపత్రాలు తన శిరస్సు నుండి జారి, వరద నీటిలో కొట్టుకుపోయాయి. దేవరజర్ వారు “నేను ఆచార్యుల పట్ల ఘోరమైన అపరాధం చేశాను” అని తీవ్ర శోక సాగరంలో మునిగిపోయెను. ఇద్దరు శ్రీ వైష్ణవులు అతని పరిస్థితిని చూసి వారి తిరుమాళిగకి చేర్చారు. వారి భార్య కూడా జరిగిన సంఘటన గురించి తెలుసుకొని బాధపడి  వారిరువురూ ఆ రోజు ఉపవాసాన్ని అనుసరించారు. ఆ తర్వాత ఆమె అతనితో “మనం తిరువారాధన చేయడం మానుకోకూడదు” అని చెప్పగా దేవరజర్ వారు అప్పుడు స్నానం చేసుకొని, ఊర్ధ్వపుండ్రములు ధరించి తిరువారాధనను ప్రారంభించెను. వారి శోక ఉద్వేగానికి లోనైనందున వారికి కాస్త కునుకు పట్టింది. తమ కోయిలాళ్వార్ లోపల ఉన్న శ్రీ రంగరాజ పెరుమాళ్ వారితో  “ఓ దేవరాజా! రమ్ము! దుఃఖించకుము. కొత్త తాళ పత్రాలను తీసుకుని రాయడం ప్రారంభించు. నేను నీతోనే ఉంటాను” అని అంటారు. వెంటనే, దేవరాజర్ “శ్రీయః పతియాయ్” అన్న పదాలతో ప్రారంభించి, నంజీయార్ మాటలను గుర్తుచేసుకుంటూ “వారు విశిష్టమైన కృపా వర్షాన్ని కురిపించారు” అనే పదాలతో ముగించెను. నంజీయార్ బోధనలన్నీ తమ తలంపులో బలంగా నాటుకుపోయినందున, వాటిని గుర్తుకు తెచ్చుకోగలిగారు, తాళపత్రాలపై రాయగలిగారు. తమ కోయిలాళ్వార్‌ లోని భగవానునికి నైవెధ్యాన్ని సమర్పించి, ఆ ప్రాసాదాన్ని తాను ఆరగించి, ఒన్బదినాయిరప్పడి యొక్క మొత్తం శ్రీ కోశం (గ్రంధ రూపంలో ఉన్న దివ్య రచన) పూర్తి చేసి, నంజీయార్‌ వారి వద్దకి వెళ్లి, సాష్టాంగ నమస్కారములు సమర్పించుకొని లిఖిత పత్రాలను వారికి అందించారు. నంజీయార్ చాలా సంతోషించి, లిఖిత పత్రాలను తీసుకుని చదవడం మొదలు పెట్టారు. తనకు కొంత సందేహం వచ్చి వ్యాఖ్యానాన్ని పూర్తిగా పూర్తి చేయని కొన్ని చోట్ల అర్థాలను చక్కగా వివరించినట్లు ఆయన గుర్తించారు. వారు దేవరాజర్‌ ని పిలిచి, “ఇది ఎంత అద్భుతం! ఎంతటి మెధస్సు! ఇది ఎలా జరిగింది?” దేవరాజర్‌ వారికి జరిగినదంతా వివరించారు. జీయర్ సంతోషంతో లేచి నిలబడి, దేవరాజర్‌ ని ఆలింగనం చేసుకుని, “నువ్వు నమ్ పిళ్ళైవా?” అని అంటారు. ఆ తర్వాత తమ తిరువారాధన  పెరుమాళ్ “ఆయర్ధేవు”ని ఆరాధించి, దేవరాజర్‌ కి నంపిళ్ళై అనే బిరుదునిచ్చి, వారిని దర్శనానికి అధిపతిగా ప్రకటించి, తమ ఆచార్యులు భట్టర్ కోరిక మేరకు దర్శనం నాయకుడికి సమర్పించాల్సిన అంగులీకముని (భట్టర్ తమకు అందించిన) నంపిళ్లైకి బహూకరిస్తారు. వారు నంపిళ్ళై తో “నీ మెధస్సుకి అనుగుణంగా, తిరువాయ్మొళికి వ్యాఖ్యానం వ్రాసి, మన రామానుజ దర్శనం (శ్రీ రామానుజుల తత్వశాస్త్రం) ని అభివృద్ధి చేయుము” అని చెబుతారు. అప్పటి నుండి, నంపిళ్ళై ప్రాపంచిక విషయాల నుండి నిర్లిప్తమై, జ్ఞానానికి, భక్తికి నిధిగా మారారు. అనేకానేక  శ్రీ వైష్ణవులు వారిని అనుసరించడం ప్రారంభించారు. వారి కాలక్షేపం కోసం గుమిగూడిన జనసమూహాన్ని చూసి ఇది “నంపెరుమాళ్ గోష్ఠియా లేక నంపిళ్లై గోష్ఠియా” అని స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయేవారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/07/19/yathindhra-pravana-prabhavam-4-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment