అవతారిక
యధార్ధముగా ఉన్నదానిని ఉన్నట్లు తెలుసుకొనుటను ‘ప్రమ’ అని అంటారు. అట్టి జ్ఞానము కలవాడు ‘ప్రమాత’ అంటే ఉన్నదానిని ఉన్నట్టు తెలుసుకొనిన వాడు. అలా అతను తెలుసుకొనుటకు సాధనము ప్రమాణము. ప్రత్యక్షముతో ఆరంభమగు ప్రమాణములు ఎనిమిది విధములు.
ప్రత్యక్షం ఏకం చార్వాకాః కాణాద సుగదౌ పునః |
అనుమానంచ తచ్చాత సాంఖ్య శబ్దంచతే అపి ||
అర్ధపత్యా సహైతాని చత్వార్యాహ ప్రభాకరః |
న్యాయైక దేసినోప్యేవం ఉపమానం ప్రచక్షతే ||
అభవ షష్ఠఅన్యేతాని ఏతాని భాట్టః వేదాన్తినస్తథ: |
సంభవైదిహ్య యుక్తాని తాని పౌరాణిక: జగు: ||
లోకాయుతులు ప్రత్యక్షమును మాత్రమే ప్రమాణముగా అంగీకరించెదరు. నైయైకులు, బౌధ్ధులకు ప్రత్యక్షముతో పాటు అనుమానమునూ ప్రమాణము. సాంఖ్యులు (కపిలుని అనుసరించువారు) ప్రత్యక్షము,అనుమానముతో పాటు శబ్దమును అనగా మూడు ప్రమాణములను అంగీకరించెదరు. పైన నాలుగు ప్రమాణములతో పాటు ఉపమానము అను ప్రమాణమును కొంతమంది నైయైకులు అంగీకరించెదరు. భాట్ట మతస్థులు మరియు వేదాంతులు పైన చెప్పిన ఐదు ప్రమాణములతో పాటు అభావము అను ప్రమాణమును కలుపుకొని ఆరు ప్రమాణములను అంగీకరించెదరు. పైన చెప్పబడిన ఆరు ప్రమాణములతో పాటు సంభవం, ఐతిహ్యం అను రెండు ప్రమాణాలను కలుపుకొని మొత్తం ఎనిమిది ప్రమాణములను పౌరాణికులు అంగీకరించెదరు. ఇందులో “ప్రత్యక్షం ఏకం చర్వాకాః ….” లో చెప్పినట్లు వేద బాహ్యులు, కుదృష్టుల వలె కాకుండా ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణములు అంగీకరించి తక్కిన ఐదు ప్రమాణములు ఈ మూడు ప్రమాణములలో అంతర్లీనములు అని పిళ్ళై లోకాచార్యులు ప్రతిపాదించితిరి. ఈ మూడింటిలో కూడా ప్రత్యక్షము చేతను, అనుమానము చేతను తెలుసుకొనుటకు శక్యము గాని విషయములను చెప్పుటలో శబ్ద ప్రమాణమే బలమైనది. శబ్దము అనగా శాస్త్రము అనగా వేదము. ఈ శబ్ద ప్రమాణములో కూడా శ్రీ రంగరాజా స్తవం ఉత్తర శతకం 14 “వేదే కర్త్రాతి అభావాత్ బలవతిః నయైస్త్వాన్ముకే నియమనే తన్ముూలత్వేన మానమ్ తధితరాధకఖిలం జాయతే” (భగవానుని గూర్చి చెప్పు వేదము ఎవరి చేతనూ రచింపబడకబోవడము చేత, ఎట్టి దోషములు లేని కారణము చేత తక్కిన శాస్త్రములు అన్నీ ప్రమాణము కోసము అట్టి వేదము పైనే ఆధారపడి ఉండును.) అని చెప్పినట్టు ఎవరి చేతనో రచింపబడిన శాస్త్రములో దోషములుండును. అట్టి శాస్త్రములు తమ ప్రామాణికతను ప్రతిపాదించుకొనుటకు స్వతః ప్రామాణ్యత్వమును కలిగిన వేదము పైనే ఆధారపడును.
పరమ వైదీకులు అయ్యి వేదమే పరమ ప్రమాణము అని విశ్వసించియుండు పిళ్ళై లోకాచార్యులు ఈ శ్రీ వచన భూషణములో చెప్పిన అర్థములు అన్నియు వేదమునే ప్రమాణముగా చేసుకొని దాని ఆధారముగా కృప చేసి అందులో మొదటగా వేదమే ప్రమాణము అనియు అట్టి వేదార్ధములను ఎలా నిర్ధారించుకోవాలో అన్న విషయము ఈ సూత్రములో కృప చేయుచున్నారు.
సూత్రము
వేదార్థమఱుతి ఇడువతు స్మృతీతిహాస పురాణఙ్గళాలే
సంక్షిప్త వ్యాఖ్యానము
స్మృతి, ఇతిహాసములు మరియు పురాణములను ఆధారము చేసుకొని వేదము యొక్క అర్ధములను నిర్ధారణ చేసుకొనవలెను.
వ్యాఖ్యానము
వేద
అఖిల హేయ ప్రత్యనీకత్వము (అన్ని దోషములకు భిన్నుడుగా ఉండుట) మరియు కళ్యాణైకతానత్వము (అన్ని మంగళములకు ఆశ్రయుడుగా ఉండుట) అను గుణములు కలిగియుండుట చేత ఆ సర్వేశ్వరుడు ప్రమేయముల అన్నిటియందు ఎలా అయితే విలక్షణుడో అలానే అపౌరుషేయత్వమును (ఎవరి చేత రచించబడనివి) మరియు నిత్యత్వము(అనాదిగా ఉండుట) అను గుణములను కలిగియుండుట చేత వేదము కూడా తక్కిన అన్ని ప్రమాణముల కంటే విలక్షణము. యజుర్వేదము 2.6 “వాచా విరూప నిత్యయా”(అనాదియైన వేదము ద్వారానే నిన్ను తెలుసుకొనగలము) అనియు మనుస్మృతి “అనాది నిధనా హ్యేషా వాగుత్సృష్టా స్వయంభువా | అదౌ వేదమయీ దివ్యా యతః సర్వా: ప్రసూతయ:||” (ఇతర ప్రమాణముల కంటే విలక్షణమైనది, పుట్టుక, వినాశము లేనిది మరియు అన్ని జీవరాశుల గురించి తెలుపునట్టిది అయిన అట్టి వేదము. ఇట్టి అనాదియగు శాస్త్రమును ఆ సర్వేశ్వరుడే సృష్ఠి చేయునప్పుడు బయలుపరిచెను). ఈ శాస్త్రములలో వేదము యొక్క నిత్యత్వమును చెప్పడము చేత వేదము యొక్క సహజమైన అపౌరుషేయత్వము అను కారణము చేతనే వేదము భ్రమ (ఒక దానిని చూసి వేరొక దానిగ తలచుట), ప్రమాదము (మరచిపోయియుండుట), అశక్తి(తాను తెలుసుకొనిన దానిని చెప్పుటకు శక్తి చాలకుండుట), విప్రలంబ(చెప్పడానికి శక్తి ఉన్నప్పటికీ ఎదుటివానిని మోసము చేయు బుద్ధి) అను నాలుగు దోషములు లేకుండా ఉండును. ఇందుచేతనే ఏ శాస్త్రమూ వేదము కంటే గొప్పది కాజాలదు. ఇందువలననే హరివంశమున పురాణ ఇతిహాసముల గ్రంథకర్త ముక్తకంఠముతో ఈ విధముగా పలికెను “సత్యం సత్యం పునః సత్యం ఉధృత్య భుజం ఉచ్యతే | వేదశ్శాస్త్రాత్ పరం నాస్తి నదైవతం కేశవత్ పరమ్||”(వేదము కంటే ఉత్కృష్ఠమైన శాస్త్రము ఏదియూ లేదు , మరియు కేశవుని కంటే గొప్ప దైవము వేరొకటి లేదు. నా చేతులు జోడించి దీనిని నేను “సత్యము! సత్యము! సత్యము! అని ప్రతిపాదించుచున్నాను.
వేదము యొక్క ఔన్నత్యమును తన హృదయములో తలచి నమ్మాళ్వార్లు తిరువాయిమొళి 1.1.7 “సుడర్ మిగు సురుది” (గొప్పగా ప్రకాశించు వేదము/శృతి) అని కృప చేసెను. వారి అడుగు జాడలలోనే గొప్ప పండితులు అయిన పరాశర భట్టరు కూడా శ్రీ రంగరాజ స్తవం ఉత్తర శతకము 19 “(ఆదీ వేదాః ప్రమాణమ్ – వేదములే పరమ ప్రమాణము) అని కృప చేసినారు.
“వేదయతి ఇతి వేదాః” అను వ్యుత్పత్తి ద్వారా వేదము అను శబ్దము తెలుస్తున్నది. తెలుసుకొనవలయును అని కోరిక గల ఆస్థికులకు తన అర్థమును ప్రకాశింపజేయునది అనుట. వేదమునందు ప్రతిపాదింపబడునట్టి విషయములకు గల భేదమును బట్టి రెండు భాగములు కలదిగా ఉండును. ఇక్కడ రెండు భాగములూ “వేదము” అను ఒక పదము చేత సూచించబడుతున్నాయి.
అర్ధము
మొదటి భాగములో అర్ధము (కర్మ) మరియు రెండవ భాగములో బ్రహ్మము(సర్వేశ్వరుడు) చెప్పబడినది. అందుచేతనే పూర్వ మీమాంస ధర్మ సూత్రము 1. 1. 1 “అధాతో ధర్మ జిజ్ఞాసా” (వేదమును అభ్యసించి ఆ అభ్యాసమును ముగించిన కారణము చేత ఒకడు వేదముల యొక్క అర్థములు తెలుసుకొనవలెను) అనియు బ్రహ్మ సూత్రము 1. 1. 1 “అధాతో బ్రహ్మ జిజ్ఞాసా” (పూర్వ భాగము యొక్క అర్ధ విచారము చేసి దాని వలన కలుగు ఫలితము నిత్యము కాదు అని తెలుసుకొని ఒకడు బ్రహ్మమును గూర్చి విచారము చేయవలెను).
దీనితో తెలియబడు రెండు భాగములు ఏమి అనగా
1) కర్మము – ఆరాధనము
2) బ్రహ్మము – ఆరాధ్యుడగు భగవానుడు
తైత్తిరీయ ఉపనిషత్తు “స ఆత్మా, అంగాన్యన్యా దేవతా:” (ఆ సర్వేశ్వరుడు ఆత్మ, దేవతలు అతనికి శరీరములు) అను శాస్త్ర వాక్యము చేత దేవతలు (అగ్ని, ఇంద్ర మొదలగు దేవతలు) ఆ సర్వేశ్వరునికి శరీరము అని చెప్పడము చేత కర్మములు భగవంతుని ఆరాధనాపూర్వకములుగా చెప్పబడుచున్నవి. ఈ సూత్రమును తెలుసుకొని అనగా ఆ భగవానుడే అగ్ని, ఇంద్రాది దేవతలలో అంతర్యామిగా గుర్తించి ఆతనిని సంతోషింప చేయుటకై కర్మములు అనుష్ఠి౦చు వారికే కర్మము భగవదారాధనము అనే విషయము సిద్ధించును. అలా కాకుండా ఈ సూత్రము తెలియక కేవలము దేవతలను ఆరాధించుటకు మాత్రమే కర్మములు ఆచరించినా అట్టి కర్మములు కూడా భగవదారాధనమే అగును ఎందులకు అనగా ఆ భగవానుడే ఆ దేవతలకు అంతర్యామి. దక్ష స్మృతి “యే యజన్తి పితౄన్ దేవాన్ బ్రాహ్మణాన్ సహుతాసనాన్. సర్వభూతాంతరాత్మానామ్ విష్ణుమేవ యజన్తి తే.” (పితృదేవతలను మరియు బ్రాహ్మణులను ఎవరు అయినా అగ్నిహోత్రము ద్వారా చేసిన ఆరాధన అంతర్యామిగా ఉండు ఆ శ్రీమన్నారాయణుని ఆరాధనయే అగును) అని చెప్పినట్టు ఆ భగవానుడే శ్రీ భగవద్గీత 9. 23 “యే ‘ప్యాన్య-దేవతా-భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః. తే ‘పి మామ్ ఏవ కౌంతేయ యజన్త్యవిధి-పూర్వకం”(ఎవరు పరమాత్మ కంటే వేరు అయినవారు అగు ఇంద్రాది దేవతల పట్ల ప్రీతిగల వారై వారిని పూజించుచున్నారో, వారును అది భగవదారాధనము అనెడి జ్ఞానము లేని వారై నన్నే పూజించుచున్నారు) అని స్వయముగా చెప్పియున్నాడు. కావున అన్ని విధములను కర్మము భగవదారాధనమని సిద్ధించుచున్నది.
ఈ విధముగా కర్మము ఆరాధనమనియూ, దానిచే ఆరాధింపబడునది బ్రహ్మమనియూ అను ఈ రెండు విషయములను తెలుసుకొనియే కదా త్యాజ్యములను మరియు ఉపాదేయములను తెలుసుకొనగలము. కావున పైన చెప్పినట్టు వేదము యొక్క రెండు భాగములలోను ప్రతిపాదింపబడినవి కర్మము, బ్రహ్మము అని తెలిసినది.
కర్మము అనునది లౌకిక సుఖములను కోరుకొనువారికి ఐశ్వర్యము ఇచ్చునదియు, ముముక్షువులలో భక్తి నిష్ఠులకు ఉపాసనా అంగము గాను, ప్రపన్నులకు కైంకర్య రూపముగాను ఉపయోగపడును. ఈ విధముగా ఉండునట్టి కర్మము యొక్క స్వరూపమును వాస్తవముగా తెలుసుకొనిన తరువాత అనంత స్థిర ఫలమును కోరు ఉపాసకులకు వారి ఉపాసనమునకు అంగముగా గ్రహింపబడునది అగును. ఐశ్వర్యకాములు ఈ కర్మమును ఎటువంటి స్వరూపముతో గ్రహించుదురో అటువంటి స్వరూపమున ఇది వీరికి త్యాజ్యమనియు అని తెలుసుకొనదగును. వేరొక సాధనమును ఉపేక్షింపని వారికి (ప్రపన్నులు) దీని వలన సాధింపవలసినది ఏదియూ లేకుండుట వలన వారిచే ఇది కైంకర్య రూపమున గ్రహింపబడినది అగును. అయితే దీనిని ఉపాసకులు గ్రహించిన ప్రకారముగా ఇది వీరికి త్యాజ్యమని తెలుస్తున్నది.
బ్రహ్మమును తెలుసుకొనవలసినచో దాని స్వరూపమును, ఆకారమును, గుణములను, విభూతులను వీటన్ని౦టినీ తెలుసుకొనవలసి ఉండటము చేత, అట్టి విభూతులగు చేతనా చేతన పదార్థముల స్వరూపములను తెలుసుకొనవచ్చును. జ్ఞానము మరియు ఆనందము అను స్వరూపము చేత తెలియబడు జీవులు కేవలము అవే స్వరూపములు అని తెలియుటనే కైవల్యమును గూర్చి తెలుసుకొనుట అని అందురు. బ్రహ్మము యొక్క శేషత్వము, ప్రాప్యత్వము తెలిసిన తరువాత బ్రహ్మమును అనుభవించుటయే పురుషార్ధము అని తెలియబడును. బ్రహ్మము యొక్క ఉపాస్యత్వము, శరణ్యత్వము తెలిసిన తరువాత ఆ బ్రహ్మమును ప్రాప్యముగా తెలియబడును.
బ్రహ్మము యొక్క నిరతిశయ భోగ్యత్వము, అనన్య సాధ్యత్వము మరియు జీవుడు ఆ బ్రహ్మము నుండి విడదీయుటకు వీలు కాకుండా ఎల్లప్పుడూ చేరి ఉండును మరియు ఆ బ్రహ్మమునకు పారతంత్ర్యముగా ఉండుట అని తెలిసిన తరువాత ఇతర ఉపాయము, సాధనములు త్యాజ్యములు అగును అని తెలియబడును.
అందువలనే ఈ కారణముల చేత పూర్వ భాగము ఆరాధనమును, ఉత్తర భాగము ఆరాధ్యుడగు భగవానుని తెలియజేయును అని అనడములో ఎట్టి సంకోచమూ లేదు. శ్రీ రంగరాజ స్తవం ఉత్తర శతకం 19 “త్వదర్చావిధిమ్ ఉపరి పరీక్షీయతే పూర్వభాగ: ఊర్ధ్వో భాగస్వధీహా గుణా విభవ పరిగ్యాపనైస్త్వత్ పదధౌ”(వేదములో పూర్వ భాగము నీ అర్చనా విధానమును తెలియజేయును. ఉత్తర భాగము నీ లీలలు అయిన సృష్ఠి, విభూతి మరియు నీ పదములను పొందుట” అను దానిని తెలియజేయును) అని కదా పరాశర భట్టరు ప్రతిపాదించారు.
అఱుదియిడువదు
ఈ విధముగా రెండు భాగములలో ప్రతిపాదింపబడునట్టి అర్ధములను నిశ్చయించుట అనగా కర్మము యొక్క స్వరూపము అంగములు, ఫలము మొదలగువానిని, బ్రహ్మము యొక్క స్వరూపము గుణములు విభూతి మొదలగువాటిని సంశయము వివర్యము (దోషములు) కలుగకుండా నిర్ణయించుట. ఈ విధముగా చెప్పుటకు ఇది సకల శాఖా ప్రత్యయ న్యాయము మరియు సకల వేదాంత ప్రత్యయ న్యాయమును బట్టియే దీనిని చెప్పవలెను. శాఖా – పూర్వ భాగపు ఖండము, వేదాంత – ఉత్తర భాగము, న్యాయ – విధానము.
వాటిలో సకల శాఖా ప్రత్యయ న్యాయము అనగా, ఏదైనా ఒక వాక్యమునకు ఒక అర్థము చెప్పినట్లైతే దాని యొక్క అంగము, ఉపాంగము బాగా తెలుసుకొనుటకు గాను శాఖాంతరములను అన్నిటినీ పరిశీలించి వాటిలో చెప్పబడినట్టి అర్ధములను తెలుసుకొని వాటికి గల పరస్పర విరోధములను తొలగించుకొని ప్రధానమైన అంగతో వానిని చేర్చుకొనవలెను. సకల వేదాంత ప్రత్యయ న్యాయము అనగా ఏదైనా ఒక ఉపనిషత్తులో ఒక వాక్యము యొక్క అర్ధము చెప్పినచో తక్కిన ఉపనిషత్తులను పరిశీలించి వానిచే తెలుపబడు అర్ధములకు పరస్పర విరోధము లేకుండా విషయ భాగముతో ఏది ఉపనిషత్ ప్రతిపాద్యమైన అర్థమో నిర్ణయించుట.
వేదార్ధము న్యాయముల సహకారముతో నిర్ణయించుకొనుట మహా బుద్ధిమంతులైన మహర్షులకు తప్ప తక్కిన వారికి శక్యము కాదు. అందువలన వేదార్ధమును సరిగా నిర్ణయించుటకు ఉపబృహణములను సరియైనవి. అందుచేత అట్టివాటిని పిళ్ళైలోకాచార్యుల వారు బయలుపరిచెరు.
స్మృతి ఇతిహాస పురాణన్గళాలే
స్మృతులు అనగా మనువు, అత్రి, విష్ణువు, హారీత, యాజ్ఞ్యవల్క్య మొదలగు వారిచే చెప్పబడిన ధర్మ శాస్త్రములు. పూర్వము జరిగిన వాటిని బయలుపరుచునవి శ్రీ రామాయణ, మహాభారతములు అను ఇతిహాసములు.
పురాణములు అనునవి సర్గము(సృష్ఠి క్రమము), ప్రతిసర్గ(లయము), వంశక్రమము(వంశములు), వంశానుచరిత మరియు మన్వంతరములను తెలియజేయు బ్రహ్మ పురాణము, పద్మ పురాణము, విష్ణు పురాణము మొదలగునవి.
ఈ విధముగా వేదార్ధమును నిర్ణయించుకొనుట అని పిళ్ళైలోకాచార్యులు చెప్పడము చేత అనగా స్మృతులు, ఇతిహాసములు, పురాణముల సహాయము లేకుండా స్వతంత్ర్యముగా తమ బుద్ధిని బట్టి వేదార్ధమును నిర్ణయించే ప్రయత్నమును చేయునప్పుడు ఒక చోట చెప్పిన దానికి, రెండవ చోట చెప్పిన దానికి భేదము కనపడుట చేత విప్రతిపత్తి ఏర్పడును. అందుచేతనే బార్హస్పత్య స్మృతిలోను, మహాభారతములోను “ఇతిహాస పురాణాభ్యామ్ వేదం సముపబృహ్యేత్. బిభేత్యల్పశృతాద్వేదో మామయం ప్రతరిష్యతి. “(వేదమును ఇతిహాస పురాణముల ద్వారానే తెలుసుకొనవలెను. అలా కాకుండా వేదమునకు అర్ధమును చెప్పచూచి అల్పజ్ఞానులను చూచి నన్ను సరియగు విధముగా వివరింపలేక మోసగించును అని వేదము భయపడును) అని చెప్పినారు.
మొదటి సూత్రము మూలకముగా, శ్రీ వచన భూషణములో పిళ్ళై లోకాచార్యులచే చెప్పబడిన అర్థములు అన్నియూ వేదములో ప్రతిపాదించబడినవే. ఈ అర్థములను ఉపబ్రహ్మణములగు ఇతిహాస పురాణముల సహాయము చేతనే నిర్ణయింపవలెను అని తెలుసుకొనవలెను.
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2020/12/06/srivachana-bhushanam-suthram-1-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org