యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 16

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 15

ఇప్పుడు ఆళ్వార్లకు సంబంధించిన సంఘటనలు

నంపెరుమాళ్ కోళిక్కొడు నుండి బయలుదేరినప్పుడు, అక్కడి అధికారులు, అర్చకుల అయుక్తతత కారణంగా ఆళ్వార్ పెరుమాళ్ళతో వెళ్లలేకపోయెను. ఆ రోజుల్లో తూర్పు పశ్చిమము రెండు దిశల్లో  (కోళిక్కొడు) దొంగల ఆవాసము ఉండేది; ఉత్తరం వైపున, ముస్లిం ఆక్రమణదారుల భయం ఉండేది. ఆ కారణంగా ఆళ్వార్ని దక్షిణ దిశగా తీసుకువెళ్ళవలసి వచ్చెను. దొంగల భయం ఉండటంతో, వేరే దారి లేక, ఒక కొండ లోయలో ఒక దివ్య చెట్టు కాండములో ఆళ్వారుని ఆసీనపరచి, రక్షణ కొరకు ఆ చెట్టు చుట్టూ గొలుసులు చుట్టి ఉంచి, ఆళ్వార్ యొక్క దివ్యాభరణాలను సమీపంలోని సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచి, ఆ కొండ క్రిందకి దిగడం ప్రారంభించారు. దారిలో కొందరు దొంగలు దాడిచేయగా, తమ వద్ద ఉన్న వస్తువులను వారికి ఇచ్చి వారి వారి ఇల్లకి చేరుకున్నారు.

వారిలో ఆళ్వార్ల ఎనలేని భక్తుడైన తోళప్పర్ కూడా ఉన్నారు. అతను మధురకి వెళ్లి, తిరుమలై ఆళ్వార్లను [తిరువాయ్మొళి ప్పిళ్ళై, మణవాళ మాముణుల ఆచార్యులు] కలుసుకుని, జరిగిన సంఘటన గురించి వివరించారు. అతని మాట విన్న తర్వాత, తిరుమలై ఆళ్వార్ తన నమ్మకస్తులతో మలయాళ దేశ రాజుకి సందేశం పంపారు. అప్పటికి ఆక్రమణదారుల ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. వాళ్ళు తిరువాంగోట్టూర్ చేరుకుని, రాజును కలుసుకుని, తిరుమలై ఆళ్వార్ల సందేశాన్ని అందించారు. ఆ సందేశాన్ని చదివిన తర్వాత, రాజు తోళప్పర్ కు బహుమానములిచ్చి, తన విశ్వసనీయులను పంపించి, తిరుక్కణాంబిలో ఆళ్వార్ని ప్రతిష్టించమని ఆదేశించారు. వాళ్ళు కావలసిన సామగ్రి గొలుసులు పలకలను తీసుకొని ముండిరిప్పు అనే ప్రదేశానికి వెళ్లి పర్వతం ఎక్కడం ప్రారంభించారు. ఆళ్వార్లి దాచిన లోయలో అ చోటికి దిగడానికి  భయపడి ఎవరు ముందుకు వస్తారోనని ఆలోచించసాగారు. తోళప్పర్ ముందుకు వచ్చారు. వారితో వచ్చిన వారు సంతోషించి, ఆలయంలో వకుళాభరణ భట్టర్ (నమ్మాళ్వార్ల  అవతార స్థలము ఆళ్వార్ తిరునగరిలోని ప్రముఖ కైంకర్యపరారు) తో సమానమైన గౌరవాలు తనకి ఇవ్వబడతాయని అతనికి వాగ్దానం చేశారు.  ఆళ్వార్ తిరునగరిలో కొన్ని సందర్భాలలో ఆళ్వారుకి తిరుమంజనము నిర్వహించినపుడు, ఆళ్వార్ల దివ్య శిరస్సుని అలంకరించే పూ మాలను “ఆళ్వార్ తోళప్పర్” అరుళప్పాడు (అరుళప్పాడు అనేది సన్మానం అందించే ముందు ఆ సన్మానం పొందే వ్యక్తి పేరును ప్రతి ఒక్కరూ వినేలా గట్టిగా పిలిచే ఒక ప్రక్రియ) వారికి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత వారు తమ వెంట తెచ్చుకున్న గొలుసుల పలకలపైన తోళప్పర్ని కూర్చోపెట్టి క్రిందకి దించారు. వారు ఆళ్వార్ని దాచి ఉంచిన చోటికి వెదుకుతుండగా దగ్గరలో ఒక పక్షి [గరుడ] శబ్దాలు చేయడం ప్రారంభించింది. తోళప్పర్ అది దివ్య సంకేతముగా భావించి అక్కడ వెదికితే ఒక కాండము కనిపించెను. సాష్టాంగ నమస్కారము చేసి ఆళ్వార్ని ధ్యానించారు. ఆ పక్షి ఎగిరిపోయింది. వారు ఆ కాండముని తెరిచి చూస్తే లోపల ఆళ్వార్ దర్శనమిచ్చెను. మళ్లీ ఆళ్వార్ ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. వారు కొన్ని తాళపత్రాలు మరియు వ్రాత పరికరాలు తీసుకెల్లినందున, వారు దిగిన క్షణం నుండి తాను చూసిన విషయాలను ఆ పత్రాలలో వ్రాసారు. తరువాత ఆళ్వారున్న ఆ దివ్య కాండముని పలకపైన ఉంచి పైనున్న వారికి లాగమని సైగ చేశారు. వాళ్ళు పలకను పైకి లాగి తోళప్పర్ వ్రాసినది చదివి, ఆళ్వార్ని పూజించి, తోళప్పర్ పైకి రాడానికి ఆ పలకను మళ్లీ క్రిందకి దించారు. పైకి లాగుతుండగా, ఆ పలక మధ్యలో ఒక అడ్డంకికి తగిలి తోళప్పర్ జారి క్రింద లోయలో పడిపోయెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/07/31/yathindhra-pravana-prabhavam-16-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment