కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 24 – నప్పిన్నై పిరాట్టి (నీళా దేవి)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 23 – అరిస్టాసుర, కేశి మరియు వ్యోమాసుర వధ

కృష్ణ లీలల్లో అత్యంత ముఖ్యమైన, అందమైన అంశాల్లో ఒకటి — కృష్ణుడు మరియు నప్పిన్నై పిరాట్టి మధ్య ఉన్న అనురాగ సంబంధం. దీనిని ఆళ్వార్ల పాసూరముల ద్వారా ఎంతో మధురంగా ఆస్వాదించవచ్చు.

ముందుగా, “నప్పిన్నై పిరాట్టి ఎవరు?” అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఆమె నీళాదేవి అవతారం. శ్రీమన్నారాయణుడికి ప్రధానంగా మూడు దేవేరులు ఉన్నారు —శ్రీదేవి (పెరియాపిరాట్టియార్), భూదేవి (భూమిపిరాట్టియార్), నీళాదేవి. వీరిలో నీళాదేవి నప్పిన్నై పిరాట్టిగా అవతరించారు. పరాశర భట్టార్ తిరుప్పావైకు రాసిన తనియన్‌లో మొదటి మాటే —“నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం” అంటే, నప్పిన్నై పిరాట్టి యొక్క పర్వత శ్రేణుల్లా ఉన్న వక్షస్థలంపై విశ్రాంతిగా ఆనందంగా శయనిస్తున్న కృష్ణుని మేల్కొల్పుతోంది అనే భావం. పిళ్ళైలోకాచార్యర్ తమ వ్యాఖ్యానంలో ఒక పురాణ శ్లోకాన్ని ఉట్టంకిస్తూ — నప్పిన్నై పిరాట్టి యశోదా దేవి తమ్ముడు అయిన కుంభకుడి కుమార్తె, మిథిలా రాజకుమార్తె, మరియు గోపాలకుల వంశంలో పుట్టినవారని చెప్పారు.

రామావతారంలో, పెరియ పిరాట్టియార్, సీతాపిరాట్టి పురుషకారంగా నిలిచింది. వరాహావతారంలో భూదేవి పురుషకారిగా నిలిచింది. కృష్ణావతారంలో నప్పిన్నై పిరాట్టి పురుషకారంగా నిలిచింది. రుక్మిణి పిరాట్టి ప్రధాన భార్య అయినా, ఆళ్వార్ల పాశురములలో, రుక్మిణి మరియు సత్యభామకు తక్కువ ప్రస్తావన, కానీ నప్పిన్నై పిరాట్టికి అధిక ప్రాధాన్యత కలదు.

నప్పిన్నై పిరాట్టి తండ్రి ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించాడు. ఆమెను పొందడానికి ఏడు శక్తివంతమైన ఎద్దులు వశం చేయాలని నియమం పెట్టాడు. నమ్మాళ్వార్ చెప్పినట్లుగా, కృష్ణావతారం రావడం యొక్క రెండు ప్రధాన కారణాల్లో ఒకటి —నప్పిన్నై పిరాట్టి ఆలింగనం కోసం. కృష్ణుడు ఆ ఏడు ఎద్దులను ఒకేసారి మెడల దగ్గర పట్టుకుని అణిచివేసి హతమార్చాడు. అందుకు నప్పిన్నై పిరాట్టి సంతోషంగా కృష్ణుణ్ణి వరించింది.

పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళి లో “పిన్నై మనాళనై పేరిల్ కిడన్దానై” ( నప్పిన్నై పిరాట్టి నాథుడు తిరుప్పేర్ నగరంలో శయనించి ఉన్నాడు)అని, ఆండాళ్: “ఉన్దు మదగళిత్తన్”, “కుత్తు విళక్కెరియ”, “ముప్పత్తు మూవర్” మూడు వరుస పాసురాలలో నప్పిన్నై పిరాట్టి ద్వారా కృష్ణుణ్ణి చేరేందుకు ప్రయత్నించింది. నమ్మాళ్వార్ తమ తిరువాయ్మొళి లో నప్పిన్నై పిరట్టిని చూపుతూ “పిన్నైకోల్ నిలమామగళ్కోల్ ?” (ఈవిడ నప్పిన్నై పిరాట్టియా లేదా భూదేవియా?). తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమొళిలో “ఆయర్పావై నప్పిన్నై తనక్కిరై” (గోపాకుల నాయకి అయిన నప్పిన్నై పిరట్టి నాథుడు). ఇంకా పలువురు ఆళ్వార్లు తమ పాశురాల్లో నప్పిన్నై పిరాట్టి వైభవాన్ని చెప్పారు.

ఈ లీలల సారాంశం:

  • నప్పిన్నై పిరాట్టిపై కృష్ణునికి అపారమైన ప్రేమ ఉంది, ఎంతగా అంటే ఆ అవతారం కేవలం తన కోసమే అనేంతగా. నమ్మాళ్వార్ తిరువిరుత్తంలో ఇలా అంటారు”శూట్టు నన్మాలైకళ్ తూయన ఏన్ది విణ్ణోర్ గళ్ నన్నీర్ అట్టి అమ్ తూపమ్ తరానిఱ్కవేయఙ్గ ఓర్మాయైయినాల్ ఈట్టియ వెణ్ణెయ్ తొడువుణ్ణ పోన్దుం ఇమిల్ ఏర్ట్రవన్ కూన్ కోట్టిడై యాడినై కూత్తు అడల్ ఆయర్ తమ్ కొమ్బినుక్కే”  — భగవంతుడు ఈ లౌకిక అవతారానికి రావడానికి రెండు కారణాలు: 1)భక్తులు ప్రేమతో చేసిన వెన్నను తినడానికి 2)నప్పిన్నై పిరాట్టిని ఆలింగనం చేయడానికి
  • శ్రీమద్భాగవతంలో కృష్ణుడు పెద్దగా పెరిగాక ఏడు ఎద్దులను అణచి, సత్యా (నాగ్నజిత్తి కుమార్తె)తో పెళ్లి జరిగినట్టు చెప్పబడింది. కానీ ఆండాళ్ మరియు ఆళ్వార్లు దీనిని గోకులం కాలంలోనే జరిగినట్టు దర్శించి అనుభవించారు. శ్రీ కృష్ణుడు గోకులం మరియు బృందావనంలో పది సంవత్సరాల వయస్సు వరకు ఉన్నాడు. ఆ తరువాత ఉపనయనం జరిగిన తర్వాత, మథురకు వెళ్లి తిరిగి గోకులానికి రాలేదు. అందువల్ల, ఇది ఆళ్వార్లకు భగవంతుడు ఇచ్చిన అద్భుత దివ్య దర్శనం అని భావించబడుతుంది.

మూలం : https://granthams.koyil.org/2023/10/01/krishna-leela-24-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment