శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
అళగియ మణవాళ మాముణుల దివ్య అవతారము
తుర్కుల దాడులు మరియు ఇతర కారణాల వల్ల ప్రపత్తి మార్గం మెల్లి మెల్లిగా బలహీనపడటంతో, కరుణతో నిండిన శ్రీమహాలక్ష్మికి పతి అయిన పెరియ పెరుమాళ్, శ్రీరంగంలోని ఆదిశేషుని సర్ప శయ్యపై శయనించి ఉండి నిరంతరం ఈ ప్రపంచ సంరక్షణ గురించి ఆలోచిస్తూ, ఒకే ఆచార్యుని ద్వారా దర్శనం (సంప్రదాయము) వృద్ధి చెందుతున్న విధానాన్ని చూసి, “ఎమ్పెరుమానార్ల (భగవద్ రామానుజులు) వలె ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే మరొక ఆచార్యుని సృష్టిద్దాం.” అని నిర్ణయించుకొనెను. తగిన వ్యక్తిని అన్వేషిస్తుండగా, ఆతడి దివ్య కృప తిరు అనంత ఆళ్వాన్ (ఆదిశేషన్) పై స్థిరపడి, ఈ ప్రపంచాన్ని సరిదిద్దమని వారిని నియమించెను. వారు కూడా ఇలా చెప్పబడినట్లు, పెరియ పెరుమాళ్ళు కోరుకున్నట్లుగానే…
తదస్థదింగితం తస్య జానత్వేన జగన్నితేః
తస్మిన్ దామ్ని శటారాతేః పురే పునరవాతరత్
(అప్పుడు, తిరువనంతుడు పెరియ పెరుమాళ్ళ దివ్య సంకల్పాన్ని గ్రహించి, శ్రీ శఠగోపుల (నమ్మాళ్వార్) దివ్య నివాసమైన ఆళ్వార్ తిరునగరిలోనే పునరవతారము దాల్చెను)
సంసన్ని సమయం తస్య తులాం ప్రాప్తే ద్విషాంపతౌ
మూలం హి సర్వసిద్ధీనాం మూలరుక్షం ప్రచక్షతే
(తిరువనంత ఆళ్వాన్ యొక్క దివ్య అవతారం మూలా నక్షత్రంలో జరిగిందని మన పూర్వాచార్యులు ధృవీకరించారు – సూర్యుడు సంచరిస్తూ తులా రాశిలోకి ప్రవేశించినపుడు, ఈ నక్షత్రము కార్య సిద్దికి దోహదపడుతుంది)
యన్మూలమాశ్వయుజమాస్యవతార మూలం కాంతో పయంతృ యమినః కరుణైకసింధోః
ఆసీతసత్సుగణితస్య మమాపిసత్తామూలం తదేవజగదప్యుదైయైక మూలం
(కరుణా సాగర అవతార తిరునక్షత్రమైన ఐప్పసి (తులా) మాసంలోని మూలం, పైగా సమస్థ ప్రపంచ సంరక్షణకు కారణము మరియు అసత్ గా భావించబడే ఈ అల్ప వ్యక్తి యొక్క ఉనికికి కారణమైన వారు [ఈ శ్లోకం మణవాళ మాముణుల శిష్యుడు ఎరుంబి అప్పాచే స్వరపరచబడింది) అణ్ణర్ (తిగళక్కిడందాన్ తిరునావీఱుడైయ దాసర్ అణ్ణన్) భార్య గర్భంలోకి ప్రవేశించి తొమ్మిది మాసాలు అక్కడ నివాసమున్నారు.
ఈ శ్లోకములో చెప్పబడినట్లు
పాదేరభావం గతాయాం కలియుగ శరతి శ్రద్దరాయే శకాప్తే
వర్షే సాధారణక్యే సమధిగతతులే వాసరే ధీరసంఖ్యే
వారే జీవేచతుర్థాం సమజనిసతితౌ శుక్లపక్షే
సుకర్మా ప్రాజన్ మూలాక్యతారే యతిపతిరపరో రమ్యజామాతృ నామా
(కళ్యత్వం 4471, సకాప్తం 1292, సాధారణ వరుషం, సూర్యుడు తులా రాశికి చేరుకున్నప్పుడు, ఆ నెలలోని 26వ రోజున, గురువారం, మూల నక్షత్రం, శుక్లపక్ష చతుర్థి తిథిన, మణవాళ మాముని అను దివ్య ఆత్మ (రమ్యజామాతృ ముని అని కూడా పిలుస్తారు), యతిపతి భగవద్ రామానుజుల పునరవతారము) కలియుగంలోని 4471వ సంవత్సరంలో, సాధారణ అను ఏడాది, ఐప్పాసి మాసం, శుక్లపక్షం, చతుర్థి తిథి, మూల నక్షత్రములో, తిగళక్కిడందాన్ తిరునావీఱుడైయపిరాణ్ తాదరణ్ణరరైయర్ యొక్క గొప్ప వంశంలో, మణవాళ మాముణులు వారి తిరుకుమారులుగా దివ్య అవతారమునెత్తెను.
వెంటనే, కలి పురుషుడు అల్లంత దూరాన పారిపోయెను, ఈ శ్లోకం ద్వారా స్థాపించబడినది.
యస్మిన్ స్వపాదపద్మేన స్పర్శ పృతివీమిమాం
కలిశ్చ తదక్షణేనైవ దుతృవే దూరదస్థరాం
మణవాళ మాముణులు తమ దివ్య కమలం లాంటి పాదాలతో ఈ భూమిని తాకిన ఆ క్షణంలోనే, కలి పురుషుడు పారిపోయెను.
ఆ విధంగా సమస్థ జీవాత్మలను ఉద్ధరించుటకై దివ్య అవతారము దాల్చిన తన తిరుకుమారుని కొరకు, జాతకర్మలు జరిపించి, పన్నెండవ రోజున భుజాలపై తిరువిలచ్చినై (దివ్య ముద్రలు) ధరింపజేశారు. ఆ రోజుల్లో, శిశువుకు పుణ్యాకవచనం [జాతకర్మం వలె] అయిన తర్వాత, పుష్ప సమాశ్రయణం చేయబడేది. దీనిలో, ధాతువుతో కూడిన శంఖ చక్రాలను వేడి చేసిన ముద్రలకు బదులుగా, శిశువుకు తిరుమణ్ కాప్పుతో అద్దిన శంఖ చక్రాల చిహ్నాలను, శ్రీ చూర్ణ ముద్రలు వేసేవారు. ఇప్పటికీ కొంత మంది శ్రీ వైష్ణవుల తిరుమాలిగలలో ఈ పద్దతి మనం చూడవచ్చు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/06/yathindhra-pravana-prabhavam-22-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org