శ్రీ వచన భూషణము – సూత్రము 3

శ్రీ వచన భూషణము

<< సూత్రము 2

అవతారిక
“వేదము యొక్క ఉత్తర భాగమును నిశ్చయించునట్టి ఈ రెండింటికి భేదము ఉండునా?” అన్న సందేహమునకు పిళ్ళై లోకాచార్యుల వారు జవాబును ప్రతిపాదించుచున్నారు.
వేరొక అర్ధము – ఒకటే విభాగమును గురించినవి అయిన రెండు ఉపబ్రహ్మణములలో ఏది ప్రబలమైనదో చెప్పదలచి తామే స్వయముగా తలచి ప్రసాదించుచున్నారు.

సూత్రము
ఇవై యిరణ్డిలుమ్ వైత్తుక్కొణ్డు ఇతిహాసమ్ ప్రబలమ్

సంక్షిప్త వ్యాఖ్యానము
ఈ రెండింటిలో ఇతిహాసము ప్రబలము

వ్యాఖ్యానము
ఇవై యిరణ్డిలుమ్…
అనగా ఉత్తర భాగములో ప్రతిపాదింపబడిన విషయమును సంశయము లేకుండా తెలుసుకొనుటకు ఇతిహాస పురాణములు అనేవి రెండూ ఉపయోగపడేవి అయినప్పటికీ పురాణముల కంటే ఇతిహాసములు ప్రబల ప్రమాణములు.
పరిగ్రహ అతిశయము (గొప్ప ప్రమాణములుగా కలిగియుండుట), మధ్యస్తతా (తటస్థగా ఉండుట), కర్తురాప్తతమత్వము (గ్రంధకర్త యొక్క విశ్వసనీయత) అను కారణముల చేత పురాణముల కంటే ఇతిహాసములు ప్రబల ప్రమాణములు.
వీటిలో పరిగ్రహము అనగా శాస్త్రమును అంగీకరించుట. చాలా పురాణములలో ఇతిహాసములు ఈ విధముగా శ్లాఘి౦చబడినవి.

 -స్కంద పురాణము “వేద వేద్యే పరే పు౦సి జాతే ధశరదాత్మజే  | వేద: ప్రాచేతసాధాసీత్ సాక్షాత్ రామాయణాత్మన ||”(వేదము ద్వారా తెలుసుకొనబడు సర్వ స్వామి అయిన ఆ శ్రీమన్నారాయణుడు దశరధుని కుమారునిగా అవతరించగా వేదములు శ్రీ రామాయణ రూపమును దాల్చి ప్రాచేతసుని కుమారుడు అయిన వాల్మీకి ద్వారా బయటకు వచ్చెను)

-శివ పురాణములో వాయువు “మతిమన్దానమ్ అవిద్య యేనాసౌ శృతి సాగరాత్| జగత్ హితాయ జనితో మహాభారత చంద్రమాః||” (లోకోద్ధరణ కోసం వ్యాసుని మేధస్సుని కవ్వముగా చేసుకొని వేదము అను సముద్రమును చిలుకగా ఏర్పడినదే ఈ చంద్రుని వంటి మహాభారతము) అని పలికెను.

-మార్కండేయ పురాణము “వ్యాస వాక్య జలౌఘేన కుధర్మ తరుహారిణా | వేద శైలావతీర్ణేన నీరాజాక్ష మహీకృతా ||”(వేద రూపమగు పర్వతము నుండి ప్రవహించునదియు, దుష్ఠ కర్మ రూపమగు వృక్షములను పెకలించి పడద్రోయునట్టిది అయిన వ్యాసుని వాక్కులు) రూపము అయిన జల ప్రవాహముచే భూమి మీద ఉన్న మురికిని తొలగించగలవు.)

-“బిభీతి గహనాఛ్చాస్త్రాన్ నరః త్రీవ్రాదివేషదాత్ | భారతశ్శాస్త్ర సారో అయమత: కావ్యాత్మనా కృత:||”(అర్ధ గోచరము కాని శాస్త్రార్ధములను చూసి భయపడువారికి శాస్త్ర సారమగు మహాభారతము కావ్య రూపమున అట్టి వారికి ఒక ఔషధముగా తయారు చేయబడినది).

– భవిష్యత్ పురాణము ““విష్ణౌ వేదేషు విధ్వత్సు గురుషు బ్రాహ్మణేషుచ | భక్తిర్భవతి కళ్యాణి భారతదేవ ధీమతమ్ ||” (బుద్ధిమంతులు అయిన వారికి మహాభారతమును చదవడము వలననే శ్రీ మహావిష్ణువు విషయమును, వేదముల విషయమునను, విద్వాంసుల విషయమునను, బ్రాహ్మణుల విషయమునను మంచి భక్తి కలుగుచున్నది)
మధ్యస్థత అనగా – పురాణములను ప్రవర్తింపజేయు బ్రహ్మ ఆయా సమయములలో ఉండు త్రిగుణములు అనగా సత్త్వ , రజో, తమో గుణములను బట్టి (కాలములలో) ఆయా గుణమును కలిగి ఉండు ఆయా దేవతా మూర్తులను ప్రస్తుతించి మాత్స్య పురాణము “యస్మిన్ కల్పేతు యత్ప్రోక్తం పురాణం బ్రహ్మణా పురా తస్య తస్యతు మాహాత్మ్యం తత్ స్వరూపేన వర్ణయతే” (పూర్వము కల్పమున బ్రహ్మచే చెప్పబడిన పురాణములు ఆ కల్పమున ప్రబలంగా ఉండు గుణమును బట్టి ఆయా దేవతల గొప్పతనమును గూర్చి చెప్పెను). అందువలన పురాణములు తటస్థములు కాదు. పురాణముల వలే కాకుండా వేదములలోని విషయములను చెప్పునవి మరియు దేశ కాల నియమములను తెలుపుటవి అయిన చేత ఇతిహాసములు తటస్థములు.
కర్తురాప్తతమత్వము అనగా ప్రబంధము యొక్క గ్రంథ కర్తకు యదార్ధముగా తెలుసుకొనుటకు తగిన సామర్ధ్యములను, తాను దర్శించినట్లే తెలుపటము అను ఈ రెండు కలిగియుండుట.
ఇతిహాసములు పురాణముల కంటే ప్రబలమైనవి అను ఈ విషయమును తత్వ నిర్ణయము అను గ్రంధమున ఉయ్యక్కొండార్లు ప్రతిపాదించియున్నారు. “అతేతిహాస పురాణయోరితిహాసా బలీయాంసః కుతః పరిగ్రహాతి రేకాత్ సర్వత్ర మాధ్యస్తేన | భూతార్థ ప్రతీతేః వచన సౌష్ఠవేన కర్తురాప్తతమత్వావ గతేశ్చ || “(ఇంకా ఇతిహాసములు, పురాణములలో, ఇతిహాసములు ప్రబలములు ఎందుకు అనగా
 1)ఇతిహాసములను ప్రత్యేకముగా కొనియాడి అంగీకరించడము          
 2)దైవిక విషయముల పట్ల అవి తటస్థములుగా ఉండుట
 3)గతములో జరిగిన విషయములను గూర్చి ప్రతిపాదించుట
 4)సరియైన పదములతో నమ్మదగిన గొప్ప  గ్రంథకర్తలచే నిర్మింపబడుట చేత)

పురాణమూల కంటే మహాభారతము యొక్క గొప్పతనము ప్రత్యేకముగా పరాశర భట్టరు వారు తమ సహస్రనామ భాష్యములో చెప్పి యున్నారు. “మహాభారతం హి పరిగ్రహ విశేషావసితం”(పురాణములలో మహాభారతమును బాగా అంగీకరించితిరి), “ధర్మేచార్ధేవ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తధన్యత్ర యన్ నేహాస్తి నతధ క్వచిత్”(ఓ ధర్మపుత్రా! ధర్మము గురించి కాని, అర్థమును గురించి కాని, కామ మోక్షములను గురించి కాని ఏది ఇక్కడ చెప్పబడినదో అది వేరు ఎక్కడా కనిపించదు)అనియు “ఇతి లౌకిక వైదిక సకలార్ధ నిర్ణయాది కృతత్వేన క్వచిదపి అపక్షపాదిత్వాచ్ఛ పురాణేభ్యో బలవత్తరం”(ఈ విధముగా లౌకిక, వైదిక పరమైన సమస్తర్థములను నిర్ణయించుటలోను ఉపయోగ పడునది అయిన కారణము చేత ఏ విషయమున పక్షపాతము లేనిది అయినందున చేత పురాణముల కంటెను బలమైనది) అను పరిగ్రహాతిశయమును బట్టియు, మధ్యస్థను బట్టియు పురాణముల కంటే ఇతిహాసమగు శ్రీ మహాభారతమునకు గల ప్రాబల్యమును శ్రీ సహస్రనామ భట్టరు వారు ప్రసాదించియున్నారు కదా!. 

అడియేన్ పవన్ రమనుజ డసన్

మూలము : https://granthams.koyil.org/2020/12/09/srivachana-bhushanam-suthram-3-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment