శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

కృష్ణుడి లీలల్లో మరొక ముఖ్యమైన లీల ఆయన రాసక్రీడ — గోపికలతో చంద్రకాంతి కలిగిన రాత్రిలో చేతులు పట్టుకొని ఆనందంగా నృత్యం చేయడం.
ఒక రాత్రి కృష్ణుడు అరణ్యంలో ఉండి, తన వేణువు వాయించడం ప్రారంభించాడు. ఆ వేణువునాదం విని ఎందరో గోపికలు తమ పనులను వదిలి పరుగెత్తుకుంటూ కృష్ణుని వద్దకు వచ్చారు. వారు కృష్ణునితో ప్రార్థించారు: “మేము రాసక్రీడలో పాల్గొనాలని కోరుతున్నాం. మీ చేతిని పట్టుకొని ఆనందంగా నాట్యం చేయాలని ఉంది.”, కానీ మొదట కృష్ణుడు అంగీకరించలేదు. ఆయన అన్నాడు “మీరు మీ ధర్మాన్ని వదిలి ఇక్కడికి వచ్చారు. ఇది సరి కాదు. వెంటనే మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి.”. ఆ మాట విని గోపికలు విచారంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. వారు: “మాకూ కుటుంబానికంటే మీరు ముఖ్యులు. ధనం ప్రసాదించే దేవతలు కూడా లక్ష్మీదేవిని సేవిస్తూ ప్రార్థిస్తారు. ఆమె కూడా మిమ్మల్ని సన్నిహితంగా సేవించాలనే సంకల్పంతో మీతో ఉండే దేవి. మేము కూడా అదే లక్ష్యంతో మీ వద్ద ఉండి, మీకు సేవచేసి, మిమ్మల్ని ఆనందపరచాలని కోరుతున్నాం.” అని ఇలా చెప్పారు
వారి ప్రేమ, భక్తి, ప్రాణం వంటి తపనను దృష్టిలో ఉంచుకొని కృష్ణుడు అంగీకరించాడు. అప్పుడు కృష్ణుడు గోపికలతో నాట్యం ప్రారంభించాడు. ఆయన అనేక రూపాలను ధరించి, ప్రతి రెండు గోపికల మధ్య ఒక కృష్ణుడిగా నిలిచాడు. అలా ఒక గోపిక — ఒక కృష్ణుడు — మరో గోపిక — మరో కృష్ణుడు అని వరుస ఏర్పడింది. ఇలా వారు మహానందంతో రాసక్రీడ చేశారు.
ఈ నాట్యంలో కృష్ణసంబంధమైన ఆ ఆనందం పెరిగి, (కొందరు ఆచార్యుల చెప్పిన ప్రకారం గోపికలలో కొంచెం గర్వం కూడా పెరిగింది.) కృష్ణుడు : “వీరు ఈ అపారమైన ఆనందాన్ని భరించలేక జీవితం కోల్పోతే?” అని అనుకుని కృష్ణుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. కృష్ణుడు కనిపించకపోవడం గోపికలు తీవ్ర విషాదంలోకి వెళ్ళారు. వారు ఆనవాళ్లు వెతుకుతూ అడవంతా తిరిగారు. చెట్లను కూడా అడిగారు: “కృష్ణుడిని చూశారా?” ఆ తర్వాత వారు పరస్పరం మాట్లాడుతూ, ఒక గోపిక సూచించింది: “కృష్ణుడు కనిపించక బాధించేస్తున్నది. ఆయన లీలలను అభినయిస్తూ ఆ బాధను తగ్గించుకుందాం.” అలా ఒక గోపిక పూతన పాత్రలో కింద పడుకుంది; మరో గోపిక పాలుతాగి సంహరిస్తూన్న కృష్ణుడు లాగా నాట్యం చేసింది. ఒకరు వత్సాసురుడు, ఒకరు కాపిత్తాసురుడు, ఇంకొకరు కాళీయ, మరొకరు కాళీయమర్ధన కృష్ణుడు అనుకుని అభినయం చేసింది. ఇలా నాటకరూపంలో కృష్ణస్మరణ ద్వారా తమ మనస్సును నిలబెట్టుకొని, మళ్ళీ ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడు వారు కృష్ణుని అడుగుజాడలను చూశారు. ఆ వెంటనే మరొక యువతి అడుగుజాడలు కూడా కనిపించాయి. వారు బాధతో “కృష్ణుడు ఒక గోపికతో వెళ్ళిపోయాడు!” అనుకున్నారు. ఈ అనుమానం వారిని మరింత దుఃఖంలో ముంచింది. వారు ఏడ్చారు, గీతాలు పాడారు, తపించారు.
ఆ సమయంలో కృష్ణుడు మళ్ళీ వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. వారిని పరామర్శించి సాంత్వన ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఆనందభరిత నాట్యం ప్రారంభమైంది — కృష్ణుడు తిరగి అనేక రూపాలలో ప్రతి గోపికతో నాట్యం చేశాడు. ఈ అద్భుత రాసక్రీడను దేవతలు కూడా చూసి పరమానందం పొందారు. చాలా సమయం నాట్యం చేసిన తర్వాత, అలసటతో కృష్ణుడు మరియు గోపికలు యమునా నదిలోకి వెళ్ళి ఆడుకుంటూ జలక్రీడ చేశారు.
అలా ఈ రాసక్రీడ అద్భుతంగా పూర్తయింది.
ఈ లీలను ఆళ్వార్లు కురవై కూత్తు అని అభివర్ణించారు, పొయ్గై ఆళ్వార్ తమ ముదల్ తిరువందది, “అరవం అడల్ వేలం…కురవై కుడ …కోత్తాది” (రాస క్రీడ మరియు కుండలతోని ఆడారు). నమ్మాళ్వార్ తమ తిరువాయిమొళి లో “కురవై ఆయ్చి యారోడు కోత్తాదుం” (రాస క్రీడలో గోపికలతో నాట్యం చేశాడు. కులశేఖర ఆళ్వార్ తమ పెరుమాళ్ తిరుమొళిలో “కున్రినాళ్ కుడై కవిత్తదుం కోలక్ కురవై కోత్తదువుం” (పర్వతాన్ని ఛత్రంలా ఎత్తాడు, మరియు అందమైన రాస క్రీడను అనుభవించారు). తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమొళి “పేయిత్ తాయై” అని మొదలయ్యే పదిగం లో వారు అనుభవిస్తూ “కురవై మున్నే కోత్తానై” అని అన్నారు (రాస క్రీడ ముందు అనుభవించిన వాడు).
ఈ లీల యొక్క సారాంశం:
- రాసక్రీడ సాధారణ లౌకిక స్త్రీ-పురుషల కాముకమైన నాట్యం కాదు, ఇది జీవాత్మ మరియు పరమాత్మల యోగానందం.
- ఆనందమో, దుఃఖమో పరాకాష్ట దాటితే భరించడం కష్టమే. అందుకే కృష్ణుడు ఈ అనుభవాన్ని వారు తట్టుకునే విధముగా క్రమంగా అందించాడు.
- కృష్ణుడి వేణునాదం విని బయటకు వెళ్దాం అనుకున్నా సమయానికి ఇంట్లోని పెద్దలను చూసి వెళ్లలేక తన ఇంట్లోనే తపించిన “చింతయంతి” అనే గోపిక — ఆ వేదనతో తన పాపకర్మలను, ఆ ఆనందభరిత సంగీతస్మరణతో పుణ్యకర్మలను కాల్చేసి — అదే క్షణంలో శరీరం విడిచి పరమపదానికి చేరుకుంది.
మూలం : https://granthams.koyil.org/2023/09/27/krishna-leela-21-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org