యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 27

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 26

ఒకరోజు తిరువాయ్మొళి ప్పిళ్ళై వారి తోటలో పండిన లేత కూరగాయలను నాయనార్ల తిరుమాళిగకి పంపారు. అందుకు నాయనార్లు సంతోషించి, “ఇవి ఆళ్వార్ల మడప్పళ్ళికి (వంటగదికి) పంపుటకు బదులు, ఈ అడియేన్ గృహానికి ఎందుకు పంపారు?” అని అడిగారు. పిళ్ళై అతనితో “ఈ దాసుడికి దేవర్వారి వంటి వారు ఇంతవరకు లభించలేదు, కాబట్టి అర్చారాధనలో మునిగి ఉండెను” అని నాయనార్లకు తమ మనస్సులోని భావనను తెలిపెను. ఆ రోజు నుండి వారు ప్రతిరోజూ నాయనార్లకి తాజా కూరగాయలను పంపేవారు. పైగా అన్ని విధాలుగా వారి అవసరాలను చూసుకునేవారు. భోజన సమయంలో నాయనార్లతో కలిసి కూర్చుని భోజనం చేసేవారు. వీటన్నింటిని చూసి, పిళ్ళై శిష్యులు కొందరు నాయనార్లను అసూయతో చూసేవారు. సర్వజ్ఞుడైన పిళ్ళై దీనిని గ్రహించి, నాయనార్ల పట్ల చెడు భావన పెరగక ముందే  ఆ మంటను మొదట్లోనే ఆర్పివేయాలనుకున్నారు. నాయనార్లు సాధారణ మనిషి కాదని, గొప్ప మహా పురుషులని పిళ్ళై తమ శిష్యులకు తెలిపెను. సూచనల ద్వారా నాయనార్ల విశిష్ట సామర్థ్యాలను వారికి వివరించి, నాయనార్లు ఎవరో కాదు ఆదిశేషుని అవతారమని వారికి అర్థమయ్యేలా వివరించెను. తరువాత పిళ్ళై శిష్యులు నాయనార్ల పట్ల విశిష్టమైన గౌరవముతో వ్యవహరించేవారు. నాయనార్లు కూడా, పిళ్ళైల దివ్య సంకల్పాన్ని  గ్రహించి, వారి పట్ల విధేయులై ప్రవర్తించేవారు. నాయనార్లు ఈ సమయంలో ఈడు ముప్పత్తారాయిరం (తిరువాయ్మొళి వ్యాఖ్యానం) అలాగే ఇతర వ్యాఖ్యానాములను నేర్చుకున్నారు.

నాయనార్లకు ఒక కుమారుడు జన్మించెను. వారు తిరువాయ్మొళి పిళ్ళై వద్దకు వెళ్లి, ఆ శిశువుకు తగిన పేరును తెలపమని కోరెను. “ఒక్కసారి కాదు, నూట ఎనిమిది సార్లు చెప్పపడింది కదా!” (ఇరామానుశ నూఱ్ఱందాదిని సూచిస్తూ) అని పిళ్ళై జవాబు చెప్పెను. నాయనార్లు తమ కుమారునికి ఎమ్మైయన్ ఇరామానుశ (నా స్వామి, రామానుజ) అని నామకరణము చేశారు. ఒకానొక తిరు ఆరుద్రా దినమున, ప్పిళ్ళైతో ఇతర ఆచార్యులు భోజనం చేస్తున్నప్పుడు, పిళ్ళై ఈ శ్లోకాన్ని పఠించారు.

ఇన్ఱో ఎదిరాశర్ ఇవ్వులగిల్ తోన్ఱియ నాళ్
ఇన్ఱో కలియిరుళ్ నీంగునాళ్

(ఇది యతిరాజు (రామానుజులు) అవతరించిన రోజు కాదా? కలి అంధకారము తొలగిన రోజు కదా?) వారు ఈ రెండు వాక్యాలను మళ్ళీ మళ్ళీ చెబుతూ మరొక మాట మాట్లాడలేదు. నాయనార్లు ఈ పాశురాన్ని ఇలా పూరించెను..

ఇన్ఱోదాన్
వేదియర్గళ్ వాళ విరైమగిళోన్ తాన్ వాళ
వాదియర్గళ్ వాళ్వడంగు నాళ్

(వేదమార్గాన్ని అనుసరించేవారికి అతి సంతోషాన్ని కలిగించినది ఈ రోజు; ఇది సుగంధబరితుడైన మగిళోన్ (నమ్మాళ్వార్) సంతోషించిన రోజు, వాద వివాదములు (వేదాలను నమ్మనివారు, వేదాలను వక్రీకరించువారు) చేసేవారి సంఖ్య తగ్గింది). అది విన్న పిళ్ళై ఎంతో ఆనందంతో తృప్తిగా భోజనం చేశారు. నాయనార్లు సంతోషంగా వారి శేష ప్రసాదాన్ని తీసుకున్నారు.

ఆ విధంగా ఆచార్యులు (పిళ్ళై) మరియు శిష్యుడు (నాయనార్లు) మధ్య క్రమబద్ధత బాగా సాగింది. ఎలాగైతే పెరియ నంబిని ఆశ్రయించిన తర్వాత ఎంబెరుమానార్లు విశిష్టతను పొందారో, పిళ్ళైల ఆశ్రయం పొందిన తర్వాత నాయనార్లు కూడా విశిష్టతను పొందారు. అందరూ వీరిని ఉడయవర్ల పునరవతారముగా కీర్తించడం ప్రారంభించారు. పిళ్ళై కోసం నాయనార్లు ఈ తనియన్లను రచించారు:

వడమామలైముదల్ మల్లనంతపురియెల్లై మల్గిత్
తిడమాగ వాళుం తిరువుడైయ మన్నరిల్ తేశుడైయోన్
తిడమాన జ్ఞాన విరక్తి పరమ్ ఇవై శేరనిన్ఱ
శటకోపతాదర్ కురుగూర్వాళ్ పిళ్ళైయై చ్చేరు నెంజే

(ఓ నా హృదయమా! తిరుక్కురుగూర్ నివాసులైన శఠగోప దాసులు అని కూడా పిలువబడే పిళ్ళైల దివ్య తిరువడిని చేరాలని ప్రయత్నించుము; వీరు భగవత్ విషయాలలో దృఢమైన జ్ఞానము ఉండి ప్రాపంచిక విషయాల పట్ల నిర్లిప్తత ఉన్నవారు; తిరుమల నుండి తిరువనంతపురము వరకు వీరి ప్రకాశము గోచరించుచున్నది) మరియు

శెందమిళ్ వేద త్తిరుమలైయాళ్వార్ వాళి
కుంతినగర్ క్కు అణ్ణల్ కొడై వాళి – ఉందియ శీర్
వాళియవన్ అముదవాయ్ మొళి కేట్టు అప్పొరుళిల్
తాళుం మఱ్ఱంబర్ తిరుత్తాళ్

(ద్రావిడ వేదం (నాలాయిర దివ్య ప్రబంధం) లో గొప్ప పండితులైన తిరుమలై ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి; కుంతీనగర నాయకుడి (తిరువాయ్మొళి ప్పిళ్ళై జన్మస్థలం) మహిమకి జోహార్లు); వారి బోధనలను అనుసరించి వాటికి అనుగుణంగా జీవించిన వారందరి దివ్య చరణాలకు జోహార్లు). వారి కాలములో, పిళ్ళై శిష్యులు వారి గొప్పతనాన్ని మహిమ పరచుచూ ఈ శ్లోకాలను రచించారు:

అప్యర్సయ నందతనయం కరపంకజాత్త వేణుం తదీయచరణ ప్రవణార్ త్రచేతాః
గోధాబిదుర్గహన సూక్తినిబంధనస్య వ్యాక్యాం వయదాత్ ద్రావిడ వేదగురుః ప్రసన్నాం

(ఎర్రటి పద్మాల వంటి పాదాలతో, చేతిలో మురలిని పట్టుకొని ఉన్న ఆ గొల్ల బాలుడు శ్రీ కృష్ణుడి దివ్య తిరువడి యందు నిత్యభక్తిలో మునిగి ఉన్న తిరువాయ్మొళి ప్పిళ్ళై, పెరియాళ్వార్ల పాశురములకు స్పష్టమైన వ్యాఖ్యానము వ్రాశారు).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/12/yathindhra-pravana-prabhavam-27-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment