శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తమతో ఉన్న తోళప్పర్ కుమారుడైన అప్పన్ పిళ్లైని ఓదార్చుచూ వాళ్ళు ఇలా అన్నారు – “బాధపడవద్దు, ఎందుకంటే నీ తండ్రి ఆళ్వార్ కైంకర్యంలో తమ దివ్య శరీరాన్ని త్యాగము చేశారు; ఆళ్వార్ నిన్ను కూడా తన కొడుకుగానే భావిస్తారు; తొళప్పర్కి చేసిన వాగ్దానము నీపైన అమలు చేయబడుతుంది” అని హామీ ఇచ్చారు. తరువాత ఆళ్వార్ల దివ్య విగ్రహాన్ని ముదిరిప్పు అనే చోటికి తీసుకువచ్చి, ఐదు రోజుల తిరుమంజనం నిర్వహించారు. ఆ చుట్టుపక్కల ఉన్న దొంగలు ఈ సంఘటన గురించి విని అక్కడికి వచ్చి, ఆళ్వార్కి ఆరాధనలు చేసి, వాళ్ళు ముందు దోచుకున్న సంపత్తినంతా తిరిగి వారికే సమర్పించి, ఆళ్వార్ తిరుక్కణాంబికి తీసుకెళ్లడానికి సౌకర్యముగా పల్లకీని దానం చేసి, ఆళ్వార్తో పాటు పరిచారకులందరూ సురక్షితంగా వెళ్లేలా ఏర్పాట్లు చేసారు. ఒక పెద్ద గరుడ పక్షి ఆళ్వార్ మీదుగా తిరుక్కణాంబి వరకు ఎగురుతూ వెళ్లి, అక్కడ ఒక చెట్టుపై గూడు కట్టుకుని అక్కడే ఉండిపోయింది. దీనిని ఆశ్చర్యంగా చూస్తూ, ప్రజలు ఆళ్వార్ని సేవించారు, వారి స్థితికి తగినట్లు సమర్పణము అందించి పరమోత్సాహముతో ఉత్సవాలలో పాలు పంచుకున్నారు. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు అన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ అద్భుతమైన సంఘటనల గురించి విని, చుట్టు పక్కల ఉన్న దివ్యదేశాలలోని (తిరువనంతపురం, తిరువాట్టాఱు, తిరువణ్‌పరిసారం, తిరువల్లవాళ్ మొదలైన) నంబూద్రీ పురోహితులు తిరుక్కణాంబికి వచ్చి, ఆళ్వార్ని సేవించుకున్నారు. తిరిగి వెళ్ళడానికి వాళ్ళకు మనసు రాలేదు. నిత్యారాధనములు, దద్యోజనము, నెయ్యితో చేసిన దోస, అటుకులు బెల్లముతో చేసిన పలు నైవేధ్యాలు మధ్యాహ్నం వరకు సమర్పించేవారు. ఆళ్వారు కాస్త విశ్రాంతి తీసుకున్న తరువాత తిరువారాధనము పూర్తైన పిదప అన్నంతో చేసిన వివిధ రకాల తీపి వంటలు, ఉప్పు సాత్తముదు, పాలు అల్లముతో చెసిన పానీయము మొదలైనవి సమర్పించేవారు. నంబూద్రీ పురోహితులు ఈ ఏర్పాట్లన్నీ ఆళ్వార్ పట్ల అమితమైన ప్రేమతో చేసేవారు. ఆళ్వార్ జన్మస్థలమైన ఆళ్వార్ తిరునగరిలో విగ్రహాము యొక్క మూల స్థానము యందు వారి శిష్యులు, మఠాధిపతులు అందరూ ఆళ్వార్ పట్ల అమితమైన భక్తి ప్రపత్తులతో సరైన సమయాలలో సరైన రీతిలో ఉత్సవాలు జరుపుతూ అక్కడే ఉండిపోయారు.
ఇప్పుడు, శ్రీరంగం ఆలయ సంఘటనము చూద్దాము
నంపెరుమాళ్ళు శ్రీరంగాన్ని విడిచి వెళ్లిన తర్వాత, శ్రీ రాముడు అడవులకు బయలుదేరిన తర్వాత “అభివృక్షాః పరింలానాః” అనే సూక్తి ప్రకారం అయోధ్య తన ఐశ్వర్యాన్ని అందాన్ని కోల్పోయినట్లే, శ్రీరంగం కూడా తన అందాన్ని కోల్పోయింది. ఆళ్వార్లు తమ పాశురములలో “అఱ్ఱపఱ్ఱర్ శుఱ్ఱి వాళుం అందణీర్ అరంగం” (చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో నివసిస్తూ వైరాగ్యముతో నిండిన భక్తులతో కూడిన అందమైన చల్లని తిరువరంగం) మరియు “నల్లార్గళ్ వాళుం నళ్రి అరంగం” (చల్లని తిరువరంగంలో నివసించే సత్పురుషులు) అని కొనియాడిన శ్రీరంగము తన అందాన్ని పూర్తిగా కోల్పోయింది.
ముస్లిముల సైన్యాధిపతి శ్రీరంగానికి మరింత నష్టం చేకూర్చాడు. దృఢమైన ఆలయ ప్రహరీ గోడలను పడగొట్టి కణ్ణనూర్లో [తిరువానైక్కావిల్ సమీపంలో] తన కోసం ఒక విశ్రాంతి భవనాన్ని నిర్మించుకొన్నాడు. అక్కడ నివసించే ప్రజలకు మరిన్ని కష్ఠాలు ఇబ్బందులు కలిగించేవాడు. పెరియ పెరుమాళ్ళకు సంబంధించిన భూములు ఆస్తుల విషయాలను చూసుకుంటున్న సింగప్పిరాన్ అనే వ్యక్తి, ఆలయ ప్రహరీ గోడలు, గోపురాలు, మంటపాలు, మాడ వీధులు మొదలైన వాటికి నష్టం జరగకుండా సహాయం చేయమని వేడుకొని అటుపైన నష్ఠము కలుగకుండా చూసుకున్నారు. స్థానిక ఆచార్యులు మఠాధిపతులందరూ ఎంతో సంతోషించి కుదుటపడ్డారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/01/yathindhra-pravana-prabhavam-17-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org