శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
నంపిళ్ళై వారు తమ శిష్యుడైన పెరియ వాచ్చాన్ పిళ్ళైకి ఒన్బదినాయిరప్పడిని కొన్ని విశేష అర్థాలతో బోధించడం ప్రారంభించారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు ఈ అర్థాలను ప్రతి రోజు పట్టోలై (తాటి పత్రాలపై వ్రాసిన మొదటి కాపి) చేయడం ప్రారంభించారు. ఉపన్యాసాలు ముగిశాక, పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు అన్ని వ్రాత ప్రతులను తీసుకువచ్చి నంపిళ్ళై వారి దివ్య పాదాల యందు అర్పించెను. దానికి నంపిళ్ళై వారు ఎంతో సంతోషించి, ఆ వ్రాతప్రతులపై తన దయను కురిపించి, దూర దూరం వరకు విస్తరించి అందరూ తెలుసుకునేలా ఈ పట్టోలైకి అనుకరణ చేసి అనేక గ్రంధాలుగా తయారు చేయమని పెరియవాచ్చన్ పిళ్ళైని ఆదేశించెను. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నడువిల్ తిరువీధి పిళ్ళై మరియు వడక్కు తిరువీధి పిళ్ళై తమ స్వసంకల్పముతో తిరువాయ్మొళి వ్యాఖ్యానం మొదటి కాపీ వ్రాసినట్లు కాకుండా పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు నంపిళ్ళై వారి ఆదేశాన్ని అనుసరిస్తూ తిరువాయిమొళి వ్యాఖ్యానం యొక్క పట్టోలై తయారు చేశారు. మణవాళ మాముణులు తమ ప్రబంధము ఉపదేశ రత్నమాల 43 వ పాశురములో ఈ విషయం తెలియజేస్తున్నారు “నంపిళ్ళై తమ్ముడైయ నల్లరుళాల్ ఏవియిడ పిన్ పెరియ వాచ్చాన్ పిళ్ళై అదనాల్ ఇన్బావరుబత్తి మాఱన్ మఱైప్పొరుళై చ్చొన్నదు ఇరుబత్తి నాలాయిరం” (నంపిళ్ళై తమ దివ్య కృపా వర్షాన్నిపెరియ వాచ్చన్ పిళ్ళైపైన కురిపించిన తరువాత, వీరు భగవానుని దివ్య అనుగ్రహముతో అవతరించిన నమ్మాళ్వార్లు కరుణతో కూర్చిన తిరువాయ్మొళి వ్యాఖ్యానముమైన ఇరుబత్తినాలాయిరప్పడిని సమకూర్చారు).
ఒక రోజు నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై, శిఱియాళ్వాన ప్పిళ్ళై (ఈయుణ్ణి మాధవర్) ని పిలిచి, ఒన్బదినాయిరప్పడిని పఠించమని కోరెను. పెరియ వాచ్చాన్ పిళ్ళై వారితో కలిసి పఠించాలనే కోరికను వ్యక్తం చేసిరి. నంపిళ్ళై సంతోషంగా అంగీకరించి వారికి కూడా వాటి అర్థాలను ఉపదెశించెను. ప్రతి రోజూ నంపిళ్ళై ప్రసంగాలను వడక్కు తిరువీధి పిళ్ళై తమ ఇంట్లో వ్రాసి ఉంచుకునేవారు. ఒకరోజు, వారు నంపిళ్ళై వారిని తమ తిరుమాలిగకి తదీయారాధనకై ఆహ్వానించారు. తదీయారాధనకి ముందు వడక్కు తిరువీధి పిళ్ళై తిరుమాలిగలో తిరువారాధన చేస్తామని నంపిళ్ళై చెబుతారు. వారు తిరువారాధన కోసం కోయిలాళ్వార్ని తెరిచినప్పుడు, అక్కడ తాళపత్రాల కట్టలు వారు చూస్తారు. నంపిళ్ళై వాటి గురించి అడిగి తెలుసుకుంటారు. నంపిళ్ళై తమకి ఉపదేశించిన తిరువాయ్మొళి పాశురార్థాలను తాను మరచిపోకూడదని వ్రాసి ఉంచానని వడక్కు తిరువీధి పిళ్ళై వివరిస్తారు. తిరువారాధన స్వయంగా వడక్కు తిరువీధి పిళ్ళైని నిర్వహించమని చెప్పి నంపిళ్ళై వారు చాలా సేపు వ్రాతప్రతులను పరిశీలించడం ప్రారంభించెను. ఆపై వారు తదీయారాధనకై వెళ్ళేటప్పుడు కూడా ఆ వ్రాతప్రతులను పరిశీలించమని పెరియ వాచ్చాన్ పిళ్ళై మరియు ఈయుణ్ణి మాధవర్లని పురమాయిస్తారు. తరువాత వచ్చి మరలా పరిశీలించడం ప్రారంభిస్తారు. వీరు అద్భుతంగా వ్యాఖ్యానం వ్రాసిన తీరును ప్రశంసిస్తుండగా, వడక్కు తిరువీధి పిళ్ళైని నంపిళ్ళై వారు పిలిచి, “నువ్వు ఇలా ఎందుకు చేశావు? ‘పెరియ వాచ్చాన్ పిళ్ళై మాత్రమే వ్యాఖ్యానం రాయాలి’ అని నీవు అనుకున్నావా? ఇంకెవ్వరూ చేయకూడదా?’ ఇదేనా నీవు అనుకున్నది? అని ప్రశ్నిస్తారు. ఈ మాటలు విన్న వడక్కు తిరువీధి పిళ్ళై భయంతో వణికిపోయెను. తమ మనఃస్థితిని కుదుర్చుకొన్న తరువాత, వరు నంపిళ్ళైతో “జియార్! నేను అలా భావించలేదు. ఉపదేశించిన అర్థాలు ఒక వేళ మరిచిపోతే మరళా చూసుకోవచ్చని వ్రాశాను” అని అంటూ వారి పాదాలపై వాలిపోయిరి. నంపిళ్ళై అతనితో “నేను నిన్ను క్షమించాను. నీదొక విశేష జన్మగా అనిపిస్తుంది. నంజీయార్ వివరణల నుండి నేను బోధించిన వాటి నుండి నీవు ఒక్క అక్షరము కూడా తప్పు వ్రాయలేదు. నీ సామర్థ్యాన్ని నేను ఎలా ప్రశంసించాలి?” ఈ వ్యాఖ్యానాన్ని వ్యాప్తి చేయడానికి తమ ఆచార్యులైన నంజీయార్ వారి దివ్య నామాన్ని పంచుకుంటున్న మాధవర్ (ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్, వారి శిష్యుడు) ని పురమాయిస్తున్నానని అంటారు. వడక్కు తిరువీధి పిళ్ళై సంతోషిస్తారు. నంపిళ్ళై ఆ తాళ పత్రాల కట్టలని ఈయుణ్ణి మాధవప్పెరుమాళ్ వారికి ఇచ్చి, “ఈ మూల పత్రాలకి నాలుగు లేదా ఐదు కాపీలుగా వ్రాసి అంతటా ప్రచారము చేయండి” అని ఆదేశిస్తారు. మాధవర్ సంకోచిస్తూ “నేను అలా చేయగలనా? నాకు ఆమోదం లభిస్తుందా?” నంపిళ్లై అతనితో “నంజీయార్ అనుగ్రహం మీకు ఉన్నప్పుడు, ఇది మీకు చాలా పెద్ద పనినా?. ఒక పురాణ కథనం ఉంది. ఇది వినండి. పేరారులాప్పెరుమాల్ (కంచి వరదర్) తున్ను పుగళక్కంధాడైత్ తొళప్పర్ కలలోకి వచ్చి ఇలా అన్నారు “జగత్రక్షాపరో నందో జనిష్యత్యపరోముని: తధారస్య సాధాచార సాత్వికా స్థత్వ ధర్శిన: (ప్రపంచాన్ని రక్షించడంలో పూర్తిగా నిమగ్నమైన తిరువంతాళ్వాన్ (రామానుజ ముని అవతారం కాకుండా) మరొక మునిగా (అందరి అభ్యున్నతి కోసం ఆలోచన చేసేవాడు) అవతారం ఎత్తబోతున్నాడు; అతని క్రింద ఆశ్రయం పొందిన వారు (ఆ సమయంలో) పూర్తిగా మంచి ప్రవర్తన మరియు మంచి లక్షణాలను కలిగి ఉంటారు). ఆ సమయం వరకు, మీరు దీని ఆధారంగా ఉపన్యాసాన్ని నిర్వహించండి. మాధవర్ కూడా ఆ వ్రాతప్రతుల ఐదు కాపీలు తయారు చేశారు మరియు అతని కుమారుడు ఈయున్ని పధ్మనాభ ప్పెరుమాల్ కూడ నేర్పించారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/07/20/yathindhra-pravana-prabhavam-5-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org