శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
అణ్ణా తరువాత కందాడై అణ్ణాన్ తిరుమాలిగకి చేరుకున్నారు. వారికి స్వాగతం పలికేందుకు కందాడై అణ్ణాన్ ఎదురుగా వచ్చారు. “వైష్ణవో వైష్ణవం ధృత్వా దండవత్ ప్రణమేత్ భువి” (ఇద్దరు శ్రీవైష్ణవులు కలుసుకున్నపుడు, ఒకరి ఎదుట ఒకరు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకోవాలి) అని చెప్పినట్లుగానే, వారిరువురు ఒకరి ఒకరు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకొని, ఒకరినొకరు కుశల మంగళములు అడిగి తెలుకొని తిరుమాలిగలోని ప్రవేశించారు. అనుకోకుండా అదే సమయంలో వానమామలై జీయర్ అక్కడికి రావడం జరిగింది. “పరమ కృపాలుడైన శ్రీవైష్ణవుడు కదా వీరు!” అని వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసారు. జీయర్ వారిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. యతి పునరవతారం (రామానుజుల పునరవతారం) అని మాముణుల మహిమలను వారు ముగ్గురూ స్మరించుకుంటూ మఠానికి చేరుకున్నారు. ప్రతివాది భయంకరం అణ్ణా తమ నివేదనలను సమర్పించుకున్నారు. అనంతరం వారి ధర్మ పత్ని, ముగ్గురు కుమారులైన ఎంబెరుమానారప్పన్, అనంతయ్యనప్పై, తిరువాయ్మొళి పెరుమాళ్ జీయర్ పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసి, శ్రీపాద తీర్థం ప్రసాదమును స్వీకరించారు. జీయర్ తిరువడి యందు అణ్ణా విశ్వాసపాత్రులైనారు. “ప్రసిద్ధః పరగోష్ఠిషు ప్రతివాధి భయంకరః శ్రీవైష్ణవం గోష్ఠీషు తత్ దాస ఇతి విశృతః:” (విరోధుల సమావేశంలో, అడియేన్ ను ప్రతివాది భయంకరం అని పిలుస్తారు, శ్రీవైష్ణవుల గోష్టిలో అడియేన్ ను దాసుడని పిలుస్తారు) అని అణ్ణా గురించి చెప్పినట్లుగానే, వారు జీయర్ తిరువడికి దాసుడై ఉన్నారు. జీయర్ వారికి మునుపెన్నడూ ఎవరికీ ఇవ్వని ‘శ్రీవైష్ణవ దాసన్’ అను తిరునామమును ప్రసాదించారు. జీయర్ అణ్ణాతో “తగిన ప్రమాణాలతో ఇతర తత్వాలను నిర్మూలించి, విశిష్ఠాధ్వైత తత్వాన్ని దృఢంగా స్థాపించి, పెంపొందించుము” అని ఆదేశం పలికారు.
జీయర్ మరలా తిరుమలకు వెళ్ళుట; దారిలో కంచి చేరుట
తదనంతరం, “ప్రతీతైరపి తద్భృత్యైః ప్రతివాది భయంకరః” (ప్రతివాది భయంకరం అణ్ణా, వారి శిష్యులతో పాటు) లో చెప్పినట్లుగా, తిరుమల తదితర దివ్య దేశాల భగవానుని పాదాలను సేవించాలని జీయర్ సంకల్పించి, ప్రతివాది భయంకరం అణ్ణా, ప్రఖ్యాతి గాంచిన వారి శిష్య గోష్ఠితో కలిసి ఉత్తర కావేరి వైపు బయలుదేరారు. ఈ క్రింద శ్లోకం ద్వారా వివరించబడింది.
అతవిలోనలోకతమేనుతం త్వదవలోకనతుంగ కుతూహలం
ద్విరతశైలశిరోగృహమమేదినం వరదం ఉత్తరవేది విభూషణం
(తరువాత, లౌకికుల అజ్ఞానాంధకారాన్ని తన చల్లని చూపుతో మటుమాయం చేయువాడు, దేవర్వారిపై సంతోషంగా తన కృపా వర్షాన్ని కురిపించే హస్తిగిరి కొండపై దయతో నివాసం ఉంటున్నవాడు, హస్తిగిరి దివ్య గడ్డపై అలంకృతుడై, కోరిన వారి కోరికలు తీర్చే పేరారుళాళన్ ను సేవించుకొనుటకు మొదట కాంచీపురం చేరుకున్నారు. ఆ ప్రాంతంలో నివసించే శ్రీవైష్ణవులు వీరికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. వారిపై తన కరుణను కురిపించి, వారితో పాటు ఆలయానికి వెళ్లారు. సేవించుకునే క్రమమును వివరిస్తూ వారు ఈ రెండు శ్లోకాలను వల్లించారు:
శ్రీమన్ ద్వారవరం మహత్తి బలిపీఠాగ్ర్యం పణీంద్రహ్రతం
గోపీనాం రమణం వరాహావపుషం శ్రీబట్టనాథం తథా
శ్రీమంతం శఠవైరిణం కలిరిపుం శ్రీభక్తిసారం మునిం
పూర్ణం లక్ష్మణ యోగినం మునివరానాధ్యానథ ద్వారపౌ
శ్రీమన్మంజన మంటపం సరసిజాం హేతీశ భోగీశ్వరౌ
రామన్ నీలమణిం మహానసవరం తార్ క్ష్యం నృసింహం ప్రభుం
సేనాన్యం కరిభూతరం తదుపరి శ్రీపుణ్యకోటిం తథ
తన్మధ్యే వరధం రమాసహచరం వందే తదీయైర్ వృతం
(నిత్యశ్రీ (నిత్య సంపద) తో ప్రకాశించే దివ్య గోపురం; బలిపీఠం ముందు ఉన్న అనంత సరస్సు; గోపికల ప్రియుడు వేణు గోపాలుడు; జ్ఞాన ప్పిరాన్ (వరాహ పెరుమాళ్); భట్టర్పిరాన్ (పెరియాళ్వార్); శ్రీమాన్ అయిన శఠకోపులు (నమ్మాళ్వార్); కలియుగ శత్రువైన తిరుమంగై ఆళ్వార్; తిరుమళిశైప్పిరాన్; పెరియ నంబి (రామానుజుల ఆచార్యులు); ఎంబెరుమానార్లు (రామానుజులు); ముదలాళ్వార్లు (మొదటి ముగ్గురు ఆళ్వార్లు – పొయిగై ఆళ్వార్, బూదత్తాళ్వార్, పేయాళ్వార్); ద్వారపాలకులు (జయ విజయులు); పెరుమాళ్ళకు తిరుమంజనం చేసే దివ్య మంటపం; కమలంపై ఆసీనురాలైన పెరుందేవి తాయార్; దివ్య ఆళియాళ్వాన్ (చక్రం), తిరువనంత ఆళ్వాన్ (అదిశేషుడు); చక్రవర్తి తిరుమగన్ (శ్రీరాముడు); కరియమాణిక్క వరదుడు; తిరుమడప్పళ్ళి (వంట శాల); గరుడ; అళగియ శింగర్ (నరసింహ స్వామి); విష్వక్సేనులు; దివ్య హస్తి గిరి; పుణ్యకోటి విమానం – ఈ క్రమంలో సేవిస్తూ, ఉభయ దేవేరీల మధ్య, శ్రీ మహాలక్ష్మికి పతి అయిన దేవప్పెరుమాళ్ళకు నమస్కరిస్తాను).
కమలనివేశితాంగ్రిం అమలం కమలాభరణం
గనమణి భూషణ ద్యుతికటారిత గాత్రరుచిం
అభయగతా సుదర్శన సరోరుహ చారుకరం
కరిగిరి శేఖరం కిమపి చేతసి మే నిధతే
(పద్మముల వంటి దివ్య పాదాలను పద్మాసనములో స్థిరముగా ఉంచినవాడు, శ్రీ మహాలక్ష్మికి పతి, మణిమయమైన దివ్యాభరణాల తేజస్సులో స్వర్ణ ఛాయతో వెలిగిపోతూ, శంఖ చక్రాలను ధరించి, అభయ ముద్రలో దర్శనమిస్తూ, హస్తిగిరికే మణి భూషణమైన పేరరుళాళన్ భగవానుని నేను ధ్యానిస్తున్నాను.
మూలము: https://granthams.koyil.org/2021/09/20/yathindhra-pravana-prabhavam-64/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org