శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

ఒక రోజు కృష్ణుడు, బలరాముడు మరియు వారి తోటి గోప బాలురు బృందావనంలోని అరణ్యంలో కూర్చున్నారు. గోప బాలులకు ఆకలి వేయడం ప్రారంభమైంది. వారు కృష్ణుడిని, బలరాముడిని వారికి ఆహారం ఏర్పాటు చెయ్యమని ప్రార్థించారు.
అప్పుడు కృష్ణుడు వారితో “ఇప్పుడు మనకు ఎక్కడి నుండి భోజనం దొరకుతుంది? మన ఇళ్లకు చాలా దూరంగా ఉన్నాం. సరే, అక్కడ కొంతమంది ఋషులు ఆశ్రమాలు నిర్మించుకొని, భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్నారు. వారి దగ్గరకు వెళ్లి భోజనాన్ని అడిగి తీసుకురండి. మనందరం కలిసి తిందాం.” అని అన్నాడు.
అలా అన్న వెంటనే, గోప బాలులు అరణ్యంలోకి వెళ్లి, ఒక ఆశ్రమాన్ని కనుగొన్నారు. అక్కడ ఋషులు యాగం చేస్తున్నారు. వారు నేరుగా వాళ్ళ దగ్గరకు వెళ్లి, “మేము కృష్ణుడు, బలరాముడితో కలిసి ఉన్నాం. మాకు చాలా ఆకలి వేస్తుంది. కొంత భోజనం ఇవ్వండి” అని అడిగారు. కానీ యాగంలో నిమగ్నమైన ఋషులు వారిని పట్టించుకోలేదు. బాలులు విచారంగా తిరిగి వచ్చి కృష్ణుడికి విషయం చెప్పారు. అప్పుడు కృష్ణుడు మళ్లీ అన్నాడు: “ఇప్పుడే మళ్లీ అదే స్థలానికి వెళ్ళండి. అక్కడ ఋషుల భార్యలు ఉంటారు. వారికి విషయం చెప్పండి, వారు మీకు భోజనం ఇస్తారు.”
గోపకులు మళ్లీ అక్కడికి వెళ్లి, ఈసారి ఋషుల భార్యలతో: “మేము కృష్ణుడు, బలరాముడి దగ్గర నుండి వచ్చాం. మాకు చాలా ఆకలి వేస్తుంది, దయచేసి కొంత భోజనం ఇవ్వండి.” అని అన్నారు. ఈ విషయం విన్న ఋషి పత్నులు, కృష్ణుడిపై అపారమైన ప్రేమతో, ఎన్నో భోజన పదార్థాలు తీసుకొని వెంటనే బయలుదేరారు. బంధువులు (భర్తలు సహా) అడ్డుకున్నా కూడా, ఆగకుండా వెళ్లి కృష్ణుడు, బలరాముడు మరియు గోప బాలులకు భోజనం సమర్పించారు. కృష్ణుడు వారి భక్తిని చూసి ఆనందంతో భోజనం స్వీకరించి అందరితో పంచుకున్నాడు. తర్వాత ఋషులు తమ తప్పును గ్రహించి, మనసులోనే కృష్ణుని క్షమాపణ కోరారు.
ఈ సంఘటనను ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళిలో ఎంతో మధురంగా ఇలా పేర్కొంటారు: “వేర్తు పసిత్తు వాయిరసైందు వేణ్డడిశిల్ ఉన్నుంబోతూ ఇత్తేన్ఱు పార్థిరుందు నెడునొక్కు కొళ్లుమ్ పత్తవిలోసనత్తు ఉయ్తిడుమిన్” అంటే —గోవులను మేపి అలసిపోయి, ఆకలితో ఒళ్ళు వణుకుతూ, ఋషుల భార్యలు భోజనం తీసుకొని వచ్చే దిశలో ఎదురుచూస్తూ నిలబడ్డ కృష్ణుడు నిలిచిన “పత్తవిలోచనమ్” స్థలానికి నన్ను తీసుకెళ్లండి. ఇక్కడ “పత్త” అంటే భక్తి వల్ల సమర్పించే భోజనం, “విలోచనం” అంటే ఎదురు చూస్తూ చూడడం అని అర్థం. అంటే — ఆహారం వచ్చే వరకు ఎదురు చూసిన ఆ కృష్ణుడిని చూడగలిగే స్థలం.
ఈ సంఘటనలోని సారాంశం:
- ఒక వ్యక్తి వేదాంతంలో నిపుణుడై ఉన్నా, ఎన్నో యాగాలు చేస్తున్నా, భగవత్ భక్తి లేకపోతే, ఆ జ్ఞానం ఉపయోగంలేదు.కానీ శాస్త్రాలు పూర్తిగా నేర్చుకోకపోయినా, భగవంతుని గురించిన మాట వినగానే మనసు కరిగిపోతే, అది భగవంతునికి ఎంతో ప్రీతికరం.
- భగవంతుని దయను గ్రహించి ఆయనను శరణు వేడటమో, లేక ఇతర భక్తుల ఉదాహరణ చూసి మనస్సు మారటమో, ఈ రెండింటిలో ఏదీ లేకపోయిన, మోక్షం కలగదు.
మూలం : https://granthams.koyil.org/2023/09/25/krishna-leela-19-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org