శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/07/29/anthimopaya-nishtai-14-telugu/ ), మనము భాగవతాపచారము వల్ల కలిగే దుష్పరిణామములను గమనించితిమి. ఈ వ్యాసములో, మనము ఆచార్యునితో మెలగుట, సేవించుట గురించి, ముఖ్యముగా ఆచార్యుని/భాగవతుని ప్రసాదము (ఉఛ్చిష్టము), శ్రీపాద తీర్థము (వారి పాదపద్మములను శుద్ధిపరచిన పుణ్య జలము) యొక్క విశిష్టతను గురించి తెలుసుకొందాము.
యోసౌ మంత్రవరమ్ ప్రాధాత్ సంసారోచ్చేద సాధనమ్
యది చేత్గురువర్యస్య తస్య ఉఛ్చిష్టమ్ సుపావనమ్
సాధారణ అనువాదము: సంసారము నుండి ఉద్ధరింపబడుటకు ఆచార్యుడు దయతో తిరుమంత్రమును ఎవరికైతే అనుగ్రహించి, వారికి తమ శేష ప్రసాదమును అనుగ్రహించిరో, దానిని శ్రేష్ఠమైనదిగా తప్పక స్వీకరించవలెను.
‘గురోర్యస్య యతోచ్చిష్టమ్ భోజ్యమ్ తత్పుత్ర శిష్యయోః’
సాధారణ అనువాదము: గురువు యొక్క శేషములను స్వీకరించుట శిష్యులకు పుత్రులకు శ్రేష్ఠము.
‘గురోరుఛ్చిష్టమ్ భుంజీత’
సాధారణ అనువాదము: గురువు యొక్క శేషములను తప్పక స్వీకరించవలెను.
పైన పేర్కొన్న ప్రమాణములు, అంతకు ముందు ఉదాహరించిన ప్రమాణములు, శిష్యులకు (ఆచార్య నిష్ఠయే అంతిమ లక్ష్యముగా నున్న వారికి) తమ ఆచార్యులే స్వయముగా సర్వేశ్వరుని అవతారమని సంపూర్ణ విశ్వాసము కలిగి, ఆచార్యుని శేష ప్రసాదము, వారి శ్రీపాద తీర్థము
(ప్రక్షాల్య చరణౌ పాత్రే ప్రణిపత్యోపయుజ్య చ; నిత్యమ్ విధివదర్ జ్ఞాత్యైర్ ఆవృత్తోభ్యర్చ్యాయేత్ గురుమ్ – ఆచార్యుని పాదపద్మములను ప్రక్షాళన గావించి వానిపై ప్రణమిల్లవలెను. వారి పాదపద్మములకు ప్రతి రోజు అర్ఘ్యప్రధానము చేసి అర్చించవలెను) మిక్కిలి శుద్ధి చేయునని, తల్లి పాలను సేవించే పసిపాపకు కలుగు తృప్తి వలే, వారికి తృప్తి నిచ్చును. ఇదియే శిష్యునికి జీవితాంతము మిక్కిలి ఆహ్లాదమును కలిగించే అంశమగును.
ఆచార్యుని పట్ల శిష్యుని ప్రవర్తనను విశదపరిచే మరికొన్ని ప్రమాణములు.
శ్రీరామానుజుని శ్రీపాద తీర్థమును స్వీకరించి వడుగనంబి పూర్ణ శుద్ధి నొందిరి.
గంగాసేతుసరస్వత్యాః ప్రయాగాన్ నైమిశాదపి
పావనమ్ విష్ణుభక్తానామ్ పాదప్రక్షాలనోదకమ్
సాధారణ అనువాదము : విష్ణు, గంగ, సేతు సముద్రము, సరస్వతి, ప్రయాగ, నైమిశారణ్యముల భక్తుని శ్రీపాద తీర్థము మిక్కిలి శుద్ధి గలది (ఇతరులను శుద్ధి చేయు శక్తి కలది)
శ్రీరామానుజుని శ్రీపాద తీర్థము స్వీకరించి దుష్ట ఆలోచనలున్న వ్యాపారులు కూడా శుద్ధి నొందిరి
యత్ తత్సమస్తపాపానామ్ ప్రాయశ్చిత్తమ్ మనీషిభిః
నిర్ణీతమ్ భగవద్భక్తపాదోదక నిషేవణమ్
సాధారణ అనువాదము : భగవత్ భక్తుల శ్రీపాద తీర్థమును స్వీకరించిన వివిధ పాపముల నుండి ముక్తి కలుగునని జ్ఞానులు తేల్చిరి.
ముదలియాండన్ శ్రీపాద తీర్థముచే గ్రామస్థులు శుద్ధి నొందిరి
తిస్రః కోట్యర్థకోటీ చ తీర్థాని భువనత్రయే
వైష్ణవాంఘ్రి జలాత్ పుణ్యాత్ కోటి భాగేన నో సమః
సాధారణ అనువాదము : ముల్లోకాలలోని (ఊర్ధ్వ, భూ, అధో లోకాలు) పుణ్య నదులను పరిశీలించినను, ఒక వైష్ణవుని శ్రీపాద తీర్థముతో కొంచెము కూడ పోల్చబడదు.
ప్రాయశ్చిత్తమ్ ఇదమ్ గుహ్యమ్ మహాపాతకినామపి
వైష్ణవాంగ్రి జలమ్ శుభ్రమ్ భక్త్యా సంప్రాప్యతే యది
సాధారణ అనువాదము : అత్యంత ఘోర పాపాత్ములకు కూడ విశ్వసనీయమైన ప్రాయశ్చిత్తము విష్ణు భక్తుని దోష రహితమైన శ్రీపాద తీర్థము స్వీకరించుటే.
నారదస్యాతితేః పాదౌ సర్వాసామ్ మందిరే స్వయమ్
కృష్ణ ప్రక్షాల్య పాణిభ్యామ్ పాపౌ పాదోదగమ్ మునేః
సాధారణ అనువాదము : శ్రీ కృష్ణుడు స్వయముగా మహర్షులైన నారదుడు, అధీతి వంటి వారి పాదములను కడిగి ఆ జలమును స్వీకరించిరి.
పెరుమాళ్ తిరుమొళి 2.3
‘తొణ్డర్ శేవడి చ్చెళుం శేఱు ఎన్ శెన్నిక్కణివనే’
సాధారణ అనువాదము : భక్తుల పాదపద్మములచే పవిత్రమైన (తొక్కబడిన) ఈ మృత్తిక నా శిరమునలంకిరించగలదు.
పెరుమాళ్ తిరుమొళి 2.2
‘తొణ్డరడిప్పొడి ఆడ నామ్ పెఱిల్ గంగై నీర్ కుడైన్ దాడుమ్ వేట్కై ఎన్నావదే’
సాధారణ అనువాదము : శ్రీమన్నారాయణుని సదా తలంచు పావనులైన శ్రీవైష్ణవుల పాదపద్మములపై బాంధవ్యమేర్పడిన వారికి, గంగలో మునిగి స్నానము చేయుట కూడ ఆకర్షణీయము కాదు.
తత్ పాదాంబుధూలం తీర్థమ్ తదుఛ్చిష్టమ్ సుపావనమ్
తదుక్తిమాత్రమ్ మంత్రాగ్ర్యమ్ తత్ స్ప్రుష్టమ్ అఖిలమ్ శుచి
సాధారణ అనువాదము : వారి పాద పద్మములను కడిగిన జలము పావనము; వారి ఉఛ్చిష్టము స్వచ్చము; వారి పలుకులు మహా మంత్రములు; వారిచే స్పృశించబడినవి శుద్ధమైనవి (దోషరహితములు)….
కోటిజన్మార్జితమ్ పాపమ్ జ్ఞానతోజ్ఞానతః కృతః
సత్యః ప్రదహ్యతే నృణామ్ వైష్ణవ ఉఛ్చిష్ట భోజనాత్
సాధారణ అనువాదము : శ్రీవైష్ణవుని ఉచిష్టమును భుజించినచో, అనేక జన్మల నుంచి తెలిసో/తెలియకో చేసిన పాపములన్నియు దగ్ధమవును.
తిరుమాలై 41
‘పోణగమ్ చెయ్త చేతమ్ తరువరేల్ పునిదమన్ఱే’
భగవానుని యొక్క మిక్కిలి సాధుపుంగవులైన భక్తులు తమ ఉచ్చిష్టమును ప్రసాదించి ఆశీర్వదించినచో మాత్రమే (అనగా, దానిని పొందుట అతి దుర్లభము)
ఈ విధముగా, పైన పేర్కొన్న ప్రమాణముల ద్వారా, మనము మన ఆచార్యులతో సమానులు, సత్వగుణ సంపన్నులు, మిక్కిలి జ్ఞానులు, అంకిత స్వభావులు, భౌతిక విషయ వాంఛారహితులైన గొప్ప భక్తుల ప్రసాదము, శ్రీపాద తీర్థమునకై ఎదురు చూచి, వానిని స్వీకరించవలెను. వారి ప్రసాదమును, శ్రీపాద తీర్థమును ప్రేమతో మాత్రమే గాని మొక్కుబడిగా శాస్త్రము తెలిపినదని స్వీకరించరాదు. కారణము, అది శ్రీవైష్ణవులపై జీవాత్మ యొక్క దాస్యత్వమునకు నిదర్శనము మరియు జీవాత్మను నిలబెట్టును.
దీనినే ఇంకను వివరించిరి. ఆపస్థంభ ఋషి “శరీరమేవ మాతాపితరౌ జనయతః” అని ఆదేశించిరి.
(మాతా పితరులు ఈ శరీరమును ప్రసాదించిరి)
‘పితుః జ్యేష్టస్య బ్రాతురుచ్చిష్టమ్ భోక్తవ్యమ్’
(తమ పితరుల మరియు జ్యేష్ఠ సోదరుల ప్రసాదమును స్వీకరించవలెను) శిష్యులు / పుత్రులు పితరుల ప్రసాదమును స్వీకరించవలెను. ఆ ఋషియే ఈ విధముగా ఆదేశించిరి
“స హి విద్యాతస్తమ్ జనయతి; తచ్చ్రేష్టమ్ జన్మః”
(అతను తప్పక ఒక జ్ఞానునికి జన్మనిచ్చును. ఇది శ్రేష్ఠమైన జన్మ) ఆచార్యుడు యధార్థమైన జ్ఞానమును అనుగ్రహించును కనుక, వారిని విశిష్ఠ (ఆధ్యాత్మిక) పితరులుగా భావించవలెను. మన శారీరిక సంబంధము వల్ల పితరులైన వారి ప్రసాదమును ఎట్లు స్వీకరించెదమో, అదే విధముగా ఆధ్యాత్మిక పితరులైన (తమ ఆచార్యునికి సమానులైన గొప్ప భాగవతులు) వారి ప్రసాదమును, శ్రీపాద తీర్థమును కూడ స్వీకరించవలెను. సదాచార్యతుల్యులు అనగా (ఆచార్యునికి సమానులైన భాగవతులు) “ఆచార్యవత్ దైవన్ మాతృవత్ పితృవత్ ” (శ్రీవైష్ణవులు ఆచార్యులుగా, భగవానునిగా, మాతా పితరులుగా), తమ ఆచార్యునితో సమముగా శ్రీవైష్ణవులను భావించి ఆదరించవలెను.
ఇంకా, శ్రీ వచన భూషణంలో పిళ్ళై లోకాచార్యుల దివ్య వక్కుల ప్రకారం స్వచ్ఛమైన భాగవతుల గురించి ఈ విధంగా వివరించబడింది..
సూత్రము 259
‘అనుకూలరాగిరార్ జ్ఞానభక్తివైరాగ్యన్గళ్ ఇట్టు మాఱినాప్పోలే వడివిలే తొడై కొళ్ళలామ్పడియిరుక్కుమ్ పరమార్ త్తర్’
సాధారణ అనువాదము : అత్యంత జ్ఞానము (నిజమైన ప్రజ్ఞ), భక్తి (శ్రద్ధ), వైరాగ్యము (భౌతిక వాంఛలనుంచి దూరము), పరమపదము పొందవలెనని కోరిక వున్నవారు అనుకూల వ్యక్తులు. వారిని చూడగానే, అందరు వారితో సంబంధమునకై స్ఫూర్తి కలిగి – వారికి ఎల్ల వేళలా గల ప్రేమాతిశయము ద్వారా భగవానునితో వారికి గల అమిత అనుబంధమును గమనించవచ్చును.
సూత్రము 223
‘అతావతు, ఆచార్యతుల్యర్ ఎన్ఱుమ్ సంసారిగళిలుమ్, తన్నిలుమ్, ఈశ్వరనిలుమ్ అధికర్ ఎన్ఱుమ్ నినైక్కై’
అనగా, శ్రీవైష్ణవులు ఆచార్యునితో సమానులు. వారు సంసారులు (విషయ వాంఛాపరులు), స్వీయులు, స్వయముగా భగవానుని కన్నా ఆదరణీయులు.
సూత్రము 451
‘…అనుకూలర్ ఆచార్య పరతంత్రర్…’
తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసము గల శిష్యునికి, మిక్కిలి ఇష్టులైన వారు ఎవరనగా వారి ఆచార్యునిపై పూర్తిగా ఆధారులైన వారు.
రామానుజ నూఱ్ఱందాది పాశురములలో ఈ సూత్రమునే తిరువరంగత్తు అముదనార్ గుర్తించిరి.
పాశురము 85
‘ఇరామానుజనైత్ తొళుం పెరియోర్ పాదమల్లాల్ ఎన్ఱన్ ఆరుయిర్కు యాదొన్ఱుమ్ పఱ్ఱిల్లైయే’
శ్రీరామానుజుని ఆరాధించే గొప్ప భాగవతుల పాదపద్మములు మాత్రమే నా మనస్సుకు శరణాగతి – ఇతరములేవియును కాదు.
పాశురము 105
‘ఇరామానుజనైత్ తొళుం పెరియోర్ ఎళుంతిరైత్తాడుమ్ ఇడం అడియేనుక్కిరుప్పిడమే’
శ్రీ రామానుజుని ఆరాధించి, వారి మహిమలను గానముగా, నృత్యముగా గొప్ప భాగవతులు ఎచట చేయుదురో, అదియే నా నివాసము.
కావున, భాగవతులనగా భౌతిక విషయ వాంఛారహితులు, ఆచార్యునికి శరణాగతి చేసినవారికి విధేయులు. అట్టి ఆచార్య నిష్ఠాపరుల సేవలో సదా నిమగ్నమైన వారు.
సర్వజ్ఞులైన మన ఆచార్యులు ఈ సూత్రమునే మిక్కిలి స్పష్టముగా తగిన ప్రమాణముల ద్వారా వివరించిరి. ఇతరులు కూడ దీనినే వివరించిరి. దీనినే పిళ్ళై లోకాచార్యులు రామానుజ నూఱ్ఱందాదిలో వివరించుట గమనించవచ్చును.
పరమ సాత్వికుల మధ్య శ్రీరామానుజులు
పాశురము 80
నల్లార్ పరవుమ్ ఇరామానుజన్ తిరు నామమ్
నంబ వల్లార్ తిఱత్తై మఱవాతవర్గళ్ ఎవర్
అవర్కే ఎల్లా విటత్తిలుమ్ ఎన్ఱుమ్ ఎప్పోతిలుమ్ ఎత్తొళుంబుం
చొల్లాల్ మనత్తాల్ కరుమత్తినాల్ చెయ్వన్ చోర్విన్ఱియే
సాధారణ అనువాదము: పరమ సాత్వికులైన శ్రీరామానుజులకు శరణాగతి చేసిన, వారి దివ్య నామమును సదా స్మరించు, భాగవతులను నేను సేవించెదను. వారి కొరకు నేను అన్ని స్థలములలో, అన్ని వేళలలో, అన్ని విధములుగా మనసా వాచా కర్మణా సేవ చేయుదును.
పాశురము 107
ఇన్బుఱ్ఱ శీలత్తిరామానుజ, ఎన్ఱుమ్ ఎవ్విటత్తుమ్
ఎన్బుఱ్ఱ నోయుడల్ తోఱుమ్ పిఱన్తిఱన్తు
ఎణ్ణరియ తున్బుఱ్ఱు వీయినుమ్ సొల్లువతొన్ఱుణ్డు
ఉన్ తొణ్డర్కట్కే అన్బుఱ్ఱిరుక్కుమ్ పడి, ఎన్నై ఆక్కి అన్గాట్పడుత్తే
సాధారణ అనువాదము : ప్రియ రామానుజ! నేను అత్యంత అల్పుడనైనను, మీరు మిక్కిలి కరుణచే నా మనస్సున విచ్చేయుట మీ ఆశీర్వాదముగా భావించెదను. నాకొక చిన్న కోరిక కలదు. నేను అనేక అల్ప జన్మలు పొందినను, రోగగ్రస్థుడనైనను, ఎచట ఏ స్థితిలో జన్మించినను మీ ప్రియ సేవకులకు నేను సంపూర్ణ శరణాగతి చేయునట్లు అనుగ్రహించుడు.
కూరత్తాళ్వాన్ ప్రియ తనయులైన పరాశర భట్టర్ భగవద్విషయముపై (తిరువాయ్మొళి కాలక్షేపము) ఒక పెద్ద గోష్ఠిలో ప్రసంగించుచుండగా, ఆళ్వాన్ సతీమణి ఆండాళ్ (భట్టర్ కు తల్లి) అచ్చటకు విచ్చేసి, తమ తనయుని ముందు మోకరిల్లి, శ్రీపాద తీర్థమును గైకొనిరి. దీనిని చూచిన గోష్ఠిలోని ఒక శ్రీవైష్ణవుడు “ఒక తల్లి తన పుత్రుని ముందు మోకరిల్లి వారిచే శ్రీపాద తీర్థమును స్వీకరించుటయా?” అనిరి. అతనికి, గోష్ఠికి సమాధానముగా ఆండాళ్ “ప్రియ పుత్రులారా! ఎవరైనను ‘ఇతరుల కొరకు ఇతరులచే ప్రతిష్టింపబడిన భగవానుని తీర్థ ప్రసాదములను స్వీకరింపవచ్చునని, కాని నాచే ప్రతిష్టింపబడిన ఎంపెరుమాన్ నుంచి దానిని నేనెట్లు స్వీకరించవచ్చును?’ అనినచో, అట్టి వారు కఠినాత్ములు మరియు సరియైన జ్ఞానము పొందని వారు – అవునా?” అనిరి. ఈ సంఘటనను అళగియ పెరుమాళ్ నయనార్ తమ తిరుప్పావై వ్యాఖ్యానములో వివరించిరి. ఆండాళ్ తమ పుత్రుని నుంచి తీర్థమును ఎందుకు అంగీకరించిరి? ఎందుకనగా :
‘న పరీక్ష్యవయో వంధ్యాః నారాయణపరాయణాః’
శ్రీమన్నారాయణుని భక్తుని వయస్సును, సామర్ధ్యతను బట్టి నిర్ణయించరాదు. పెరుమాళ్ తిరుమొళి – 7.6 – ‘వణ్ణచ్చెమ్ శిఱుకైవిరలనైత్తుమ్ వారి వాయ్ క్కొణ్డ అడిశిలిన్ మిచ్చల్ ఉణ్ణప్పెఱ్ఱిలేనో కొడువినైయేన్…’
దేవకి భావములో కులశేఖరాళ్వార్ – కృష్ణుడు తన అందమైన ఎర్రని వ్రేళ్లతో గుప్పెడు అన్నమును అందుకొని ఆరగించినప్పుడు, నోటి నుండి జారి పడిన ముద్దలను నేను తినలేక పోవుట మిక్కిలి దురదృష్టకరము అని గానము చేసిరి.
అనువాదకుని గమనిక : ఈ విధముగా, మనము ఆచార్యులతో, శ్రీవైష్ణవులతో వ్యవహరించు సరియైన ఆచారములను, ఆచార్య/భాగవత ప్రసాదము, శ్రీపాద తీర్థ మహిమలను గమనించితిమి. తదుపరి భాగములో, తమ జన్మతో సంబంధము లేకుండా శ్రీవైష్ణవుల విశిష్టతను వివరముగా తెలుసుకొనెదము.
కొన్ని సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారమునిచ్చిన శ్రీరంగనాథన్ స్వామికి కృతజ్ఞతలు.
సశేషం….
అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.
మూలము: https://granthams.koyil.org/2013/07/anthimopaya-nishtai-15/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org