శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
కోయిల్ కు తిరిగివచ్చిన జీయర్
తిరుమాలిరుంజోలై నుండి బయలుదేరి, ప్రతి నిత్యం తిరుమాలిరుంజోలై భగవానుడు శయనించే దేశమైన శ్రీరంగానికి [అన్ని దివ్యదేశాల పెరుమాళ్ళు రాత్రికి శయనించడానికి శ్రీరంగానికి వస్తారు] చేరుకున్నారు. తిరువాయ్మొళి 10-9-8 వ పాశురము “కొడియణి నేడుమదిళ్ గోపురం కుఱుగినర్” (ఎత్తైన ప్రహరీ గోడలు, రంగురంగుల ధ్వజాలతో అలంకరించబడిన ప్రదేశంలోకి ప్రవేశించాను) అని నమ్మాళ్వార్ చెప్పినట్లు, శ్రీరంగంలోకి ప్రవేశించగానే, అక్కడి స్థానికులు ఎదురు వచ్చి, వారి పాదాలపై పడి, భక్తితో ఈ శ్లోకాన్ని పఠించారు
వకుళతరసవిత్రీం యాతియస్మిన్ ధరిద్రీం మధుమథన నివాసో రంగమాసీతసారం
పునరపి సుసమ్రుద్దం భూయసా సంప్రవిష్టే వరవరమునివర్యో మానుషః స్యాద్కిమేషః
(మొగళి పుష్పమాలలను తమ వక్షస్థలంలో ధరించే నమ్మాళ్వర్ల స్వస్థలమైన ఆళ్వార్తిరునగరికి మణవాళ మాముణులు వెళ్ళిన సమయంలో, క్షీరసాగరాన్ని మథనం చేసిన పెరుమాళ్ళు కొలువై ఉన్న శ్రీరంగం, తన శోభను కోల్పోయింది. మణవాళ మాముణులు తిరిగి శ్రీరంగంలోకి ప్రవేశించిన వెంటనే శ్రీరంగం తన శోభను సంతరించుకుంది. ఈ మణవాళ మాముణులను సాధారణ మనిషిగా భావించాలా?). వచ్చిన వారందరిపై జీయర్ తమ అనుగ్రహం కురిపించి, వారందరితో కలిసి మొదట ఎంబెరుమానార్ల సన్నిధికి వెళ్ళి, వారి తిరువడిని సేవించి, వారి పురుషకారంతో శ్రీరంగ నాచ్చియార్, పెరియ పెరుమాళ్ళను దర్శించుకున్నారు. విశేష ప్రసాదాలను స్వీకరించి తమ మఠానికి చేరుకున్నారు. ‘రంగే ధామ్ని సుఖాసీనం’ (శ్రీరంగంలో ఆసీనులై) అని చెప్పినట్లు, జీయర్ తిరుమలైయాళ్వార్లో ఆసీనులైనారు. తమ యథావిధి వ్యాఖ్యానాలు (వివిధ ప్రబంధాలు, శ్రీసూక్తుల వ్యాఖ్యానాలు) నిర్వహించి అందరినీ ఆనందపరిచారు. సందర్భానికి అనుగుణంగా వారి శిష్యులు ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు.
జయతౌ యశసా తుంగం రంగం జగత్రయ మంగళం
జయతు సుచిరం తస్మిన్ భూమా రమామణి భూషణం
వరదగురుణార్థం తస్మై శుభాన్యపి వర్ధయన్
వరవరమునిః శ్రీమాన్ రామానుజో జయతు క్షితౌ
(ముల్లోకాలకు మంగళ కరమైన కేంద్ర బిందువుగా మహోన్నత కీర్తిని సంతరించుకున్న శ్రీరంగం దివ్యంగా ప్రకాశించాలి. పెరియ పిరాట్టియార్ (శ్రీమహాలక్ష్మి), శ్రీ కౌస్తుభం [సమస్థ చిత్ తత్వాలను సూచించే రత్నం] ఆభరణాలుగా కలిగి ఉన్న భగవాన్ చిరకాలం వర్ధిల్లాలి. వరదగురు అణ్ణన్ తో పాటు, ఆ పెరుమాళ్ళకు మరింత మంగళం కలిగించే, రామానుజుల పునరవతారమైన మణవాళ మాముణులు ఈ భూమిపై దివ్యంగా ప్రకాశించాలి).
అళగర్ కోయిల్ కు నిర్వాహకులుగా ఒక జీయరుని పంపిన మణవాళ మాముణులు
తిరుక్కురుంగుడిలో జీయర్ చేసిన మంగళాశాసనం ఫలించి, అళగర్ తిరుక్కురుంగుడి నుండి తమ స్వస్థళానికి తిరిగి చేరుకున్నారు. అళగర్ తరపు నుండి ఒక దివ్య సందేశం వచ్చింది. ‘నంగళ్ కున్ఱం కైవిడాన్’ (ఈ కొండను వదిలి వెళ్ళనివ్వము) అన్న దేవర్వారి సంకల్పానికి అనుగుణంగా మేము మా క్షేత్రానికి తిరిగి వచ్చాము. మా ఈ గృహంలో సక్రమంగా కార్యములు నిర్వహించుకోడానికి ఎవరినైనా పంపండి” అని సందేశం పంపారు. జీయర్ దీనిని చదివి ఎంతో సంతోషించి, మహా విరక్తర్ (అన్నింటినీ సంపూర్ణంగా త్యాగం చేసినవాడు), మంగళాసన పరర్ (నిష్ఠగా పెరుమాళ్లకు మంగళాశాసనం చేసేవారు) అయిన యతిరాజ జీయర్ అనే దివ్య నామంతో ఉన్న ఒక జీయరుని అళగర్ శ్రీకార్యం (అళగర్ ఆలయంలో కార్య నిర్వాహం చేసే వ్యక్తి) గా పంపారు. యతిరాజ జీయర్ అక్కడికి వెళ్లి, అళగర్ ను సేవించుకొని, తన ఆచార్య నిష్ఠకు ప్రతీకగా అన్ని కైంకర్యాలను శ్రద్ధతో నిర్వహించారు.
మూలము: https://granthams.koyil.org/2021/10/17/yathindhra-pravana-prabhavam-91-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org