కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 26 – అక్రూరుడి యాత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 25 – కంసుడి భయం మరియు దుర్బుద్ధి

కంసుడిచే, శ్రీ కృష్ణ-బలరాములను తీసుకురమ్మని పంపబడ్డ అక్రూరుడు, తెల్లవారుజామునే వేగంగా బృందావనం వైపుగా బయలుదేరాడు. అక్రూరుడికి కృష్ణునిపై అపారమైన భక్తి కలదు. ఎన్నాళ్లుగానో కృష్ణుణ్ణి దర్శించాలనే తపస్సుతో ఎదురుచూస్తున్నాడు. అక్రూరుడి ఈ ప్రయాణాన్ని ఆచార్యులు తిరువేంకటం యాత్ర లాంటిదని, మరియు అర్చిరాది మార్గం ద్వారా పరమపదానికి చేరుకునే ప్రయాణంలాంటిదని పోలుస్తారు.

అక్రూరుడు ఉదయమే రథం ఎక్కి వేగంగా బృందావనం వైపు సాగాడు. ప్రయాణమంతా అతను మనసు ఇలా ఊహల్లో మునిగిపోయాడు: “బృందావనానికి చేరుకొని ఆయన దివ్యపాదాలకు నమస్కరిస్తాను…ఆయన తన దివ్యహస్తాలతో నన్ను పైకి లేపి హత్తుకుంటాడు…” ఈ తపన, ఆనందం, ఆత్రుతతో అతను సాగుతూనే ఉన్నాడు. బృందావనానికి చేరేసరికి, కృష్ణుడు మరియు బలరాముడు ఆవుల పాలు పితకటానికి బయలుదేరుతున్నారు. కృష్ణుణ్ణి ఒక్కసారి చూసి —అక్రూరుడు భావావేశంతో నిండిపోయాడు. అతను రథం నుండి కిందికి దూకి, పరుగెత్తి వెళ్ళి, కొట్టిన వృక్షంలా కృష్ణుడి పాదాలపై పడ్డాడు. కృష్ణుడు అతన్ని తన దివ్యహస్తాలతో పైకి లేపి, ఆప్యాయంగా హత్తుకొని, అతనిని అపారమైన ఆనందం కలగచేసాడు.

తర్వాత వారు అతన్ని గృహాంలోకి తీసుకువెళ్లి, మనోహరంగా అతిథి సత్కారం చేశారు. నందగోపుడు, బలరాముడు, కృష్ణుడు అక్రూరుడు ఎందుకు వచ్చాడో అడిగారు. అప్పుడు అక్రూరుడు కంసుని కపటపన్నాగాన్ని వివరించాడు. అది విన్న వెంటనే కృష్ణుడు:“మనం వెంటనే అక్రూరుడితో వెళ్లాలి.” అని చెప్పాడు. నందగోపుడు వారితో పాటు అనేక మందిని పంపాలి అని నిశ్చయించాడు. అలా అక్రూరుడు, కృష్ణుడు, బలరాముడు రథంలో మథుర వైపు బయలుదేరారు. రథం కదులుతుండగా గోపికలు కన్నీళ్లు పెట్టుకున్నారు . కృష్ణుడి వియోగం వారు సహించలేకపోయారు. రథం సాగుతుండగా వారు పరుగెత్తి వెళ్ళి ఆపాలని చూశారు. కానీ కృష్ణుడు వారిని ఆపి, వారితో అనిచ్ఛగా వీడ్కోలు పలికాడు.

కొంతదూరం ప్రయాణించిన తరువాత, వారు యమునా తీరం వద్దకు చేరుకున్నారు. అక్రూరుడు సంధ్యావందనం చేయడానికి రథం ఆపి, నది లోపలికి అడుగుపెట్టాడు. అతను ఆచమనానికి నీరు తీసుకునే వేళ —యమునా లోతుల్లో ఆదిశేషంపై ఆనందంగా విశ్రాంతిగా ఉన్న భగవంతుని దర్శించాడు! అద్భుత భక్తివిస్మయంతో చూసినప్పుడు —కృష్ణుడు బయట రథంపై కూడా కూర్చున్నాడు!ఈ సర్వేశ్వర దర్శనం చూసి అక్రూరుడు పరమానందంలో మునిగిపోయి, భగవంతుని మహిమను స్తోత్రంగా గానం చేశాడు.

ఇలా అకూరుడు కృష్ణుడు, బలరాములను మథురకు తీసుకొచ్చాడు.

ఈ సంఘటనలోని సారాంశం:

  • ప్రతిరోజూ మనలో భగవానుని చేరాలనే తపన, కోరిక ఉండాలి.
  • ఎక్కడ ఉన్నా, ఏస్థితిలో ఉన్నా —భగవంతుని చేరాలన్న ఆర్తి ఉన్న వారికి, భగవంతుడు కృపను తప్పక అనుగ్రహిస్తాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/02/krishna-leela-26-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment