కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 14 – కాళింగ నర్తనం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 13 – దేనుకాసుర వధ

యమునా నది తీరంలో ఒక చెరువులో కాళీయ అనే పాము తన కుటుంబంతో కలిసి నివసించేది. అది దుష్ట మనసు కలిగినది. ఎప్పటికప్పుడు విషాన్ని ఉమ్మడం వల్ల, ఎవరూ ఆ చెరువు దగ్గరికి రాకుండా అడ్డుకుంది. ఎవరు దగ్గరికి వచ్చినా, వారు ఆ విష వాయువును పీల్చి మూర్చిపోయేవారు. పశువులకూ అలానే జరిగింది. అంతేకాక, ఆ ప్రాంతంలోని చెట్లు, మొక్కలు, వాడి క్షీణించిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసి కృష్ణుడు కాళీయును శిక్షించాలని నిర్ణయించాడు.

ఒక రోజు, కృష్ణుడు బాలరామునికి చెప్పకుండా కాళీయ ఉన్న ఆ చెరువు తీరానికి వెళ్లాడు. అక్కడ ఒక కదంబ చెట్టెక్కి, చెరువులో ఉన్న కాళీయ తలపై దూకాడు. కృష్ణుడు కాళీయ తలపై నర్తించి, దానిని తీవ్రంగా బాధపెట్టాడు. కాళీయ గాలి ఆడక, కన్నులు ఉబ్బి, దారుణంగా బాధపడింది. ఇది చూసిన కాళీయ భార్యలు కృష్ణుణ్ణి పొగడుతూ, ప్రార్థించి, క్షమాపణ కోరారు. కాళీయ కూడా తన తప్పును గ్రహించి క్షమించమని యాచించాడు. అప్పుడు కృష్ణుడు, “నీవు ఇక్కడ ఉండరాదు, సముద్రానికి వెళ్లిపో” అని ఆజ్ఞాపించాడు. కాళీయ ఆయన మాట విని విధేయతతో వెళ్లిపోయింది.

ఈ సంఘటనను అనేక ఆళ్వార్లు ఆస్వాదించారు. పెరియాళ్వార్ తన పెరియాళ్వార్ తిరుమొళిలో ఇలా తెలిపారు — “కాలియన్ పొయ్ కై కలఙ్గప్పాయ్ న్దిట్టు అవన్ నీళ్ ముడి ఐన్దిలుమ్ నిన్ఱు నడఞ్జైయ్ దు మీళ అవనుక్కు అరుళ్ శెయ్ ద విత్తకన్ తోళ్ వలి వీరమే పాడిప్పఱ తూమణి వణ్ణనై పాడిప్పఱ” (కాళీయ చెరువులోకి దూకి అల్లకల్లోల పరచి, అతని అయిదు ఫణాలపై నాట్యం చేసి, చివరకు కరుణ చూపిన, అతనికి శరణాగతి చేసి, శ్రీమన్నారాయణుని భుజ పరాక్రమాన్ని స్తుతించుడి; మాణిక్యమువలె ప్రకాశించే స్వామిని స్తుతించుడి) అని వర్ణించారు. ఆండాళ్ నాచ్చియార్ తన నాచ్చియార్ తిరుమొళిలో — “నీర్కరై నిన్ఱ కదంబై ఏరి కాళియన్ ఉచ్చియిల్ నట్టం పాయిందు పోర్క్కలమాగ నిరుత్తం సేయ్ద పొయ్గై కరైక్కు ఎన్నై ఉయ్తిడుమిన్” (కృష్ణుడు కదంబ చెట్టు ఎక్కి, కాళీయ తలపైకి దూకి, యుద్ధరంగమువలె నృత్యం చేసి, యమునా తీరం యుద్ధభూమిని చేసిన, ఆ చెరువు తీరంలో నన్ను విడిచిపెట్టండి.) అని ప్రార్థించింది. కులశేఖర ఆళ్వార్ తన పెరుమాళ్ తిరుమొళిలో , “కాలాల్ కాళియన్ తలై మిధిత్తదుం” (కాళీయుని తలపై కాళ్లను మోపడం) అన్నారు. తిరుమంగై ఆళ్వార్ తన పెరియ తిరుమొళిలో , “కాళియన్ తన్ సెన్ని నడుంగ నడం పయిన్ఱ” (కాళీయుని తల వణికేలా నాట్యం చేశాడు) అని పేర్కొన్నారు.


ఈ సంఘటనలోని సారాంశం:

  • శత్రువులను సంహరించడానికి ఏ ఇతర సహాయం లేకుండానే భగవంతుడు తనంతట తాను చేయగలడు.
  • తప్పు చేసిన వారిని ఆయన శిక్షిస్తాడు, కానీ వారు తమ తప్పును గుర్తించి పశ్చాత్తాపపడితే వారి పట్ల క్షమించి కరుణను ప్రదర్శిస్తాడు.

మూలం : https://granthams.koyil.org/2023/09/19/krishna-leela-14-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment