శ్రీ వచన భూషణము – సూత్రము 5

శ్రీ వచన భూషణము

<< సూత్రము – 4

సూత్రము – 5

అవతారిక
మొట్టమొదట “వేదార్ధం.. ” మొదలగు వాక్యములచే పిళ్ళై లోకాచార్యుల వారు వేదమును, వాటి అర్ధములను, ఉపబృంహణములను విస్తృతముగా వివరించినారు. వేదము యొక్క భాగములు అయిన పూర్వ(కర్మ), ఉత్తర(బ్రహ్మ) విభాగములను వివరించినప్పటికీ చేతనుల ఉజ్జీవనమునకు కావలసిన అర్ధములను ప్రతిపాదించుటకు ఉపక్రమించిన వారై అవి (ఆ అర్ధములు) పూర్వ భాగము నుండి తెలియరానివి అగుట చేతను, ఉత్తర భాగము నందే తెలియవచ్చునవి అగుట చేతను, పూర్వ భాగమున ముముక్షువులకు తెలియవలసిన అంశములను ఉత్తర భాగ ప్రతిపాదితములగు స్వరూప, ఉపాయ, పురుషార్ధములను చెప్పు తదనుగుణములగు త్యాజ్యోపాదేయములను తెలుపునప్పుడు వాటి మూలముగా ఉండుట వలన ఉత్తర భాగము యొక్క అర్ధములను నిర్ణయుంచుటకై పూనుకొని దానిలోని భగవత్స్వరూప, రూప, గుణ, విభూతులను, భగవదుపాసనాదులను బాగా ప్రతిపాదించు రీతి యందు సారాసార వివేక పూర్వకముగా తాత్పర్యార్ధములను సంగ్రహించి ఎట్టి సంశయము మరియు భ్రమ కలుగకుండా చేతనులకు స్పష్టముగా గోచరించేట్టు ఇక మీద ప్రతిపాదించుచున్నారు. అందులో మొదట ఉత్తర భాగము యొక్క అర్థమును నిర్ణయించునట్టి రెంటిలో గొప్పదైనదిగా చెప్పబడిన ఇతిహాసములలో ఒకటైన శ్రీ రామాయణము యొక్క గొప్పతనమును చెప్పదలచి అందులో ప్రతిపాదింపబడిన విషయమును కృప చేయుచున్నారు.

సూత్రము
ఇతిహాస శ్రేష్ఠమాన శ్రీ రామాయణత్తాల్ శిఴైయిరున్దవళ్ ఏత్తమ్ శొల్లుగిఴతు; మహాభారతత్తాల్ తూతుపోనవన్ ఏత్తమ్ శల్లుగిఴతు

సంక్షిప్త వ్యాఖ్యానము
ఇతిహాసములలో శ్రేష్ఠమైన శ్రీ రామాయణములో చెరసాలలో ఉన్న ఆమె గొప్పతనము చెప్పబడినది. మహాభారతములో దూతగా వెళ్లిన వాని గొప్పతనము చెప్పబడినది.

వ్యాఖ్యానము

ఇతిహాస శ్రేష్ఠమాన…
ఇతిహాసముల యందు శ్రీ రామాయణమునకు గల ప్రాబల్యమునకు గల కారణములు
– సృష్టికారకుడు అయిన చతుర్ముఖ బ్రహ్మ చేత సత్కారములను పొందిన శ్రీ వాల్మీకీ భగవానునిచే రచించబడడము వలన శ్రీ రామాయణము బాల కాండము 2.26 “వాల్మీకాయే మహర్షయే సన్దిదేశాసనంతతః బ్రహ్మణా సమనుజ్ఞాత స్సోప్యుపా విశ దాసనే”(వాల్మీకీ మహర్షికి చతుర్ముఖ బ్రహ్మ ఆసనమును ఇచ్చెను. అట్టి శ్రీ వాల్మీకీ మహర్షి బ్రహ్మ అనుజ్ఞచే ఆసనమున కూర్చొనెను) అని చెప్పినట్టుగా
– బ్రహ్మచే అనుగ్రహింపబడినట్టు ఇందులో చెప్పబడిన అన్ని సూత్రములు సత్యములే “నతేవాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి”(ఈ కావ్యమున నీవు రాసినది ఏది అబద్ధము కాజాలదు)
– లోకముచే అంగీకరింపబడడము చేత “తావద్రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి”(ఎంత వరకు ఈ లోకమున పర్వతములు, నదులు ఉండునో అంతవరకు శ్రీ రామాయణ కథ ఈ ప్రపంచములో ఉండును)

ఈ కారణములు చేత శ్రీ రామాయణము ఇతర ఇతిహాసములు కంటే ప్రామాణికమైనది. ఈ విషయమే నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టరు వారు తమ “తత్త్వ త్రయము” అను ప్రబంధమున ప్రమాణాధికారమున(ప్రమాణములను చెప్పు అధ్యాయము) కృప చేసియున్నారు. ఇంకా స్కాంద పురాణము “వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే | వేదః ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా||”(వేదము ద్వారా తెలియబడు సర్వ స్వామి అయిన ఆ శ్రీమన్నారాయణుడు దశరధుని కుమారునిగా అవతరించెను. వేదములు శ్రీ రామాయణ రూపమును దాల్చి ప్రాచేతసుని కుమారుడైన శ్రీ వాల్మీకీ మహర్షి ద్వారా అవతరించెను) అని చెప్పినట్టు అందరికంటే విలక్షణుడు అయిన ఆ సర్వేశ్వరుడు సంసారములో చేతనులను ఉద్ధరించుటకై మానవ రూపములో శ్రీ రామునిగా అవతరించెను. చేతనులలో రుచి కలిగించుటకై సకల శాస్త్రములలో గొప్పదైన వేదము రామావతారమున ఉండు గొప్ప కళ్యాణ గుణములను, చేష్టితములను బయలుపరచుటకై శ్రీ రామాయణముగా అవతరించెను. ఈ విధముగా చెప్పడము చేత శ్రీ రామాయణము యొక్క గొప్పతనము సిద్ధించడము అయినది.

శిఴైయిరున్దవళ్ ఏత్తమ్…
పిరాట్టిమార్లు(శ్రీ మహాలక్ష్మి) అని కాకుండా “శిఴైయిరున్దవళ్”(చెరసాలలో ఉన్న ఆమె) అని కృప చేయుటకు గల కారణము పిరాట్టిమార్లకు ఉండు గొప్ప వాత్సల్యమును తెలుపుటకు. తన యొక్క కృప చేత రావణుని వద్ద బంధీలుగా ఉన్న దేవతా స్త్రీలను విడిపించుటకు ఆ సర్వేశ్వరుని పట్ట మహిషిగా ఉన్న పిరాట్టిమార్లు ఆమె గొప్పతనమును మరచి తనకు తానుగా బంధీ అయ్యెను. ఎలా అయితే లోకములో ఒక తల్లి తన బిడ్డ నూతిలో పడితే తాను కూడా అందులోకి దూకి బిడ్డని కాపాడునో అలానే పిరాట్టిమార్లు కూడా ఈ సంసారములో మునిగి పడరాని పాట్లు పడుతున్న జీవాత్మలను చూసి వారిని రక్షింపదలచి తానూ కూడా ఈ లోకములో జన్మించెను. అందుచేత తన యొక్క ఈ చేష్ఠితము తనకు ఉండు ఉత్క్రుష్టమైన వాత్సల్య గుణమును (సహజముగా అందరి చేతనుల పట్ల తనకు ఉండు మాతృత్వమును) బయలుపరిచెను. పరమాచార్యులుగా ప్రసిద్ధి గాంచిన నమ్మాళ్వార్లు తిరువాయిమొళి 4.8.5 “తనిచ్చిఴైయిల్ విళప్పుత్త కిళి మొళియాళ్”(చిలుక వంటి మధురమైన పలుకులను కలిగిన పిరాట్టిమార్లు తనను రహస్యముగా ఉంచబడిన చెరసాలలో ప్రకాశించెను) లో ఆమె యొక్క ఈ గొప్ప గుణమును కీర్తించినారు. ఆళ్వార్ల అట్టి దివ్యమైన వచనముల వలనే కదా పిళ్ళై లోకాచార్యుల వారు కూడా ఈ విధముగా చెప్పుచున్నారు! కర్మ చేత సంక్రమించు చెరసాల అనునది చాలా హేయమైనది, కానీ తన యొక్క కృప మరియు వాత్సల్యము చేత దేవతా స్త్రీలను రక్షించుటకై(విడిపించుటకై) తనకు తానుగా చెరసాలలో బందీగా ఉండుట అనే ఈ చేష్టితము ఆమె యొక్క గొప్పతనుమునే ప్రకాశింపజేయును. సంసారులతో సమానముగా గర్భవాసము చేసి జన్మించుట అనేది తిరువాయిమొళి 1.3.2 “పల పిఴప్పాయ్ ఒళివరుమ్”(అనేక జన్మలను ఎత్తి ప్రకాశించువాడు) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరునికి తేజోమయమగును.అది కర్మ మూలముగా కలిగినది కాకుండా అనుగ్రహ మూలముగా కలుగుట వలన తేజోమయమైనట్టుగా పిరాట్టిమార్ల ఈ చర్య కూడా తన వాత్సల్యముతో అవ్వడము వలన తేజోమయమే అగును కదా! కేవలము హేయమైన వారికి మాత్రమే ఆమె యొక్క గొప్ప శక్తి అర్ధముగాక ఆమె రావణుని పరాక్రమము వలనే చెరసాల పాలైనది అని తోచును. శ్రీ రామాయణము సుందరకాండము 53.29 “శీతోభవ”(అగ్ని కూడా హనుమకి చల్లగా ఉండుగాక)లో అన్నట్టుగా ఆమె ఎంతో సులువుగా “నష్టో భవ”(రావణుడు నాశనమైపోవుగాక) అని అనివుండవచ్చును. ఆమె యొక్క వాత్సల్యము వలన ఇతరులను రక్షించుటకు గొప్ప గుణములు అయిన దయ మొదలగు వాటిని బయలుపరుచుటకే పిళ్ళై లోకాచార్యుల వారు “శిఴై యిరున్దవళ్” అని కృప చేసినారు. శ్రీ వాల్మీకీ భగవానుడు కూడా శ్రీ రామాయణము మొత్తము అంతా సీతా పిరాట్టి యొక్క గొప్పతనమును చెప్పును అని శ్రీ రామాయణము బాల కాండము 4.7 “కావ్యం రామాయణం కృత్స్నమ్ సీతాయాః చరితం మహత్” (శ్రీ రామాయణము అను ఈ కావ్యము మొత్తము సీతా పిరాట్టి యొక్క గొప్పతనుమునే చెప్పును) అని వ్రాసి ఉన్నారు. పరాశర భట్టరు వారు కూడా శ్రీ గుణ రత్న కోశము 14 “శ్రీమద్రామాయణమపి పరం ప్రణీతి త్వచ్చరిత్రే”(నీ చరిత్ర వల్లనే శ్రీమద్రామాయణము జీవమును కలిగినది అవుచున్నది) అని చెప్పి ఉన్నారు కదా!.

ఇక మీద పిళ్ళై లోకాచార్యుల వారు మహాభారతమున ప్రతిపాదింపబడిన విషయమును కృప చేయుచున్నారు.

మహాభారతత్తాల్…
శ్రీ విష్ణు పురాణము 3.4.5 “కృష్ణద్వైపాయనం వ్యాసమ్ విద్ధి నారాయణం ప్రభుమ్ కోహ్యన్యో భువిమైత్రేయ మహాభారత కృత్భవేత్”(ఓ మైత్రేయుడా! కృష్ణద్వైపాయనిగా పేరొందిన వ్యాస మహర్షి సాక్షాత్తు నారాయణుడే. ఆతను కాక మరి ఎవరు ఈ లోకములో మహాభారతమును రచించగలరు?) అని చెప్పినట్టు వ్యాస మహర్షి భగవానుని ఆవేశ అవతారము. “ఏవం విధం భారతం తు ప్రోక్తం యేన మహాత్మనా సోయం నారాయణస్సాక్షాత్ వ్యాస రూపీ మహామునిః”(మహాభారతమును ఏ మహాత్మునిచే చెప్పబడినదో ఆతను వ్యాస మహామునుల రూపమును ధరించిన నారాయణుడే) అనియు “సహో వాచః వ్యాసః పారాశర్యః”(పరాశరుని కుమారుడు అయినట్టి వ్యాస మహర్షి). ఈ మహాభారతమును పంచమ వేదముగా రచించిన వ్యాస భగవానుడు మహాభారతము “వేదాన్ అధ్యాపయామాస – మహాభారత పంచమాన్”(పంచమ వేదము అయిన మహాభారతమును ఆయన చెప్పెను) అన్నట్టుగా పలు పురాణములలో గొప్పగా కీర్తింపబడినట్టి మహాభారతము శ్రీ రామాయణముతో సమానముగా ఉత్క్రుష్టమైన ప్రమాణము అని చెప్పడమైనది. దీనినే నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టరు వారు కృప చేసినారు. శ్రీ విష్ణు సహస్రనామ భాష్యములో పరాశర భట్టరు వారు కూడా “శ్రీరామాయణవన్ మహాభారతం శరణం”(శ్రీ రామాయణము మరియు మహాభారతము మోక్షమునకు ఉపాయములు) అని కృప చేసియున్నారు.

సర్వేశ్వరన్ అని కాకుండా “తూదు పోనవన్”(దూతగా వెళ్లినవాడు) అని పిళ్ళై లోకాచార్యుల వారు చెప్పుటకు గల కారణము – ఆతని(భగవానుని) ఆశ్రిత పారతంత్ర్యము(తన భక్తుల పట్ల విధేయతతో ఉండువాడు) అను గుణమును ఎత్తి చూపుటకే. దేవదేవుడైన తన గొప్పతనమును తాను చేయు కార్యము యొక్క చిన్నతనమును గమనింపక(లెక్కపెట్టక) పాండవులకు దూతగా వెళ్ళినది తనకు గల పారతంత్ర్యమున ఉండు రుచిచే పరవశుడై కదా! తనని ఆశ్రయించు తన భక్తుల విషయమున ఒక సౌకుమార్యమును కలుగజేయునట్టి కారుణ్యమునకు తన యొక్క ఈ చర్య తనకు గల వాత్సల్యాది మొదలగు గుణములను చూపించుటకే. ఇట్టి గుణాతిశయ విషయమున గల ఇష్టము చేతనే కదా శ్రీ తిరుమంగై ఆళ్వార్లు పెరియ తిరుమొళి 2.2.3 “ఇన్ఴార్ దూతన్ ఎన నిన్ఴాన్”(పాండవుల పక్షమున దూతగా నిలబడినవాడు) అనియు పెరియ తిరుమొళి 6.2.9 “కుడై మన్నర్ ఇడై నడన్ద తూదా”(దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లినవాడు) అని చెప్పినట్టు ఈ దివ్యమైన పలుకుల వల్లనే కదా శ్రీ పిళ్ళై లోకాచార్యుల వారు ఈ విధముగా కృప చేసినారు! మన సంప్రదాయములో గొప్పతనము ఏమి అనగా ఆళ్వార్లు, ఆచార్యులు చెప్పినదే తిరిగి చెప్పడము. కర్మ వస్యుడై దూతగా వెళ్ళుట అనునది హేయమైన చర్య కానీ కేవలము తన కోరిక మేరకే భగవానుడు తన భక్తుల కోసము చేయు చిన్న చిన్న కార్యములు ఆయన యొక్క గొప్పతనమునే ప్రకటింపజేయును. శృతి “స ఉ శ్రేయాన్ భవతి జాయమానః”(అతడు అవతరించి గొప్ప వాడు అవుతున్నాడు) అన్నట్లుగా ఇతరుల కోసము జన్మించుట శ్రేయస్కరము అని శృతి తెలుపుట అనునది పరుల కోసము తన ఇష్టముచే చేయువన్నీ తేజస్కరములుగా ఉండును అని అనుటకే కదా!

ఈతను దూతగా వెళ్ళడము అనునది తక్కువ చర్య అని తలచు వారు మూర్ఖులలో అగ్రేసరులు(పెద్దవారు). జ్ఞానులలో ఉత్తములైన వారు దీనిని తలచి తిరువాయిమొళి 1.3.1 “ఎత్తిఴమ్”(ఎంత ఆశ్చర్యమో!) అని చెప్పినట్టు మోహించెదరు(భగవానుని పట్ల వ్యామోహము చెందెదరు). ఇటువంటి ఈ కారుణ్యము యొక్క మహిమను ప్రకాశింపజేయుటకై పిళ్ళై లోకాచార్యుల వారు దయతో దూతగా పోయినవాడు అని ప్రసాదించారు. మహాభారతము మొత్తము ఈతని సమాచారమును తెలుపుటయే ముఖ్య విషయముగా అవ్వడము చేతనే మహాభారత కథను చెప్పదలచిన శ్రీ వేదవ్యాసుడు “నారాయణ కధామిహం”(నారాయణుని కథ చెప్పుచున్నాను) అని ఆరంభించితిరి. కావున ఈ గ్రంధమున ప్రతిపాదింపబడు విషయములు ఏవి అనే అంశము ఈ పైన చెప్పబడిన వాటిచే తెలుపబడినది.

అడియేన్ పవన్ రమనుజ డసన్

మూలము : https://granthams.koyil.org/2020/12/09/srivachana-bhushanam-suthram-5-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment