యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 47

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 46

కందాడై అణ్ణన్ ను ఆశ్రయించిన ఆండపెరుమాళ్

ఒకరోజు జీయర్ శుద్ధసత్వం అణ్ణాను పిలిచి “దేవరి వారు భాగ్యవంతులు, నమ్మాళ్వార్ల పట్ల మధురకవి ఆళ్వార్ ఉన్నట్లే, అణ్ణన్ పట్ల దేవరి వారు కూడా అంతటి ఇష్టపడే వ్యక్తి అయినారు. ఆచార్యుడు ఈ లోకంలో ఉన్నంత వరకే సేవ చేయగలము. అణ్ణన్ అవసరాలను తీర్చుచూ జీవించండి” అని ఆశీర్వదించారు. తరువాత వారు కుమాండూర్ ఆచ్చాన్ పిళ్ళై మనవడు, శాస్త్ర నిపుణుడు, ఎంతో జ్ఞానవంతుడు అయిన ఆండపెరుమాళ్ ను పిలిచి ఇలా అన్నారు: “వీరిని మీ తిరువడి విశ్వాసపాత్రుడిగా ఉంచుకొని, దర్శన ప్రవర్తకారునిగా (రామానుజ తత్వసిద్దాంత ప్రచారము చేయువారు) మలచండి అని చెప్పి ఆండపెరుమాళ్ ని అణ్ణన్ సంరక్షణలో ఉంచారు.

జీయర్ నాయనార్ల దివ్య అవతారము

ఆ విధంగా, తమ దివ్య తిరువడిని ఆశ్రయించిన వారందరినీ ఉద్ధరించే గొప్పతనము ఉన్న జీయర్, దర్శనమును పరిశీలించుచూ నియంత్రిస్తున్నారు. వారి పూర్వాశ్రమ కుమారుడు నమ్మైయన్ ఇరామానుసన్‌ ఆళ్వార్ తిరునగరిలో సంప్రదాయ రీతిలో పెరుగుతున్నాడు. కొంతకాలం గడిచిన తరువాత అతనికి వివాహం అయ్యింది. మరికొంత కాలం తర్వాత, అతనికి ఒక కుమారుడు జన్మించాడు. జీయర్ అతనికి “అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్” అని దివ్య నామకరణము చేశారు. తరువాత నమ్మైయన్ ఇరామానుసన్‌ శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్లి అక్కడ వాసము చేశారు. అక్కడ అతనికి మరో కుమారుడు జన్మించాడు. తగిన దివ్యనామం కోరుతూ వారు జీయరుకి కబురు పంపారు. జీయర్ “శిశువు శ్రీవిల్లిపుత్తూర్‌లో పుట్టాడు, ఇక తగిన పేరు పంపే అవసరం లేదు! శిశువుకి పెరియాళ్వార్ల పేరు పెట్టండి” అని తెలుపగా, ఆ బిడ్డకు పెరియాళ్వారైయన్ అను పేరును పెట్టారు. ఆ ఇద్దరు శిశువులు పెరిగి పెద్దయ్యారు, గురువుల సంరక్షణలో విడిచిపెట్టే వయస్సుకి వచ్చారు. వారిరువురు జీయర్ దివ్య తిరువడి యందు ఆశ్రయం పొందారు, ఈ ఇద్దరిలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ నిత్యం జీయర్ సేవలో ఉండేవారు. ఒక్క క్షణం కూడా వారి దివ్య చరణాలను విడిచిపెట్టేవారు కాదు. జీయర్ ఆశ్రయం పొందిన వారు తమ కుమారులకు నాయనార్ (సన్యాసాశ్రమ స్వీకరణకు ముందు జీయర్ పేరు ‘నాయనార్’) అని పేరు పెట్టుకున్నారు. అందుకని, జీయర్ మొదటి మనవడిని జీయర్ నాయనార్ గా గుర్తించి ఆ పేరుతోనే పిలెచేవారు అందరూ. నాథముని ఆళవందార్లను దర్శన ప్రవర్తకులుగా భావించినట్లే, జీయర్ నాయనార్ ను దర్శన ప్రవర్తకునిగా భావించిన జీయర్, ఎంతో కృపతో అతనిని అనుగ్రహించి ఆశీర్వదించారు. జీయర్ మనుమడు అయినందున అతను దివ్య తేజస్సుతో దీప ప్రకాశము వలె ఉండేవారు. జీయర్ తిరువడి అనుచరులు అతని గురించి ఇల వర్ణించేవారు…

అస్మాసు వత్సలతయా కృపయాస భూయః
స్వచ్చావతీర్ణమివ సౌమ్యవరం మునీంద్రం
ఆచార్యపౌత్రం అభిరామవర అభిదానం
అస్మద్గురుం గుణనిధిం సతతం ఆశ్రయామః

అభిరామవరర్ (అళగియ మణవాళర్) కు మనపైన ఉన్న దివ్య కృప, వాత్సల్యము, కోరిక కారణంగా వారు పునరవతారము (మణవాళ మాముణుల పునరవతారము) పొంది, మన మధ్యలోకి వచ్చిన  వారి యొక్క దివ్య చరణాలకు నిత్యం నా నమస్కారాలు. వారు శుభ గుణాలకు నిధి, పైగా ఆచార్యుని దివ్య మనుమలు [జీయర్జి]) కూడా అని, నిత్యము ధ్యానం చేస్తూ ఉంటాను.

జీయర్ ఆళ్వార్తిరునగరికి బయలుదేరుట

నమ్మాళ్వార్ల అభిమానులకు స్వామిగా గౌరవింపబడే జీయర్, “భగవాన్ భగవద్ ఉత్పవస్థలీ భవతు శ్రీనగరీ గరీయసి” (ఓ! సర్వోన్నత సర్వగుణ సంపన్న, దేవారి వారి దివ్య అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగరి అత్యంత ఉన్నతమైన ప్రదేశంగా ప్రకాశించాలి) అని కీర్తించబడే ఆళ్వార్తిరునగరి, తమ జన్మస్థలానికి వెళ్లి ఆళ్వారి దివ్య తిరువడిని సేవించాలని తమ దివ్య మనస్సులో సంకల్పించారు. కణ్ణినుణ్ శిఱుత్తాంబు పాశురములో చెప్పినట్లు – “కురుగూర్ నంబి! ముయల్గిన్ఱేన్ ఉందన్ మొయ్ కళఱ్కు అన్బైయే” (ఓ తిరుక్కురుగూర్ స్వామీ! మీ గొప్ప తిరువడి యందు భక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను), అని తమ హృదయంలో ఆనందంతో నంపెరుమాళ్ళ సన్నిధికి వెళ్లి, ఆళ్వార్తిరునగరికి వెళ్ళుటకు అనుమతి కోరారు. శ్రీరంగంలో శయనించి ఉన్న సహచరుడు తన ప్రయాణంలో తోడుగా వచ్చాడు. తిరువాయ్మొళి ప్పిళ్ళై జన్మించిన కుంతీనగరానికి వారు చేరుకొని మూడు రాత్రులు అక్కడే ఉన్నారు. వారు తిరువాయ్మొళి ప్పిళ్ళైని స్తుతిస్తూ ఈ క్రింది పాశురాన్ని పాడారు.

చిత్తం తిరుమాల్ మేల్ వైత్తరుళుం సీర్ మన్నర్
నత్తం ఇదు కాణుం నాం తొళిల్ – ముత్తరాయ్
పోనారేయాగిలుం పూంగమలత్తాళ్గళ్ తనై
తామార వైత్తార్ తలం

(మహాలక్ష్మికి పతి అయిన శ్రియః పతిపై తమ దివ్య మనసును దయతో ఉంచిన గొప్ప రాజు [తిరువాయ్మొళి ప్పిళ్ళై] జన్మించిన ప్రదేశం ఇది. వారు ముక్తాత్మ అయినప్పటికీ, కమలము వంటి వారి దివ్య పాదాలు ఇక్కడ మోపి నడైయాడిన ప్రదేశం ఇది). ఆ స్థలాన్ని సేవించి ముందుకు సాగారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/01/yathindhra-pravana-prabhavam-47-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment