శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
అణ్ణన్, కాంచీపురం నుండి బయలుదేరి, జీయర్ దివ్య తిరువడి దర్శనం పొందాలనే గొప్ప ఆర్తితో కావేరి ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీరంగంలోని ప్రముఖులందరూ వారి రాక కబురు విని ఎంతో ఆనందించారు. ఆలయ అర్చకులు, ఆలయ ఉద్యోగులందరు కలిసికట్టుగా వెళ్లి అణ్ణన్ ను స్వాగతించి, వారిని తిరుమాలిగకు చేర్చారు. అణ్ణన్ తిరుమాలిగకు జీయర్ కూడా వచ్చి, అతనిపైన తమ కృపను కురిపించారు. జీయర్ తిరువేంకటేశ్వరుడి ప్రసాదాలు, పేరారుళాళన్ ప్రసాదాలను స్వీకరించి, ఆనందపడి, యాత్ర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అణ్ణన్ తో వెళ్లిన శ్రీవైష్ణవులు, జీయరుకి పేరారుళాళన్ అనుగ్రహించిన దివ్యనామం ‘అణ్ణన్ జీయర్’ గురించి తెలియజేసారు. ఇది విన్న జీయర్ ఎంతో సంతోషించి, “మా మనస్సు తెలుసుకుని, దేవర్వారితో ఉన్న సంబంధాన్ని ఆ పేరారుళాళన్ ఎంత గొప్పగా చాటారు!” అని పొగిడి మాట్లాడారు. మరి కొందరు “స్వతంత్రుడైన భగవానుడికి హద్దు, అడ్డంకి ఉంటుందా!” అని అన్నారు. ప్రతివాది భయంకరం అణ్ణా కూడా “శ్రియః పతి” అని చెప్పినట్లే ఈ దివ్య నామము కూడా ఒక గుర్తింపును అద్భుతంగా తెస్తుంది అని అన్నారు. అక్కడ ఉన్నవారందరూ అతన్ని మనస్ఫూర్తిగా కీర్తించారు.
తరువాత రామానుజ దాసర్, జీయర్ తిరువడి యందు సాష్టాంగ నమస్కారం చేయగా, జీయర్ తమ దివ్య పాదాలను రామానుజ దాసు శిరస్సుపై ఉంచి, అద్భుత రీతిలో అతని శిరస్సుని అలంకరించి అనుగ్రహించారు. ఉత్తర దివ్యదేశాల నుండి రామానుజ దాసర్ పొందిన ప్రసాదాలు, సమర్పణలను నలుగురు శ్రీవిష్ణువులు తెచ్చి జీయరుకి సమర్పించారు. జీయర్ వాటంన్నింటినీ స్వీకరించి గోష్ఠి వారందరిలో వితరణ చేయించారు. జీయర్ ఎంతో సంతృప్తి చెంది, ఉత్తర దివ్యదేశాలన్నింటినీ సేవించినట్లు భావించి, రామానుజ దాసర్ను ఆలింగనం చేసుకున్నారు.
తరువాత రామానుజ దాసర్, ఎఱుంబికి తిరిగి రమ్మని కోరుతూ ఎఱుంబి అప్పా తండ్రిగారు పంపిన సందేశాన్ని ఎఱుంబి అప్పా కు తెలియచెశారు. జీయర్ నుండి వీడవలసి వచ్చినందుకు అప్పా ఎంతో బాధ పడ్డారు. అతనిని ఓదార్చడానికి, జీయర్ తమను పోలిన ఒక విగ్రహాన్ని, పాదుకలను వారికి ఇచ్చారు. ఈ సంఘటనను వర్ణిస్తూ ఈ శ్లోకం రచించబడింది.
ప్రీతః ప్రేషితవాన్ మునిర్వరవరో యస్మై ముహుః శ్రీముఖం
ప్రాదాత్ స్వాంగ్రి సరోజసంగసుపకం స్వీయాముపానద్యుకీం
స్వీయం సుందరం ఉత్తరీయం అమలం స్వాం మూర్తిం అర్చామయీం
తం దేవేశగురుం భజేమ శరణం సంసార సంతారకం
(మాణవాళ మాముణులు తమ సందేశాలను ఎవరికైతే పంపేవారో, ఎవరికైతే తమ దివ్య పాదుకలను, దివ్య విగ్రహాన్ని ప్రసాదించారో, ఆ దేవరాజ గురువుకి (ఎఱుంబి అప్పా అని కూడా పిలువబడే) శరణాగతి చేద్దాం. తరువాత, ఎఱుంబి అప్పావారి దివ్య మనుమడు పిళ్ళైయప్పా కూడా ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
జీయర్ అనుమతి తీసుకుని అప్పా కోయిల్ (శ్రీరంగం) నుండి బయలుదేరి, ఎఱుంబికి వచ్చి, తమ తండ్రిగారి దివ్య పాదాలను సేవించుకొని వారికి కైంకర్యాలు నిర్వహించారు. వీరు జీయర్ ఆదిశేష స్వరూపాన్ని, లక్ష్మణ రుపాన్ని వర్ణిస్తూ అనేక ప్రబంధాలను రచించారు. అవి వరవరముని ప్రబంధం, వరవరముని పంచాశత్, వరవరముని స్తవం, వరవరముని మంగళాశాసనం, వరవరముని గద్యం మొదలైనవి.
అరంగనగరప్పన్ తిరువారాధనముగా పొందిన శ్రీవానమామలై జీయర్
అదే సమయంలో, వానమామలై ఆలయ నిర్వహణ కార్య భారాలను నిర్వహించేందుకు వానమామలై జీయర్ను వానమామలైకి పంపమని సేన ముదలియార్ (విష్వక్సేనుడు) సందేశం పంపారు. జీయర్ దానికి సంతోషంగా అంగీకరించారు. వానమామలై జీయరుని పెరియ పెరుమాళ్ళ సన్నిధికి తీసుకెళ్లి, వానమామలై నుండి వచ్చిన సందేశాన్ని ప్రకటించారు. నిత్యం పెరియ పెరుమాళ్ళ సన్నిధిలో నాలాయిర దివ్య ప్రబంధంలో నుండి వంద పాశురాలను పఠించి పెరుమాళ్ళకు వినిపించడం జీయర్ నియమము. ఆ రోజు, వారు పెరియ తిరుమొళి 11-8-8 “అణియార్ పొళిల్ శూళ్ అరంగ నగర్ అప్పా” (సుగంద భరితమైన నందనవనాలతో చుట్టుముట్టి ఉన్న శ్రీరంగంలో నివాసముంటున్న ఓ నా స్వామీ!) అని పఠించారు. పెరియ పెరుమాళ్ళు అంగీకరించి, ‘భూపాలరాయన్’ ( నంపెరుమాళ్ సింహాసనము) పైన నంపెరుమాళ్ తో కలిసి ఆసీనులైన “అరంగనగరప్పన్” విగ్రహాన్ని వానమామలై జీయర్ తిరు హస్థాలకు అందించారు. దివ్య తేజముతో నిండిన జీయర్ తిరుముఖాన్ని చూసి ‘పెరియార్ క్కాట్పట్టక్కాల్ పెఱాద పయన్ పెఱుమాఱు” అని పఠించి, తీర్థం, తిరుపరివట్టం (శిరస్సుపై ధరించే దివ్య వస్త్రం), మాల, అభయ హస్తం మొదలైన వాటితో సత్కరించి, [వానమామలై జీయరుని శ్రీరంగం నుండి బయలుదేరడానికి] అనుమతిని ఇచ్చారు. జీయర్ ఎంతో భక్తితో మేళ తాళాల నడుమ అరంగనగరప్పన్ ను స్వీకరించి, వారికి దివ్య నివేదనలు అర్పించి, వానమామలై జీయరుని ఆశీర్వదించి వానమామలైకి పంపారు.
మూలము: https://granthams.koyil.org/2021/10/13/yathindhra-pravana-prabhavam-87-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org