శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
భగవద్రామానుజ కాలక్షేప గోష్టి (ఎడమ నుంచి కుడివైపుకి) – ఎంబార్, కూరత్తాళ్వాన్, భగవద్రామానుజులు, ముదలియాండాన్, అరుళాళఫ్ఫెరుమాళ్
నాయనారాచ్చాన్ పిళ్ళై తనియన్లు
శ్రుత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రమ్
పద్మోల్లసత్ భగవధంఘ్రి పురాణ బన్ధుమ్ !
జ్ఞానాధిరాజమ్ అభయప్రదరాజ పుత్రమ్
అస్మద్ గురుమ్ పరమకారుణికమ్ నమామి !!
పరమ కృపా స్వరూపులు, భానుని కిరణాలనెడి తన బుద్ధికుశలత చేత కమలములనెడి వేద సారమును వికసింప చేసినవారు, నిజ జ్ఞాన విరాజితుడైన శ్రియఃపతి శ్రీ చరణ సంబంధీకులు, అభయప్రద రాజులైన పెరియ వాచ్చాన్ పిళ్ళై పుత్ర రత్నమైన శ్రీ నాయనారాచ్చాన్ పిళ్ళైని సదా నమస్కరించెదను.
అభయప్రదపాద దేశికోద్భవమ్
గురుమీడే నిజమాధరేణ చాహం |
య ఇహాఖిలలోక జీవనాధారః
చరమోపాయ వినిర్ణయం చకార ||
శ్రీ పెరియ వాచ్చాన్ పిళ్ళై సుపుత్రులు, సకలలోక జీవనోద్ధరణకై “చరమోపాయ నిర్ణయం ” అనెడి గ్రంథం రచించిన ఆచార్యులైన శ్రీ నాయనారాచ్చాన్ పిళ్ళైని సదా పూజించెదను.
గ్రంథ ప్రారంభమునందు నాలుగు వేడుకోలు శ్లోకములు కలవు. ఆచార్యులైన నాయనారాచ్చాన్ పిళ్ళై తమ తండ్రి గారి వైభవమును స్మరిస్తూ మరియు ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యతను ఇందులో తెలియజేయుచున్నారు.
అభయప్రదపాదాఖ్యం అస్మద్ దేశికమాశ్రాయే |
యత్ప్రసాదాత్ అహం వక్ష్యే చరమోపాయ నిర్ణయం ||
నా గురువులు మరియు తండ్రి అయిన శ్రీ అభయప్రదుల (శ్రీ పెరియ వాచ్చాన్ పిళ్ళై : భగవద్రామానుజుల సర్వలోక శరణ్యత్వము మరియు శరణాగతి తత్వమును అద్భుతంగా ప్రతిపాదించుటచే వారు అభయప్రదులన్న నామధేయులైనారు) శ్రీ చరణములను ఆశ్రయించి, వారు ప్రసాదించిన జ్ఞానము చేత ఈ చరమోపాయ నిర్ణయమును చెప్పుచున్నాను.
అస్మజ్జనక కారుణ్యసుధా సంధుక్షితాత్మవాన్ |
కరోమి చరమోపాయ నిర్ణయం మత్పితా యథా ||
నా తండ్రి (శ్రీ పెరియ వాచ్చాన్ పిళ్ళై ) యొక్క పవిత్ర సంకల్పంచేత జన్మించిన నేను వారు చూపిన బాటలోనే నడుచుచూ ఈ చరమోపాయ నిర్ణయమును చెప్పుచుంటిని.
అస్మదుత్తారకమ్ వన్దే యతిరాజం జగద్గురుమ్ |
యత్కృపాప్రేరితః కుర్మి చరమోపాయ నిర్ణయం ||
నా యొక్క ఉత్తారకాచార్యులు, జగద్గురువులైన భగవద్రామానుజులకు నమస్కరించుచున్నాను. వారి కృప చేత “చరమోపాయ నిర్ణయం ” అను ఈ గ్రంథమును రచించుచుంటిని.
పూర్వాపర గురు ఉక్తైచ్చ స్వప్నవృత్తైర్యదీ చ భాక్ |
క్రియతేద్య మయా సమ్యక్ చరమోపాయ నిర్ణయం ||
యతీంద్రులైన భగవద్రామానుజుల మునుపు, పిదప అవతరించిన ఆచార్యుల శ్రీ సూక్తులను మరియు పలు సంఘటనల ఆధారముగా, మరియు పెద్దల దివ్య స్వప్నముల ఆధారముగా, భగవద్రామానుజులే జగద్గురువులనెడి పరమ సత్యమును రూఢీ చేయుచూ ఈ “చరమోపాయ నిర్ణయము” ను రచించుచుంటిని.
శ్రీ వైష్ణవ సంప్రదాయమున ప్రతి ఒక్కరికి వారి ఆచార్యులే ఉత్తారకులు. వారే శిష్యులను ఈ సంసార సాగరమును నుండి సంరక్షించే బాధ్యత వహించెదరు. కానీ ప్రతి ఆచార్యుడు తనతో కలిపి తన శిష్యుల సంరక్షణా భారమును భగవద్రామానుజుల శ్రీ చరణముల వద్ద విడిచి పెట్టును. దీనికర్ధము భగవద్రామానుజులే ఈ ప్రపంచమునందలి సకల ప్రాణి కోటికీ ఉద్ధర్త.
క్రింది శ్లోకము నందు చూపబడినట్టు (శ్రీ పిళ్ళలోకం జీయర్ కూడా తమ యొక్క “సమయాచార నిష్కర్షం ” అనెడి గ్రంథములో ఇదే విషయము చెప్పి ఉన్నారు.) ఆచార్యునికి చెప్ప దగ్గ ఉత్తమ గుణములు కలిగినవారు కేవలం భగవద్రామానుజులే. ఈ విషయమును శ్రీ వడుగ నంబి కూడా, “ఆచార్య పీఠమును అధిరోహించగల సమర్ధులు భగవద్రామానుజులే ” అని ధ్రువీకరించినారు.
విష్ణు: శేషి తదీయః శుభగుణ నిలయో విగ్రహః శ్రీ శఠారి:
శ్రీమాన్ రామానుజార్యః పాదకమలయుగం భాతి రమయమ్ తదీయం
తస్మిన్ రామానుజార్యేవ గురురితి చ పదం భాతి నాన్యత్ర
తస్మాత్ శిష్టం శ్రీమద్ గురూణాం కులమిదమఖిలం తస్య నాధస్య శేషాః
విష్ణువు సర్వ జగదాధి పతి. శ్రీ శఠకోపులు విష్ణువు యొక్క దివ్య తిరుమేని. కైంకర్య శ్రీమంతులైన భగవద్రామానుజులు శ్రీ శఠకోపుల శ్రీచరణములు. “ఆచార్య” అనెది పదము భగవద్రామానుజుల చెంతనే విరాజిల్లుచున్నది. కనుక గురుపరంపరలోని తక్కిన ఆచార్యులందరూ భగవద్రామానుజులకు శేషభూతులే.
నమ్మాళ్వార్లు తిరువాయిమొళి 5. 3. 2 లో తెలిపినట్లు “కలియుం కెడుం “, భగవద్రామానుజుల అవతారం చేత కలి నశించగలదు అని గ్రహించిన పూర్వాచార్యులు భగవద్రామానుజుల అవతరామును ముందుగానే గ్రహించి, తమ ఆచార్యుల అనుగ్రహం చేత భగవద్రామానుజుల ఉత్థారకత్వమును ధ్యానించెడి వారు. ఈ గురుపరంపర లేదా ఆచార్య సంబంధ పరంపర రెండు విధములుగానుండును – ఒకటి ఆరోహణ క్రమము (అనగా మన ఆచార్యులు, వారి ఆచార్యులు, వారి ఆచార్యులు అనుచూ పైకి వెళ్ళుట) , రెండు అవరోహణ క్రమము (అనగా ఆచార్యులు,వారి శిష్యులు, వారి శిష్యులు అనుచూ తిరోగమనమున వెళ్ళుట.). రెండు పథములలోనూ భగవద్రామానుజులు మూలము. ఆరోహణ క్రమమందు మన ఆచార్యుని వద్ద ఆరంభించి ఆది గురువు శ్రియఃపతి ఐన శ్రీమన్నారాయణుని వద్ద ముగుస్తుంది. అవరోహణ క్రమము అనంతముగా ఆచార్య శిష్య ప్రశిష్య పరంపరగా వస్తూ ఉంటుంది. ఉభయ మార్గములన్దునూ భగవద్రామానుజులే మూలము.
ఏకాచార్య మార్గ గురుపరంపరను (ఓరాణ్ వళి అనగా శ్రియఃపతి నుండి మణవాళ మహామునుల వరకు) అనుసరించి పరంపరలో భగవద్రామానుజులు మధ్యలో వేంచేసి ఉంటారు. ముత్యాలమాలలోని వజ్ర మణి వలె గురుపరంపరా మాలయందు భగవద్రామానుజులు మణి వలె వేంచేసి ఉండి మాల ఇరువైపులకి (అనగా స్వామి రామానుజుల ముందు మరియు వారి పిదప వేంచేసి ఉన్న ఆచార్యులకు) వన్నె తెచ్చారు. తిరుమంత్రము నందలి “నమః” శబ్దము మధ్యలో నుండి జీవునికి పరమాత్మకి ఒక వారధి వలెనుండి జీవుని యొక్క భగవత్సాధనలో గల అడ్డంకులని ఎలాగైతే తొలగిస్తుందో భగవద్రామానుజులు కూడా గురుపరంపరా మాల యందు మధ్యలో మణి వలె తిరు మంత్రములోని “నమః ” అనెడి శబ్దము యొక్క అర్థమును గుర్తు చేయునట్లు ప్రకాశించుచున్నారు. “నమః” శబ్దము ఉపాయమునకు సూచకము. అటులనే భగవద్రామానుజులే చరమోపాయము. ఈ కింది శ్లోకమును గమనిస్తే మనకు ఈ విషయం మరింత అవగతమవుతుంది.
అర్వాజ్ఞ్చో యత్పద సరసిజ ద్వన్ద్వమాశ్రిత్య పూర్వే
మూర్ధ్నా యస్యాన్వయం ఉపగతా దేశికా ముక్తిమాపు:
సోऽయం రామానుజమునిరపి స్వీయ ముక్తిమ్ కరస్థామ్
యత్ సంబంధమనుత కథం వర్ణ్యతే కూరనాథః
భగవద్రామానుజుల పిదప వేంచేసిన ఆచార్యులకు రామానుజ శ్రీ చరణ (తిరువడి) సంబంధము చేత మోక్షము కలిగినది. భగవద్రామానుజుల మునుపు వేంచెసిన ఆచార్యులకు రామానుజ శిరో సంబంధము (తిరుముడి సంబంధం) చేత మోక్షము కలిగినది. అయితే భగవద్రామానుజులకి మాత్రం కూరత్తాళ్వార్ల సంబంధము చేత మోక్షము సిద్ధించినది. అటువంటిది కూరత్తాళ్వార్ల వైభవము.
గమనిక: పై శ్లోకములో రెండవ పాదము నందు గ్రంథ సంబంధ విషయము ప్రస్తావించబడినది
ఆచార్యత్వము రెండు విధములు గా చెప్పబడినది. మొదటిది స్వాను వృత్తి ప్రసన్నాచార్యత్వము – అనగా ఆచార్యుడు శిష్యుని నిశితముగా పరిశీలించి పరీక్షించి శిష్యుడు జ్ఞానార్జనకు అర్హుడని ధ్రువీకరించిన పిదప వేదాంత రహస్యములను ఉపదేశించుట. రెండవది కృపా మాత్ర ప్రసన్నాచార్యత్వము – అనగా సంసారము నందు చిక్కుకుని అలమటించుచున్న శిష్యుని యొక్క స్థితికి కరిగి అతనిని ఉద్ధరిచుటకు అనగా శిష్యుని యెడల కృప చేత జ్ఞానమును ఉపదేశించుట. ఎక్కువ మంది ఆచార్యులు మొదటి రకమునకు చెందినవారు. రెండవ రకం ఆచార్యులు చాలా అరుదు. కృపా మాత్ర ప్రసన్నాచార్యుని పొందిన శిష్యుడు మోక్షం విషయంలో దిగులు చెందనవసరం లేదు. గురు సేవా పరాయణత్వము, సహనము, పట్టుదల లేని సగటు శిష్యుడు స్వాను వృత్తి ప్రసన్నాచార్యుని మెప్పించుట బహుదుర్లభము. అటుల మెప్పించిన వారు కారణజన్ములే. ముదలియాణ్దాన్ – కూరత్తాళ్వాన్ సంవాదమునందు కూడా కూరత్థాళ్వాన్ ఈ విషయమునే ద్రువీకరించిరి. పెరియ వాచ్చాన్ పిళ్ళై, అరుళాళ ప్పెరుమాన్ ఏమ్బెరుమానార్ అనుగ్రహించిన జ్ఞానసారము నందలి 36వ పాశురము, “మత్తహత్తు త్తన్ తాళ్ అరుళాలే వైత్త అవర్” (అనగా కృపామాత్ర ప్రసన్నాచార్యుడు కరుణ చేత తన శిష్యుని ఉద్ధరించి చరమగతి ప్రసాదించగలడు.), అను విషయమును తరచూ చెప్పేవారు. పరగత స్వీకారము (అనగా మనము భగవంతుని ఎన్నుకొనుట కన్నా శ్రియఃపతి తన యొక్క నిర్హేతుక కరుణ చేత జీవులను ఎంచుకొనుట) ఎట్లు జీవాత్మస్వరూపమునకు ప్రథమపర్వమునందు తగునో, అటులనే శిష్యస్వరూపమునకు చరమపర్వము నందు తగును. అనగా, ఆచార్యుడు తానుగా శిష్యుని తన యొక్క నిర్హేతుక కృప చేత ఎన్నుకుని భగద్విషయమును అనుగ్రహించుట కేవలం కృపామాత్ర ప్రసన్నాచార్యుని విషయములోనే జరుగుతుంది.
సోమాసియాణ్డాన్ తన గురుగుణావళిలో ఆచార్యవైభవమును ఈ క్రింది శ్లోకములో వివరించారు,
యస్సాపరాధాన్ స్వపధప్రపన్నాన్ స్వకీయ కారుణ్య గుణేన పాతి
స ఏవ ముఖ్యో గురురప్రమేయస్తదైవ సద్భి: పరికీర్త్య దేహి
సదాచార్యుడు తన యొక్క అపారకరుణ చేత శిష్యుని యొక్క రక్షకత్వమును, సంసార విమోచకత్వమును నిర్వహించెదడు. ఇవి ఆచార్యుని యొక్క ముఖ్య లక్షణములు. ఇవి కేవలం నమ్మకస్తులైన శిష్యులకు మాత్రమే తెలుస్తుంది.
అటువంటి కృపా మాత్ర ప్రసన్నాచార్యునికి ఉత్తారకత్వము ముఖ్యముగా చెప్పబడుచున్నది. భగవద్రామానుజులకు ఈ లక్షణములు మెండుగా కలవు. ఎటులనగా :
— తాను ఎంతో ప్రయాస పడి, కష్టించి గోష్టీపూర్ణుల వద్ద పొందిన చరమశ్లోక వివరమును భగవద్రామానుజులు ఆశ కలిగిన జనులందరికీ పిలిచి మరీ సులువుగా ఉపదేశించినారు. ఇది జీవులపై వారికి గల అపార కరుణకు నిదర్శనము.
— భగవద్రామానుజుల కాలములో శ్రీ రంగములో వేంచేసి ఉన్న రాజమహేంద్ర పెరుమాళ్ అరయర్ అనెడి అరయర్ స్వామికి అరంగమాళిగై అనెడి పుత్రుడు కలడు. ఆ కుర్రవాడు చెడు స్నేహముల చేత పితృవాక్యమును పరిపాలించక తిరుగుచుండెను. భగవద్రామానుజులు విషయము తెలుసుకొని ఒకనాడు ఆ కుర్రవాని పిలిపించి అతడితో ఇట్లనెను, “నాయనా! తండ్రి వాక్యము పరిపాలించుట ధర్మము. నన్ను ఆశ్రయించుము. నీవు నన్ను వీడినను నేను నిన్ను విడువజాలను.”, అని తమ తిరువారాధన పెరుమాళ్ళైన పేరరుళాళన్ వద్ద ఆ కుర్రవాని బుద్ధిని సంస్కరించి, భగవద్విషయమును మరియు పలు రహస్య గ్రంథములను ఉపదేశించెను. పిదప భగవద్రామానుజులు ఆ కుర్రవాని శిరస్సు మీద తమ శ్రీచరణములనుంచి, “ఇప్పుడు నీకు ఏమి తెలియుచున్నది? మునుపు ఉన్న నీకు ఇప్పుడు ఉన్న నీకు తేడా ఏమిటి? ” అని ప్రశ్నించెను. అప్పుడు ఆ కుర్రవాడు, “మునుపు ఉన్న బుద్ధి నన్ను నరకమునకీడ్చును. రామానుజదాసుడైన పిదప రామానుజ శ్రీ చరణములే నాకు చరమోపాయము” అనెను. ఆనాటి నుంచి అరంగమాళిగై భగవద్రామానుజుల అపార కరుణ చేత రామానుజ శ్రీ చరణములన్దు అమితమైన నమ్మకము కలిగి సన్మార్గములో పయనించసాగెను. ఈ కథను తమ తండ్రిగారైన పెరియ వాచ్చాన్ పిళ్ళై తరచూ చెప్పుచుండెడివారని నాయనారాచ్చాన్ పిళ్ళై వివరించిరి.
ఈ పై రెండు సంఘటనలు భగవద్రామానుజుల యొక్క ఉత్తారకత్వమును విశదీకరించుచున్నవి. ఇంకనూ పలు విషయములు నిశితముగా పరిశీలించి భగవద్రామానుజుల ఉత్తారకత్వమును స్థాపించెదము.
అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్
మూలము: https://granthams.koyil.org/2012/12/charamopaya-nirnayam-invocation/
పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు)– https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org
0 thoughts on “చరమోపాయ నిర్ణయం – వేడుకోలు (ప్రార్థన)”