కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 23 – అరిస్టాసుర, కేశి మరియు వ్యోమాసుర వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 22 – కుండల తో నృత్యం

ఈ విధంగా, కృష్ణుడు బృందావనంలో నివసిస్తున్నప్పుడు, కంసుడు పంపిన మరికొంతమంది అసురులు ఒక్కొక్కరిగా వచ్చి కృష్ణుణ్ణి చంపేందుకు ప్రయత్నించారు. కృష్ణుడు వారిని సులభంగా సంహరించాడు. ఇక ఇప్పుడు ఆ సంఘటనలను అనుభవిద్దాం.

అరిష్టాసురుడు ఒక క్రూరమైన, పెద్ద ఎద్దు రూపంలో, భయంకరమైన కోపంతో కృష్ణుడు మరియు బలరాముని చంపడానికి వచ్చాడు. అతడు కృష్ణుని వైపు దూసుకొచ్చినప్పుడు, కృష్ణుడు అతని కాళ్లను పట్టుకుని పైకి ఎత్తి నేలపై పడవేసి హతమార్చాడు.

కేశి అనే రాక్షసుడు ఒక భారీ గుర్రం రూపంలో వచ్చాడు. దానిని చూసి నారద మహర్షి “ఇక కృష్ణుడు తప్పించుకోలేడు” అని భయపడి మూర్ఛపోయాడు. కేశి కృష్ణుణ్ని చంపేందుకు ముందుకు దూసుకొస్తున్నప్పుడు, కృష్ణుడు అతని నోరు పట్టుకుని రెండు భాగాలుగా చీల్చి చంపేశాడు. కృష్ణుడు కేశిని హతమార్చిన వార్త విన్న తరువాతే నారదుడు మళ్ళీ కోలుకున్నాడు.

ఈ సంఘటనను పలువురు ఆళ్వార్లు తమ దివ్యప్రబంధాలలో అనుభవించారు. పోయ్గై ఆళ్వార్ తమ ముదల్ తిరువన్దాదిలో  “మావాయ్ పిలన్దు” (గుర్రం ముఖాన్ని చీల్చినవాడు) అని అన్నారు. నమ్మాళ్వార్ తిరువాయ్మొళిలో “తురన్గమ్ వాయ్ పిలన్దానురై తొలైవిల్లిమంగళం” ( గుర్రం నోరు చీల్చినవాడు తొలైవిల్లిమంగళంలో కొలువై ఉన్నాడు) అని అనుభవించారు. కులశేఖర ఆళ్వార్ తమ పెరుమాళ్ తిరుమొళిలో “మావియై వాయ్ పిళన్దు ఉగన్దు మాలై “(భగవానుడు గుర్రం నోరు చీల్చి ఆనందించాడు) అని పాడారు. ఆండాళ్ తమ తిరుప్పావైలో ” మావాయ్ పిళన్దానై “(గుర్రం నోటిని చేల్చిన వాడు) అని పలికింది. తిరుమంగై ఆళ్వార్ తిరునెడున్దాణ్డకమ్ లో “మా కీణ్డ కైత్తలత్తు ఎన్ మైన్దా” (గుర్రాన్ని చంపిన అందమైన చేతుల కల యువరాజు) అని అన్నారు. ఇక్కడ “తురన్గమ్” మరియు “మా” అనే పదాలు గుర్రాన్ని సూచిస్తున్నాయి.

ఒక రోజు వ్యోమాసురుడు, కంసుడి ఆజ్ఞతో, గొపాల బాలకుల వేషంలో కృష్ణుడు మరియు ఇతర బాలకులతో ఆటలాడేందుకు వచ్చాడు. క్రమంగా ఒకొక్క బాలుడిని ఒంటరిగా తీసుకెళ్లి చివరికి కృష్ణుణ్ని చంపాలని యోచించాడు. ఇది గ్రహించిన కృష్ణుడు అతడిని కూడా హతమార్చాడు.

ఈ విధంగా, కంసుడు పంపిన అనేక రాక్షసులు గోకులం మరియు బృందావనానికి వచ్చి కృష్ణుణ్ని చంపాలని యత్నించారు. కానీ వారందరూ కృష్ణుడిచేత హతమయ్యారు.

ఈ సంఘటనలోని సారాంశం:

  • చెడు మనస్సుతో, ఏ రూపంలో వచ్చినా, ఎవరు కృష్ణుని వద్దకు చేరినా. ఆయన వారిని వెంటనే గుర్తించి సంహరిస్తాడు.
  • భగవానునికి ఆపదలు అనిపించినా, అవి నిజంగా ఆపదలు కావు; ఎందుకంటే ఎవ్వరూ ఆయనకు హాని చేయలేరు. కానీ ఆ ప్రమాదాలు ఆయన భక్తులకు మాత్రం భరించలేనివి, ఎందుకంటే వారు భగవానునికి ఏ దోషం, బాధ కలగడాన్ని తట్టుకోలేరు. అందువల్లే ఆయన ఆ ప్రమాదాలను తొలగించి తన భక్తుల మనోవేదనను తొలగిస్తాడు.

మూలం : https://granthams.koyil.org/2023/09/29/krishna-leela-23-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment