యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 49

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 48

జీయర్ మరియు తిరునారాయణపురం ఆయి సమావేశం

మాముణులు ఆచార్య హృదయంలోని 22వ సూత్రం [నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి ఆధారంగా అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (పిళ్లై లోకాచార్యుల తమ్ముడు) రాసిన నిగూఢ గ్రంథం] అర్థాన్ని వివరిస్తున్నప్పుడు, తమ వ్యాక్యానము అంతగా వారిని సంతృప్తి పరచలేదు. మంచి వివరణ ఎవరు ఇవ్వగలరా అని ఆలోచిస్తున్నారు. మాముణులకు తిరునారాయణపురత్తు ఆయి జ్ఞాపకం వచ్చి వారి వద్ద ఆ సూత్రార్థాల శ్రవణం చేయాలని ఆశించారు. ఆ తర్వాత జీయర్ తిరునారాయణపురత్తు ఆయిని కలవడానికి ఆళ్వారుకి అనుమతి పార్థిన చేసి, ఆళ్వార్ అనుమతితో తిరునారాయణపురానికి బయలుదేరారు. ఇంతలో, ఆయి కూడా మాముణుల కీర్తి మహిమలను విని వారిని సేవించాలనుకున్నారు. అటు ఆయి తిరునారాయణపురం నుండి బయలుదేరారు, దారిలో ఆళ్వార్ తిరునగరికి దగ్గర ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. మాముణులు “ఎణ్ణిన పలం ఎదిరిలే వర ప్పెఱువదే” (అడియేన్ కోరిన ఫలాన్ని పొందాలని బయలుదేరితే ఆ ఫలమే ఎదురుగా రావడం ఎంతటి అదృష్టము!) అని పరవశించారు. ఇద్దరూ ఎంతో ఆప్యాయతతో ఒకరికొకరు భక్తితో గౌరవ నమస్కారాలు ఇచ్చి పుచ్చుకున్నారు. జీయర్ శిష్యులు వీరిరువురిని చూసి “పెరియ నంబి, రామానుజులు ముఖాముఖిగా వచ్చినట్లు అనిపిస్తోంది!” అని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం, అందరూ తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) చేరుకున్నారు. మాముణులు తాను ఆచార్య హృదయంలో వినాలనుకున్న అర్థాలను ఆయి నుండి విని, వారిపైన ఒక తనియన్ సంకలనం చేశారు.

ఆచార్య హృదయమ్యార్తాః సకలా యేన దర్శితాః
శ్రీసానుధాసమమలం దేవరాజం తమాశ్రయే

(ఆచార్య హృదయ భావార్థాలను పూర్తిగా వివరించిన శ్రీసానుదాసర్ (తిరుత్తాళ్వరై దాసర్) అని పిలువబడే ఆ దేవరి వారిని (అయి) నేను నమస్కరిస్తున్నాను). ఆయి తమ ప్రశంసల పట్ల అంతగా రుచి చూపక, జీయరుని కీర్తిస్తూ ఇలా అన్నారు…

పూదూరిల్ వందుతిత్త పుణ్ణియనో? పూంగమళుం
తాదారుమగిళ్ మార్బన్ తానివనో – తూదూర
వంద నెడుమాలో? మణవాళ మామునివన్
ఎందై ఇవర్ మూవరిలుం యార్?

(శ్రీపెరంబుదూర్లో [రామానుజర్] అవతరించిన దివ్య మనిషినా వీరు? సుగంధ భరితమైన దివ్య హారము తమ వక్షస్థలముపై ఉన్నవారా [నమ్మాళ్వార్] వీరు? దూత కార్యాన్ని నిర్వహించుటకు వచ్చిన తిరుమాళా (శ్రీమహాలక్ష్మీ పతి) వీరు? ఈ ముగ్గురిలో నా స్వామి మణవాళ మాముణులు ఎవరు?) జీయర్‌ వారిని విశిష్ట అవతారంగా ఆదరించి కొంతకాలం ఆళ్వార్ తిరునగరిలోనే ఉన్నారు.

తిరునారాయణపురంలో ఆయిపై అసూయతో ఉన్న కొందరు, వారి అనుపస్థితిని ఉపయోగించుకుని, వారు తిరునాడు (శ్రీవైకుంఠం) కి చేరుకున్నారని ప్రచారం చేసి, ఆయి తిరుమాలిగలో ఉన్న వస్తువులన్నీ ఆలయ గిడ్డంగి (స్టోర్ రూం) లో శెల్వ పిళ్ళై (తిరునారాయణపురం ఆలయంలోని పెరుమాళ్ పేరు) సమర్పణగా ఇచ్చేసారు. ఆయి సుమారు అదే సమయంలో, ఆళ్వార్ తిరునగరి నుంచి తిరునారాయణపురానికి తిరిగి వచ్చి, జరిగిన సంఘటన గురించి విని, “యస్యానుగ్రమ్ ఇచ్ఛామి తస్య విత్తం హరామ్యహం” (నాకు నచ్చిన వారిపై కృప చూపాలనుకుంటే మొదట వారి సంపదను దోచుకుంటాను) అన్న గీతా శ్లోకాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించారు. తన సంపదను సర్వేశ్వరుడు స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి, ఆతని కరుణకు పాత్రుడైనందుకు సంతోషించారు. “యస్యైతే తస్యతద్దనం” (యజమాని తన ఆస్తిని స్వాధీనము చేసుకొనుట సమంజసమే) అని ఆలోచిస్తూ ఆనంద బాష్పాలు కార్చారు. ఆ తర్వాత వారు తమ నిత్యారాధన కొరకు జ్ఞానప్పిరాన్ (వరాహ స్వరూపము) మూర్తిని మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని యాదవగిరినిలయుని (యాదవగిరి పెరుమాళ్) కి తమ సమర్పణగా ఆలయంలోనే ఉంచారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/02/yathindhra-pravana-prabhavam-49-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment