శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
అనంతరం, వారు “ఎణ్దిశై క్కణంగళుం ఇఱైంజియాడు తీర్థ నీర్” (అష్ట దిక్కులలోని అందరూ అత్యాదరముతో కావేరి పవిత్ర స్నానం చేస్తారు) మరియు “గంగైయిలుం పునిదమాన కావిరి” (గంగ కంటే పవిత్రమైన కావేరి) అని కీర్తించబడిన కావేరి ఒడ్డుకి చేరుకుని ఆ దివ్య నదిలో పవిత్ర స్నానం చేసి, కేశవాది ద్వాదశ ఉర్ధ్వపుండ్రములు ధరించి, భవ్యమైన ఆ దివ్య తిరువరంగ పట్టణాన్ని నమస్కరించారు. వారికి స్వాగతం పలికేందుకు తిరువరంగ వాసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారందరి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, వారితో పాటు శ్రీరంగంలోని తోటల గుండా పట్టణ ప్రవేశం చేశారు. తరువాత వారు ఈ క్రింది పాశురంలో చెప్పినట్లు శ్రీరంగ వీధుల గుండా వెళ్ళారు.
మాడమాళిగైశూళ్ తిరువీధియుం మన్నుశేర్ తిరువిక్కిరమన్ వీధియుం
ఆడల్మాఱన్ అగళంగమ్ వీధియుం ఆలినాడన్ అమర్ందుఱై వీధియుం
కూడల్ వాళ్ కులశేఖరన్ వీధియుం కులవు రాసమగేందిరన్ వీధియుం
తేడుతన్మా వన్మావిన్ వీధియుం తెన్నరగంగర్ తిరువావరణమే
(వారు ఎత్తైన భవంతులు ఉన్న వీధులను దాటి, తిరువిక్రమ వీధిని దాటి, అగళంగన్ వీధిని దాటి, తిరుమంగై ఆళ్వార్ వీధిని దాటి, కులశేఖర వీధిని దాటి, రాజమహేంద్ర వీధిని దాటి, శ్రీరంగానికి రక్షణ పొరలుగా ఉన్న ఈ వీధులన్నింటినీ దాటి వెళ్ళారు). వారు శ్రీరంగంలోని దివ్య భవంతులు, దివ్య వీధులు, దివ్య గోపురాలను ఎంతో ఆనందంతో చూస్తూ, తన లాంటి అక్కడి ఆచార్యులైన కొత్తూరిలణ్ణర్ వారి తిరుమాళిగకు చేరుకున్నాడు. గతంలో కొత్తూరిలణ్ణర్ తిరుమెయ్యం దివ్య దేశములో తిరువాయ్మొళి ఇరుబత్తినాలాయిరం (పెరియవాచ్చాన్ పిళ్ళై వారు రచించిన తిరువాయ్మొళివ్యాఖ్యానం)పై కాలక్షేపము చేసి, నంపెరుమాళ్ళు తిరిగి శ్రీరంగానికి చేరుకున్న తరువాత వీరు కూడా శ్రీరంగంలో స్థిర నివాసము ఉండాలని నిశ్చయించి అక్కడ స్థిరపడి ఉన్నవారు. నాయనార్లు ఒక విశిష్ట అవతారమని గ్రహించిన కొత్తూరిలణ్ణర్ తమ గౌరవ మర్యాదలు సమర్పించుకొనెను. అణ్ణార్ నాయనార్లను కోయిల్ కి తీసుకెళ్ళాలని, ఆ రోజుల్లోని శ్రీరంగం ఆలయ అధిపతి అయిన తిరుమాలై తండ పెరుమాళ్ భట్టర్ నివాసానికి వెళ్లారు. భట్టార్ ఎంతో సంతోషించి నాయనార్లను స్వాగతించి, కృపతో తిరువాయ్మొళి పాశుర అర్థాలను చెప్పవలసిందిగా నాయనార్లను అభ్యర్థించెను. నాయనార్ నమ్మాళ్వార్ల మహిమను చాటే పాశుర అర్ధాలను వివరించారు [6.5 పదిగానికి పరిచయంగా ఈడు వ్యాఖ్యానంలో వివరించిన విధంగా). (మన పూర్వాచార్యుల ప్రకారం తిరువాయ్మొళి 6.5.1 ‘తూవళిల్ మణిమాడం’ నమ్మాళ్వార్ల గుణాలను స్పష్టంగా తెలియజేస్తుంది.) భట్టర్ పాశురార్థాలను విని చాలా సంతోషించి, “నాయనార్లను ముప్పత్తారాయిర పెరుక్కర్ (అనేక అర్థాలతో ఈడుని స్పష్టంగా వర్ణించేవాడు)” అని చెప్పి, పెరుమాళ్లకు మంగళాశాసనం చేయమని వారిని ఆహ్వానించి, శ్రీరంగంలోని ఇతర శ్రీవైష్ణవులను కూడా రమ్మని కబురు పంపారు. అందరూ కలిసి బయలుదేరారు. మొదట్లో ఇరామానుశ నూఱ్ఱందాది పాశురము పొన్నరంగమెన్నిల్ మాయలే పెరుగుం ఇరామానుశన్” (‘గొప్ప శ్రీరంగం’ అనే పదాన్ని వినగానే రామానుజులు మోహితులౌతారు) అని చెప్పినట్లు, ఎంపెరుమానార్ సన్నిధికి చేరుకుకొనెను. వారి దివ్య తిరువడిని సేవించి, యోనిత్యం అచ్యుత…. తో ప్రారంభించి రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే తో ముగిసే తనియన్ల పఠన చేశారు.
ఇవ్వులగందన్నిల్ ఎతిరాశర్ కొండరుళుం
ఎవ్వురువుం యాన్ శెన్ఱిఱైంజినక్కాల్ – అవ్వురువం
ఎల్లాం ఇనిదేలుం ఎళిల్ అరంగత్తు ఇరుప్పుప్పోల్
నిల్లాదెన్ నెంజు నిఱైందు
(నేను ఈ లోకములో ఎక్కడికి వెళ్లినా, ఆ రామానుజుల దివ్య స్వరూపాన్ని ఎక్కడ సేవించినా, ఆ ప్రతిరూపము శ్రీరంగంలోని ఎంపెరుమానారుల దివ్యరూపాన్ని దర్శించుకున్నట్లు నాకు సంతృప్తిని కలిగిస్తుంది).
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/14/yathindhra-pravana-prabhavam-30-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org