శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
నాలూరాచ్చాన్ పిళ్ళై దివ్య పాదాలకు తిరుమలై ఆళ్వార్ సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేసెను. నాలూరాచ్చాన్ పిళ్ళై వారిని స్వీకరించి, ఈడు (తిరువాయ్మొళిపై నంపిళ్లై చేసిన కాలక్షేపం ఆధారంగా వడక్కు తిరువీధి పిళ్ళై వ్రాసిన వ్యాఖ్యానం) బోధించడం ప్రారంభించారు. నాలూరాచ్చాన్ పిళ్ళై తిరుమలై ఆళ్వార్ కు ఈడు వాక్యానము బోధిస్తున్నారని విని, తిరునారాయణపురంలోని జనన్యాచార్ (తిరునారాయణపురత్తు ఆయి), తిరువాయ్మొళి ఆచ్చాన్ పిళ్ళై మొదలైన ఆచార్యులు, ఎంబెరుమానార్లచే వెలువడిన ఒక సందేశాన్ని నాలూరాచ్చాన్ పిళ్ళైకి పంపారు. అది చూసి, తిరుమలై ఆళ్వార్‌తో కలిసి నల్లూరాచ్చన్ పిళ్లై తిరునారాయణపురానికి బయలుదేరెను.
ఇలా చెప్పబడినట్లుగా..
ఆరుహ్యామల యాదవాద్రి శిఖరం కల్యాణితీర్థం తతః
స్నాత్వాలక్ష్మణయోగినః పదయుగం నత్వాతుగత్వాంతతః
శ్రీనారాయణమేయతత్ర ధరణీ పద్మాలా మధ్యకం
పశ్యేయం యధికిం తపఃపలమతః సంపత్కుమారం హరిం
(పవిత్రమైన యాదవాద్రి కొండ ఎక్కడం, కళ్యాణి తీర్థంలో పుణ్య స్నానం చేయడం, ఇళయాళ్వార్ల (రామానుజుల) దివ్య తిరువడిని సేవించడం, తిరునారయణుని దర్శించడం, ఇరువురు దేవేరులైన శ్రీ దేవి భూదేవుల నడుమనున్న సంపత్ కుమారుని (సెల్వ పిళ్ళై) ఆరాధించగలిగితే, దీని కంటే గొప్పది తపస్సు ఇంకే ముంది?)
వారు గౌరవాలు పొందుతూ సరైన సాంప్రదాయ రీతిగా క్రమంలో తిరునారాయణుని దివ్య పాదాలను తమ రక్షణగా ఉంచి వెళ్ళారు; వారు ఎమ్పెరుమానార్లని మొదట సేవించి వారి పురుషకారాంతో యదుగిరి నాచ్చియార్ (శ్రీమహాలక్ష్మి), సెల్వప్పిళ్ళై (ఉత్సవ మూర్తి) మరియు తిరుణారాయణుని (మూలవర్లు) సేవించుకొనెను. వారు తమ బస అక్కడ ఏర్పరచుకొనిరి. ఇరామానుశ నూఱ్ఱందాది 19వ పాశురంలో “ఉరుపేరుం శెల్వముం.. (తిరువాయ్మొళి మన జీవనాధారానికి నిధి….” ) వ్రాసిన విధంగా ఎమ్పెరుమానార్లకి సంతృప్తి కలిగించడానికి ఎమ్పెరుమానార్ల సన్నిధిలో నాలూరాచ్చాన్ పిళ్ళై నుండి ఈడు వ్యాక్యానాన్ని అభ్యసించడం ప్రారంభించారు. ఉపదేశ రత్నమాల పాశురము 49 “మెలోర్కిందార్…” (ఉత్తమ పురుషులకు అర్థాలను అనుగ్రహించెను) లో చెప్పబడినట్లుగానే నాలూరాచ్చన్ పిళ్లై కూడా మహా కృపతో వారికి పూర్తి అర్థాలను వివరించారు. నాలూరాచ్చన్ పిళ్లైల దివ్య తిరువడి యందు సాష్టాంగ నమస్కారం చేసి తిరుమలై ఆళ్వార్ ఆళ్వార్ల దివ్య ప్రబంధాల అర్థాలను వివరించమని కోరారు. నాలూరాచ్చన్ పిళ్లై కూడా తిరుమలై ఆళ్వార్ల జ్ఞాన భక్తి వైరాగ్యాలకు మెచ్చి తమ తిరువారాధన పెరుమాళైన ఇనవాయర్ తలైవన్ (పశు కాపరి, అనగా శ్రీ కృష్ణుడు) ని తిరుమలై ఆళ్వార్లకి ప్రసాదించెను.
ఈ శ్లోకములో చెప్పినట్లుగా….
దేవాదిపాత్సమధిగమ్య సహస్రగీతేర్ భాష్యం నికూటమపియః ప్రదయాం చకార
కుంతీపురోత్వముం శరణం భజేహం శ్రీశైలనాథ గురుభక్తి పృతం శటారౌ
(దేవాదిపర్ అని పిలువబడే నాలూరాచ్చాన్ పిళ్ళై వద్ద తిరువాయ్మొళి పాశురాల నిగూఢ భాష్యమైన ఈడు ముప్పత్తారాయిరమును నేర్చిన ఆ తిరుమలై ఆళ్వార్ల యందు నేను శరణు వేడుతున్నాను; తర్వాత వారు ఆ భావార్థాలను ఎంతో ప్రసిద్ధికెక్కించెను. నమ్మాళ్వార్ల యందు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండేవారు. కుంతీనగరంలో జన్మించారు.) దేవ పెరుమాళ్ళచే అనుగ్రహింపబడిన తిరుమలై ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల దివ్య తిరువడి యందు అంతులేని భక్తితో ఉండేవారు. శ్రీ రామాయణంలో “ఆజగామ ముహూర్తేన” (కొద్ది క్షణాల్లో) చెప్పినట్లుగానే, అతను నమ్మాళ్వార్ నివాసం ఉన్న తిరుక్కనంబికి చేరుకొనెను, ఆళ్వార్ల దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆళ్వారుపైన తనకున్న అభిమానాన్ని పూరించడానికి ఆళ్వారుని తిరుక్కనంబి నుండి ఆళ్వార్తిరునగరికి తీసుకురావాలని నిర్ణయించుకొనెను. “నల్లార్ పలర్ వాళ్ కురుగూర్” (ఎందరో మహానుభావులు నివసించే కురుగుర్లో) అని చెప్పినట్లు దానికి అనుగుణంగా, వారు మొదట ఆళ్వార్ తిరునగరికి వెళ్లి, అక్కడ పెరిగి ఉన్న కలుపు మొక్కలన్నీ పెరకి, ఉండగలిగేలా సౌకర్యవంతమైన ప్రదేశంగా మార్చారు. ఆ తర్వాత వారు నమ్మాళ్వార్లను మూలస్థానంలో ప్రతిష్టింపజేశారు. ఇలా చెప్పబడింది..
శటకోపమునిం వందే శటానాం భుద్ది దూషణం
అజ్ఞానాం జ్ఞానజనకం తింద్రిణే మూల సంశ్రయం
(అజ్ఞానుల అజ్ఞానాన్ని తొలగించి, దివ్య జ్ఞానాన్ని(భగవత్ జ్ఞానము) పొందేలా చేసి కృపతో దివ్య చింత చెట్టులో నివాసమున్న శ్రీ శఠగోప ముని దివ్య తిరువడి యందు నేను నమనము చేస్తున్నాను). తమ ఈ లక్ష్యాన్ని పూర్తి అయిన పిదప వారు నమ్మాళ్వారుని చిత్త శుద్ధములై ఆరాధించడంతో, నమ్మాళ్వార్ స్వయంగా [అర్చక ముఖేన] శ్రీ శఠగోపదాసర్ (నమ్మాళ్వారుల దివ్య దాసుడు) అని బిరుదును ప్రసాదించెను. వీరు చాలా కాలం పాటు ఆళ్వార్ తిరునగరిలోనే ఉండి, తమ దినచర్యగా భావించి నమ్మాళ్వార్లకి అన్ని వేళలా అన్ని సేవలను నిర్వహించెను.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://granthams.koyil.org/2021/08/04/yathindhra-pravana-prabhavam-20-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org