శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తిరుమలై ఆళ్వార్ మరియు విళాంజోలై పిళ్ళై
తిరుమలై ఆళ్వార్ తాను తిరువనంతపురానికి వెళ్లి, విళాంజోలై పిళ్ళైకి పాదాభి వందనాలు సమర్పించుకొని వారి వద్ద అన్ని సంప్రదాయ రహస్య అర్థాలను నేర్చుకోవాలని తమ దివ్య మనస్సులో నిర్ణయించుకున్నారు. ఆళ్వార్ల ప్రధాన శిష్యులన్న హుందాతనాన్ని చూపిస్తూ వారు ఆలయం లోపలికి వెళ్లి, పడగలు విప్పి ఉన్న ఆదిశేషునిపై పవళించి ఉన్న భగవానుని దివ్య పాదాలను సేవించెను. ఆ తరువాత శ్రీ కృష్ణుడి దివ్య పాదాలను దర్శింపజేసిన ఉలగారియన్ (పిళ్ళై లోకాచార్యులు) ను ఆశ్రయించిన నారాయణన్ (విళాంజోలై పిళ్ళైల మరో పేరు) దివ్య తిరువడిని సేవించేందుకు వెళ్ళెను. విళాంజోలై పిళ్ళై నివాసం ఉంటున్న తోటలోకి వీరు ప్రవేశించెను. “గురుపదాంబుజం ధ్యాయేత్ గురోర్ నామసదాజపేత్” (నిత్యము ఆచార్యుని దివ్య తిరువడిని ధ్యానిస్తూ, ఆచార్యుని దివ్య నామాన్ని నిరంతరం పఠిస్తూ ఉండాలి) అని చెప్పబడినట్లే,
శ్రీలోకార్య ముఖారవిందం అఖిల శృత్యర్థ కోశం సదాం
తద్గోష్ఠీంచ తదేకలీనమనసా సంచింతయంతం సదా
(వేదార్థాలకు నిలవుగా పరిగణించబడే పిళ్లై లోకాచార్యుల దివ్య శ్రీముఖాన్ని అలాగే సత్పురుషుల నివాసంగా పరిగణించబడే వారి గోష్టిని విలాంజోలై పిళ్లై నిత్యము ధ్యానిస్తుండేవారు. సాలె పురుగులు చుట్టూ బూజులు అల్లాయని కూడా తెలియకుండా పిళ్ళై లోకాచార్యుల దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానిస్తున్న స్థితిలో తిరుమలై ఆళ్వార్ విలాంజోలై పిళ్ళైని దర్శించెను. తిరువాయ్మొళి పిళ్ళై వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, అంజలి ప్రణామాలు సమర్పించారు. విలాంజోలై పిళ్ళై తమ దివ్య నేత్రాలు తెరిచి “ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని అడిగెను. తిరుమలై ఆళ్వార్ అప్పటి వరకు జరిగినదంతా వివరించారు. విలాంజోలై పిళ్ళై సంతోషించి, తిరుమలై ఆళ్వారుకి శ్రీ వచన భూషణం యొక్క ముఖ్యమైన నిగూఢ అర్థాలను కృపతో బోధించెను. శ్రీ వచన భూషణమే కాకుండా, విలాంజోలై పిళ్ళై తిరుమలై ఆళ్వార్‌కు కేవలం ఏడు పాసురాలలో శ్రీవచన భూషణ సారమైన సప్తకాదై అర్థాలను కూడా బోధించెను. మేలిమి బంగారం వంటి విలాంజోలై పిళ్ళైల సంబంధముతో తిరుమలై ఆళ్వార్ల జన్మ దోషాలు తొలగిపోయాయి; విలాంజోలై పిళ్ళై వద్ద అన్ని రహస్య అర్థాలను తెలుసుకున్న తర్వాత, తిరుమలై ఆళ్వార్ ఆళ్వార్తిరునగరికి తిరిగి వచ్చెను. విలాంజోలై పిళ్ళై, జ్యోతిష్కుడిలో తమ ఆచార్యులు (పిళ్ళై లోకాచార్యులు) తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి, నిత్యాసురులు మరియు ముక్తాత్మాలతో కలిసి భగవానునికి కైంకర్యము చేయాలనే కోరికతో మరియు “సెఱిపొళిల్ అనంతపురత్తు అణ్ణలార్ కమలపాదం అణుగువార్ అమరరావార్” (చుట్టూ సుసంపన్నమైన తోటలతో విస్తరించి ఉన్న తిరువనంతపురం స్వామి యొక్క దివ్య కమల చరణాలను ఆశ్రయించి) అనే సూక్తికి అనుగుణంగా, వారు శ్రీవైకుంఠానికి చేరుకొనెను.
ఆ సమయంలోనే, తిరువనంతపురం ఆలయంలోని నంబూద్రీ పూజారులు అనంత పద్మనాభునికి తిరువారాధన కైంకర్యము చేస్తుండెను. విలాంజోలై పిళ్ళై అనంత పద్మనాభుని గర్భ గృహంలోకి ప్రవేశించడం, పెరుమాళ్ళ దివ్య పాదాలను సేవించడం వారు చూశారు. తక్కువ జాతికి చెందిన వ్యక్తి ప్రవేశించిన చోటిలో తాము ఉండలేము అని నిర్ణయించుకుని, పెరుమాళ్ళకు దివ్య రక్షణ లేపనము చేసి వాళ్ళు గర్భ గృహము వదిలి ఆలయము బయటకు వచ్చారు. అదే సమయంలో, విలాంజోలై పిళ్ళై శిష్యులు తమ ఆచార్యులు విలాంజోలై పిళ్ళై లోకాచార్యుల దివ్య తిరువడిని చేరుకున్నారని, తమకు పెరుమాళ్ళ దివ్య పరివట్టం (వస్త్రం), పుష్ప మాలలు కావాలని, ఇరామానుశ నూఱ్ఱందాది పఠిస్తూ ఆలయము లోనికి అచ్చెను. ఇది చూసిన నంబూద్రీ అర్చకులు గుడిలో తాము చూసిన అద్భుతమైన అనుభవాన్ని వారితో పంచుకున్నారు. తిరుమలై ఆళ్వారుని వద్దకు తిరిగివచ్చి ఆచార్యులు జరిగిన ఈ సంఘటన గురించి విని ఇలా అన్నారు.
గత్వానంతపురం జగత్గురు పదధ్యానేరతం కుత్రచిత్ తం
నారాయణదాసమేత్యవిమలం గత్వా తదంగ్రిం ముదా
తస్మాధార్యజనోక్తిమౌక్తికకృతం వేదాంత వాగ్భూషణం
శ్రీవాగ్భూషణమభ్యవాప్సగురుం శ్రీశైలనాథోభవత్
తిరుమలై ఆళ్వార్ తిరువనంతపురానికి వచ్చి, పిళ్లై లోకాచార్యుల దివ్య చరణాలను నిత్యము ధ్యానించాలని కోరుకునే ఆ నారాయణ దాసుని (విలాంజోలై పిళ్ళై) ని ఆశ్రయించెను; ఆనందంగా వారి దివ్య తిరువడికి నమస్కరించి, పూర్వాచార్యుల వేదాంత సూక్తులతో కూడిన శ్రీ వచన భూషణాన్ని అందుకొని గొప్ప ఆచార్యులైనారు. విలాంజోలై పిళ్ళై శ్రీవైకుంఠాన్ని అధిరోహించిన వార్త విన్న తిరుమలై ఆళ్వారు, ఒక శిష్యుడు తమ ఆచార్యునికి, తనయుడు తన తండ్రికి చేయవలసిన చరమ కైంకర్యాలు అన్ని నిర్వహించెను.
పిళ్లై లోకాచార్యుల శిష్యులలో ఒకరైన కోట్టూర్ అళగియ మణవాళ పెరుమాళ్ పిళ్ళై తమ ఆచార్యులు పరమపదము చేరుకున్న తరువాత, తిరుప్పుళ్ళాణి సమీపంలోని సిక్కల్ కిడారం అనే చోటికి చేరుకుని అక్కడ కొంత కాలం ఉన్నారు. తరువాత, తిగళక్కిడందాన్ తిరునావీఱుడైయ పిరాన్ తాడరణ్ణణరైయర్ వారి వద్దకు వచ్చి తమ కుమార్తె శ్రీ రంగ నాచ్చియార్ ను వివాహం చేసుకుని వారి ఇంట్లోనే ఉన్నారు. పిరాన్ తమ మామగారిని పిళ్లై లోకాచార్యులుగా భావించి, పిళ్లై లోకాచార్యుల వద్ద నేర్చుకోలేక పోయిన అన్ని విషయాలని నేర్చుకున్నారు. అతనికి అన్ని రహస్యార్థాలను బోధించిన తర్వాత, అళగియ మణవాళ పెరుమాళ్ పిళ్ళై దివ్య శ్రీ వైకుంఠానికి చేరుకుకొనెను.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/05/yathindhra-pravana-prabhavam-21-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org