యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 62

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 61

వేద సహాయంతో కుదృష్టులను తిరస్కరించుట

ఒక కుదృష్టి (వేదాలను వక్రీకరించువాడు) శ్రీరంగం ఆలయానికి వచ్చి, దురహంకారముతో తన తత్వాన్ని అక్కడ బోధించాలని సంకల్పించాడు. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలై 8వ పాశురంలో “కలైయఱక్కఱ్ఱ మాందర్ … కాణ్బరో కేట్పరో తాం” (శాస్త్రమునెరిగిన ఎవరైనా ఇతర తత్వ సిద్దాంతములను విన్న మాత్రాన అంగీకరిస్తాడా?) అని చెప్పినట్లుగా, జీయర్ అతనితో చర్చకు దిగి, ఓడించే సామర్థ్యం ఉన్నవారు కనుక, అతనిని గడ్డితో సమానంగా భావించి, “భగవాన్‌ విరోధి అయిన ఈ వ్యక్తిని మనం ఈ చోటి నుండి తరిమివేయాలి” అని ప్రతిజ్ఞ చేశారు. ఈ వ్యక్తి వాదూల (ముదలియాండన్ వంశం) వంశంలో జన్మించిన వారని, వేడలప్పై శిష్యుడని, చెడు సాంగత్యం కారణంగా తప్పు దారి పట్టి బౌద్ధ/జైనుల గోష్ఠిలో చేరి వారి తత్వ సిద్దాంతమును అనుసరిస్తున్నారని జీయరుకి తెలుసు. ఆ కారణంగా అతను త్రిశంకు వలె కర్మ చండాలుడైయ్యడు (తమ దుష్కర్మల వలన నీచ స్థితికి దిగజారిన వ్యక్తి). అతనితో చర్చించుటకు జీయర్ ఇష్టపడక, అతనిని తిరస్కరించమని వేడలప్పైకి కబురు పంపారు. వారు కూడా అక్కడికి వచ్చి, అతనిని చూసి ఈ కుదృష్టి ఇక్కడికి కూడా వచ్చాడా అని అనగానే, ఆ కుదృష్టి వేడలప్పైని చూడగానే, గరుడని చూసిన సర్పంవలే భయపడి, వారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయెను. వేడలప్పై నైపుణ్యాన్ని చూసి, జీయర్ ఆశ్చర్యపోయి, కొంత కాలం అక్కడే ఉండమని వేడుకున్నారు. తమ వృద్ధ వయస్సును దృష్టిలో ఉంచుకుని, దాశరథియణ్ణన్ ను తమ ప్రతినిధిగా జీయర్ మఠంలో ఉంచి, వారు తమ గ్రామానికి తిరిగి వెళ్ళారు.

ప్రతివాది భయంకరం అణ్ణా చరిత్ర

వేడలప్పై వెళ్లిన తర్వాత, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ముందుకు ఎవరు నడిపిస్తారని జీయర్ ఆలోచిస్తున్నారు . అదే సమయంలో, “హస్తిగిరినాదర్ అణ్ణ” అనే ఒక వ్యక్తి రామానుజ దర్శన విరోధులతో వాద్వివాదములు చేసి, వారందరిపైన గెలుపు పొందుతూ “ప్రతివాది భయంకరర్” అనే బిరుదును సంపాదించుకున్నారు. వీరు లౌకిక మరియు వైదిక విషయాలపై అసమానమైన నైపుణ్యం కలిగినవారు. వీరు కొంతకాలం పెరుమాళ్ కోయిల్ (కాంచిపురం)లో నివాసముండి తరువాత తిరుమలలో ఉండసాగారు. తిరుమలలో ఉన్న రోజుల్లో వీరికి ముగ్గురు తిరుకుమారులు జన్మించారు. పెరిగి పెద్దవారై శాస్త్రాలను నేర్చుకున్నారు. వారి భార్య ఆండాళ్ (కురత్తాళ్వాన్ భార్య) లాంటిది, శాస్త్రాధ్యయనం చేసిన నిపుణురాలు. ప్రతివాది భయంకరం అణ్ణ, కూరత్తాళ్వాన్ వంటి వారు, భౌతిక సంపదను ఆశించేవారు కాదు, ఎందుకంటే అది భగవానుని పొందుటకు ఆటంకం వంటిది. “అర్థసంపత్విమోహాయ” (సంపద, ఐశ్వర్యం మనిషిని భ్రమింపజేస్తుంది) అన్న సుత్రాన్ని పాఠించే పరమ సత్వనిష్టరులు వీరు. భగవాన్ భాగవతులలో తమ సంపదను పంచుకుంటూ, భగవత్ కైంకర్యం మాత్రమే తమ పురుషార్థమని తమ దివ్య మనస్సులో స్థిరపరచుకున్నవారు. తిరువాయ్మొళి పాశురం 3-3-1 “ఒళివిల్ కాలం ఎల్లాం ఉడనాయ్ మన్ని వళువిలా అడిమై శెయ్యవేండుం” (నేను దోషరహితమైన సేవను నిరంతరాయంగా ఆ తిరువేంకటేశ్వరునికి చేయాలి” అని చెప్పినట్లుగా వీరు ఏ ఆటంకం లేకుండా తిరువేంకటేశ్వరుని దివ్య పాదాలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అతని దివ్య సంకల్పాన్ని విని, తిరుమలై తోళప్పర్ ఎంతో సంతోషించి, “అన్యత్ పూర్ణాదపం కుంభాదన్యత్ పదావనేజనాత్ అన్యత్ కుశల సంప్రశ్నా న చ ఇచ్ఛతి జనార్ధనః” (జనార్ధనుడైన కృష్ణుడు పూర్ణ కుంభం తప్పా మరొకటి కోరరు) అని చెప్పినట్లు. అణ్ణకు ఒక వెండి బిందెనిచ్చి, “అకాశగంగ నుండి జలాన్ని తీసుకువచ్చి, యాలకలు మొదలైన సువాసనగల పరిమళ ద్రవ్యాలను కలపండి [తిరువేంకటేశ్వరునికి తిరువారాధన కోసం]” అని చెప్పాడు. అణ్ణా ఎంతో అనందంతో ఆ వెండి బిందెను తీసుకొని, “ఈ మేరకు శేషత్వం సాక్షాత్కరించడం గొప్ప విషయం” అని భావించి, తమ నిత్య కార్యంగా సేవను ప్రారంభించారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/17/yathindhra-pravana-prabhavam-62-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment