శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 24 – నప్పిన్నై పిరాట్టి (నీలా దేవి)
కంసుడు అనేక రాక్షసులను పంపించాడు, ఎలాగైనా కృష్ణుణ్ణి చంపాలి అని భావించాడు. కానీ ఆ రాక్షసులందరినీ కృష్ణుడు సంహరించాడు. చివరకు కంసునికి మిగిలింది భయం మరియు నిరాశ మాత్రమే.
విష్ణుభక్తులలో గొప్పవాడైన నారద మహర్షి, కంసుని సభకు వచ్చాడు. అతను కంసునితో ఇలా చెప్పాడు: “నిన్ను చంపబోయే కృష్ణుడు, బలరాముడు బృందావనంలో, ఆనందంగా ఉన్నారు. నీ అంత్యకాలం సమీపించింది.” ఈ మాటలు విన్న కంసుడు కోపంతో కంపించాడు. ముందే అశరీరి వాక్యం విని భయపడిపోయి ఉన్నాడు. ఇప్పుడు నారదుని నిర్దిష్టమైన మాటలు మరింత భయాన్ని కలిగించాయి.
తర్వాత అతను కృష్ణుణ్ని చంపాలి అని. ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు అతను ఒక పథకం రచించాడు. ఒక ధనుర్యాగం (బాణోత్సవం) నిర్వహించి ; కృష్ణుడు, బలరాముడిని ఆహ్వానించి ; అక్కడే కృష్ణుణ్ణి హతమార్చాలి, ఈ ప్రయత్నంలో, శక్తివంతమైన కువలయాపీడ అనే గజరాజు, శూరులు అయిన చాణూరుడు, ముష్టికుడు వంటి మల్లయోదులు, కృష్ణుణ్ణి చంపుతారని ఆశపడ్డాడు. అలాగేమీ కాలేకపోయినా — “నేనే అవకాశం చూసి ప్రమాదంలాగ చంపేస్తాను” అని దుష్టబుద్ధితో ఆలోచించాడు. తర్వాత అతను అక్రూరుడిని పిలిచి కృష్ణుడు, బలరాముడిని వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రంతా కంసుడు కళ్ళు మూసి నిద్రపోలేక, భయం మరియు దురుద్దేశంతో బాధపడుతూ గడిపాడు.
పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళి లో “తీయ పున్దిక్కంజన్ ఉన్ మేల్ సినముదైయన్”(దుర్బుద్ధి కలిగిన కంసుడు నీపై కోపంతో ఉన్నాడు, ఓ కృష్ణా!) ఆండాళ్ తిరుప్పావైలో:“తతరిక్కిలానాగిత్యాన్ త్యాన్ తీంగు నినైన్ద కరుత్తై పిళైప్పిత్తు కఞ్జన్ వయిత్తిల్ నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే”(కంసుడు కృష్ణుడు బ్రతికే ఉన్నాడన్న ఆలోచన కూడా తట్టుకోలేక దుష్టబుద్ధి చేశాడు; అటువంటి కంసుని హృదయంలో అగ్నివలె నిలిచినవాడా, కృష్ణా!).
అక్రూరుడు పూర్తిగా కృష్ణభక్తుడు. ఆజ్ఞ విన్న వెంటనే అతని హృదయం ఆనందంతో నిండిపోయింది . “రేపు ఉదయం కంసుడిని చూడడానికి లేచే బదులు, నేను శ్రీకృష్ణుడిని దర్శించే అదృష్టం పొందబోతున్నాను” అని ఆనంద పడుతూ, పరమోత్కంఠతో బృందావనం బయలుదేరాడు.
ఈ సంఘటన లోని సారాంశం:
- కంసుడు ఎప్పుడూ కృష్ణుడి గురించే ఆలోచించాడు. కానీ ద్వేషంతో, దురుద్దేశంతో.అలాంటి ఆలోచనలు ఆధ్యాత్మికంగా ప్రయోజనకరమైనవి కావు.
- ఎవరైనా భగవంతుణ్ణి మోసం చేయాలని యత్నించినా —భగవంతుడు మరింత తెలివిగలవాడు. కంసుడు ఎవరికి తెలియకుండా కృష్ణుణ్ణి చంపుతాను అనుకున్నాడు. కానీ చివరకు కృష్ణుడే అతన్ని సంహరించాడు — తన దుష్టబుద్ధి, పాపసంకల్పం అతనితోపాటే అంతమైంది.
మూలం : https://granthams.koyil.org/2023/10/02/krishna-leela-25-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org