యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 51

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 50

జీయర్ ఆశ్రయం పొందిన ఎఱుంబి అప్పా

ఒక శ్రీవైష్ణవుడు తిరుమల కొండకి వెళుతూ దారిలో ఎఱుంబి అప్పా వద్దకు వెళ్ళారు. అప్పా అతన్ని చూసి గౌరవంగా ఆహ్వానించి, కోయిల్ (శ్రీరంగం దేవాలయం) గురించి, మాముణుల గురించి విషేశాలు చెప్పమని ఆతృతతో అడిగాడు. ఆ శ్రీవైష్ణవుడు అతనితో ఇలా అన్నాడు: “కందాడై అన్నన్ వంటి కందాడై అయ్యంగార్లు, తిరువాళియాళ్వార్ పిళ్ళై వంటి ఇతర ప్రముఖులతో పాటు ఎందరో శ్రీవైష్ణవులు మాముణుల దివ్య తిరువడి ఆశ్రయం పొందారు; జీయర్ కీర్తి దిన దినము అంచలంచలుగా పెరుగుతున్నాది.” ఇది విన్న అప్పా ఎంతో సంతోషించి, ఆ శ్రీవైష్ణవుడికి అనేక బహుమానాలు సమర్పించుకున్నారు. తర్వాత అప్పా ఆ శ్రీవైష్ణవులతో “మీ ద్వారా మాముణుల మహిమల గురించి క్లుప్తంగా విన్నాము. దయచేసి ఈ ఘట్టాల గురించి, జీయర్ ఆళ్వార్ తిరునగరి నుండి శ్రీరంగానికి తిరిగి వెళ్ళుట గురించి కూడా వివరించండి” అని ప్రార్థించారు. “తిరుమల నుండి త్వరగా తిరిగి రండి. మీరు శ్రీరంగానికి వెళ్లేటప్పుడు మేము మీతో వస్తాము” అని తెలిపారు. అప్పా పూజ్యులైన తమ తండ్రి వద్దకు వెళ్లి ఈ సంఘటనల గురించి చెప్పారు. వారి తండ్రిగారు ఆయనతో “నీవు జీయర్ తిరువడి సంబంధం పొందాలనుకుంటున్నట్లు అనిపిస్తుంది. అది అంతగా సబబు కాదని నేను భావిస్తున్నాను. నీవు కావాలంటే, వారికి నీ గౌరవాలను సమర్పించుకో, వారి నుండి తగిన వ్యాక్యార్థాల శ్రవణం చేయి, శ్రీపాదతీర్థం, ప్రసాదాన్ని స్వీకరించు” అని అన్నారు. ఇంతలో, ఆ శ్రీవైష్ణవుడు తిరుమల నుండి తిరిగి వచ్చాడు. ఎఱుంబి అప్పా అతనితో పాటు శ్రీరంగానికి వెళ్ళి నంపెరుమాళ్ళను సేవించుకున్నారు. తన సన్నిహిత మిత్రుడు అయిన పెరియ కందాడై అణ్ణన్ తిరుమాలిగకు వెళ్లి భోజనము చేసారు. తరువాత జీయర్ దివ్య తిరుమాలిగకు వెళ్లారు. ఎఱుంబి అప్పా మహా జ్ఞాని అని జీయరుకి తెలుసు. వారు సర్వేశ్వరుని పరత్వ గుణాన్ని చాటి చెప్పే తిరువాయ్మొళి మొదటి పాశురము ‘ఉయర్వఱ ఉయర్నలం’ పరిచయం గురించి వివరణాత్మక అర్థాలను వివరించారు. జీయర్ ఉపన్యాసం విన్న ఎఱుంబి అప్పా ఆశ్చర్యపోయి, “జీయర్‌కు తమిళం భాషలో నిష్ణాతులని, సంస్కృతంలో అంత నిష్ణాతులు కాదని మేము విన్నాము. కానీ వీరు రెండింటిలోనూ నిపుణులు, వీరు ఉభయ వేదాంతులు (సంస్కృతం మరియు ధ్రావిడం)” అని అన్నారు. జీయర్ అతని పట్ల ఆప్యాయతతో మఠంలో భోజనం చేయమని అభ్యర్థించారు. అప్పా స్పందిస్తూ ఇలా అన్నారు.

యత్యన్నం యతిపాత్రస్నం యతినా ప్రేశితంచ యత్
అన్నత్రయం నభోక్తవ్యం భుక్త్వా చాంద్రాయణం చరేత్

(సన్యాసుల ఆహారం, సన్యాసుల పాత్రల నుండి తెచ్చిన ఆహారం, సన్యాసులు పంపిన ఆహారం – ఈ మూడు రకాల ఆహారాలు స్వీకరించుట నిషేధం. ఈ  విశేష ధర్మాన్ని పాటించకుండా అలాంటి ఆహారాన్ని ఎవరైనా తింటే, అతను ప్రాయశ్చిత్తంగా చాంద్రాయణ వ్రతం పాటించాలి), (శాస్త్రాన్ని రెండు విధాలుగా పాటించాలి. ఒకటి సామాన్య శాస్త్రం – సామాన్య సమయంలో పాటించాలి. రెండవది విశేష శాస్త్రం – విశిష్ట సమయాల్లో ఆచరించాలి). అప్పా జీయర్ ఆశ్రయం పొందకుండా, కందడై అణ్ణన్ తిరుమాలిగకి కూడా వెళ్ళకుండా అసంతృప్తితో వెంటనే ఎఱుంబికి బయలుదేరారు.

ఇంటికి చేరుకున్న తర్వాత, తమ తిరువారాధన పెరుమాళ్ అయిన చక్రవర్తి తిరుమగన్ (శ్రీరాముడు) యొక్క కోయిలాళ్వార్ (మందిరం) తెరవాలనుకున్నారు. ఎంత ప్రయత్నించినా కోయిలాళ్వార్ తలుపులు తీయలేకపోయారు. దీంతో తీవ్ర బాధతో రాత్రికి ఏమీ తినకుండానే నిద్రలోకి జారుకున్నారు. వారి స్వప్నంలో శ్రీ రాముడు వచ్చి ఇలా అన్నాడు….

శేషః శ్రీమానజనిహిపురా సౌమ్యజామాతృయోగి భోగీభూతః
తదనుభగవాన్ రాఘవస్యానుజన్మా
భూత్వా భూయో వరవరమునిర్ భూయసాపాసమానః రక్ష్యత్యస్మాన్
రఘుకులపతే రాస్తితోపత్రపీటం
భూత్వా భవ్యో వరవరమునిర్ భోగినాం సార్వభౌమః శ్రీమద్ రంగే
వసతివిజయీ విశ్వసంరక్షణార్థం
తత్వం కంతుం వ్రజ శరణమిత్యాధిశత్ రాఘవోయం స్వప్నే
సోయం వరవరగురుః సంశ్రయో మాధృశానాం

(ఈ మణవాళ మాముణులు మొదట్లో కైంకర్యశ్రీ (సేవా సంపద) తో ఉన్న తిరువనంత ఆళ్వాన్ (ఆధిశేషుడు). అదే సర్ప రాజు తరువాత శ్రీ రాముడి తమ్ముడు లక్ష్మణునిగా అవతరించాడు. తరువాత మానవుడిగా అవతారమెత్తి, తమ భక్తులకు చేరువగా, శ్రీ రాముడి సింహాసనంపై ఆసీనులై మనల్ని రక్షిస్తున్నాడు. “ఆదిశేషుడు లోక కల్యాణార్థం మణవాళ మాముణులుగా అవతరించి శ్రీరంగంలో ఉంటున్నాడు. తత్వజ్ఞానము పొందాలనుకుంటే అతనిని ఆశ్రయించుము” – ఆ విధంగా అప్పా స్వప్నంలో శ్రీ రాముడు ఆదేశించాడు. అలాంటి మణవాళ మాముణులు మనలాంటి వారు ఆశ్రయించుటకు తగినవారు).

మూలము: https://granthams.koyil.org/2021/09/04/yathindhra-pravana-prabhavam-51-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment