శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
మాణవాళ మాముణులు, శ్రీవచన భూషణ శాస్త్రాన్ని నంపెరుమాళ్ళ ఆదేశము మేరకు రచించారని చెప్పారు, కానీ పైన ఉల్లేఖించిన సంఘటన మన మనస్సులో సందేహానికి స్థానమిస్తుంది. ఈ విషయము గురించి పెద్దలను అడిగి తెలుసుకోవడం మంచిది. మాణవాళ మాముణులు, తమ శ్రీవచన భూషణం వ్యాఖ్యానంలో ఈ విధంగా వ్రాశారు:
“సంసారులు అనుభవిస్తున్న కష్టాలను చూసి, వారిని ఉద్ధరించడానికి, పిళ్ళై లోకాచార్యులు గొప్ప కరుణతో, అనేక ప్రబంధాలను రచించారు. పెరుమాళ్ళ అనుగ్రహముతో ఆతడి కోరిక మేరకు, పూర్వాచార్యులు పరమ గోప్యంగా ఇచ్చిన నిగూఢమైన కాలక్షేపాలను స్మరిస్తూ, తమ మునుపటి రచనలలో వెల్లడించని అర్థాలను నిర్ధారిస్తూ, పిళ్ళై లోకాచార్యులు శ్రీ వచన భూషణ ప్రబంధాన్ని కృపచేసారు.
పేరరుళాళ ప్పెరుమాళ్ (కంచి దేవా ప్పెరుమాళ్) మణప్పాక్కం నివాసి అయిన నంబికి తన స్వప్నంలో కొన్ని అర్థాలను నిర్ధేశించారు. ఆతడు ఒకరోజు నంబితో “నీవు రెండు నదుల మధ్య ఉన్నప్పుడు; మరిన్ని అర్థాలను మేము అక్కడ మీకు స్పష్టమైన రీతిలో నిర్ధేశించెదము” అని అన్నారు. నంబి కూడా శ్రీరంగం (కొల్లిడం మరియు కావేరి అనే రెండు నదుల మధ్య ఉంది) కి చేరుకున్నారు. అక్కడ ప్రతిరోజూ పెరుమాళ్ళను ఆరాధిస్తూ, దేవరాజ పెరుమాళ్ తనకు చెప్పిన అర్థాలను ఆలయంలో (కాట్టళగియ శింగర్ ఆలయము) ఏకాంత ప్రదేశంలో ధ్యానించుచుండెను. పిళ్లై లోకాచార్యులు తమ శిష్యులతో కలిసి ఒకరోజు అక్కడికి వచ్చారు. వారు తమ శిష్యులకు శాస్త్ర రహస్యార్థాలను ఉపదేశించడం ప్రారంభించారు. అవి దేవ ప్పెరుమాళ్ళు తనకు చెప్పిన అర్థాల మాదిరిగా ఉన్నట్టు గమనించి, మణప్పాక్కం నంబి తాను ఉన్న చోటి నుండి బయటకు వచ్చి పిళ్లై లోకాచార్యులకి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకున్నారు. వారు లోకాచార్యులని “మీరు వారేనా?” (అర్థం – మీరు పేరరుళాళ ప్పెరుమాళ్ళా?) అని అడిగారు. లోకాచార్యులు “అవును; ఎందుకు అడుగుతున్నావు?” అని ప్రశ్నించారు. స్వప్నములో పేరారుళాళ పెరుమాళ్ళు తనకి అర్థాలను ఎలా ఉపదేశించారో, తరువత ఏమి చేయమని ఆదేశించారో నంబి వివరించారు. లోకాచార్యులు ఈ మాటలు విని సంతోషించి, నంబిని తన శిష్యునిగా స్వీకరించి వారికి కూడా రహస్యార్థాలను బోధించారు. ఒకరోజు, నంబి స్వప్నములో పెరుమాళ్ళు వచ్చి, ఈ అర్థాలు మరచిపోకుండా ఉండేందుకు వీటిని వ్రాయమని తన ఆదేశముగా లోకాచార్యులకి తెలియజేయమని చెప్పెను. లోకాచార్యులు దీనిని పెరుమాళ్ళ ఆదేశముగా భావించి పాటించాలని నిశ్చయించుకునెను” (ఇక్కడ వరకు మణవాళ మాముణులు తమ శ్రీవచన భూషణ ప్రబంధ వ్యాఖ్యాన పరిచయములో వివరించెను).
అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తిరుప్పావైతో సహా కొన్ని ప్రబంధాలకు వ్యాఖ్యానం రాశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, జీయర్ [మన సంప్రదాయంలో జీయర్ అనే పదం మణవాళ మాముణులను సూచిస్తుంది], తమ ఉపాదేశ రత్నమాల ప్రబంధంలో “తన్ శీరాల్ వైయ గురువిన్ తంబి మన్ను మణవాళ ముని శెయ్యుం అవై తానుం శిల” (పిళ్ళై లోకాచార్యుల సోదరుడైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ కొన్ని వ్యాఖ్యానాలు కృపతో అనుగ్రహించారు). అని రాశారు.
ఆ విధంగా, పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు ప్రాపంచిక విషయాల పట్ల సంపూర్ణ నిర్లిప్తతతో జీవిస్తున్నప్పుడు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు శ్రీవైకుంఠాన్ని చేరుకున్నారు. పిళ్ళై లోకాచార్యులు దుఃఖ సాగరములో మునిగిపోయి బాధతో, మణవాళ పెరుమాళ్ నాయనార్ల శిరస్సును తన ఒడిలో పెట్టుకుని, “గొప్ప ముడుంబై వంశానికి చెందిన మణవాళ పెరుమాళ్ కూడా శ్రీవైకుంఠానికి వెళితే, అష్టాక్షరముల (తిరుమంత్రం) అంతరార్థాలను ఎవరు తెలియజేస్తారు. ‘మామ్’ [శ్రీ భగవత్ గీత 18.66 లో కృష్ణుడు పలికిన “మామ్ ఏకం శరణం వ్రజ”] అనే పదానికి అర్థం ఎవరు తెలియజేస్తారు? అని విలపించసాగారు.
అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల తనియన్:
ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం
రమ్యజామాతృ దేవేన దర్శితం కృష్ణసూనునా
(వడక్కు తిరువీధి పిళ్ళై తిరు కుమారులైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు దివ్య గ్రంధమైన ఆచార్య హృదయం రచించారు)
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/07/28/yathindhra-pravana-prabhavam-13-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org