యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 34

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 33

ఇప్పుదు, తిరుమల కథనం

పురట్టాసి (భాద్రపద) మాసం మొదటి రోజు, తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే, స్థానికులు కొందరు కొండ క్రింద ఆళ్వార్ తీర్థం దక్షిణ దిశ పొదల్లో పెరియ పెరుమాళ్ళ (శ్రీ రంగనాథన్) లాగా శయనించి ఉన్న ఒక శ్రీవైష్ణవుడిని తాము చూశారని వచ్చి చెప్పినట్టు పెరియ కేళ్వి జీయర్ (కొండపై ఉన్న పెద్ద జీయర్ వారు) స్వప్నంలో చూసెను.  ఏడు కొండలంత అతి విశాల రూపముతో, వారి దివ్య తిరుముడి (శిరస్సు) పడమర దిశలో వారి దివ్య తిరువడి (పాదాలు) తూర్పు దిశలో ఉంచి, దక్షిణం వైపు చూస్తున్నాట్టు, ఒక జీయర్ వారి పాదాల వద్ద నిలబడి ఉన్నట్టు స్వప్నంలో వారికి కనిపించారు. వారెవరని స్థానికులను అడిగినప్పుడు, “వారు అళగీయ మాణవాళ పెరుమాళ్ నాయనార్ అని, ముప్పత్తారాయిరం (ఈడు, తిరువాయ్మొళి  వ్యాఖ్యానం) నిపుణుడని, వారి దివ్య తిరువడి యందు నిలబడి ఉన్న వ్యక్తి పొన్నడిక్కాల్ జీయర్” అని స్వప్నంలో తెలుపుతారు. మరుసటి రోజు తెల్లవారు జామున, పెరియ కెల్వి జీయర్ సుప్రభాత సేవ కోసం గుడికి వెళ్ళినప్పుడు, వారు ఇయల్ (తిరుప్పల్లాండు, తిరుప్పావై మొదలైన పాశురాలు పారాయణం చేసే ప్రాతః ఆచారం) కోసం వచ్చిన వారికి స్వప్నం గురించి వివరించెను. ఇది విన్న తోళప్పర్ ఒక శ్లోకం రచించారు.

స్వప్నేబృహత్ యతీంద్రస్య శ్రీశైలసమితోమహామ్
శయానః పురుషోదృష్టః సౌమ్యజామాతృ దేశికః
తదర్శ పశ్చాత్ తస్యైవ పాదమూలే యతీశ్వరం
ప్రాంజలిం నిభృతం ప్రహ్వం స్వర్ణాధిపతిపదసంయకం

(పెరియ కేళ్వి జీయర్ స్వప్నంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అనే విశేష మహాపురుషులు శయనించి ఉన్నట్టు, వారి తిరువడి వద్ద పొన్నడిక్కాల్ జీయర్ వినయంతో చేతులు జోడించుకొని నిలుచొని ఉన్నట్టు పెద్ద జీయర్ చూశారు). ఇది విని అందరూ సంతోషించారు. సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వస్తున్న కొందరు వారిని కోయిల్ నాయనార్ అని అన్నారు. మరికొందరు వారు బ్రహ్మోత్సవాల కోసం వస్తున్నారని అన్నారు; మరికొందరు “వానమామలై జీయర్ని నాయనార్లు అతి ప్రియ శిష్యులుగా భావిస్తారు; వారిని  పొన్నడిక్కాల్ జీయర్ అనే పేరుతో పిలుస్తారు” అని వారిలో వారు గుసగుసలు చెప్పుకున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలు అద్బుతంగా జరగబోతున్నాయని అందరూ ఆశగా ఎదురు చూడసాగారు.

నాయనారు తమ యాత్రలో భాగంగా, తిరువాయ్మొళి 3.3.8 “తిరువేంగడమామలై ఒన్ఱుమే తొళ నం వినై ఓయుమే” (తిరుమల ఏడు కొండలను మనం సేవించిన వెంటనే, మన పూర్వ కర్మలు తొలగిపోతాయి) అని పఠించుచూ తిరుమలైయాళ్వార్ (కొండ) ని సేవించెను. వారు తిరుమలైయాళ్వార్ ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, రెప్పార్చకుండా ఏడు కొండలను చూస్తూ “సువర్ణముఖరీం తత్రసంగతాం మంగళాస్వనాం” (మధురమైన ధ్వనులతో ఆ తిరుమలలో ప్రవహిస్తున్న సువర్ణముఖి) అని చెప్పినట్లు, స్వర్ణముఖి నదికి చేరుకున్నారు. అక్కడ పవిత్ర స్నానమాచరించి, కేశవ నామముతో ప్రారంభించి పన్నెండు ఊర్ధ్వ పుండ్రములను ధరించెను. వారు గోవిందరాజుల సన్నిధికి వెళ్లి, ఆతడికి మంగళాశాసనము చేసి, తీర్థ శఠారీ తుళసి తులసి మొదలైన ఆలయ మర్యాదలు స్వీకరించి, కొండ క్రిందనే ఉన్న అళగియ శింగర్ (నరసింహుడు) ని సేవించెను. ఉపనిషత్తు “ఏవంవిత్ పాదేన అధ్యారోహతి” (ఇలా సేవించినవాడు కాలి నడకన పైకి ఎక్కుతాడు) లో పేర్కొన్నట్లుగా, అతను కొండపైకి ఎక్కడం ప్రారంభించాడు. దారిలో, అతను పరిషద్ తిరువేంగడముడైయాన్ సేవించెను (పరిషత్ తిరువేంగడముడైయాన్ అనేది – తిరువేంగడముడైయాన్ యొక్క మరప భక్తుడైన తోండమాన్ చక్రవర్తిని ఆదుకోడానికి శంఖ చక్రాలతో వచ్చిన పెరుమాళ్ళ అర్చా రూపం. తర్వాత, సమీపంలోని కర్పూరకా (కర్పూర తోట) నుండి పవిత్ర జలాన్ని తీసుకుని, ఆపై కాట్టళగియ శింగర్ మరియు మాంబళ ఎంపెరుమానార్లను సేవించెను.

(మాంబళ ఎమ్పెరుమానార్ గురించి ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది: ఎమ్పెరుమానార్లు తిరుమల కొండ పైకి ఎక్కుతున్నప్పుడు తిరువేంకటేశ్వరుడు అనంతాళ్వాన్ శిష్యులలో ఒకరి లాగా వేషం వేసుకుని, ఎమ్పెరుమానార్ వద్దకు మామిడి పండు పెరుగన్నంతో వెళ్లి, వీటిని తిరువేంకటేశ్వరుడు పంపారని చెప్పెను. ఎమ్పెరుమానార్లు అతడిని తమ ఆచార్యుడు ఎవరు అని అడిగినప్పుడు, అతను తన ఆచార్యులు అనంతాళ్వాన్ అని తెలిపుతారు. వెంటనే ఎమ్పెరుమానార్లు వారి తనియన్ను పఠించమని ఆ శ్రీవైష్ణవుడిని అడగగా

అఖికాత్మ గుణావాసం అజ్ఞాన తిమిరాపహం
ఆశ్రితాతాం సుచరణం వందే అనంతార్య దేశికం
యతీంద్ర పాదాంబుజ సంచరీకం శ్రీమద్ దయాపాల దయైక పాత్రం
శ్రీవేంకటేశాంగ్రి యుగాంతరం నమామి అనంతార్యం అనంతకృత్వః

అని చెప్పి అదృశ్యమౌతాడు. ఇది చూసి ఎమ్పెరుమానార్లు ఆశ్చర్యపోతారు; ప్రసాదముతో వచ్చినది వేంకటేశ్వరుడే అని వారు గ్రహిస్తారు. వారు ఆ చోటిలో కూర్చొని పెరుగన్నం మామిడి పండుని తిని ఆ మామిడి జీడిని ఆ ప్రదేశంలోనే నాటుతారు. తిరువేంకటేశ్వరుని దివ్య పాదాలు అక్కడ ప్రత్యక్షమైన తరువాత, తరువాతి కాలంలో వచ్చిన వారు అక్కడ ఎమ్పెరుమానార్ల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని మాంబళ ఎమ్పెరుమానార్ అని పిలుస్తారు).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/18/yathindhra-pravana-prabhavam-34-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment