యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 105

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 104

యతీంద్ర ప్రవణ ప్రభావం – అనుబంధం

శ్రీశైలేశ మంత్ర మహిమ

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం
యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం

మణవాళ మాముణుల శిష్య రూపంలో శ్రీ రంగనాధుడు వారిని కీర్తిస్తూ ఈ తనియన్ను పఠించారని అందరికీ తెలుసు. మనకు ఇది మహామంత్రము, మంత్ర రత్నంతో (ద్వయ మహామంత్రం) సమానమైనది. ఈ మంత్ర మహిమను గొప్పతనాన్ని మనం ఇక్కడ అనుభవించబోతున్నాము.

పిళ్ళై లోకం జీయర్ వ్రాసిన వ్యాఖ్యానం ఆధారంగా

పెరియ జీయర్ [మణవాళ మాముణులు] తిరువాయ్మొళి పిళ్ళైల తిరువడి సంబంధం పొందారు, “వాళి తిరువాయ్మొళి పిళ్ళై మాదగవాల్ వాళుం మణవాళ మామునివన్” (తిరువాయ్మొళి పిళ్ళైల అనుగ్రహముతో జీవించే మణవాళ మాముణులు చిరకాలం వర్ధిల్లాలి) అని కొనియాడబడ్డారు. వీరు తిరువాయ్మొళి పిళ్ళై వద్ద తిరువాయ్మొళి మొదలైన దివ్యప్రబంధాల అర్థాలను నేర్చుకోవడమే కాకుండా అందరినీ ఈ అర్థాలను నేర్చుకొని ఉద్దరణ పొందమని ప్రోత్సహించేవారు. ఆ దిశలో వీరు కైంకర్యం చేస్తుండేవారు. అర్చక ముఖేన నంపెరుమాళ్ళు మణవాళ మాముణులను పిలిచి, తాను తనతో పాటు భక్తులందరూ లాభం పొందేలా పెరియ తిరుమండపం (శ్రీరంగం ఆలయం లోని దివ్య మండపం) లో తిరువాయ్మొళి అర్థాల ఉపన్యాసం చేయమని ఆదేశించారు. పెరుమాళ్ళ ఆజ్ఞాను శిరసా వహిస్తూ మాముణులు అమలు పరచారు. ‘ఉయర్వర ఉయర్ నళం’ నుండి ప్రారంభించి ‘అవావఱ చూళ్’ తో ముగించారు. మాముణుల ఉపన్యాస విధానానికి సంతోషించి, పెరుమాళ్ మాముణులకు ‘ముప్పత్తారాయిర ప్పెరుక్కర్’ (తిరువాయ్మొళి ఈడు వ్యాఖ్యానం (ముప్పత్తారాయిర ప్పడి అని పిలుస్తారు) ను వివిధ అర్థాలతో వివరించేవాడు అని అర్థం) అన్న పేరుతో గౌరవించారు. దయతో పెరుమాళ్ళు మాముణులను పొగుడుతూ శ్రీశైలేశ దయాపాత్రం తనియన్ను పఠించారు.తమపై కరుణ కురిపించిన పెరియ పెరుమాళ్ళ కోసం ఈ క్రింది పాశురాన్ని మాముణులు రచించారు.

నామార్? పెరియతిరుమండపమార్? నంపెరుమాళ్
తామాగ నమ్మైత్తనిత్తళైత్తు – నీ మాఱన్
శెందమిళ్ వేదత్తిన్ శెళుం పొరుళై నాళుం ఇంగే
వందురై ఎన్ఱేవువదే వాయ్ందు

(అసలు మనం ఎవరు? తిరుమండపం అంటే ఏమిటి? స్వయంగా నంపెరుమాళ్ళు విడిగా పిలిచి, “మాఱన్ (నమ్మాళ్వార్) స్వరపరచిన తమిళ్ వేద అర్థాల ఉపన్యాసం చెప్పండి” అని ఆజ్ఞాపించారు. ఇది ఎంతటి భాగ్యం!)

పెరియ జీయర్ కోసం నంపెరుమాళ్ళు స్వరపరచిన తనియన్ అర్థం: తిరువాయ్మొళి పిళ్లై కృపా పాత్రుడు, శ్రీ భాష్యకారుల (రామానుజులు) పరమ భక్తుడు, జ్ఞాన భక్తి వైరాగ్య గుణా సాగరుడు అయిన కోయిల్ అళగియ మణవాళ జీయర్ను నేను ఆరాధిస్తాను..

శ్రీశైలేశ దయాపాత్రం: తిరువాయ్మొళి ప్పిళ్ళైల [శ్రీశైలేశర్] మహా కృపకు పాతృలు మనవాళ మాముణులు. నమ్మాళ్వార్ల తిరువడి అయిన రామానుజులను (వీరి తిరువడిని) అటువంటి తిరువాయ్మొళి ప్పిళ్ళై వారు ఎన్నడూ మరువలేదు. శ్రీశైలపూర్ణులు (రామానుజులకు మేనమామగారు, వారికి శ్రీ రామాయణ బోధించిన పెరియ తిరుమలై నంబి), శ్రీశైల దేశికర్ (తిరువాయ్మొళి ప్పిళ్ళై), వీరిరువురి ద్వారా శ్రీ రామాయణం మరియు తిరువాయ్మొళి యొక్క భక్తి ప్రవాహం చేరి మణవాళ మాముణుల తిరుహృదయంలో నివాసం చేసుకుంది. వీరిని యతీంద్ర ప్రవణర్ (రామానుజుల తిరు పాద భక్తులు) అని కూడా పిలుస్తారు.

దీభక్త్యాది గుణార్ణవం: జ్ఞాన భక్తి వైరాగ్య మహా సాగరం వంటి వారు మణవాళ మాముణులు. మునుపు ఇళైయ పెరుమాళ్ (లక్ష్మణుడు), ఇళైయాళ్వార్ (రామానుజులు) స్వరూపాలలో కూడా మాముణులు జ్ఞాన భక్తి పరిపూర్ణులు. కానీ పెరియ జీయర్ విషయంలో, పెరియ పెరుమాళ్ళ పట్ల వీరి భక్తి ప్రపత్తులు రెట్టింపని చెప్పుకోవచ్చు.

యతీంద్ర ప్రవణం: యతీంద్ర ప్రవణం అనే పదం, నంపెరుమాళ్ళ పట్ల మాముణులకు ఉన్న భక్తి, ఎల్లలు & పరిమితి లేని భక్తి గా ఎమ్పెరుమానార్ల పై  చేరింది (భక్తికి, ప్రపత్తికి అనంతమైన సీమను సూచిస్తుంది). రామానుజులు పరాంకుశ భక్తర్ (నమ్మాళ్వార్ల దాసులు). మాముణులు యతీంద్ర దాసులు (యతీంద్ర ప్రవణర్).

వందే రమ్యజామాతరం మునిం: అళగియ మణవాళ మాముణుల తిరు నామాన్ని ధ్యానిస్తూ, మాముణుల దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు.

మూలము: https://granthams.koyil.org/2021/11/01/yathindhra-pravana-prabhavam-105-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment