యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 27

అళగియ మణవాళ పెరుమాళ్ళకి పిళ్ళై ఆదేశము

జ్ఞాన భక్తి వైరాగ్యాలకు ప్రతిరూపంగా గొప్ప కీర్తి ప్రతిష్ఠలతో పిళ్ళై కైంకర్య శ్రీ (సేవా సంపద) తో చాలా కాలం జీవించారు. తరువాత నిత్య విభూతి (శ్రీవైకుంఠం) లో నిత్య సేవ గురించి చింతన చేస్తూ, వారు తమ ఆచార్యులు పిళ్ళై లోకాచార్యులను ధ్యానించి

ఉత్తమనే! ఉలగారియనే! మఱ్ఱొప్పారైయిల్లా
విత్తగనే! నల్ల వేదియనే! తణ్ముడుంబై మన్నా!
శుద్ధ నన్ జ్ఞానియర్ నఱ్ఱుణైయే! శుద్ధసత్తువనే!
ఎత్తనై కాలమిరుందు ఉళల్వేన్ ఇవ్వుడంబై క్కొండే?

(శ్రేష్ఠమైన ఓ లోకాచార్య! ఓ పరమ పండితుడా! గొప్ప వేద విద్వాంసుడా! ఓ చల్లని ముడుంబై వంశ శిరోమణి! ఓ సజ్జనులకు సహచరుడి వంటి వాడా ! సత్గుణ సంపూర్ణుడా! ఇంకా ఈ భౌతిక శరీరముతో ఎంతకాలం నేను బాధపడాలి?)

తమ ఆచార్యుని చేరేందుకు తన ఈ దేహమే అడ్డంకి అని స్పష్ఠంగా ఎరిగిన వీరు, ఆ శరీరం నుండి విముక్తులను చేయమని తమ ఆచార్యుని అభ్యర్థించెను. ఆ ఆలోచనతో వారు అనారోగ్యపాలై విశ్రాంతిలో ఉన్నారు. ఒకసారి వీరు అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచారు. నాయనార్లు మరియు ఇతర శిష్యులు “ఏమైంది?” అని అడుగగా, “ఇది కలికాలం, ఆళ్వార్ల ఆరుళిచ్చెయల్ (నాలాయిర దివ్య ప్రబంధం) పట్ల పూర్ణ ఆసక్తి, విశ్వాసంతో మన దర్శనాన్ని (సంప్రదాయాన్ని) ఎవరు ముందుకు తీసుకువెళతారు? అడియేన్ కు భయంగా ఉంది” అని వారు బాధతో అన్నారు. నాయనార్లు, వారి తిరువడి యందు సాష్టాంగ నమస్కారం చేసి “అడియేన్ చేస్తాను” అని అభయమిచ్చారు. “కేవలం మాటలతో సరిపోదు” అని పిళ్లై అనగా, నాయనార్లు పిళ్ళై దివ్య తిరువడికి నమస్కారము చేసి “నేను చేస్తాను” అని ప్రమాణం చేసెను. పిళ్లై సంతృప్తి చేందెను; వారు నాయనార్లని పిలిచి, “ కేవలం సంస్కృత శాస్త్రాలపైనే నీ దృష్ఠి ఉంచకుము; శ్రీ భాష్య శ్రవణ చేయి, కానీ ఎంబెరుమానార్లకు మరియు మనకందరికీ ప్రీతి అయిన దివ్య ప్రబంధాన్ని కుడా నిరంతరం విశ్లేషిస్తూ ఉండుము. మన పూర్వాచార్యుల వలె  పెరుమాళ్ళను సేవిస్తూ శ్రీరంగంలో నిత్య నివాసము చేయి” అని ఆదేశించెను. వారు తమ ఇతర శిష్యులను పిలిచి, “నాయనార్లను విశిష్ట అవతారంగా భావించి ఆదరంతో ఉండండి” అని తెలిపెను. తిరువాయ్మొళిలో “మాగవైగుందం కాణ ఎన్ మనం ఏగమేణ్ణుం” అని చెప్పినట్లే, పిళ్ళై లోకాచార్యుల దివ్య తిరువడి ధ్యానం చేస్తూ శ్రీవైకుంఠం చేరుకోవాలని నిత్యము ధ్యానిస్తూ ఉండేవారు. వారు వైకాశి (ఋషభ) మాసంలో బహుళాష్టమి (పౌర్ణమి తర్వాత ఎనిమిదవ రోజు) నాడు దివ్య పరమపదానికి వారు బయలుదేరారు.

తిరువాయ్మొళి పిళ్ళై వారి విశిష్ఠత

ఆ తరువాత, నాయనార్లు మరియు ఇతర ఆచార్యులు తమ ఆచార్యుని నుండి వీడినందుకు తట్టుకోలేక దుఃఖ సాగరములో మునిగిపోయారు. వారు తమ దుఃఖాన్ని మ్రింగి, పిళ్ళై చరమ కైంకర్యములు నిర్వహించి, 13 వ రోజు తిరువధ్యయనం నిర్వహించారు. ఆ తర్వాత, ప్రతి ఏడాది, వైకాశి మాసంలో పౌర్ణమి తర్వాత 8 వ రోజున, నాయనార్లు అందరు శ్రీ వైష్ణవులకు మూడు ఫలముల (మామిడి, అరటి, పనస) తో కూడిన విందు ఏర్పాటు చేసేవారు.

పిళ్లై లోకాచార్యులకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, వారు స్త్రీలు మరియు అజ్ఞానులు కూడా అర్థం చేసుకోగలిగే విశిష్టమైన అర్థాలను చాలా సమగ్రంగా సులువైన రీతిలో అందించారు. వారు భగవానుని నుండి వీడి ఉండలేకపోయేవారు, అందుకని భగవత్ నిత్య సేవలో మునిగి ఉండేవారు. శిష్యుని గురించి “శరీరమర్థం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్” (తమ శరీరం, సంపద, జీవితం తమ ఆచార్యులనికై వినియోగించాలి) అనే సామెతలో చెప్పినట్లే, తిరువాయ్మొళి పిళ్ళై, పరమాచార్యులైన నమ్మాళ్వార్ల విగ్రహం, వారి ప్రియ శిష్యులైన ఉడయవర్ల విగ్రహాన్ని ఆళ్వార్ తిరునగరిలో ప్రతిష్టించారు. ఇది తిరువాయ్మొళి పిళ్ళై వారి విశిష్ఠత. వీరికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆళ్వార్ల అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధము) పట్ల వీరికున్న రుచి మరియు వాటి ప్రచారం పట్ల వీరి దృఢత్వం అపారమైనది. వైకాసి (ఋషభ) మాసంలో వీరి దివ్య తిరునక్షత్రం విశాఖం. వీరి తనియన్

నమః శ్రీశైలనాథాయ కుంతీనగరజన్మనే
ప్రసాదలబ్ద పరమప్రాప్య కైంకర్య శాలినే

(కుంతీపురంలో కృపతో అవతరించిన శ్రీ శైలేశర్ అని పిలువబడే తిరువాయ్మొళి పిళ్ళైకు నేను నమస్కరిస్తున్నాను. నమ్మాళ్వార్ల అనుగ్రహంతో, వీరు అసమానమైన కైంకర్య సంపద పొంది ఆ కారణంగా శ్రేష్ఠతను గడించారు)

తరువాత, నాయనార్లు కూడా, తమ ఆచార్యుల [తిరువాయ్మొళి పిళ్ళై] నిర్దేశము ప్రకారం, తిరువాయ్మొళి దివ్య ప్రబంధ ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లే…

తదస్థు మూలభూతేషు తేషు దివ్యేషు యోగిషు
వవృతే వర్దయన్ భక్తిం వకుళాభరణాధీషు
తతా తద్దత్ ప్రపన్నార్థ సంప్రదాయం ప్రవర్తకాన్
అయమాద్రియత శ్రీమాన్ ఆచార్యానాధిమానపి

తరువాత, శ్రీమాన్ (కైంకర్యం సంపద కలిగి ఉండుటచేత) అళగియ మాణవాళ పెరుమాళ్ నాయనార్ నమ్మాళ్వార్ల పట్ల భక్తి ప్రపత్తులను పెంచుకుని, తమను తాను పోషించుకున్నారు. అదే విధంగా ఆళ్వార్ చేత చెప్పబడిన సాంప్రదాయ అర్థాలను తమ జీవితాల్లో అన్వయం చేసుకున్న పుర్వాచార్యుల పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శించారు. ప్రమాణాలు (గ్రంధాలు), ప్రమేయం (సర్వేశ్వరుడు) మరియు ప్రమాథలు (గ్రంధాల రచయితలు) పట్ల గొప్ప గౌరవాన్ని చూపుతూ, వీరు ఆళ్వార్ తిరునగరిలో దర్శనం పోషణ కొనసాగించెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/12/yathindhra-pravana-prabhavam-28-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment