యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 84

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 83

తిరుమలకు బయలుదేరిన కందాడై అణ్ణన్

జీయర్ దయతో కందాడై అణ్ణన్ ను ఆదరించి, “దేవర్వారు తిరువేంకటేశ్వరునికి మంగళాశాసనం చేయ లేదు కదా?” అని అడిగారు. అక్కడ దగ్గరలో ఉన్న అప్పిళ్ళై, “కావేరిని దాటి వెళ్ళని కందాడై అణ్ణన్, అని ప్రసిద్ధికెక్కిన వారు వీరే కదా?” (వీరు శ్రీరంగనాధుని పరమ భక్తుడు) అని అన్నారు. దానికి జీయర్ “నిత్యసూరులందరూ సమావేశమై అరంగత్తణైయాన్ (శ్రీరంగనాధుడు) కి తిరువారాధన చేయాలని ఆశించేది తిరుమలలోనే కాదా?” [ఇక్కడ ప్రస్తావన తిరుప్పణాళ్వార్ తమ అమలనాదిపిరాన్ ప్రబంధం 3వ పాశురంలో ప్రస్తావించబడింది, ఆ పాశురంలో వారు ‘మందిపాయ్ వడవేంగడమామలై వానవర్గళ్ సంధి శెయ్య నిన్ఱాన్ అరంగత్తు అరవిణ్ అణైయాన్’ – దివ్య తిరుమలలో వానరులు ఎగిరి గెంతులు వేస్తుంటే, శ్రీ రంగనాధుడు నిత్యస్యూరుల ఆరాధనకై నిలబడి ఉన్నాడు’, అని వర్ణించబడి ఉంది]. అప్పుడు అణ్ణన్ జీయర్ తో “దేవర్వారు అడియేన్ ను ఆదేశించాలి” అని అన్నారు. జీయర్ అతనిని పెరుమాళ్ సన్నిధికి తీసుకువెళ్లి, తిరుమల వెళ్లేందుకు అనుమతినిచ్చి, ఆలయ అర్చకులైన ఉత్తమ నంబిని కూడా కందాడై అణ్ణన్ కు తోడుగా వెళ్ళమన్నారు. వారితో పాటు అనేక శ్రీవైష్ణవులను, జీయర్లను, ఏకాంగులను వెళ్ళమన్నారు. కందాడై అణ్ణన్ సౌకర్యం కోసమై ఉత్తమ నంబి పల్లకిని, ఇతర సౌకర్యాలను సిద్ధం చేసారు. అణ్ణన్ వాటన్నింటిని తిరస్కరించి, శ్రీవైష్ణవ గోష్ఠిని సేవిస్తూ తిరుమలకు వెళ్ళారు. భాద్రపద మాస బ్రహ్మోత్సవాల (పురట్టాసి మాసం) సందర్భంగా కనీసం రెండు మూడు రోజులు తిరుమలలో బసచేయాలన్న కోరికతో, ఆతృతగా ప్రయాణం సాగించారు. గోష్ఠి తిరుపతి చేరుకుని అడిప్పుళి అళగియ శింగర్ (నరసింహ పెరుమాళ్) ను దర్శించుకున్నారు. తిరుమల అనంతాళ్వాన్ [రామానుజుల శిష్యులలో ఒకరైన ‘ఒన్ఱాన తిరుమలై అనంతాణ్ పిళ్ళై’ వంశం వారు, అక్కడ పుష్ప కైంకర్యం చేసేవారు] ఈ వార్త పెరియ కెల్వియప్పన్ జీయర్ విన్న వెంటనే, స్థానిక ప్రముఖులకు ఈ విషయం గురించి కబురు పంపారు. సంతోషకరమైన ఈ  వార్త విన్న వారందరూ,  బ్రహ్మొత్సవాలలో పెరుమాళ్ళను దర్శించుకొని, అందరూ పెరుమాళ్ళు దివ్య రథాన్ని అధిరోహించే వరకు ఉండి, వెంటనే గోష్ఠి మొత్తం అణ్ణన్ ను స్వాగతించేందుకు వెళ్ళారు. అణ్ణన్ ను గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి, తరువాత వారందరూ పెరుమాళ్ళ రథం వద్దకు వచ్చారు. కందాడై అణ్ణన్ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసిన తరువాత, రథం తిరుమాడ వీధుల్లో ప్రదక్షిణ గావించింది. ఇయల్ గోష్ఠి (నాలాయిర దివ్య ప్రబంధం పారాయణం చేసేవారు) జరిగే చోట, అయోధ్య రామానుజ అయ్యంగార్ అణ్ణన్ ను చూసి పారవశ్యంతో వారికి నమస్కారాలు సమర్పించుకున్నారు.

అదే సమయంలో, బద్రికాశ్రమంలో ఉన్న రామానుజ దాసర్ తిరుమలకు వచ్చారు. తిరుమలకు అణ్ణన్ వెంచేయడం చూసి ఆశ్చర్యపోయారు, వెంటనే అణ్ణన్ దివ్య పాదాలను సేవించుకున్నారు. అణ్ణన్ కూడా రామానుజ దాసర్ ను చూసి ఎంతో సంతోషించి, వారిని ఆలింగనం చేసుకొని ఆనందంగా “ఓ రామానుజ దాసర్! రండి. మీ దర్శన భాగ్యం మాకు కలిగింది! పర దేశానికి వెళ్లిన కొడుకులో తండ్రి మనస్సు ఉన్నట్లు, జీయర్ దివ్య హృదయం మీతో కలిసి ఉంది”, అని రామానుజ దాసర్ల ఆచార్య నిష్ఠాని అక్కడ సమావేశమైన ప్రముఖులందరికీ తెలిపారు. పెరుమాళ్ళు రథం నుండి దిగి ఆలయంలోకి ప్రవేశించారు. పెరుమాళ్ళను సేవించే క్రమంలో, అణ్ణన్ శ్రీవారి దివ్య పాదాల నుండి కిరీట పర్యంతం, మరలా శ్రీ దివ్య కిరీటం నుండి వారి పాదాల వరకు సేవించుకున్నారు. తన మనస్సులోని కోరిక పూర్తి అయినందుకు సంతృప్తితో, తీర్థ, శ్రీ శఠారీలు, శ్రీవారి పాద ధూళిని స్వీకరించి అనంతాళ్వాన్ తిరుమాలిగకు వెళ్ళారు. అక్కడ అనంతాళ్వాన్ అణ్ణన్ కు సకల గౌరవ సన్మానాలు నిర్వహించారు. కందాడై అణ్ణన్ కొన్ని రోజులు అక్కడే ఉన్నారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/11/yathindhra-pravana-prabhavam-84-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment