శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఆళ్వార్తిరునగరిలో అగ్నికి ఆహుతి అయిన జీయర్ మఠం
పెరియ జీయర్ అపార పాండిత్యముతో ఇలా కాలము గడుతుండగా, ఈర్ష్యాద్వేషములతో వారంటే పడిరాని వాళ్ళు కొందరు, రాక్షస ప్రవృత్తితో అర్ధరాత్రి వేళ జీయర్ మఠానికి నిప్పంటించి పారిపోయారు. అది చూసిన వారి శిష్యులు దుఃఖ సాగరములో మునిగిపోయారు. జీయర్ ఆదిశేషుని రూపాన్ని ధరించి, రగిలే మంటల నుండి చెక్కుచెదరకుండా తప్పించుకుని, తమ శిష్యులు ఆశ్చర్య పడేలా తిరిగి వచ్చి వాళ్ళను కలుసుకున్నారు. అది విన్న అక్కడి రాజు, నేరస్థులను శిక్షించేందుకు తన భటులను నియమించారు. ఎలాగైతే రావణుడు యుద్దములో మరణించిన తర్వాత ఒంటి కన్నుచెవి ఉన్న రాక్షస స్త్రీలను సంహరించాలని సంకల్పించిన హనుమంతునితో సీతాపిరాట్టి “పాపానాంవా శుభానాం వా” (అది పాప కార్యమో లేక పుణ్య కార్యమో…) అని చెప్పి వాళ్ళను క్షమించి తన ఉదారతను ప్రదర్శించమని అన్నట్లుగా, వరవరముని శతకం 14 లో “దేవి లక్ష్మీర్ భవసిదయయా వత్సలత్వేన సత్వం ” (నీ మాతృ కృప, సహన గుణాల కారణంగా నీవు లక్ష్మీదేవివి) అని చెప్పినట్లుగా మాముణులు తమ దయ మరియు ఉదారత కారణంగా ఆ దుండగులను క్షమించారు. తరువాత ఆ నేరస్థులు వచ్చి, వారు చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకొని కృపా సముద్రులైన మాముణుల చరణాల యందు శరణాగతి చేశారు. తరువాత వారు ఎంతో కాలం పాటు మాముణులతోనే ఉన్నారు.
తిరుక్కుఱుంగుడి మరియు తిరుక్కురుగూర్లో కైంకర్యాలు
ఆ స్థానిక రాజు, మాముణుల జ్ఞానానుష్ఠాములు, సర్వజ్ఞ గుణములు మొదలైన వాటి గురించి విని భక్తిప్రపత్తులతో వచ్చి మాముణులను ఆశ్రయించారు. జీయర్ వారికి శఠకోప దాసర్ అని దాస్యనామాన్ని ప్రసాదించి, “ఒక వంతు ప్రాపంచిక విషయాసక్తి ఉంచుకొని మిగిలిన మూడు వంతులు మోక్షాసక్తి కలిగి ఉండండి” అని రాజుని నిర్దేశించారు. రాజు కూడా చూచా తప్పకుండ ఈ సూచనను అనుసరించారు. ఆ రాజు కాలమేఘ తిరుమండపం (కాలక్షేపం మొదలైనవాటిని నిర్వహించడానికి ఒక దివ్య మండపం), దివ్య వీధులు, దివ్య సరిహద్దులు మొదలైన అనేక కైంకర్యాలను నిర్వహించి జీయర్ ని సంతోషపరిచారు. వారు అళగియ మణవాళన్ దివ్య మండపాన్ని కూడా నిర్మించారు.
అనంతరం, జీయర్ తిరుక్కుఱుంగుడికి వెళ్లి, తిరువెంగడముడైయాన్ అనే బ్రాహ్మణునిపై తమ దయ చూపారు. అతనికి తిరువేంగడదాసర్ అను దాస్యనామాన్ని అనుగ్రహించి తిరుక్కుఱుంగుడిలో కైంకర్యం నిర్వహించమని నియమించారు. తిరువేంగడదాసర్ నిన్ఱ నంబి, ఇరుంద నంబి మరియు కిడంద నంబి ల కోసం ప్రత్యేక మందిరాలను నిర్మించారు (తిరుక్కుఱుంగుడి నంబికి ఆ ప్రదేశంలో పంచ మూర్తులు ఉన్నాయి; మాముణుల మహిమలకు సంబంధించిన మరో కథనము ప్రకారం, మగిలిన రెండు మూర్తులకు (తిరుప్పాఱ్కడల్ నంబి, మలైమేల్ నంబి) కూడా వారే మందిరాలు నిర్మించారని విదితమౌతున్నది. వీరు నంబుల కోసం దివ్య మండపాలను కూడా నిర్మించారు. ఆ విధంగా, మాముణులు తిరుక్కురుగూర్ నంబి (నమ్మాళ్వార్) మరియు తిరుక్కుఱుంగుడి నంబి (సర్వేశ్వరన్) ఇద్దరికీ సాధ్యమైన విధాలుగా అలంకారాలను ఏర్పాటు చేశారు. వారు ఈ మందిరాల కార్య నిర్వహణల అభివృధి బాధ్యతలను ఈ ప్రదేశాలలో తమ అనుచరులను అప్పగించారు. అనంతరం వారు కోయిల్ (శ్రీరంగం) కి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.
జీయర్ శ్రీరంగానికి తిరిగి రాక
ఈ పాశురమును పఠిందారు……
పిఱందగత్తిల్ శీరాట్టు ప్పెఱ్ఱాలుం తన్నై
చ్చిఱంద్ఉగక్కుం శీర్కణవన్ తన్నై మఱందిరుక్క
ప్పోమో మణవాళర్ పొన్నడియై విట్టిరుక్క
లామో కల్వియఱిందాల్
(తమ పుట్టింటిలో ఎంత గారంగా చూసుకున్నా, ఆమెను గొప్పగా ఆదరించే భర్త పొందే ఆనందాన్ని మరచిపోగలదా? కొంత జ్ఞానం ఉన్న ఎవరైనా అళగియ మణవాళర్ (నంపెరుమాళ్) ల దివ్య స్వర్ణమయమైన చరణాల నుండి వీడి ఉండుట సరైనదేనా?) వెంటనే శ్రీరంగానికి తిరిగి రాడానికి ఆళ్వార్ అనుమతి కోరారు. శ్రీరంగానికి తిరిగి వచ్చి పెరియ పెరుమాళ్ళను సేవించి, ఇతర తత్వ సిద్ధాంతులతో తిరుగులేని విధంగా చర్చించి వారిపై తమ సిద్ధాంతాన్ని (రామానుజ దర్శనం) స్థాపించారు. తమ ఆదిషేశుని అవతారమని దర్శింపజేసే తమ గుణాలను వ్యక్తపరచుచూ పెరియ పెరుమాళ్ళ సమక్షంలో జీవించారు.
అప్పిళ్ళార్ అను ఒక జ్ఞాని ఉత్తర ప్రాంతాలకు వెళ్లి వాద్వివాదాలలో చర్చించి ఇతర సిద్ధాంత అనుచరులపై గెలుపు పొందుచున్నారు. ఎఱుంబి అప్పాతో చర్చ వాదనకై వారు ఎఱుంబి (శోలింగపురం దగ్గరలో) అనే చోటికి చేరుకున్నారు. అప్పా కీర్తి గురించి తెలుసుకొని అప్పిళ్ళార్ ఆశ్చర్యపోయారు. అప్పాతో వాదనకు బదులుగా అతనితో స్నేహం ఏర్పరచుకొని వారి నుండి సూక్ష్మార్థాలను నేర్చుకున్నారు. మూడు దినాలు అక్కడే గడిపిన తరువాత ఇక బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో అప్పా అడిగగా. దానికి అప్పిళ్ళై “శ్రీరంగంలో జీయర్ అనే వ్యక్తి ఉన్నారు. అడియేన్ వారిని చూడాలని వారితో చర్చించాలని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఇది విన్న అప్పా ఒక శ్రేయోభిలాషిగా అప్పిళ్ళార్ తో ఇలా అన్నారు “దేవరి వారి పక్షాన ఇలా అనడం సమంజసం కాదు. అడియేన్‌కి జీయర్ మహిమలు తెలుసు. పెరుమాళ్ కోయిల్ లో కిడాంబి నాయనారు నుండి శ్రీభాష్యం కలక్షేపం వినే భాగ్యం కలిగినప్పుడు, ఆ సమయంలో, నాయనార్లు అడియేన్ని పిలిచి, జీయార్ సామర్థ్యాలను పరీక్షించమని కోరారు. ఏకకాలంలో అన్ని అర్థాలపై ఉపన్యాసం ఇవ్వగల సమర్థుడు జీయర్. వారితో వాదనకు దిగడం ఎవరికీ సాధ్యం కాదు. పైగా, వారు యతులకు నాయకుడు మరియు శ్రీ వైష్ణవ దర్శనమును నడిపించువారు. మనమందరం వారి పట్ల ఎంతో గౌరవంగా ఉండాలి. తగిన సమయంలో మీకు వివరిస్తాను” అని చెప్పి వారిని పంపారు.
మూలము: https://granthams.koyil.org/2021/09/04/yathindhra-pravana-prabhavam-50-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org