యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 92

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 91

శిష్యుల ద్వారా దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహించారు

జీయర్ శ్రీ పాదాల ఆశ్రయం పొందిన మహాబలి వాణనాథన్, తిరుమలై తందాన్ తోళప్పర్ (తిరుమలై తోళప్పర్) ని తమ ప్రధాన అధికారులుగా నియమించి, వారి ద్వారా తిరుమాలిరుంజ్యోలై దివ్యదేశంలో అనేక కైంకర్యములను నిర్వహింప జేశారు. వారి కృషి వల్ల అళగర్కోయిల్లో కైంకర్యం సంపద అంచలంచలుగా పెరిగింది. కోయిల్ (శ్రీరంగం), తిరుమల మొదలైన దివ్యదేశాలలో ఏ లోటు లేకుండా కైంకర్యాలు జరుగుతూ అందరూ అనందించే సమయంలో తుళవ వంశంలో జన్మించిన ఒక వ్యక్తి ఆ ప్రాంతాలలో సంచరిస్తూ జీయర్ వద్దకు వచ్చి వారి ఆశ్రయం పొందారు. జీయర్ అతనిపై తమ కృపను కురిపించి, అతనికి “శ్రీరామానుజ దాసర్” అను దాస్య నామాన్ని అనుగ్రహించారు. జీయర్ కృప కారణంగా, శ్రీరంగంతో మొదలు పెట్టి అనేక దివ్యదేశాలలో కైంకర్యం చేసే భాగ్యం వారికి కలిగింది. తరువాత, ఈ క్రింది శ్లోకంలో చెప్పబడినట్లు

దివ్యోత్సవప్రసంగేషు దేవదేవమతంత్రితః
ఆశాసానస్సమాసీతన్నత్రాక్షీత్ రంగభూషణం

(ప్రత్యేక ఉత్సవాల సమయాల్లో, అత్యోన్నత స్వరూపుడైన శ్రీరంగనాధుని సేవించి, వారి నిజమైన భక్తుడిగా మంగళాశాసనం చేశారు), ఉత్సవాల సమయాలలో జీయర్ నంపెరుమాళ్ళకు మంగళాశాసనాన్ని నిర్వహించి, చెయ్దవక్కారం నఱు నెయ్ పాలాల్ (ఎర్రటి బియ్యం, పప్పు, పంచదార, నెయ్యి పాలతో తయారు చేసిన తీపి వంటకం) మొదలైన అనేక రకాల ప్రసాద నివేదనలను అర్పించారు. అంతకు మించి, ప్రతి ఏడాది ‘ఒన్ఱుం దేవుం, కణ్ణినుణ్ శిఱుఱ్ఱాంబు, ఇరామానుజ నూఱ్ఱందాది మొదలైన విశేష పాశురాలను పఠించేవారు, ప్రతి నిత్యం వ్యాఖ్యానాలతో పాటు ఆళ్వార్ అరుళిచ్చెయల్ పఠించేవారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లుగా…

కస్తూరి హిమకఱ్పురా స్రక్ తాంబూలా’నులేపనైః
దివ్యైరప్యభజత్ భోజ్యైః రంగనాథం దినే దినే

(ప్రతిరోజూ శ్రీ రంగనాధునికి కస్తూరి, కర్పూరం, మాలలు, తమల పాకులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి నివేదించే కైంకర్యం వీరు చేసే వారు. మార్గళి (ధనుర్మాసం) మాసంలో…

కాలేకోతండ మార్తాండే కాంక్షంతే వారునోదయం
న్యషేవతవిశేషేణ శేషిణం శేషశాయినం
మంగళానిప్రయుజ్ఞానో మాధవం ప్రత్యభోదయత్
సంయకేనం సమప్యర్చ్య సర్వధానుకతైః క్రమైః
స్వస్వకాలోచితైర్దిన్యై స్వసంకల్పోపలంబితైః
అభోజయతయం భోజ్యైః శాకమూలపలాధిపిః
సూభాభూప కృతక్షీర చర్కరా సహితం హవిః 

(ప్రాతఃకాలంలో, శేష శయ్యపై ​​శయనించి ఉన్న పెరుమాళ్ళకు విశేష ఆరాధనలు చేసేవారు. దివ్య పాశురాలను సేవిస్తూ మేల్కొనే సమయం ఆసన్నమైనదని శ్రీ మహాలక్ష్మి పతిని మేల్కొలుపేవారు. శాస్త్ర విధిని నిష్ఠగా అనుసరించి పెరుమాళ్ళకు తిరువారాధన చేసేవారు. వారు స్థాపించిన పద్ధతి ప్రకారం, వివిధ రితులలో లభించే ప్రత్యేక కూరగాయలు, దుంపలు, పండ్లు మొదలైన కాలానుగుణంగా లభించే పదార్థాలతో పాటు వడలు, పప్పు, నెయ్యి, పాలు, పంచదార, అన్నం మొదలైనవి నివేదించేవారు).

పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానము రచించారు

పెరియాళ్వార్ తిరుమొళికి పెరియవాచ్చన్ పిళ్ళై రచించిన వ్యాఖ్యానం దురదృష్టవశాత్తు ఆఖరి నలభై పాశురాలు మినహా అన్నీ నశించిపోయాయి [తాళపత్రాలకు చెదలు పట్టడం వల్ల]. నష్ట పోయిన భాగానికి వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించి పాశురంలో పేర్కొన్న విధంగా ఆళ్వార్ తిరునగరిలో కైంకర్యం నిర్వహిస్తున్న తిరుప్పాణాళ్వార్ దాసర్‌ కు సందేశం పంపారు.

శెందమిళిల్ ఆళ్వార్గళ్ శెయ్ద అరుళిచ్చెయలై
శిందై సెయల్ తన్నుడనే శెప్పలుమాం – అందో
తిరుప్పాణాళ్వార్ తాదర్ నాయనార్ శేర
విరుప్పారాగిల్ నమక్కీడావార్ యార్ 

(అందమైన తమిళ భాషలో దయతో ఆళ్వార్లు రచించిన ఆరుళిచ్చెయల్ కు, మనసా వాచా కర్మనా నేను వ్యాఖ్యానం వ్రాయాలని ఆశిస్తున్నాను. అయితే, ఈ కార్య సిద్ధి కోసం తిరుప్పాణాళ్వార్ దాసర్ సహకారం కోరుతున్నాను) తిరునగరిలో తిరుప్పాణాళ్వార్‌ కు ఈ సందేశం లభించిన వెంటనే ఎంతో సంతోషించి, ఆ సందేశాన్ని తమ శిరస్సుపై పెట్టుకుని, తమ తిరునందనవన కైంకర్యాన్ని (పెరుమాళ్ల పూల తోటను చూసుకునే) విడిచిపెట్టి, వెంటనే తిరునగరి నుండి బయలుదేరి, వేగాతివేగంగా శ్రీరంగం చేరుకుని జీయర్ దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తిరుప్పాణాళ్వార్‌ యత్నాలను, తనను చూడలేకపోయానన్న తపనను గ్రహించి, జీయర్ తమ చల్లని దృష్ఠితో అతనిని ఆదరించి, “మీరు ఎంతో జ్ఞానవంతులయ్యారు” అని చెప్పి, మర్నాడే, పెరియాళ్వార్ తిరుమొళి వ్యాఖ్యానం రచించడం ప్రారంభించారు, చివరి నలభై పాశురాల వరకు [మిగిలిన భాగానికి పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్ ఉంది) రాగనే ఆపివేసి, ఈ రెండు భాగాలను జోడించారు.

జీయర్ రచించిన వ్యాఖ్యానాన్ని కీర్తించిన కందాడై నాయన్

అప్పుడు చిన్నవాడైన కందాడై నాయన్ అక్కడికి వచ్చి,  జీయర్ వ్యాఖ్యానం మరియు అభయప్రదరాజర్ వారి (పెరియ వచ్చన్ పిళ్ళై) వ్యాఖ్యానం విశ్లేషించాడు. అతను పెరియ వాచ్చన్ పిళ్ళైల నలభై పాశురాల వ్యాఖ్యానాన్ని క్రింద ఉంచి, జీయర్ వ్యాఖ్యానాన్ని తన చేతిలోకి తీసుకుని, “మిగతా నలభై పాసురములు లేకుండా, ఇది సంపూర్ణం కాదు” అని అన్నాడు. ఇది విన్న జీయర్, “ఇంత చిన్న వయస్సులో, ఎంతటి జ్ఞాన పరిపూర్ణతను సొంతం చేసుకున్నాడితడు!” అని భావించి, కందడై నాయన్ ను తమ కృపా దృష్ఠితో చూసి, నాయన్‌ ను ఆశీర్వదించి, “ఒకరిని తిరస్కరించి మరొకరిని ఆదరించుట సమంజసమేనా? అటువంటి భేదం అసలు ఉందా?” అని నాయన్ ను ప్రశ్నించారు. నాయన్ బదులిస్తూ, “చిలక కొరికిన పండు ఎంత తియ్యగా ఉంటుందో, మాముణులు అందించినప్పుడు పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం తీయగా మారుతుంది. జ్ఞానాన్ని కొలవడం అంటే, ముఖ్య అంశాలను స్వీకరించి, అముఖ్యమైనవి విస్మరించుట. అంతేకాక, ఈ వ్యాఖ్యానములో అద్భుతమైన సారం ఇమిడి ఉంది” అని అన్నారు. అది విన్న జీయర్ సంతోషించి నాయన్ ను ఆలింగనం చేసుకున్నారు. ఆ విధంగా, జీయర్ ప్రతి ఒక్కరు సంతోషపడే విధంగా పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానం రచించారు. అంతే కాకుండా తమ వద్ద ఉన్నపెరియవాచ్చాన్ పిళ్ళైల దివ్య స్పర్ష కలిగిన శ్రీ రంగరాజుల విగ్రహాన్ని తిరుప్పాణాళ్వార్ దాసర్‌ను తన తిరువారాధన పెరుమాళ్ళుగా ఇచ్చి వారికి ఆళ్వార్ తిరునగరికి వెళ్ళమని అనుమతిని ఇచ్చారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/18/yathindhra-pravana-prabhavam-92-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment