యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 12

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 11

పిళ్ళై లోకాచార్యుల మహిమ

పిళ్లై లోకాచార్యులు ఏటువంటి మహిమ కలవారంటే వారిని నమ్మాళ్వార్ల పునరవతారముగా పరిగణిస్తారు. వీరి తమ్ముడు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తన కృపా ఛాయలో పెరిగారు. వీరిరువురు రామ లక్ష్మణుల లాగా, అలాగే కృష్ణ బలరాముడి మాదిరిగా  కలిసి పెరిగారు. వీరి జంటని ఈ పాశురములో వర్ణించారు.

తంబియుడన్ దాశరథియానుం శంగవణ్ణ
నంబియుడన్ పిన్నడందు వందానుం – పొంగుపునల్
ఓంగు ముడుంబై ఉలగారియనుం ఒఱన్
దాంగు మణవాళనుమే తాన్

ఎలాగైతే దాశరథి (శ్రీ రాముడు) తన తమ్ముడైన లక్ష్మణునితో, అలాగే నల్లని కృష్ణుడు తన అన్న అయిన తెల్లని శంఖము వంటి వర్ణము కలిగిన బలరామునుతో కలిసి నడిచినట్లు, ముడుంబై అను ఉత్తమ వంశజులైన ఉలగారియన్ (పిళ్లై లోకాచార్యులు) వారి సోదరుడైన అళగియ మణవాలన్ తో కలిసి నడుచుచున్నారు)

వీరిరువురిలో, పిళ్లై లోకాచార్యులు అనేక నిగూఢ గ్రంథాలను రచించారు.  స్త్రీలతో పాటు సామాన్యులు కూడా ఉద్ధరింప బడుటకు ఈ గ్రంథాల అనుసంధానము చేయవచ్చు. అవి తనిప్రణవం, తనిద్వయం, తనిచరమం, పరందపడి, శ్రీయఃపతిపడి, యాదృచ్ఛిక ప్పడి, ముముక్షుప్పడి, సంసార సామ్రాజ్యం, సారసంగ్రహం, తత్వత్రయం, తత్వశేఖరం, ప్రపన్న పరిత్రాణం, ప్రమేయ శేఖరం, అర్చిరాది, అర్థ పంచకం, నవ విధ సంబంధం, నవ రత్న మాలై, శ్రీ వచన భూషణం మొదలైనవి. వీరు తమ తమ్మునితో కలిసి జీవించిన కాలంలో పరమసాత్వికులైన అనేక మంది – కూరకులోత్తమ దాసర్ నాయన్, మణప్పాక్కత్తు నంబి, అళగియ మణవాళ పిళ్ళై (కొల్లి కావల దాసర్), కోట్టూరిల్ అణ్ణర్, తిరుమలై ఆళ్వార్ (తరువాత వీరు మణవాళ మాముణులకు ఆచార్యులైనారు), విళాంజోలై పిళ్ళై, గొప్ప స్త్రీ మూర్తులై తిరుమలై ఆళ్వార్ వారి తల్లిగారు మొదలైన అనేక మంది పిళ్లై లోకాచార్యుల దివ్య పాదాల యందు ఆశ్రయము పొంది, ఎంబెరుమానుని కంటే ఎక్కువగా అన్ని వేళలా అన్ని స్థితులలో వీరికి సేవలు చేసి తరించారు.

అలా వారిద్దరూ జీవనము సాగిస్తున్న కాలములో, పిళ్లై లోకాచార్యులు తమ శిష్యులకు శ్రీ వచన భూషణ కాలక్షేపము ఇవ్వడం ప్రారంభించారు. దాదాపు అదే సమయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తమ ఆచార్య హృదయం అనే రచనను ప్రారంభించారు, ఇది తిరువాయ్మొళి సారముగా పరిగణించబడుతుంది, అలాగే శ్రీవచన భూషణ అర్థ విశేషాలను దృఢపరచే గ్రంథమిది. ఈ రెండూ, ఈడు యొక్క అర్థాలను తెలియజేస్తాయి కాబట్టి, ఈడు తనియన్లు పఠించినప్పుడు పిళ్లై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల ఇద్దరి తనియన్ ని పఠించడం పరిపాటి.

అన్నదమ్ములిద్దరూ తమ రచనల వల్ల పొందిన కీర్తిని, వారి రచనల శ్రవణం చేయడానికి,  ప్రజలు వచ్చి వారి ఆశ్రయం పొందడాన్ని కొందరు సహించలేక పోయారు. అసూయతో వారు వెళ్లి నంపెరుమాళ్ళతో ఇలా మొర పెట్టుకున్నారు, “ఓ రంగనాథా! పిళ్లై లోకాచార్యులు శ్రీ వచన భూషణం అనే గ్రంథాన్ని నిగూఢ అర్థాలతో రచించెను, ఇది దర్శనం యొక్క అర్థాలను నిరర్థకం చేసేటట్టుగా ఉంది” అని వేడుకున్నారు. ఇది విన్న నంపెరుమాళ్ ఆగ్రహించి, అర్చక ముఖేన  పిళ్ళై లోకాచార్యుని పిలిపించారు. వారు స్నాన మాచరించేందుకు వెళ్ళినందున, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు వారి పిలిపు ఉద్దేశ్యాన్ని తెలుసుకొని వారితో పాటు పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళెను. అర్చక ముఖేన పెరుమాళ్ళు ఇలా అడిగారు, “ఓ నాయనార్! ధర్మసంస్థాపనకై మనము అనేక అవతారాలు ధరించాము కదా?  అవి నిరర్థకము చేయడానికి నీవు రహస్య గ్రంథాలను ఎందుకు గ్రంథస్తం చేయుచున్నావు? ” శ్రీవచన భూషణ స్థాపనకు అనుబంధంగా తాను ఆచార్య హృదయం గ్రంథస్తం చేసారని  అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు జవాబిచ్చారు. ఈ వివరణ విన్న పెరుమాళ్ళు సంతోషించి, ఫిర్యాదు చేసిన వారిని “ఇవి కాదా, తన అవతారాలలో చెప్పినవి?” అని పలికారు. ఆ తరువాత నాయనార్లకు ఆలయ మర్యాదలన్ని అందించి (తీర్థ శఠారి, తుళసి ప్రసాదం మొదలైనవి), పల్లకీలో వారి నివాసానికి పంపాడు. ఇది విన్న పిళ్ళై లోకాచార్యులు సంతోషించి, తిరునెడుందాండగము పాశురము “వళర్ త్తదనాల్ పయన్ పెఱ్ఱేన్” (నికు శిక్షణ ఇచ్చిన ప్రయోజనాన్ని నేను ఇప్పుడు గ్రహించాను) పాడుతూ తన సోదరుడిని కౌగిలించుకున్నాడు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/07/27/yathindhra-pravana-prabhavam-12-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment