యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 98

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 97

 తమ చరమ దశలో నాలాయీర శ్రవణం చేసిన పెరియ జీయర్ 

అనంతరం తమ శిష్యులను ఒక్కొక్కరిగా పిలిచి విలువైన సూచనలు వారికి ఇచ్చారు. కళంగాప్ పెరునగరం (ఎలాంటి దిగ్భ్రాంతిని కలిగించని గొప్ప ప్రదేశం) గా పేర్కొనబడే శ్రీ వైకుంఠాన్ని (ఎప్పుడూ కళ్ళు మూసుకోకుండా ఎమ్పెరుమాన్‌కు దోషరహిత సేవను నిర్వహించే ప్రదేశం) అధిరోహించే నాలుగు రోజుల ముందు, జీయర్ నాయనార్ను, ఇతర శిష్యులను పిలిపించి నాలాయీరం (దివ్య ప్రబంధం) పఠించమన్నారు. వాళ్ళు పాశురములు పఠించడం ప్రారంభించారు. ఈ పాసురములు విన్న జీయర్, పరమానందంతో, తిరునెడుందాండగం 14 వ “వలర్తదనాల్ పయన్ పెఱ్ఱేన్” పాశురం సేవించారు. వారు తమ శిరస్సుని వంచి, కళ్ళు మూసుకుని, దివ్య పాశురాల అర్థాలను ధ్యానిస్తున్నారు. కందాడై అణ్ణన్ వారి దగ్గరకు వెళ్లి “దేవర్వారు తమ దివ్య మనస్సులో ఏమి ఆలోచిస్తున్నారు?” అని అడిగారు. “ఈడు (తిరువాయ్మొళి వ్యాఖ్యానం) అర్థాలు నా మనసులో ప్రసరిస్తున్నాయి” అని జీయర్ బదులిచ్చారు. ఈ ఘటనలు ఇలా జరుగుతుండగా, తిరువాయ్మొళి 10.6.1 – ‘మరుళొళి మడనెంజే’ (ఓహృదయా! నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టు) అనే పాశురం పఠించే సమయంలో వారి చివరి దశకు చేరుకున్నారు. అది ద్వాదశి దినము. వారు ఉత్తమ నంబిని, ఇతర ఆలయ కైంకర్యపరారులందరినీ వెంటనే రమ్మని సందేశం పంపించి, “మీరు నా అపరాధాలన్నింటినీ క్షమించాలి” అని వారిని వేడుకున్నారు. దానికి వారు “అసలు దేవర్వారు ఎప్పుడైనా ఎవరిపట్లనైనా అపరాధం తలపెట్టి ఉన్నారా?” అని అన్నారు. వారితో “పెరియ పెరుమాళ్ళకు ఎటువంటి లోటు లేకుండా అన్ని శ్రీకార్యాలు నిర్విఘ్నంగా సాగేలా చూడండి; శ్రీవైష్ణవులకు సహకరించండి” అని అన్నారు; ‘యస్యైతే తయతత్ధానం’ (వస్తువులను యథా స్థితిలో బహుమతిగా ఇస్తూ) అని చెప్పినట్లు, వారు తమ తిరువారాధన పెరుమాళ్ళను, ఆచార్యుల విగ్రహాలను, దివ్య గ్రంథాలను, అనేక ఇతర ఉపకరణాలను, తమ మఠాన్ని నంపెరుమాళ్ళకు సమర్పించారు. అనంతరం, తను తెలిసి తెలియక చేసిన అపరాధాలకు క్షమాపణ వేడుకుంటూ తీర్థ ప్రసాదాలతో తదీయారాధనం నిర్వహించారు. వృద్ధ వృక్షాన్ని పక్షులు సంరక్షించేటట్టుగా, జీయర్ శిష్యులు వారి చేతులు జోడించి అంజలి ఘటించి వారిని ఆరాధించారు.

సూర్యుడు అస్తమించాడు; ఆ సమయంలో చేయవలసిన అనుష్టానాలను వారు పూర్తి చేసుకున్నారు. “పిళ్ళై తిరువడిగలే శరణం (నేను తిరువాయ్మొళి పిళ్ళైల దివ్య తిరువడిని శరణు వేడుతున్నాను), వాళి ఉలగాశిరియన్ (పిళ్ళై లోకాచార్యులు చిరకాలం వర్ధిల్లాలి) అని తమ ఆచార్య తిరువాయ్మొళి ప్పిళ్ళైని ధ్యానించుకున్నారు. జీయర్ దివ్య తిరువడి సంబంధం ఉన్న శిష్యులందరూ జోడించిన చేతులతో బ్రహ్మవల్లి, భృగువల్లి (తైత్రీయ ఉపనిషత్తు అధ్యాయాలు) పఠించారు; శూళ్విశుంబు అణి ముగిల్ (తిరువాయ్మొళి 10.9.1), ఆర్చిరాది (పిళ్లై లోకాచార్యూ అనుగ్రహించిన రహస్య గ్రంథం), ఇరామానుస నూఱ్ఱందాది సేవించారు. నూఱ్ఱందాది 108 వ ‘అంగయల్ పాయ్వయల్ తెన్నరంగన్’ పాశురం వరకు వచ్చి పఠిస్తున్న సమయంలో, జీయర్ కృపతో విని తమ రెండు చేతులను జోడించి, “ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం” అని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి జారుకున్నారు.

తిరునాడు (శ్రీవైకుంటం) ను అధీష్టించిన జీయర్ 

జీయర్ కోరినట్లుగానే, ‘కనకగిరి మేల్ కరియ ముగిల్ పోల్ వినతై శిఱువన్ మేఱ్కొండు’ (స్వర్ణ పర్వతంపైన నల్లని మేఘమును వలే, ఎంబెరుమాన్ వినత పుత్రుడైన గరుడునిపైన ఆసీనుడై ఉన్నాడు), ‘ఎందై తిరువరంగర్ ఏరార్ గరుడన్ మేల్ వందు ముగం కాట్టి వళి నడత్త’ (నా స్వామి ఆ శ్రీ రంగనాధుడు, అందమైన గరుడుని పైన ఆసీనుడై మార్గనిర్దేశం చేస్తూ తమ దివ్య శ్రీముఖాన్ని చూపిస్తున్నారు), గరుడారూడుడైన పెరియ పెరుమాళ్ళు స్వర్ణ పర్వతంపైన విశాల పర్వతం వలె నున్న తమ దివ్య స్వరూపాన్ని దర్శింపజేస్తూ, తమ దివ్య పాదాలను మాముణుల శిరస్సుపై ఉంచారు; “ఉన్ శరణం తందు ఎన్ సన్మం కళైయాయే” (మీ దివ్య పాద స్పర్శతో నా ఈ జన్మ మరణ చక్రం తొలగించుము) అని చెప్పినట్లుగా, పెరుమాళ్ళు కృపతో మాముణులకు అనుభవింపజేశాడు; “సుఖేనేమాం ప్రకృతిం స్థూల సూక్ష్మ రూపం విసృజ్య” (మూల తత్వాలతో కూడిన నా ఈ స్థూల సూక్ష్మ రూపాలను తొలగించి, నన్ను సంతోషపెట్టుము), “నోయ్గళాల్ నలంగామల్ శదిరాగ ఉన్ తిరుత్తాళ్ తా” (వ్యాధి బారి నుండి తొలగించి, నీ దివ్య చరణాలను నాకు అనుగ్రహించుము). “మాధవన్ తన్ తుణైయాగ నడందాళ్” (పెరుమాళ్ళతో కూడా నడిచే ఆమె) అని చెప్పినట్లు, తమ దివ్య స్వరూపాన్ని విడిచిపెట్టి, అంగీకారం పొందారు, “అరంగత్తు ఉఱైయుం ఇంతుణైవనోడుం పోయ్” (శ్రీరంగ పెరుమాళ్ళతో పాటు వెళుతూ) అని చెప్పినట్లు, ‘హార్ధన్’ దారి చూపుతుండగా, గరుడారూడుడై పెరియ పెరుమాళ్ళు, వారు తమ సుషుమ్నా నాడి (ఆత్మను శ్రీవైకుంఠానికి తీసుకెళ్లే 101 వ నాడి) లోకి ప్రవేశించారు, శిర కపాలాన్ని భేదించుకొని, తల పైభాగంలో ఉన్న బ్రహ్మ రంధ్రం ద్వారా తిరునాడు (శ్రీవైకుంఠం) ని అధిరోహించారు.

అనంతరం, పెరియ పెరుమాళ్ళు, “విసృజ్య లక్ష్మణం రామో దుఃఖశోక సమన్వితః” (లక్ష్మణుని వీడిన శ్రీరాముడిలా, దుఃఖ సాగరంలో మునిగిపోయారు), “సౌమిత్రేర్మే సకల భగవాన్ సౌమ్య జామాత్రు యోగి” (మణవాళ మాముణులు నిజానికి ఇళైయ పెరుమాళ్ (లక్ష్మణుడు), జీయరుని పరమపదానికి అనుమతించి, ఏమీ తినకుండా, దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నారు. జీయర్ తిరువడి సంబంధం ఉన్న శిష్యులందరూ, జీయర్ తిరునాడుకి చేరుకోవడం సరియేనా అని పెరుమాళ్ళను ప్రార్థించారు. శిష్యులు తమలో తాము ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఈ దుఃఖాన్ని అణచుకోలేక విలవిలలాడారు. వారి అంతిమ క్షణాల గురించి అందరికీ తెలియాలని వాళ్ళు ఈ క్రింది పాశురాన్ని పఠించారు.

కుంభం పాస్వతి యాతి తత్సుతధినే పక్షే వళర్ క్షేతరే
ద్వాదశ్యాం శ్రవణర్ క్షభాజి రుధిరోత్కార్యాఖ్య సంవత్సరే
ధీభక్త్యాధి గుణార్ణవో యతివరాధీన అఖిలాత్మస్థితి
శ్రీవైకుంఠమకుంట వైభవమగాద్ కంతోపయంతా మునిః

(జ్ఞాన, భక్తి, వైరాగ్య గుణాల మహా సాగరుడైన మణవాళ మాముణులు, ఎంబెరుమానార్ల స్థాయి కలిగినవారు. ద్వాదశి రోజున, కృష్ణపక్షం, రుధిరోత్కారి సంవత్సరం, సూర్యుడు కుంభ రాశి (కుంభ మాసం) ప్రవేశించినప్పుడు, శనివారం నాడు శ్రీవైకుంఠానికి చేరుకున్నారు.

ఆపైన, వారి శిష్యులు వారి అవతార సమయం మరియు శ్రీవైకుంఠానికి అధిరోహించిన సమయం గురించి వివరిస్తూ ఈ పాశురాన్ని పఠించారు.

ఆశిలాధ మణవాళ మామునియణ్ణల్ భూమియుఱు ఐప్పశియిల్ తిరుమూలం
తేసనాళదు వందు అరుళ్ శెయ్ద నం తిరువాయ్మొళి ప్పిళ్ళై తాన్
ఈశనాగి ఎళుబత్తు మూవాండు ఎవ్వుయిర్గళైయుం ఉయ్విత్తు వాళ్ందనన్
మాసి మాల్పక్కత్తు దువాదశి మామణి మండపత్తు ఎయ్దినం వాళియే

(ఏ దోషం లేని మణవాళ మాముణులు, మూలా నక్షత్రం, ఐప్పశి (తులా మాసం) మాసంలో ఈ భూమిపై అవతరించారు; తిరువాయ్మొళి పిళ్ళై వీరి ఆచార్యులు; ఈ లోకంలో అందరినీ ఉద్ధరింపజేయుటకు డెబ్భై మూడు సంవత్సరాలు ఈ భూమిపైన జీవించారు; మాఘ (మాసి) మాసం, శ్రవణ నక్షత్రం, కృష్ణ పక్షం, ద్వాదశి రోజున వీరు ‘మామణి మండపం’ (శ్రీవైకుంఠంలో మణులతో కట్టబడిన ఒక మండపం) చేరుకున్నారు. వీరు చిరకాలం వర్ధిల్లాలి.

మూలము: https://granthams.koyil.org/2021/10/24/yathindhra-pravana-prabhavam-98-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment