<< తనియన్లు
సకల వేదార్ధములను సంగ్రహముగా తెలియచెప్పునది తిరుమంత్రము. మూడు పదముల సమూహము అయిన అట్టి తిరుమంత్రము మూడు ఆకారములను ప్రతిపాదించును(అనన్యార్హ శేషత్వము – భగవానునికే తప్ప వేరొకరికి శేషభూతముగా కాకుండుట, అనన్య శరణత్వము – భగవానుని మాత్రమే శరణముగా ఆశ్రయించుట, అనన్య భోగ్యత్వము – భగవానుని మాత్రమే భోగ్యముగా(భోగ్య వస్తువు) స్వీకరించుట మరియు భగవానునికి మాత్రమే భోగ్య వస్తువుగా ఉండుట). ఈ మూడు ఆకారములు అనగా (అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము) అనునవి అందరి జీవులకును సర్వ సాధారణములైనవి. యజుర్వేదము “యత్రర్షయః ప్రధమ జాయే పురాణాః”(పరమపదములో అనాదిగా వేంచేసియుండువారు)అని చెప్పినట్టు జ్ఞాన సంకోచము లేనివారై నిరంతరము భగవానుని అనుభవించుట వలన కలుగు నిరతిశయానందముచే మాండూక్య ఉపనిషత్తు 2.21 “అనాది మాయయా సుప్తాః” (అనాదిగా అజ్ఞానముచే కప్పబడి) అనియు “తిల తైలవత్ ధారు వహ్నివత్”(తిలల(నువ్వుల) యందు ఉండు తైలము(నూనె) వలెను దారువు(కొయ్య )నందు ఉండు అగ్ని వలెను నిత్యసూరుల వలె జీవులందరికి శుద్ధసత్త్వమయమగు పరమపదమున భగవానుని అనుభవించు యోగ్యత ఉన్నప్పటికీ జీవులు అనాదిమాయచే కప్పబడడము చేత జ్ఞాన రాహిత్యము కలిగి తద్వారా అవిద్య చేత అంతులేని కర్మలు సంక్రమించి అట్టి కర్మలు సుర(స్వర్గపు), నర(మనుష్య), తిర్యక్(జంతువు), స్థావర(వృక్షములు) రూపములలో అంతులేని జన్మలు పొందించి తిరువాయిమొళి 2.6.8 “మాఴి మాఴిప్ పల పిఴప్పమ్ పిఴన్దు”(అనేక విధముల జన్మలు పొంది) అని చెప్పినట్టు పలు మార్లు జన్మించి, ప్రతీ జన్మలో దేహాత్మాభిమానము, స్వస్వాతంత్య్రము, అన్య శేషత్వము అనుబడు ఒక కూపములో (దురవస్థలో) పది దానికి అనుగుణములగు సాధ్య సాధన విషయములలో ప్రవేశము కలిగి అట్టి జీవాత్మలు ప్రతిజ్ఞ చేసినట్టుగా ఏదోక రీతిలో భగవానుని విడువుటకు తిరువిరుత్తము 95 “యాధానుమ్ పత్తి నీన్ గుమ్ విర్దత్తై” (సంసారమున దేనినో ఒక దాని కోసము భగవానుని విడువుటకు ప్రతిజ్ఞ పూని) అని చెప్పినట్టు సర్వేశ్వరుని నుండి వేరుచేయునట్టి ఏదైనా ఒక వ్రతమును పైన పెట్టుకుని స్వాభావికముగా శేషియు, పరమ ప్రాప్యము, పరమ ప్రాపకము అయిన సర్వేశ్వరుని పట్ల విముఖులై గర్భ, జన్మ, బాల్య, యౌవన, వార్ధక, మరణ మరియు నరక అను ఏడు అవస్థలలో యెల్ల కాలము దుఃఖములను అనుభవించుచూ ఉండునట్టి ఈ సంసారులగు జీవులలో ఎవరికైనా కొందరికి జన్మించబోవునప్పుడు కలుగునట్టి భగవానుని కటాక్షము చేత రజస్తమో గుణములు క్షీణించి సత్త్వ గుణము వర్థిల్లి మోక్షమునకై ఆశ కలుగును.
- ఒకనికి మోక్షము మీద కోరిక కలిగినచో వణికి తత్త్వము(భగవానునికే శేషభూతముగా ఉండుట), హితము, పురుషార్ధములు ఈ సంసారమున ఉజ్జీవనమును కలుగుటకు తెలుసుకొనతగినవి.
- ఈ మూడింటిని శాస్త్రము ద్వారా తెలుసుకునే ప్రయత్నములో శాస్త్రములలో గొప్పదైన వేదము ద్వారా తెలుసుకొనవలెను. యజుర్వేదము 1.44 “అనన్తా వై వేదాః” అని చెప్పినట్టు వేదము అంతము లేనిది అనియు ఏదైనా వేదము నుండి తెలుసుకొనవల్సి వచ్చినప్పుడు “సర్వ శాఖా ప్రత్యయ న్యాయము” అను న్యాయము ద్వారా తెలుసుకొనవలెను, కానీ ఇది అల్ప బుద్ధి కల వారికి వాటిని తెలుసుకొనుట దుర్లభము.
- వేదములో చెప్పినవాటిని తెలుసుకొనుట దుర్లభము అని గ్రహించి అట్టి వేదమును సంపూర్ణముగా తెలుసుకొని తమ యోగ మహిమ వలన పరాపర తత్త్వ విభాగములను సాక్షాత్కరించు కొనిన వ్యాసాది మహర్షులచే రచించబడినవి అయిన స్మృతి ఇతిహాస పురాణముల తాత్పర్యాంశము సంసార వివేకమున ఎక్కువ రుచి గల వారికి తప్ప తక్కిన వారికి తెలియనవి.
- అలా తెలియనందున, సంసారులగు జీవులనుజ్జీవింప దలచి ఆ సర్వేశ్వరుడు స్వయముగా తానే ఆచార్యునిగా అవతరించి బయలుపరచినదియు సకల వేదసారమగు రహస్యత్రయము అతి సంగ్రహము అవ్వుటచేత అత్యంత నిగూడార్ధములను కలిగియుండుట చేత వాటిని అందరూ గ్రహించుటకు కష్టము అయినది.
- అందుచేత భగవంతుని నిర్హేతుక కటాక్షము వలన సకల వేదార్ధములను గ్రహించి వాటిని ద్రావిడ వేదముగా పిలువబడి దివ్యప్రబంధముల ద్వారా ఆళ్వార్లు మనకు అందించినప్పటికీ అవి స్వల్ప బుద్ధి కల వారికి పూర్తిగా అవగతము కావు.

- ఆళ్వార్లు కృప చేసిన దివ్యప్రబంధములను అర్థము చేసుకొని సారమును గ్రహించు బుద్ధి కుశలత కొరవడడముతో యోగ బలము చేత ఆళ్వార్ల కటాక్షమునకు పాత్రలు అయిన నాధమునులతో ఆరంభమగు ఆచార్య పరంపర ఆ ద్రావిడ ప్రబంధములను దర్శించారు. వారు ఏర్పరచిన సంప్రదాయమే సత్ సంప్రదాయము. వేదములలో, శాస్త్రములలో ద్రావిడ ప్రబంధములలో తెలియచెప్పబడిన అర్ధములను వారు గ్రహించి అల్ప బుద్ధి కల వారికి కూడా సులభముగా గ్రహింపశక్యము అయ్యేటట్లు గ్రంధములను వ్రాసి ఉపదేశించుచూ లోకమును సన్మార్గమున ప్రవర్తింపజేసితిరి.

- అట్టి ఆచార్యుల అడుగుజాడలలోనే పరమ కారుణీకులైన శ్రీ పిళ్ళై లోకాచార్యులు తమ యొక్క కృప చేత ఈ సంసారములో కొట్టు మిట్టాడుతున్న జీవుల ఉజ్జీవనమునకై తద్వారా పరమపదములో లభించు ఆ సర్వేశ్వరుని ప్రత్యక్ష కైంకర్యము కోసము ఎన్నో ప్రబంధములను అనుగ్రహించారు. ఈ ప్రబంధములలో గల ఉపదేశములు అన్నియూ పూర్వము ఆచార్య కాలక్షేపము ద్వారా పరంపరగా అనుగ్రహింపబడేవి. అట్టి ఉత్క్రుష్టమైన ఉపదేశముల గొప్పతనమును దృష్టిలో ఉంచుకొని సాధారణ జనులకు బయటకి ఉపదేశించకుండా ఉంచితిరి. కానీ రాబోవు తరాలు ఇట్టి ఉత్క్రుష్టమైన ఉపదేశములను పొందు భాగ్యమును కోల్పోయెదరు కదా అని గ్రహించి స్వప్నము ద్వారా ఆ సర్వేశ్వరుని దివ్యాజ్ఞ చేతనూ మరియు తమ కరుణ చేతనూ ఈ శ్రీ వచన భూషణము అను దివ్య గ్రంధము ద్వారా బయలుపరిచితిరి.
అంతక పూర్వము పేరరుళాళ ప్పెరుమాళ్ళు(కాంచీపుర వరదరాజ స్వామి) తమ కరుణ చేత మణర్పాక్కము అను ఊరిలో నివసించు ఒక శ్రీ వైష్ణవులకు అనుగ్రహించారు. దేవరాజ పెరుమాళ్ళు మణర్పాక్క నంబికి స్వప్నమున కొన్ని రహస్యములను ఉపదేశించి ఆ తరువాత “మీరు ఇప్పుడు కావేరి, కొల్లిడం అను రెండు నదుల మధ్యన ఉన్న శ్రీ రంగమునకు వెళ్లి నివసించండి, మేమే ఆ రహస్యములను పూర్తిగా అక్కడ ఉపదేశించెదము” అని ఆజ్ఞాపించితిరి. ఆ ఆజ్ఞను స్వీకరించి నంబి గారు శ్రీ రంగమునకు చేరి అక్కడ వేంచేసియున్న పెరియ పెరుమాళ్ళను తమ ఉనికిని దాచిపెట్టి స్వప్నము ద్వారా దేవరాజ పెరుమాళ్ళు తమకి ఉపదేశించిన రహస్యములను నిత్యము అనుసంధించుకుంటూ అక్కడే స్థిరముగా నివసించసాగిరి.

ఇలా ఉంటుండగా ఒక రోజు ఆ నంబి గారు కాట్టళగియ సింగర్ కోవెలలో(శ్రీరంగమునకు పక్కన) వంటరిగా ఉన్నప్పుడు ఆ సర్వేశ్వరుని తిరువుళ్ళముతో పిళ్ళై లోకాచార్యులు తమ శిష్యులతో అక్కడికి వేంచేశారు. ఆ కోవెల శ్రీరంగము పొలిమేరలో ఉండడము చేత నిర్మానుష్యముగా ఎట్టి కోలాహలం లేకుండా ఉండడము వలన వారు మన సత్సంప్రదాయ రహస్యార్థములను తమ శిష్యులకు ఉపదేశించడము మొదలుపెట్టారు. ఆ రహస్యార్థములను దూరముగా ఉన్న మణర్పాక్క నంబి గారి చెవినపడి అవి తమకు అంతక ముందు దేవప్పెరుమాళ్ళు స్వప్నమున ఉపదేశించిన అర్థముల వలె అనిపించి ఆశ్చర్యమునకు గురి అయ్యారు. వెంటనే నంబి గారు పిళ్ళై లోకాచార్యుల శ్రీ చరణముల మీద వ్రాలి “మీరు వారేనా?” అని అడుగగా లోకాచార్యులు “ఆ అవును, అయితే ఏమిటి ఇప్పుడు?” అని పలికితిరి. అప్పుడు నంబి తమ స్వప్న వృత్తాంతమును చెప్పగా పిళ్ళై లోకాచార్యులు ఉప్పొంగి నంబిని తమ శిష్యులుగా స్వీకరించి ఆ రహస్యార్థములను ఉపదేశించినారు. ఇలా ఉండగా ఒక రోజు పెరుమాళ్ళు నంబికి స్వప్నమున కనపడి “మీరు పిళ్ళై లోకాచార్యులని అర్ధించి ఈ రహస్యార్థములను కాలక్రమేణ మరుగున పడిపోకుండా ఉండేలా గ్రంథస్థము చేయించండి” అని ఆజ్ఞాపించినారు. అప్పుడు నంబి పిళ్ళై లోకాచార్యులకు తమ స్వప్న విషయమును చెప్పగా పిళ్ళై లోకాచార్యులు “ఇలా చేయడము ఆయన ఆజ్ఞ అయితే అలానే చేస్తాము” అని బదులు ఇచ్చి శ్రీ వచన భూషణ గ్రంధమును అనుగ్రహించారు. ఈ ఘట్టము మన సంప్రదాయములో సుప్రసిద్ధము.
ఎలా అయితే రత్నములతో కూడిన ఒక హారమును రత్న భూషణము అని పిలుస్తామో అదే విధముగా మన పూర్వాచార్యుల ఉపదేశములతో కూడి ఉండి అనుసంధించిన వారికి గొప్ప జ్ఞాన ప్రకాశమును కలిగించు ఈ ప్రబంధమునకు “శ్రీ వచన భూషణము” అను పేరు సార్ధకమైనది.

దీనితో శ్రీ వచన భూషణము అవతారికలో ఎంతో గొప్పదైన మొదటి ఘట్టము సుసంపన్నము అయినది. చాలా సులువుగా సాంప్రదాయ అర్ధములను తెలుపుట చేత ఈ గ్రంధము ఎంతో గొప్ప కీర్తిని గడించినది. అందులోనూ మణవాళ మహామునుల తీయని స్పష్టమైన వ్యాఖ్యానము చేత మనందరికీ దీనిని సేవించి తరించ యోగ్యమైనది. ఈ గ్రంధమును ఆచార్యుని వద్ద సేవించినచో క్లిష్టమైన సత్సంప్రదాయ రహస్యములను మనము సులువుగా అర్థము చేసుకొనవచ్ఛును. అట్టి ఆచార్యుల తిరువడికి దండము సమర్పించి ధన్యులము అవుదాము.
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2020/12/02/srivachana-bhushanam-avatharikai-1-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org