శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఈ శ్లోకములో చెప్పినట్లు..
యానియానిచ దివ్యాని దేశే దేశే జగన్నితేః
తాని తాని సంస్థాని స్థాని సమసేవత
(మార్గంలో, ఎమ్పెరుమాన్ ఎక్కడెక్కడ కొలువై ఉన్నాడో అక్కడక్కడి పెరుమాళ్ళ దివ్య తిరువడిని సేవించారు), తిరుమంగై ఆళ్వార్ తిరునెడుందాణ్డగం పాశురం 6 లో “తాన్ ఉగంద ఊరెల్లాం తన తాళ్ పాడి” (ఎమ్పెరుమాన్ ఆనందంగా కొలువై ఉన్న దివ్య దేశాలలో వారి తిరువడిని సేవించుట) అని చెప్పినట్లుగా, దారిలో ఉన్న అన్ని దివ్య దేశాలలో మంగళాశాసనాలను సమర్పించుకున్నారు. ఈ శ్లోకంలో పేర్కొన్న విధంగా వారు దివ్య దేశాలను సేవించారు:
వైకుంఠనాథ విజయాసన భూమిపాలాన్ దేవేశ పంకజ విలోచన చోరనాట్యాన్
నిక్షిప్తవిత్త మకరాలయకర్ణపాశాన్ నాతం నమామి వకులాభరేణ శార్థం
(నేను శ్రీవైకుంఠనాదర్ (శ్రీ వైకుంఠము), విజయాసనర్, భూమి పాలర్, దేవర్పిరాన్ (తిరుప్పుళింగుడి), అరవిందలోచనర్ (తిరుత్తొలైవిల్లిమంగళం), మాయక్కూత్తర్ (పెరుంగుళం), వైత్తమానిధి (తిరుక్కోళూర్), మకర నెడుం కుళైక్కాదర్ (తెన్తిరుప్పేరై), ఆళ్వార్ తో పాటుగా ఉన్న ఆదినాదర్, వీరిని వకుళాభరణర్ అని కూడా పిలుస్తారు పాద పద్మాలను సేవించాను). అష్టతలములు ఉన్నట్లు కనిపించే శ్రీవైకుంఠంలో ఉన్న శ్రీ శ్రీవైకుంఠనాదర్ ను ఆరాధించి, అష్ట సన్నిధులను సేవిచుకుంటూ, కర్ణికై (ఎనిమిది విమానాల మధ్య భాగము) వంటి కేంద్రమైన ఆళ్వార్ తిరునగరికి వారు చేరుకున్నారు. వారి అనుచరులు ఆళ్వార్ 4.10 పాశురమైన ‘తిరుక్కూరదనై ప్పాడియాడి ప్పరవి చ్చెన్మింగళ్ క్కుఉరాధనైప్పాడియాదీప్పరవిచ్చెన్మింగల్’ (మీరు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) ని సేవిస్తున్నన్నప్పుడు ఆడండి పాడండి) పైన ఆనందతో ఆడారు పాడారు. జీయర్ తమ గోష్ఠితో కలిసి తామిరపరణి నది ఒడ్డుకి చేరుకొని మంగళ స్నానం చేసి, పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి, కోకిల పక్షుల కిలకిలారావాలు చేసే సరస్సులను, ఎర్రటి తామర పుష్పాలు వికసించి ఉన్న సరస్సులను, చుట్టూ తుమ్మెదల హుంకారాలను వింటు, బంగారు భవంతులు, ఎత్తైన దివ్య నివాస భవనాలను ఆస్వాదించుచూ నిత్యసూరులు ఆరాధించిన తిరుక్కురుగూర్ ను దర్శించుకుంటూ ఈ పాశురాన్ని పఠించారు
పుక్కగత్తినిన్ఱుం పిఱందగత్తిల్ పోందదు పోల్
తక్క పుగళ్ తెన్నరంగం తన్నిల్ నిన్ఱుం – మిక్క పుగళ్
మాఱన్ తిరునగరి వందోం అరంగన్ తన్
పేఱన్ఱో? నెంజే! ఇప్పోదు
(మెట్టినింటి నుండి పుట్టింటికి వచ్చినట్లు, దక్షిణాన ఉన్న అత్యంత ప్రసిద్ధ పట్టణమైన శ్రీరంగము నుండి బయలుదేరి [ఆళ్వార్] తిరునగరికి చేరుకున్నాము. ఓ హృదయమా! ఇది శ్రీరంగనాథుని కృప వల్లనే జరిగినది కదా?)
వారు పట్టణ ప్రవేశం చేసినప్పుడు, తిరుక్కురుగూర్ లో నివసించే గొప్ప జ్ఞానులు పండితులు తండోపతండాలుగా వచ్చి జీయర్ తిరువడి యందు సాష్టాంగము చేశారు. వారందరిపైన కృపా వర్షాన్ని కురించి గోష్ఠిగా సాగుతూ మొట్ట మొదట చతుర్వేది మంగళం వీధిలో ఉన్న ఎమ్పెరుమానార్ల సన్నిధికి చేరుకున్నారు. “శ్రీ మాధవాంగ్రి జలజ…. రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా” (శ్రీ లక్ష్మీపతి దివ్య చరణాల నిత్య సేవ చేస్తున్న యతిరాజైన రామానుజుల దివ్య పాదాలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను) అని యతిరజ వింశతిలోని 1వ శ్లోకమును పఠించారు [ఈ స్తోత్రాన్ని వారు ఆళ్వార్ తిరునగరిలో ఉన్నప్పుడు స్వరపరిచారు]. ఆ సన్నిధిలో వారు తీర్థ ప్రసాదాలను స్వీకరించి అక్కడి నుండి బయలుదేరి తిరువాయ్మొళి పిళ్ళై తిరుమాలిగకు చేరుకున్నారు. ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకొని లోనికి ప్రవేశించి ఇనవాయర్ తలైవన్ (పశువుల కాపరి శ్రీ కృష్ణుడు) ని సేవించారు. ఆచార్య తిరువాయ్మొళి పిళ్ళై తనియన్, అనగా, “నమః శ్రీ శైల నాథాయ…” పఠించి “మనల్ని యోగ్యులగా మార్చిన ప్రదేశం ఇదే కాదా?” అని మననము చేసుకుంటు తిరువాయ్మొళి పిళ్ళై ఉపన్యాసం ఇచ్చే చోటిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఎత్తైన కొండల వంటి భవనాలనూ, మేలిమి బంగారంలా మెరిసే భవనాలనూ వీక్షిస్తూ ముందుకు సాగారు. వారు ఉభయ ప్రధాన ప్రణవం (ప్రణవం (ఓం) లో ‘అ’ మరియు ‘మ’ అక్షరాలు ఉన్నట్లే), ఆదినాతర్ మరియు ఆళ్వార్ ఇరువురూ కొలువై ఉన్న) ఆలయంలోకి ప్రవేశించారు. ‘వకుళాభరణం దేవం స్వకుళాభరణం యయౌ’ (తమ వంశానికే ఆభరణం లాంటి పూజ్యర్ (అత్యంత స్వచ్ఛమైన) నమ్మాళ్వార్ల సన్నిధికి చేరుకున్నారు) అని చెప్పినట్లుగా, వీరు మొదటగా వకుళ పుష్ప మాలను తమ ఛాతీపై ధరించి ఉన్న ఆళ్వార్ దివ్య చరణాలని సేవించారు). తనియన్ ‘మాతా పితా… వకుళాభిరామం శ్రీమద్ తదంగ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా’ తో ప్రారంభించి, మధురకవి ఆళ్వార్ల కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు ప్రబంధాన్ని పఠించారు. ‘అన్నైయార్ అత్తనాయ్’ పాశురంలో చెప్పినట్లు, ఆళ్వార్ని తమ తల్లిగా, తండ్రిగా, ఇతర సంబంధిగా భావించే వీరు అంజలి ముద్రతో వారి ముందు నిలబడి సేవించారు. చాలా కాలంగా వేరే ఊళ్లో ఉండి ఇంటికి తిరిగి వస్తున్న కొడుకుని తల్లిదండ్రులు చూస్తున్నట్లుగా ఆళ్వార్ కూడా జీయరుని మనసారా తదేకంగా చూశారు. ఆళ్వార్ జీయరుకి తీర్థం మరియు శ్రీరామానుజులను (దివ్య చరణాలు) సమర్పించారు. వారు ‘శెల్వచ్ఛటకోపర్ తేమలర్తాట్కు ఏయ్ త్తినియ పాడుకమామ్ ఎందై ఇరామానుసనై వాయ్ందు ఎనదు నెంజమే వాళ్ (ఓ నా హృదయమా! కైంకర్య సంపద పుష్కలంగా ఉన్న శ్రీ శఠగోపుల తేనె వంటి చరణ పాదుకలుగా ఉన్న శ్రీ రామానుజులను స్వీకరించి వర్ధిలుము) వారు పఠించాను. ‘వకుళాలంకృతం శ్రీమచ్చటగోప పదద్వయం అస్మద్ కులధనం భోగ్యమస్తుమే మూర్తి భూషణం (కైంకర్య సంపదతో నిండి ఉన్న శఠగోపుల దివ్య పాదాలు నా శిరస్సుపై ఆభరణములా ఉండనీ) అని వారు పఠించాను. తరువాత ఆళ్వార్ సంకల్పానికి అనుగుణంగా, వీరు పొలిందు నిన్ఱ పిరాన్ సన్నిధికి వెళ్ళి తమ మంగళాశాసనాలు సమర్పించుకున్నారు. పిదప వారు తమ మఠానికి వచ్చి అక్కడ కొంత కాలం ఉన్నారు. స్థానిక వాసులెందరో జీయరుని ఒక దివ్య అవతారంగా భావించి, వారి దివ్య తిరువడి యందు ఆశ్రయం పొందారు. వాళ్ళపైన తమ దయను చూపి ఆళ్వార్ల దివ్య ప్రబంధాలను వాళ్ళకి ఉపదేశించారు.
మూలము: https://granthams.koyil.org/2021/09/02/yathindhra-pravana-prabhavam-48-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org