యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 39

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 38

నాయనార్ల సన్యాసాశ్రమ స్వీకారం

ఆ సమయంలో, దక్షిణ దేశము నుండి కొందరు వచ్చి, నాయనార్ల బంధువులలో ఒకరు పరమపదించారని కబురిచ్చి, వారు చేసే పెరుమాళ్ళ సేవలో బాధ కలింగించారు. శ్రీరంగనాధుని తిరువడిని తమ శిరస్సుపై ఉంచుకొని వారికి కైంకర్యము నిర్వహిచుకుంటూ తనను తాను నిలబెట్టుకుంటున్న తనకు, ఎమ్పెరుమానుని నుండి ఈ విరహము మహా దుఃఖాన్ని కలిగిస్తుందని శోకించసాగారు; “త్వద్పాదపద్మ ప్రవణాత్మ వృద్దేర్ భవంతి సర్వే ప్రతికూలరూపాః” (పెరుమాళ్ళ దివ్య తిరువడి సంబంధములో మునిగి ఉన్న ఈ దాసుడికి, ఈ విషయాలన్ని పెరుమాళ్ళ అనుభవానికి విరుద్దమైనవి), వెంటనే వారి విద్యార్థి రోజుల్లోని చిన్ననాటి స్నేహితుడైన శఠగోప జీయర్ను కలుసుకోడానికి వెళ్ళారు. ఈ క్రింద శ్లోకములో చెప్పబడింది…..

చన్దం తస్యైష విజ్ఞాయ నందన్ నందన్ నిరంతరం
సర్వం శంగం పరిత్యజ్య తుంగం ప్రావిశదాశ్రమం

(అళగియ మణవాళ నాయనార్, శఠగోప జీయర్ల దివ్య సంకల్పాన్ని తెలుసుకుని, చాలా సంతోషించారు. అన్ని అనుబంధాలను త్యజించి గొప్పదైన సన్యాసాశ్రమ స్థితికి చేరారు. అన్ని సంబంధాలను విడిచిపెట్టి  పూర్ణ వైరాగ్యముతో సన్యాసిగా మారెను. శఠగోప జీయర్ వారికి త్రిదండం [చిత్, అచిత్, ఈశ్వరులకి ప్రతీకమైన మూడు దండములు] మరియు కాషాయ వస్త్రాలు తమ చేతులతో వారికి అందించగా, నాయనార్ వాటిని ధరించి ఇద్దరూ కలిసి సన్నిధికి వెళ్లి పెరుమాళ్ళను సేవించుకున్నారు. ఈ శ్లోకాన్ని పఠించారు.

మంగళం రంగదుర్యాయ నమః పన్నగశాయినే
మంగళం సహ్యజామధ్యే సాన్నిత్యకృత చేతసే

(శ్రీరంగనాధునికి మంగళం. ఆదిశేషుని శయ్యపై పవ్వళించి ఉన్న పెరుమాళ్ళ దివ్య పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. ఉభయ కావేరుల నడుమ నిత్యం నివాసముండాలని దృఢ సంకల్పముతో ఉన్న ఆ పెరుమాళ్ళకి మంగళం). పెరుమాళ్ వారిని అనుగ్రహించి, తమ పూర్వాశ్రమ దివ్య నామాన్నే (మణవాళన్) తమ సన్యాశ్రమ నామముగా పెట్టుకోమని ఆదేశించారు. “మేము మీకు పల్లవరాయ మఠం ప్రసాదిస్తున్నాము. ఎంపెరుమానార్ వలే మీరు కూడా మీ దేహమున్నంత వరకు ఇక్కడే ఉండండి” అని ఆదేశించారు. [అంతకు ముందు ఈ పల్లవరాయ మఠం కందాదైయాండాన్ (రామానుజర్ మేనల్లుడు మరియు శిష్యుడైన ముదలియాండన్ తిరుకుమారులు) తమ ఆచార్యులైన ఆట్కొణ్డవిల్లి జీయర్ కోసం నిర్మించారు].  ‘ఎన్నైత్ తీమనం కెడుత్తార్’ (కృష్ణుడికి దివ్య నామము, మనస్సు నుండి చెడు ఆలోచనలను తొలగిస్తాడు కాబట్టి) అను తమ తిరువారాధన పెరుమాళ్ళ కోసం, పెరుమాళ్ళు శ్రీ రంగం ఆలయం నుండి నేతి దీపము మరియు ప్రసాదం [జీయర్లకు అగ్నితో ఎలాంటి సంబంధం ఉండకూడదు; అందువల్ల వారు ప్రసాదం వండ లేరు మరియు దీపాలను వెలిగించలేరు] ఏర్పాటు చేశారు. వారి వంశస్థులు, ఆ సమయంలో పరస్పర భేదాల కారణంగా ఆలయ ఉగ్రాణము (స్టోర్ హౌస్‌) కు ఆ విగ్రహాన్ని ఇచ్చేసారు. అంతకు పూర్వం, అత్యంత విశిష్టమైన రామానుజ కూటం పల్లవరాయులు నడుపు చుండుట వలన పల్లవరాయ మఠంగా మారింది. పెరుమాళ్ళు ఆ మఠాన్ని మరియు తిరువారాధన విగ్రహమైన ఎన్నైత్ తీమనం కెడుత్తార్ ని మణవాళ మాముణులకి ప్రసాదించెను. “నిసృష్టాత్మా సుహృత్సుచ” (తమ స్నేహితులకు తన బాధ్యతలను అప్పగించేవాడు) అని చెప్పినట్లు, పెరుమాళ్ కూడా తమ బాధ్యతను వారికి అప్పగించి, పరివట్టం, తీర్థ శఠారీలను వారికి ప్రసాదించిరి. అనంతరం పెరుమాళ్ళు ఉత్తమ నంబి మరియు ఇతరులను అళగియ మణవాళ జీయర్ ను వారి మఠానికి తోడుగా వెళ్ళమని ఆదేశించారు. వారు కూడా అలాగే చేసి “అడియార్గళ్ వాళ అరంగ నగర్ వాళ.. మణవాళ మామునియే ఇన్నుమొరు నూఱ్ఱాండు ఇరుం” (భక్తులను అలాగే శ్రీరంగం నగరాన్ని ఉద్ధరించడం కోసం .. . . . . . . . . ఓ అళగియ మణవాళ మాముని! మరో వంద సంవత్సరాలు జీవించు) అని కీర్తించారు.

వానమామలై జీయర్ మరియు ఇతరుల సహాయంతో, వారు మొత్తం మఠాన్ని పునరుద్ధరించారు. వారు వ్యా ఖ్యాన మండపం నిర్మించి, దానిని తిరుమలైయాళ్వార్ అని పిలిచేవారు (తమ ఆచార్యుల నామము). పిళ్ళై లోకాచార్యుల దివ్య తిరుమాలిగ నుండి మట్టిని తెచ్చి, దానిని “రహస్యం విళైంద మణ్” (రహస్యార్థాలు వెలువడిన నేల) అని పలుకుతూ తాము కూర్చునే చోటి ఎదుట రక్షణగా చల్లేవారు. ఆ ప్రదేశాన్ని తమ గురుకులవాసంగా భావించి, అక్కడ తమ ఆచార్యుల దివ్య పాద పద్మ యుగళి యందు నివసిస్తున్నట్టుగా భావించి అక్కడి నుండి నిత్యం ఉపన్యాసాలు ఇచ్చేవారు. తిరువాయ్మొళి పిళ్ళై నమ్మాళ్వార్ల దివ్య నామంతో ప్రకాశించినట్లే, మాముణులు కూడా నంపెరుమాళ్ళ దివ్య నామంతో ప్రకాశించారు. “రంగమంగళ దుర్యాయ రమ్యజామాతృయోగినః” (మంగళాసనపరర్లు అయిన మణవాళ మాముణులకి శుభం కలుగుగాక) అన్న సూక్తి ప్రకారం ఆలయానికి శుభం చేకూర్చుచున్న ఆ రోజుల్లో స్థానిక వాసులు వారిని ఇలా కీర్తించారు…

ఆచార జ్ఞాన వైరాగ్యై రాగారేణచ తాదృశః
శ్రీమాన్ రామానుజస్సోయమిత్యాశం సన్మితః ప్రజాః

(రూపంలో, ప్రవర్తనలో, జ్ఞాన వైరాగ్యములో మాముణులు రామానుజులను పోలి ఉండేవారు కాబట్టి, వీరు ఆ శ్రీమాన్ రామానుజులే నని స్థానికులు ఒకరితో ఒకరు చెప్పుకునేవారు). వీరు ఎంపెరుమానార్ల పునరవతారమని తమ మనస్సులో దృఢంగా వాళ్ళు భావించేవారు. అందరూ వారి దివ్య తిరువడి యందు ఆశ్రయం పొంది పునీతులు కావాలని ఆశించేవారు. వారు “పరమపద నివాస పణిపుంగవ రంగపదేర్ భవనమిదం హితాయ జగతో భవదాదిగతం” ”(శ్రీ  వైకుంఠంలో నివసించే ఓ తిరు అనంతుడా! ఈ లోకరక్షణ కోసం అళగియ మణవాళన్ (శ్రీ రంగనాధుడు) కొలువై ఉన్న ఈ శ్రీ రంగములో లోక రక్షణ కొరకై మణవాళ మాముణులు నివాసులై ఉన్నారు) వారు పెరుమాళ్ తిరుమొళి పాశురం 1-10 “వన్పెరు వానగం ఉయ్య అమరరుయ్య మన్నుయ్య మన్నులగిల్ మణిసరుయ్య తుంబమిగు తుయర్ అగల అయర్వొన్ఱిల్లాచ్చుగం వళర అగమగిళుం తొణ్డర్ వాళ అన్బొడు తెన్దిసై నోక్కి ప్పళ్ళి కొళ్ళుం” (శ్రీ రంగంలో దక్షిణం వైపు చూస్తూ కొలువై ఉన్న పెరుమాళ్ళు,  స్వర్గం, పై లోకాలు, దేవలోక వాసులు, భూమి, భూలోక వాసులు, ఎటువంటి బాధ లేకుండా సుఖ సమృద్ధులతో వృద్ధి చెందాలని, తమ భక్తుల ఆనందాన్ని పొందడం కోసం అక్కడ ఉన్నాడు). భక్త రక్షణ కోసమై పెరియ పెరుమాళ్ళు శ్రీరంగంలో తమ నివాసం ఏర్పరచుకున్నట్లు, మణవాళ మాముణులు కూడా అక్కడే నివాసం ఉన్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/24/yathindhra-pravana-prabhavam-39-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment