అంతిమోపాయ నిష్ఠ – 7

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/04/09/anthimopaya-nishtai-6-telugu/) మనము మన పూర్వాచార్యుల జీవితములలో  ఆచార్య కైంకర్యము / అనుభవము, భగవత్ కైంకర్యము / అనుభవము కన్నా ఉత్కృష్ట మైనదని అనేక సంఘటనల ద్వారా గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల గురించిన మరిన్ని సంఘటనలను తెలుసుకొందాము

నంపిళ్ళై – తిరువళ్ళికేణి

మన జీయర్ (మణవాళ మాముణులు) ఈ క్రింది సంఘటనను పదే పదే తలంచుకుంటారు. ఒకసారి నంపిళ్ళై తమ శిష్యులతో కలసి తిరువెళ్లరైలోని నాచ్చియార్ కు మంగళాశాసనము చేయుటకై వెళ్లి, శ్రీరంగమునకు తిరుగు పయనమైరి. ఆ సమయములో కావేరి నది ఉద్తృతముగా ప్రవహించుచున్నది. నదిని దాటుటకై సరైయిన నావ లేదు. నదిని దాటుటకై వారు చిన్న తెప్పను ఎక్కిరి. సూర్యాస్తమైనది. చీకటి మొదలైనది పైగా వర్షము పడుతున్నది. తెప్పను అదుపు చేయుటకు ఆ నావికుడు ప్రయాసపడుతున్నాడు. తెప్ప మునగ నారంభించినది. వారితో అతను, మీలో కొందరు నదిలో దూకినచో, మనము క్షేమముగా ఆవలి ఒడ్డుకు చేరగలము, లేనిచో, నంపిళ్ళైతో సహా అందరము మునిగి పోగలము అనెను. క్రిందికి దూకినచో, మునిగి పోగలమని ఎవ్వరును దూకుటకు ఇష్టపడలేదు. కాని ఒక స్త్రీ మూర్తి (భాగవత నిష్ఠలో మునిగి వున్నది), తెప్పవాని ఉపాయమునకు అతనిని ఆశీర్వదించుతూ, “ఓ నావికుడా! నీవు చిరంజీవిగా ఉండు! ఈ జగత్తునకే ప్రాణాధారుడైన, నంపిళ్ళై ను ఆవలి తీరమునకు చేర్చుము.” అని పలికి, “నంపిళ్ళై దివ్య తిరువడిగలే శరణము” అని పలుకుచూ, ఆ చీకటిలోనే తెప్ప నుంచి దూకి వేసెను. తదుపరి, ఆ తెప్ప క్షేమముగా శ్రీరంగమునకు చేరెను. నంపిళ్ళై, ఆమె మరణమునకు మిక్కిలి విచారముతో నుండిరి. కాని, ఆమె దూకిన తరువాత, ఒక ద్వీపముపై పడెను. నంపిళ్ళై యొక్క దుఃఖమును ఆలకించిన ఆమె, “స్వామి, మీరు చింతించవలదు, నేను ఇంకను జీవించియే వున్నాను” అని అరిచినది. ఆమెను రక్షించుటకై, నంపిళ్ళై తెప్పను పంపిరి. ఆమె సురక్షితముగా చేరి, నంపిళ్ళై పాద పద్మములకు ప్రణమిల్లెను. ఆమె పరిపూర్ణమైన ఆచార్య నిష్ఠలో నిమగ్నమై ఉండి, నంపిళ్ళైతో “నేను మునుగునప్పుడు, మీరు నన్ను రక్షించుటకై ద్వీపముగా మారినారు కదా!” అని పలికెను. అప్పుడు నంపిళ్ళై “మీ నమ్మకము అదే అయినచో, అదే అగును” అనిరి.

ఒకసారి, ఒక వైష్ణవ రాజు శ్రీవైష్ణవుల పెద్ద సమూహాన్ని గమనించి, “వీరందరూ నంపెరుమాళ్ళ దర్శనము చేసుకొని వచ్చుచున్నారా? లేదా నంపిళ్ళై ప్రవచనమును శ్రవణము చేసి వచ్చుచున్నారా?” అని అడిగిరి. అంతటి గొప్ప శ్రీవైష్ణవశ్రీ (దైవీసంపద) కలిగినవారు నంపిళ్ళై. వారి శిష్యురాలైన ఒక స్త్రీ, వారి తిరుమాళిగై (నివాసము) ప్రక్కన ఒక గృహమును తీసుకొనిరి. ఒక శ్రీవైష్ణవుడు (నంపిళ్ళై కాలక్షేప గోష్టిలో వారి శిష్యుడు మరియు ఆమెకు సహవిద్యార్థి అయినవారు) ఆ గృహములోనే అద్దెకు వున్నారు. అతను, ఆమెతో “నంపిళ్ళై వున్న ఇల్లు కొంచెము చిన్నది. కావున నీ ఇంటిని వారికి సమర్పించినచో, మన ఆచార్యునకు ఎంతో బాగుండును” అని అనేక మార్లు సూచన చేసిరి. దానికి ఆమె “శ్రీరంగములో ఇంత మంచి గృహము లభించుట కష్టము. నా కడవరకు ఈ గృహమును నేనే ఉంచుకొనెదను” అనెను. ఈ విషయమును ఆ శ్రీవైష్ణవుడు నంపిళ్ళై కి తెలిపిరి. నంపిళ్ళై ఆమెతో “నీవు నివసించుటకు ఒక మంచి వసతి మాత్రమే అవసరము. నీ గృహమును మాకు ఒసంగినచో  శ్రీవైష్ణవులు అందరూ సౌకర్యముగా ఇందులో ఉండగలరు” అనిరి. ఆమె “సరే, అటులనే ఇవ్వగలను. కాని నాకు మీరు పరమపదములో స్థానము ఇవ్వవలెను” అనెను. నంపిళ్ళై “సరే” అనిరి. ఆమె “నేను చాలా సున్నితమైన మనస్సు కల స్త్రీని. మీరు మాట ఇచ్చిన మాత్రమే విశ్వసించను. నాకు లిఖిత పూర్వకముగా కూడా ఇవ్వవలసినది” అని కోరెను. ఆమె ఆచార్య నిష్ఠకు మిక్కిలి సంతసించిన నంపిళ్ళై ఒక తాటి పత్రముపై ఈ విధముగా హామీ వ్రాసిరి “ఈ సంవత్సరము / ఈ మాసము / ఈ దినమున, తిరుక్కళికన్ఱి దాసన్ ఈమెకు పరమపదములో స్థానమును కల్పించుచున్నాను. శ్రీవైకుంఠ నాథుడు దయతో ఈ హామిని తీర్చగలరు”. ఆ పత్రమును ఆమె అంగీకరించి, ఆనందముగా తీర్థ ప్రసాదములను స్వీకరించెను. తదుపరి కొన్నిదినములు ఆమె నంపిళ్ళైని పూజించుచూ, పరమాపద ప్రాప్తిని పొందెను. ఆ విధముగా మన ఇళ్ల్యార్ “నిత్య విభూతి (పరమపదము – ఆధ్యాత్మిక జగత్తు) మరియు లీలా విభూతి (సంసారము – భౌతిక జగత్తు) అని రెండును ఆచార్యుని యొక్క అధీనములో వున్నాయి అని పలికిరి.

కూరత్తాళ్వాన్ మనుమడైన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ కు నంపిళ్ళై యొక్క జ్ఞాన భక్తి వైరాగ్యములు, అనేక శిష్యులు, భాగవతులు వున్న గోష్టి, సర్వులకు ఆమోదయోగ్యులగుట మొదలగునవి స్వీకృతి కాలేదు. నంపిళ్ళ తో వారు ఎల్లప్పుడూ కఠినముగా ఉండేవారు. ఒకసారి వారు రాజ సభకు వెళ్లుచూ పిన్భళగియ పెరుమాళ్ జీయర్ ను దారిలో కలిసిరి. వారిని తమతో రాజసభకు విచ్చేయమనగా వారు సరే అనిరి. వారు రాజ భవనమునకు చేరగానే, రాజు వారిని ఆహ్వానించి, వారికి ఆ పెద్ద సభలో ఉచిత స్థానమును కల్పించిరి. వివేకవంతుడు మరియు శాస్త్రమునందు మంచి జ్ఞానము కల ఆ రాజు, భట్టరు వారిని పరీక్షించదలచి “భట్టరు!  శ్రీరాముడు తను దశరధ తనయుడను మరియు మానవమాత్రుడను అని (పరత్వము – ఉత్కృష్టత్త్వమును మరుగు పరచి) ప్రకటించుకొనిరి కదా! మరి వారు జటాయువునకు మోక్షమును ఎట్లు ఇచ్చిరి?” అని ప్రశ్నించిరి. సరైయిన జవాబునకు భట్టరు వారు యోచిస్తుండగా, రాజు తన పరిపాలన పరమైన కార్యములలో నిమగ్నమైరి. భట్టరు, జీయర్ తో “మన తిరుక్కళ్లి కన్ఱి దాసర్, పెరుమాళ్ (శ్రీరాముడు) జటాయువుకు మోక్షమును ఇచ్చుటను ఏ విధముగా సమర్థించిరి?” అని అడిగిరి. ఇళ్యార్ సమాధానముగా “నంపిళ్ళై ‘సత్యేన లోకం జయతి’ (సత్యవంతుడు అన్ని లోకములను జయించును) అనే సూత్రము ద్వారా సమర్థించిరి” అనిరి. భట్టరు ఇదియే తగు సమాధానము అని భావించిరి. తదుపరి, రాజు తిరిగి వచ్చి, “భట్టరు! మీరు ఇంకను సమాధానము ఇవ్వలేదే?” అనిరి. భట్టరు, “మీరు ఇతర విషయములలో మునిగినారు. నేను ఇచ్చు వివరణపై దృష్టి నిలుపుము.” అనిరి. రాజు అంగీకరించిరి. భట్టరు, రామాయణములోని పై శ్లోకమును తెలిపి, “సత్యవంతుడైన వ్యక్తి అన్ని లోకములను శాసించగలడు మరియు సత్యసంధతకు మారుపేరైన శ్రీరాముడు జటాయువునకు పరమపదమును ప్రసాదించగల సమర్ధుడు” అనిరి. రాజు ఈ వివరణను ఆలకించి, అచ్చెరువు పొంది “మీకు అన్నీ తెలుసునని అంగీకరించుచున్నాను” అని, భట్టరునకు  అనేక ప్రశంసలు, మర్యాదలు చేసి, విలువైన వస్త్రములను, ఆభరణములను, సంపదను ఒసంగిరి. రాజు భట్టరునకు ప్రణమిల్లి, గొప్ప వీడ్కోలునిచ్చారు. భట్టరు ఆ సంపదలను గైకొని ఇళ్యార్ తో “దయతో నన్ను నంపిళ్ళై దగ్గరకు చేర్చుము. నన్ను నేను వారికి సమర్పించుకొనవలెను, మరియు ఈ సంపదను వారి పాదపద్మములకు సమర్పించవలెను” అనిరి. జీయర్ వారిని నంపిళ్ళై వద్దకు చేర్చిరి. నంపిళ్ళై, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ ను చూసి వారు పరమాచార్య వంశస్థులు (ఆచార్యుని యొక్క ఆచార్యులు పరాశర భట్టర్) అగుటచే, వారిని ఆనందముగా ఆహ్వానించిరి. తమ ముందు ఉంచిన సంపదను చూసి “ఇది ఏమిటి ” అని అడిగిరి. భట్టరు జవాబుగా “మీ యొక్క వేలాదివేల దైవ సంబంధమైన భాష్యములలోని, కొన్ని పలుకులకే ఇవి బహుమానము – కావున ఈ సంపదతో పాటు నన్ను మీ శిష్యునిగా స్వీకరించవలెను” అనిరి. నంపిళ్ళై ఇది సరి కాదు, మీరు ఆళ్వాన్ యొక్క మనుమలు (అంతటి గొప్ప వంశము నుంచి వచ్చినవారు), నన్ను ఆచార్యునిగా అంగీకరించరాదు అనిరి. నంపిళ్ళై పాదపద్మములపై ప్రణమిల్లి, భట్టరు ధుఃఖిస్తూ, “నిత్య సంసారి యైన ఆ రాజు మీ యొక్క కొన్ని ఆధ్యాత్మిక మాటలు విన్నంతనే ఇంత సంపదను ఒసగినారు. ఆ విధముగా అయినచో, ఆళ్వాన్ యొక్క వంశము నుంచి వచ్చిన నేను, మీకు ఎంత సంపదను సమర్పించవలెనో కదా? మిమ్ములను చాలా కాలము నుంచి నేను పట్టించు కొనకపోవడమే కాక, మీ ప్రక్క వాకిలిలోనే వున్నను, మీ పై అసూయతో వున్నాను. కావున కృతజ్ఞతగా నన్ను నేను మీకు అర్పించుకొనుట తప్ప మరేమి చేయలేను. నన్ను దయతో అంగీకరింపుము” అని వేడుకొనిరి. నంపిళ్ళై భట్టరును లేవదీసి, మిక్కిలి ప్రేమతో ఆలింగనము గావించి, ఆశీర్వదించిరి. తదుపరి, అన్ని విషయములను వారికి బోధించిరి. భట్టరు మిక్కిలి కృతఙ్ఞతతో, పూర్తి కాలము నంపిళ్ళై తో కలిసి పరమానందముగా జీవించిరి.

నంపిళ్ళై కాలక్షేప గోష్టి

తదుపరి, నంపిళ్ళై మొత్తము తిరువాయ్మొళిని భట్టరునకు వివరముగా బోధించిరి. భట్టరు శ్రద్ధగా ఆలకించి, దానిని తాళ పత్రములపై లిఖించి, వానిని నంపిళ్ళై పాదపద్మములకు సమర్పించిరి. నంపిళ్ళై “ఇది ఏమిటి? ” అని అడిగిరి. భట్టరు, “ఇది మీరు బోధించిన తిరువాయ్మొ అర్ధ సహితముగా” అనిరి. నంపిళ్ళై ఆ మూటను విప్పి చూడగా, అది మహాభారతము కన్నా అనేక రెట్లు పెద్దదిగాను – 125000 గ్రంధములుగా గమనించిరి. వారు మిక్కిలి వ్యధ చెంది, భట్టరుతో “నా అనుమతి లేకయే దీనిని వ్రాసితివి మరియు దీనిలోని అన్ని గూడార్ధములను వివరముగా వ్రాసినావు” అనిరి. భట్టరు “అంతయును మీరు వివరించిన విధముగానే వ్రాసితిని – నా స్వంత కవిత్వమును వ్రాయలేదు – మీరే గమనించుడు” అని సమాధానమిచ్చిరి. నంపిళ్ళై “నీవు తిరువాయ్మొళి గురించి నేను చెప్పినదే వ్రాసి ఉండవచ్చు. కాని, నా ఆలోచన ఏమో, నీవు ఎలా వ్రాయగలవు? ఉడయవర్ల కాలములో వారి యొక్క ఆశీర్వచనములు మరియు అనుమతితో పిళ్లన్ చాలా శ్రమతో 6000 పడి వ్రాసిరి. కాని నీవు నా అనుమతి లేకయే 125000 పడి వ్యాఖ్యానమును చాలా విపులముగా వ్రాసినావు. దాని వలన శిష్యులు ఆచార్యుల పాదపద్మములను ఆశ్రయించి నేర్చుకొనుటకు అవరోధము కలుగును” అనిరి. తదుపరి వారు ఆ తాటి పత్రములపై జలమును పోసి, చెద పురుగులకు ఆహారముగా వేసి, వానిని నశింపజేసిరి.

తదుపరి, తన ప్రియ శిష్యుడు మరియు అన్ని విషయములను తన వద్దనే అభ్యసించిన పెరియ వాచ్చన్ పిళ్ళై ను తిరువాయ్మొళికి వ్యాఖ్యానమును వ్రాయమని ఆదేశించిరి. వారు 24000 పడిగా, శ్రీరామాయణము అంతగా వ్రాసిరి. ఆ తరువాత, నంపిళ్ళై యొక్క మరొక నమ్మకస్తుడైన శిష్యుడు వడక్కు తిరువీధి పిళ్ళై, నంపిళ్ళై యొక్క ఉదయపు కాలక్షేపములో తిరువాయ్మొళిని ఆలకించి, వ్యాఖ్యానమును ఆ రాత్రియే వ్రాసిరి. ఆ వ్యాఖ్యానమును నంపిళ్ళై పాదపద్మములకు సమర్పించిరి. “ఇది ఏమిటి? ” అని నంపిళ్ళై అడుగగా, “మీరు సాయించిన తిరువాయ్మొళిని ఆలకించి, వ్రాసిన వ్యాఖ్యానము “అని వడక్కు తిరువీధి పిళ్ళై సమాధానమిడిరి. ఆ వ్యాఖ్యానమును చదివిన నంపిళ్ళై, అది మరీ విపులముగా గాని మరీ స్వల్పముగా గాని లేదు మరియు శృత ప్రకాశిక (శ్రీ భాష్యమునకు వ్యాఖ్యానము) 36000 పడి వలె అద్భుతముగా వ్రాయబడినదిగా గమనించిరి. నంపిళ్ళై అమిత సంతోషముతో “మీరు దీనిని అద్భుతముగా వ్రాసిరి: కాని దీనిని నా అనుమతి లేకయే వ్రాసిరి. కావున, దీనిని నాకు ఇవ్వగలరు” అని పలికి, ఆ వ్యాఖ్యానమును తన వద్దనే ఉంచుకొనిరి. తదుపరి ఆ వ్యాఖ్యానమును తమ ప్రియ శిష్యుడైన ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ కు అందజేసిరి. ఈ సంఘటనను మన ఇళ్యార్ ఉపదేశరత్తినమాలై 48 వ పాశురములో వివరించిరి.

శీరార్ వడక్కుత్ తిరువీధి ప్పిళ్ళై
ఎళుతేరార్ తమిళ్ వేదత్తు ఈడు తనైత్
తారుమ్ ఎన వాంగ్కి మున్ నమ్పిళ్ళై
ఈయుణ్ణి మాదవర్క్కుత్ తామ్ కొడుత్తార్ పిన్ అదనైత్ తాన్

సాధారణ అనువాదము: పవిత్ర లక్షణములతో నిండిన వడక్కు తిరువీధి పిళ్ళై 36000 పడిని నంపిళ్ళై నుంచి గ్రహించిన ప్రకారము వ్యాఖ్యాన సహితముగా రచించిరి. ఆ రచనను వారి నుంచి నంపిళ్ళై తీసుకొని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ కు ఇచ్చిరి.

ఇంకను, తిరువాయ్మొళిపై అన్ని వ్యాఖ్యానములను మరియు వాని ఉత్కృష్టతను మాముణులు స్పష్టముగా గుర్తించిరి.

ఆ విధముగా, నంపిళ్ళై ఈ లోకమున అవతరించి మరియు అనేక జీవాత్మలను చాలా కాలము వరకు ఉజ్జీవింప జేసి, చివరగా పరమపదమునకు పయనమైరి. చరమ కైంకర్యములలో భాగముగా వారి శిష్యులందరూ శిరోముండనము గావించుకొనిరి. నడువిల్ తిరువీధి భట్టరు యొక్క సోదరుడు వారితో “ఈ విధముగా చేయుట మన కూర కులము (ఆళ్వాన్ యొక్క వంశ పారంపర్యము) నకు అవమానము కదా! తిరుక్కళ్లి కన్ఱి దాసర్ పరమపదమునకు వెళ్లినందులకు మీరందరు శిరోముండనము చేసికొనుట ఏమి?” అని ప్రశ్నించిరి. భట్టరు “ఓహ్! నేను మీ వంశమునకు అవమానము చేసినానే” అనిరి. వారి సోదరుడు “మీరు అవహేళన చేస్తున్నారే?” అనిరి. భట్టరు “నంపిళ్ళై పరమపదమునకు పయనమైనప్పుడు, వారి పాదపద్మములనే నేను ఆశ్రయించి నందు వలనను, నేను కూర కులమున జన్మించినందు వలనను, ఆళ్వాన్ యొక్క శేషత్వము (ఆచార్యునికే నిరంతర సేవ చేయుట) అను వారి ఉత్తమ లక్షణముచే, నేను నా ముఖమును మరియు శరీరమును కూడా సేవకుల వలె ముండనము చేయవలెను. కాని శిష్యుల వలె శిరోముండనము మాత్రమే గావించుట, నాకు అవమానకరము, ఏలనన, ఆళ్వాన్ యొక్క సేవాపరత్వము అను గుణమును విస్మరించినందులకు” అనిరి. అప్పుడు వారి సోదరుడు భట్టరుతో “ఇప్పుడు మీ తిరుక్కళ్ళికన్ఱి దాసర్ మీకు దూరమైనారు కదా, మీరు ఇంకా ఎంత కాలము వారిపై కృతఙ్ఞతతో ఉందురు” అని అడిగిరి. భట్టరు “ఈ ఆత్మ నశించేంత వరకు, నంపిళ్ళై పైన సదా కృతజ్ఞతతో ఉండగలను” అనిరి. వారి సోదరుడు పై మాటల భావమును అర్ధము చేసికొనిరి, వారు కూడా పండితులు మరియు ఉత్తమ వంశములో జన్మించినందు వలన. మన ఇళ్యార్ “తరువాత వారు తమను తాము పూర్తిగా భట్టరునకు సమర్పించుకొని, వారి నుంచి అన్ని ముఖ్య సూత్రములను అభ్యసించిరి” అని తెలిపిరి.

కొందరు శ్రీవైష్ణవులు ఇతరులతో “శ్రీభాష్యము ఎలా ఉండును?” అని అడుగగా, వారు “నడువిల్ తిరువీధి (శ్రీరంగములోని వీధులలోని మధ్య వీధి) లో సుందరమైన వేష్టి (పంచ) మరియు ఉత్తరీయమును ధరించిన కూరత్తాళ్వన్ అను వ్యక్తి వుంటారు. ఆ వీధికి మీరు వెళ్లినచో, శ్రీభాష్యము నడిచి వెళ్ళుట  మీరు చూడగలరు.” అని అనిరి. కొందరు శ్రీవైష్ణవులు “మేము భగవద్విషయమును ఎచ్చట శ్రవణము చేయగలము?” అని అడిగిరి. సమాధానముగా “నడువిల్ తిరువీధిలో భట్టరు నామముగల తీయని పండిన ఫలాలున్న ఒక వృక్షము వున్నది. అచ్చటకు వెళ్లి, ఆ వృక్షముపై రాళ్ళను విసరకుండా, దాని క్రింద నిలబడి వున్నచో, భగవద్విషయము అనే పండ్లు స్వాభావికముగా మీ పై రాలగలవు”.

పరాశర భట్టరు అతి పిన్న వయసులో, వీధిలో ఆడుకొనుచుండగా, “సర్వ జ్ఞాన్” అను విద్వాంసుడు మిక్కిలి ఆడంబరముగా పల్లకిలో వచ్చారు. భట్టరు వారిని ఆపి “మీకు అన్ని విషయములు తెలుసునా?” అని అడిగిరి.  వారు “అవును, నాకు అన్ని విషయములు తెలియును” అనిరి. భట్టరు, భూమిపై నుంచి ఒక గుప్పెడు ఇసుకను తీసి, “ఇది ఎంత?” అని అడిగిరి. దానికి సమాధానము నకు మాటలు లేక, అతను అవమానముతో తల దించుకొన్నారు. భట్టరు వారితో “మీ వద్దనున్న అన్ని బిరుదులు మరియు పతకములు వదిలి వేయుము” అనిరి. వారు అంగీకరించి, ఓటమిని ఒప్పుకున్నారు. పిమ్మట భట్టరు “మీరు ఇది ‘గుప్పెడంత’ ఇసుక అని జవాబునిచ్చి మీ బిరుదులు మరియు పతకములు కాపాడు కొని వుండవచ్చు. ఇప్పుడు మీరు అన్ని కోల్పోయారు – మీరు ఇక వెళ్ళవచ్చును” అని వారిని పక్కకు తోసివేసిరి.

పాషండి (మాయావాద) వేత్తలు, ఒక వైష్ణవ రాజు వద్దకు వెళ్లి, శంఖ / చక్రాంకిత లక్షణమునకు (పంచ సంస్కారములో భాగముగా వేడి చేసి శంఖ, చక్ర ముద్రలను భుజములపై ముద్రించుట) ఋజువు లేదు అని ప్రకటించిరి. ఆ రాజు మిక్కిలి వివేకుడు, భట్టరును ఆహ్వానించి “శంఖ / చక్ర లక్షణమునకు ఋజువు కలదా?” అని అడిగిరి. భట్టరు “అవును, ఖచ్చితముగా కలదు” అనిరి. రాజు “నాకు ఋజువును చూపగలరా? అని అడిగిరి. భట్టరు తన సుందరమైన భుజములను చూపి, “ఇదిగో, నా రెండు భుజములపై వున్నాయి” అనిరి. రాజు మిక్కిలి ఆనందముతో దానిని అంగీకరించి” అన్ని విషయములు తెలిసిన భట్టరుకు ఈ శంఖ / చక్ర లక్షణములు వున్నాయి కదా, ఇంతకన్నా ఏమి ఋజువు కావలెను” అని ఆ పాశండులను తరిమి వేసిరి.

పై సంఘటనలు మన పెద్దలు వివరించిరి. ఈ విధముగా శృతి వాక్యములు ( ఖ / చక్ర లక్షణములకు సంభందించినవి) మరియు ఈ క్రింది రెండు పాశురములు / శ్లోకములు, భట్టరు వ్రాయగా, మిక్కిలి ఆదరణ పొందినవి.

మట్టవిళుంపొళిల్ కూరత్తిల్ వందుతిత్తు
ఇవ్వైయమెల్లామ్ ఎట్టుమిరణ్డుమ్ అఱివిత్త ఎమ్పెరుమాన్
ఇలన్గు చిత్తర్ తొళుం తెన్నరంగేశర్ తమ్ కైయిల్ ఆళియై
నానెట్టన నిన్ఱ మొళి ఏళుపారుమ్

సాధారణ అనువాదము: ఆళ్వాన్ చే ఆరాధింపబడిన, శ్రీరంగనాథుని యొక్క శంఖము (మరియు చక్రము) ముద్రలు నాకు వున్నవి. ఆళ్వాన్ కూరమ్ లో దర్శనమిచ్చి, తిరుమంత్రము మరియు ద్వయమునకు అర్ధములను వివరించిరి. అదియే లోకమంతయు అంగీకరించి మరియు అనుసరించినదనుటకు ఋజువు కదా.

విధానతో దధానః
స్వయమేనామభి తప్తచక్రముద్రామ్
బుజయేవమమైవ భూసురాణామ్
భగవల్లాఞ్చన ధారణే ప్రమాణమ్

సాధారణ అనువాదము:  ఈ శంఖ / చక్రములు  నా భుజములపై వుండుట అను యధార్ధమే సరైయిన ఋజువు కదా, శ్రీవైష్ణవులు దానిని అంగీకరించి అనుసరించుటకు.

పై సంఘటనల ద్వారా, మన పూర్వాచార్యులు అందరు ఆచార్యుల అనుగ్రహము అను నీడను ఆశ్రయించారు అని అవగతమౌచున్నది మరియు అజ్ఞాని లేక జ్ఞాని అయినా వారు ఉద్ధరింప బడుటకు ఆచార్యులే ఆధారము.

సశేషం……

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు బొమ్మకంటి రామానుజ దాసన్.

మూలము: https://granthams.koyil.org/2013/06/anthimopaya-nishtai-7/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment