యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 45

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 44

అన్నన్ తమ బంధువులతో జీయర్ మఠానికి బయలురుట

అన్నన్ బంధువులలో కొంతమందిని సమాశ్రయణం కోసం జీయర్ మఠానికి వెళ్ల వద్దని వారి మనస్సులను ఎంబా మార్చి వేసారు. జరిగిన విషయం కందాడై అన్నన్ కు తెలిసింది; వారు నిరాశగా, కోపంతో “వాళ్ళను వదిలేయండి” అని చెప్పి, మిగిలిన వారిని తమతో తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. వారు ఆచ్చిని పిలిచి, తగిన సమయం చూసి జీయర్ కు తెలియజేయమని చెప్పారు. ఆమె మఠానికి వెళ్లి చూడగా, తిరుమలై ఆళ్వార్ [ఉపన్యాస మందిరం] లో శ్రీవైష్ణవ గోష్టిలో జీయర్ ఉన్నారని తెలిసింది. గోష్టిలోకి వెళ్లి వారికి తెలియజేయుటకు సంకోచించింది. ఆమె అక్కడ ఉన్న ఒక శ్రీవైష్ణవుడితో మాముణులకు సందేశం పంపాలని అనుకుంది. ఆమె అతనిని పిలిచి, జీయర్‌ ను దయచేసి ఒక సారి లోపలికి రమ్మనమని, ఎవరికీ వినిపించకుండా జీయరుకి తెలియజేయమని ఆమె కోరింది. ఆ శ్రీవైష్ణవుడు కారణమేమిటని అడుగగా, ఆమె “కందాడై అయ్యంగార్ల వంశ ఆచార్యులతో కలిసి అణ్ణన్ వస్తున్నారు” అని చెప్పి, జీయర్ కు విషయము తెలియజేయడానికి వీలుగా లోపలికి వెళ్ళి ఎదురుచూసింది.

అసట్టాచ్చాన్!

ఆ శ్రీవైష్ణవుడు ఆచ్చి చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకొని వెంటనే లోపలికి పరిగెత్తుకెళ్లి, “స్వామీ! దయచేసి త్వరగా రండి. కందాడై అయ్యంగార్లు వస్తున్నారు” అని జీయర్తో అన్నారు. వారు వెంటనే లేచి పెరట్లోకి వెళ్ళారు. జీయర్ ఇంకా లోపలికి రాకపోయేసరికి, ఆ శ్రీవైష్ణవుడు వారికి ఏమి చెప్పారోనని ఆచ్చి ఆందోళన చెందింది. ఈ సంతోషకరమైన వార్తను వారికి తానే తెలియజేయాలనుకుంది. కానీ, పెరట్లోకి వెళ్ళలేక పోయింది. అప్పటికే, పండ్లు, పలు నివేదనలతో అన్నన్ మరియు వారి బృందము ప్రవేశ ద్వారం వరకు చేరుకున్నారు. వారందరూ అక్కడ వానమామలై జీయర్‌ను కలుసుకుని తమ మర్యాదలను సమర్పించుకున్నారు. అన్నన్ “మేము ప్రాప్యప్రాపకం (అత్యున్నత ఫలము మరియు సాధనం) గా జీయర్ దివ్య పాదాలను ఆశ్రయించుటకు వచ్చాము. దేవరు వారు ఈ మా విన్నపాన్ని స్వీకరించాలి” అని ఎంతో వినయంగా వానమామలై జీయర్ ను ప్రార్థించారు. అది విన్న వారు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు, కానీ సంతోషించారు కూడా. తర్వాత జీయరుకి జరిగిన విషయము గురించి చెప్పేందుకు లోపలికి వెళ్లారు. ఇంతలో ఆచ్చి సరైన అవకాశము చూసుకొని, వెళ్లి జీయర్‌ని కలుసుకొని వారికి పాదభివందనాలు చేసి, “ఈ రోజు ఎంతో సుభ దినము. అన్నన్ మరియు కొందరు [దేవర్వారి] దివ్య చరణాల వద్ద ఆశ్రయం పొందాలని వస్తున్నారు” అని తెలిపెను. అదే సమయంలో, వానమామలై జీయర్ లోనికి వచ్చి, పారవశ్యంతో జరిగిన విషయమును గురించి వారికి తెలియజేశారు. ఇవి విన్న జీయర్ సంతోషించి. “వీటన్నిటికీ ప్రధాన కారణం ఆచ్చియార్ కదా!” అని అన్నారు. ఆ తర్వాత తిరుమలైయాళ్వార్లో తనను హెచ్చరించిన శ్రీవైష్ణవుడిని పిలిచి వింతగా “దేవరీర్ పేరు ఏమిటి?” అని అడిగారు. ఆ శ్రీవైష్ణవుడు “అడియేన్ రామానుజదాసన్” అని జవాబిచ్చాడు. జీయర్ వ్యజ్ఞ్యముగా“ అలా కాదు. దేవరీర్ అసట్టాచ్చాన్ (తెలివి లేని వ్యక్తి)” అన్నారు.

జీయరుకి తమ గౌరవాలు సమర్పించిన అన్నన్ 

జీయర్ ఆశ్చర్యపడుతూ కృపతో….

విధ్యా విముక్తిజననీ వినయాధికత్వం ఆచారసంపతనువేల వికాసశీలం
శ్రీలక్ష్మణార్య కరుణా విషయీకృతానాం చిత్రం నదాశరథివంశ సముత్భవానాం

(మోక్ష సాధనమైన జ్ఞానం, సత్ప్రవర్తనాసంపద మరియు అద్భుతమైన వినయ విధేయతలను శ్రీ ముదలియాండాన్ వంశస్థులు నిష్ఠగా అనురిస్తారని అనుటలో అతిశయోక్తి లేదు) అనిపలుకుతూ మఠం ముందు వాకిలిలోకి వచ్చారు. అక్కడ ఉన్న పరిచారకులను చూసి ఇలా అన్నారు….

శ్రీరామానుజ యోగీంద్ర కరుణా పరిబృంహితాం
శ్రేయసీం అనగాం వందే శ్రీమద్వాధూల సంతతిం

(ఏ దోషమూ లేని శ్రేష్ఠమైన యతిరాజులు, రామానుజుల కృపతో వృద్ధి చెందిన వాధూల వంశాన్ని నేను నమస్కరిస్తున్నాను). కందాడై అయ్యంగారులందరూ జీయర్ దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, “నకర్మణా నప్రజాయతనేన ”, “వేదాహమేతం” మొదలైన వేద మంత్రాలను పఠించి తమ నివేదనలు వారికి సమర్పించుకున్నారు. జీయర్ వాటిని స్వీకరించి వారందరినీ లోపలికి ఆహ్వానించారు. అక్కడ చేరిన దివ్య గోష్ఠికి, తిరువాయ్మొళిలోని ‘పొలిగ పోలిగ’, తిరుప్పల్లాండు పాసుర అర్థాలపై క్లుప్తమైన ఉపన్యాసం ఇచ్చారు. అక్కడ సంభవించిన ఈ శ్రీవైష్ణవ ఘట్టాన్నిఅందరూ కీర్తించి తమ మంగళాశాసనాన్ని అర్పించారు. మాముణులకు సమాశ్రయణ విన్నపము చేయమని అన్నన్ వానమామలై జీయర్ను సూచించారు. వానమామలై జీయర్ మరియు అన్నన్‌ ను మాముణులు పిలిచి, “దేవర్ గొప్ప వంశానికి చెందినవారు, పైగా అందరికీ గురువుల వంటివారు. ఇది ఏమిటి?” అని అడిగారు. అన్నన్ ప్రతిస్పందిస్తూ “దయచేసి అలా అనకండి” అని అన్నారు. వారు తమ మునుపటి ప్రవర్తనకి [జియార్‌ను గౌరవించకుండుట] క్షమాపణలు వేడుకొని, తమ స్వప్నంలో చూసిన సంఘటనలను వివరించారు. జీయర్ అంగీకరించి, “తప్పక ఈయాన్ వంశస్థులను పెరియ పెరుమాళ్ళు కృపతో అనుగ్రహిస్తారు. ఈ రోజు నుండి నాల్గవ రోజున అందరికీ సమాశ్రయణం చేస్తాము’’ అని ప్రకటించారు. గోష్ఠిలోని వారందరూ ప్రసాదం, తమలపాకులు పుచ్చుకొని మఠం నుండి బయలుదేరారు.

మరికొంతమందిని సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో, ఎమ్పెరుమాన్ తమ మనస్సులో నిశ్చయించుకున్నారు.

పునఃస్వప్నాపదేశేన దేశే దేశే నిరంకుశః
అయమర్చావతారత్వ సమాధిమవధీరయత్
అధ్యమర్త్యన్ తదేతస్య తత్వమాధ్యంతికం హితం
అసంకుచితం ఆసక్యౌ భుజంగశయనః పుమాన్

శేష శయ్యపైన శయనించి ఉన్న ఆ సర్వోన్నతుడు, ఆతనిని ఎదిరించే వారెవరూ లేరు కనుక, స్వప్నం నెపంతో, ఎవరితోనూ మాట్లాడకూడదనే తమ అర్చావతార స్వరూప నియమాన్ని కూడా ప్రక్కన పెట్టి పలు ప్రాంతాలకు వెళ్లి – కృపతో, ఇతర దేవతలను కూడా మించిన గొప్ప మాముణుల యథార్థ స్వరూపాన్ని మరియు వారి మోక్ష (శ్రీవైకుంఠం) సంసిద్ధతను తెలుపుతూ, “గురుశ్చ స్వప్నదృష్టశ్చ” (తమ ఆచార్యుని స్వప్నంలో దర్శించుట) అనే సూక్తికి అనుగుణంగా వారు [మాముణులు] తమ కలలోకి అర్చావతార రూపంలో వచ్చి: “మేము ఆచార్య (గురువు) రూపంలో అవతరించాము, మీరు కూడా ‘ఆచార్యం మాం విజానీయాత్ భవబంధ విమోచనం’ (ఈ సంసారము నుండి (అందరినీ) బంధ విముక్తులను చేయడానికి మేము మాముణులుగా అవతరించాము, ఈ విషయము అందరమూ తెలుసుకోవాలి), విశిష్ట విశ్వాసాన్ని ప్రదర్శించి వారి యందు ఆశ్రయం పొందుము” అని తెలియజేశారు.

మూలము: https://granthams.koyil.org/2021/08/29/yathindhra-pravana-prabhavam-45-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment