చరమోపాయ నిర్ణయం -శిరస్సంబంధం (తిరుముడి సంబంధం)

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< వేడుకోలు (ప్రార్థన)

శ్రీ నాథమునులు నమ్మాళ్వార్ల నుంచి భవిష్యదాచార్య విగ్రహమును స్వీకరించుట

నమ్మాళ్వార్లు నాథమునులకు తిరువాయ్మొళిని అనుగ్రహిస్తూ (నాథమునులు 12000 సార్లు “కణ్ణినుణ్ సిరుత్తాంబినాల్” జపము చేసి నమ్మాళ్వర్లను  ప్రసన్నము చేసుకుని వారి నుంచి అరుళిచ్చెయల్ ను మరియు అష్టాంగ యోగ రహస్యములను తెలుసుకొనిరి.), 5.2.1 నందు, “పొలిగ ! పొలిగ ! ” (అనగా జయము ! జయము !) పాశురము నందు ఉడయవర్ల యొక్క అవతార రహస్యమును ప్రస్తావించి, “కలియుమ్ కెడుం కణ్దు కొణ్మిన్ ” (కలి నశించు గాక !) అని కీర్తించిరి. త్రికాలజ్ఞులైన నమ్మాళ్వార్లు శ్రియఃపతి అనుగ్రహము చేత ఉడయవర్ల అవతారమును ముందుగానే గ్రహించి నాథమునులకు ఇట్లు ఉపదేశించిరి, “భవిష్యత్తులో ప్రపన్నకులములొ ఒక గొప్ప ఆచార్యశ్రేష్టుడు అవతరించబోవుచున్నాడు. ఈ చరాచర జగత్తుకు ఆచార్యుడై ఉద్ధరించగల సమర్థుడు అతడు”. ఈ విషయము విన్న నాథమునులు ఆశ్చర్యభరితులై ఇంక తెలుసుగొనగోరి “పయనన్నాగిలుమ్” పాశురము మధురముగా పాడి నమ్మాళ్వర్లను ఆనందిమ్పచేసి ఇట్లు ప్రార్థించిరి, “ఆళ్వారె ! దేవరవారు సర్వజ్ఞులు. దాసుడి యందు దయుంచి భవిష్యత్తులో అవతరించబోవు ఆ మాహాత్ముని శరీరాకృతి గూర్చి తెలియజేయుడు!” అని కోరిరి. ఆనాటి రాత్రి నాథమునులకు ఒక దివ్యస్వప్నము కలిగెను. అందు నమ్మాళ్వార్లు కాషాయ వస్త్రము ధరించి, ద్వాదశోర్ధ్వ పుండ్రధారులై, త్రిదండము చేత బట్టి, ఆజానుబాహువులతో దివ్య సాముద్రిక లక్షణములు కలిగిన తిరుమేనితో దర్శనమిచ్చిరి. సూర్యుని తేజస్సు వంటి శరీర ఛాయతో, కనులయందు వాత్సల్యము నిండి అనుగ్రహరూపులై సేవ సాయించి నమ్మాళ్వార్లు భవిష్యదాచార్యులు ఇట్లు ఉందురని తెలిపిరి. దీని బట్టి భగవద్రామానుజుల తిరుమేని సాక్షాత్ నమ్మాళ్వర్లేనని తెలియుచున్నది. కలలో దర్శించిన తిరుమేనికి నాథమునులు పరమ సంతోషముతో నమ్మాళ్వార్లను పరిపరి విధముల కీర్తిన్చిరి. నాథమునులేమిటి ఆ పరమ దివ్య తిరుమేని యావత్ ప్రపంచాన్నే ఆకర్షించింది.

తదుపరి నాథమునులు ఈ భవిష్యదాచార్యుని ఎట్లు పూజించవలయునని నమ్మాళ్వార్లను ప్రార్థించగా, నమ్మాళ్వార్లు  ఒక శిల్పికి స్వప్నమునందు సేవ సాయించి భవిష్యదాచార్యుని విగ్రహమును చెక్కవలెనని విగ్రహపు రూపురేఖలు ఎట్లుండవలెనో తెలిపిరి. మరునాడు ఆళ్వార్లు చెప్పిన విధముననే ఆ శిల్పి నిరంతరాయముగా చింత చెట్టు కింద భవిష్యదాచార్యుల విగ్రహమును చెక్కెను. ఆ విగ్రహమునకు నమ్మాళ్వార్లే  స్వయముగా ప్రాణప్రతిష్ట చేసి నాథమునులకు ఆ విగ్రహమును ఇచ్చి, “శ్రీ రామచంద్ర మూర్తికి లక్ష్మణుడు ఎట్లు అనుంగుడో అటులనే ఈ భవిష్యదాచార్యుని మా అనుంగునిగా తలంపుము. మా సంకల్పము చేత ఉద్భవించిన ఈ భవిష్యదాచార్యుని మా యొక్క తిరువడిగా గుర్తింపుము. మా కోరికలను వీరు నెరవేర్చగలరు. మీ వంశములో జన్మించబోవువారు వీరిని నేరుగా కలుసుకొనగలరు. ఈ మహాపురుషుడు మేము అవతరించిన శ్రీ రామ పట్టాభిషేకము నిశ్చయించిన మాసమునకు తదుపరిదైన వైశాఖ మాసములో మా నక్షత్రమైన విశాఖ నుంచి పద్ధెనిమిదవ నక్షత్రములో (ఆరుద్ర, తిరువాదిరై) అవతరించగలడు. మీరు ఈ విగ్రహమును మమ్ము అర్చించిన విధముగానే భక్తి శ్రద్ధలతో అర్చిన్చుడు. ” అని ఆశీర్వదించి కాట్టుమన్నార్ కొయిల్ కి పంపించెను. నమ్మాళ్వార్ల ఉపకార స్మృతికి కృతజ్ఞతగా నాధమునులు ఈ క్రింది శ్లోకముతో ఆళ్వార్లను కీర్తించినారని పెరియ వాచ్చాన్ పిళ్ళై తెలియజేసేవారు.

“యస్స్వభావకాలే కరుణాకరస్సన్ భవిష్యదాచార్య పరస్స్వరూపమ్
సంతర్చయామాస మహానుభావమ్ తమ్ కార్యసూనమ్ శరణం ప్రపద్యే ”

అర్థము: తన యొక్క పరమకారుణికత చేత నా స్వప్నమునందు భవిష్యదాచార్య దర్శనము కలిగించిన కారి పుత్రులైన శఠకోపులను శరణు వేడెదను.

అంతే కాక భవిష్యదాచార్యుని అవతార విషయము ఎవరికీ చెప్పక రహస్యముగా ఉంచబడినదని, కేవలం ఏకాచార్య (ఓరాణ్ వళి) పరంపర ద్వారా నమ్మకస్థులైన శిష్యులకు మాత్రము చెప్పటం జరిగినదని పెరియ వాచ్చాన్ పిళ్ళై తెలిపి ఉన్నారు.

ఆ విధముగా శ్రీ నాథమునులు నమ్మాళ్వార్ల వద్ద నాలాయిర దివ్య ప్రబంధమును నేర్చుకొని వీర నారాయణ పురుము చేరుకొని మన్నార్ పెరుమాళ్ళ వద్ద మృదు మధురముగా ఆ దివ్య ప్రబంధమును పాడి ప్రశంసలు పొందిరి. పిదప తమ గృహుము చేరుకొని తమ మేనళ్ళుళ్ళైన కీళై అగత్థాళ్వాన్ మరియు మేలగత్థాళ్వాన్ లకు జరిగిన విషయమును చెప్పిరి. వారు ఆశ్చర్యపడి ఒక మహానుభావుని (నాథమునులు) సంబంధము పొందినందకు పరమ సంతోషించిరి. శ్రీ నాథమునులు తాము నేర్చిన దివ్యప్రబంధ రహస్యములను తమ శిష్యులు కణ్ణమంగై ఆండాన్ కు వివరించి “పొలిగ! పొలిగ !” అను పాశురము యొక్క అర్థము, తాము స్వప్నములో దర్శించిన భవిష్యదచార్యుని గూర్చి వివరించగా ఆణ్డాన్ పరమ సంతోషముతో, “దేవరవారి సంబంధము చేత దాసుడు కూడా ధన్యుడయ్యాడు” అనిరి. పిదప శ్రీ నాథమునులు ఇదే విషయమును తమ పుత్రులైన ఈశ్వరమునులకు, మరియు ఇతర శిష్యులు పుణ్డరీకాక్షులు, కురుగై కావలప్పన్ కు వివరించిరి. కావలప్పన్ కు అష్టాంగ యోగమును ఉపదేశించిరి. పుణ్డరీకాక్షులకు సంప్రదాయ ప్రచార బాధ్యత అప్పగించిరి. ఈశ్వరమునులకు తమకు భవిష్యత్తులో పుట్టబోయే పుత్రునికి “యమునైత్తు ఉరైవన్ ” అని నామకరణము చేయమని ఆజ్ఞాపించిరి. తమ చివరి దశలో పుణ్డరీకాక్షులను పిలిపించి భవిష్యదాచార్య అవతారము గూర్చి ఎవరి వద్ద చెప్పవలదని ప్రమాణము స్వీకరించి నమ్మాళ్వార్లు అనుగ్రహించిన భవిష్యదాచార్య విగ్రహమును బహుకరించి, భవిష్యత్తులో అవతరించబోవు “యమునైత్తు ఉరైవన్” కు ఆ విగ్రహమును ఇవ్వవలసినదిగా ఆదేశించి, నాథమునులు “ఆళ్వార్ తిరువడిగళే శరణం! ” అనుచు పరమపదమును పొంది నిత్యముక్తులైరి.

నాథమునుల ఆజ్ఞ ప్రకారం పుణ్డరీకాక్షులు తమ శిష్యులతో శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారం చేయసాగారు. ఒకనాడు పుణ్డరీకాక్షులు శిష్యులైన మణక్కాల్ నంబి, తిరువల్లిక్కేణిప్పాణ్ పెరుమాళ్ అరయర్ “పొలిగ ! పొలిగ !” అను పాశురములో “కలియుం కెడుమ్” పాదము గూర్చి వివరించమని కోరగా పుణ్డరీకాక్షులు వారికి అర్థము చెబుతూ తాము తమ గురువులవద్ద పొందిన దివ్యానుభావాలను వివరించిరి. భవిష్యదచార్యుని అవతారము గురించి విన్న శిష్యులు పరమ సంతోషముతో “వారి దివ్యదర్శన భాగ్యము ఎవరికి కలుగగలదు?” అని ప్రశ్నించిరి. దానికి పుణ్డరీకాక్షులు, “వారు ఎప్పుడు అవతరిస్తారో తెలియదు. వారి అవతారము చేత ప్రపంచము సమస్తము ఉద్ధరించబడగలదు.” అని బదులిచ్చిరి. పుణ్డరీకాక్షులు తమ అవసాన దశలో మణక్కాల్ నంబిని పిలిచి భవిష్యదచార్య అవతారము గూర్చి వివరించి తమకు పిదప శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారము చేయవలసినదిగా తమ ప్రియ శిష్యులైన మణక్కాల్ నంబిని ఆదేశించి, భవిష్యదాచార్య విగ్రహమును ఇచ్చి అనుగ్రహించిరి. త్వరలో అవతరించాబోవు “యమునైత్తు ఉరైవన్” కు ఆ విగ్రహము ఇవ్వవలసినదిగా నంబిని ఆదేశించి తాము కూడా పరమపదమును పొందిరి.

తరువాత కొంత కాలమునకు రామమిశ్రులు, పుణ్డరీకాక్షుల ఆజ్ఞ మేరకు, ప్రభుత్వ బాధ్యతలు నడుపుచున్న యామునులను కలిసి వారిని సంప్రదాయము వైపు ఆకర్షించి, వారిని ఉద్ధరించి శ్రీ రంగమునకు తీసుకొనివచ్చిరి (https://acharyas.koyil.org/index.php/2012/08/25/manakkal-nambi/)). రామమిశ్రులు శ్రీ యామునులకు రహస్యార్థములను, భవిష్యదాచార్య అవతరణమును గూర్చి తెలిపి శ్రీ యామునులను సంప్రదాయ ప్రచార బాధ్యతను స్వీకరించమని ఆజ్ఞాపించిరి. శ్రీ రామమిశ్రుల అవసాన కాలము సమీపిస్తుండగా ఒకనాడు నాథమునులు స్వప్నమున సేవ సాయించి, “వెంటనే భవిష్యదాచార్యుని గూర్చి వెతకమని యామునులను ఆజ్ఞాపించుము. మీ వద్ద ఉన్న భవిష్యదాచార్య విగ్రహమును యామునులకు ఇవ్వుము.”, అని పలికిరి. తమ మనుమడైన యామునులు భవిష్యదాచార్యుని దర్శించినచో తమకు కూడా ఆ దర్శన ఫలము దొరుకునని నాథమునులు చెప్పినది స్వప్నమున విని రామమిశ్రులు పరమ సంతోషపడి శ్రీ యామునులను పిలిపించి జరిగిన విషయమును చెప్పెను. శ్రీ యామునులు మొదట తమకు నాథమునుల దర్శనము కాకపోవుటకు చింతిన్చిననూ పిదప తమ ఆచార్యుని ఆజ్ఞను సంతోషముతో స్వీకరించిరి. రామమిశ్రులు శ్రీ యామునులతో , “మీ తాతగారైన నాథమునుల ఆజ్ఞను అనుసరించి భవిష్యదాచార్య విగ్రహమును మీకు ఇస్తున్నాము. దీనిని శ్రద్ధతో కాపాడండి. నాధమునుల ఆజ్ఞ మేరకు భవిష్యదాచార్యుని వెదికి శ్రీరంగము తీసుకువచ్చి వారికి మీ తదుపరి ధర్మ ప్రచార బాధ్యతను అప్పగించండి. రాబోవు ఆచార్యుడు ఈ సమస్త ప్రకృతిని తన నిర్హేతుక కృప చేత ఉద్ధరించగల జగదాచార్యుడు కాగలడు. ఈ రహస్యమును పరమ గోప్యముగా ఉంచవలెను. ” అని చెప్పి ఆశీర్వదించెను.

శ్రీ యామునులు భవిష్యదాచార్య విగ్రహమును రామమిశ్రుల నుంచి పరమ సంతోషముతో స్వీకరించిరి. తమ తదుపరి సంప్రదాయ ప్రచారము చేయగలిగిన ఉత్తమ ఆచార్యుని అవతారము కొరకు వేచి చూడసాగారు. కొన్నాళ్ళకు శ్రీ యామునులకు ఒక శుభవార్త తెలిసింది. కాంచిపురములో “ఇళయాళ్వాన్” అని ఉత్తమ వటువు ఉన్నాడని అతడి వైభవము గూర్చి తోటి శ్రీ వైష్ణవుల ద్వారా తెలుసుకొనిరి. వెంటనే కాంచిపురము వెళ్లి, శ్రీకాంచిపూర్ణుల సహాయముతో శ్రీ కరుమాణిక్క పెరుమాళ్ళ సన్నిధిలో బాలకుడైన “ఇళయాళ్వాన్” ను చూసెను. ఆ వటుడి వైభవము, దివ్య సాముద్రిక లక్షణములు కలిగిన తిరుమేని, ఆ బాలకుని జన్మ నక్షత్రము ఆర్ద్రా అని తెలుసుకొనిరి. భవిష్యదాచార్యుని కనుగొనుటకు పెద్దలు చెప్పిన ఈ మూడు గుర్తులు సరిపోలిఉండుట చేత ఇళయాళ్వానే భవిష్యదాచార్యుడని నిశ్చయించుకొని, “అవును వీరే అగ్రగణ్యులు.” అని రూఢీ చేసిరి.

శ్రీ ఆళవందార్లు కాంచిపురములో “ఇళయాళ్వాన్” ను చూసి ఆశిర్వదించుట

శ్రీ యామునులు తమ చివరి రోజుల్లో గోష్టీ పూర్ణులను పిలిపించి వారికి భవిష్యదాచార్య విగ్రహమును ఇచ్చిరి. గోష్టీ పూర్ణులకు భవిష్యదాచార్య అవతార రహస్యమును తెలిపి ఇళయాళ్వాన్ వెలుగుతున్న దీపము వలె ప్రపన్నకులములో జన్మించి ఈ లోకమును ఉద్ధరించగలడని సమయము వచ్చినపుడు ఇళయాళ్వాన్ కు రహస్యార్థములు ఉపదేశించవలెనని ఆజ్ఞాపించిరి. ఇళయాళ్వాన్ పీఠమును అధిష్టించిన పిదప శ్రీ వైష్ణవ దర్శనము “ఎమ్బెరుమనార్ దర్శనం” లేదా “రామానుజ దర్శనం” అను నామముతో జగద్విఖ్యాతి పొందగలదని శ్రీ యామునులు గోష్టిపుర్ణులకు తెలిపిరి. శ్రీ యామునుల చివరి క్షణములలో తమ శిష్యులు తమకు ఏది దారి యని దుఃఖము పొందగా శ్రీ యామునులు ఈ విధముగా సందేశము నిచ్చిరి, “ఇళయాళ్వాన్ మీకు నా తరువాత ఆచార్యుడు కాగలడు. అతడే మిమ్మల్ని ఉద్ధరించగలడు. ఇళయాళ్వాన్ వైభవము మాకు తెలిసిననూ అతని సహచర్యము పొందలేక చింతించుచు భార హృదయముతో పరమపదమును పొందుచుంటిని.”

ఈ విధముగా భగవద్రామానుజుల మునుపు ఆచార్యులందరూ భగవద్రామానుజులను ఉత్తారాకాచార్యులుగా స్థిరీకరించిరి.

అయితే భగవద్రామానుజుల అవతారమునకు మునుపే పూర్వాచార్యులు భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ఒప్పుకొనుట ఎట్లు సంభవం?

దీనికి సమాధానం వరాహ పురాణములోని ఈ క్రింది శ్లోకము చెబుతుంది.

ఆస్పోటయన్తి పితరః ప్రణ్యుత్యన్తి పితామహాః ।
వైష్ణవో నః కులే జాతః స నః సంతరిష్యంతి  ॥

పితరులు ఈ లోకము నందు లేకపోయిననూ తమ కుటుంబము నందు ఒక శ్రీ వైష్ణవుడు పుట్టుట చేత వారునూ ఉద్ధరిమ్పబడగలరు.

నాధమునులు మొదలగు ఆచార్యులు పరమపదము పొందిననూ నిత్యసూరుల నాయకుడగు ఆదిశేషుని అంశలో ఇళయార్వారు ప్రపన్న కులములో జన్మించుట చేత అది వారికి ఉద్ధరణ చేకూర్చినది.

అయితే పితరులు ఈ లోకములో లేకపోతే వారికి వైష్ణవత్వాధికారము ఉండదు. కనుక వారి కడ గమ్యము పరమపదము చేరుకోవడమే, దీనికి ఒక వైష్ణవుడు తమ ఇంట జన్మిస్తే చాలు.

కానీ నాథమునుల వంటి పూర్వాచార్యులు ఉత్తమమైన శ్రీ వైష్ణవులుగా లొకోద్ధరణ చేసి చరమ గమ్యమగు పరమపదమును పొందారు. అందుచేత వారికి ముక్తిని ఇవ్వగల ఉద్ధారకుడు అవసరము లేదు. కానీ, వారు భవిష్యదచార్యుని ఉత్తారకునిగా స్వీకరించారు. అందులో అతిశయోక్తి లేదు. దీనికి వివరణ పెద్దలు ఈవిధముగా ఇచ్చారు: నాథమునులు నమ్మాళ్వార్లను ఆశ్రయించి వారినే తమ ఉత్తారకునిగా స్వీకరించారు. నమ్మాళ్వార్ల దివ్య చరణాలను ఉపాయముగా భావించారు నాథమునులు. అందులో సందేహము లేదు. అయితే, నమ్మాళ్వార్లు భవిష్యదాచార్య అవతార రహస్యమును నాథమునులకు వివరిస్తూ, “భవిష్యత్తులో అవతరించబోవు జగదాచార్యుడు నా తిరువడిగా భావింపుము ఎలాగైతే లక్ష్మణుడు శ్రీ రాముని కుడి బాహువు (రామస్య దక్షిణో బాహు:) అని శ్రీ రామాయణములో వర్ణించినదో అటులను.” అని ఉపదేశించుట చేత నాథమునులు భవిష్యదాచార్యుని సాక్షాత్ తన ఆచార్య తిరువడిగా భావించి ఆరాధించారు. ఇటువంటి గొప్ప భావన నాథమునుల నుంచి పుణ్డరీకాక్షులకు, వారి నుంచి రామమిశ్రులకు, వారి నుంచి శ్రీ యామునులకు పరంపరగా ఉపదేశముగా సంప్రాప్తించింది. శ్రీ యామునుల నుంచి భవిష్యదాచార్య అవతార రహస్యము వారి శిష్యులైన గోష్టిపూర్ణులు, తిరుమలై ఆణ్డాన్, మహా పూర్ణులు, తిరువరంగ పెరుమాళ్ అరయర్ మొదలగు వారికి ఉపదేశముగా వచ్చింది. తిరుమాలై దివ్య ప్రబంధములోని “కణ్డ్  కొణ్మిన్ ” పాశురము మరియు గరుడ పురాణములో “తస్మై ధేయమ్ తతో గ్రాహ్యమ్ ” అను ప్రమాణాలననుసరించి ఉత్తమ భక్తునికి ఉండవలసిన 8 గుణములు 1) భగవంతుని మీద అకారణమైన ప్రేమ కలిగి ఉండుట 2) భగవద్ సేవను సంతృప్తిగా అనుభవించుట 3) శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుని మరియు నిత్యానపాయని అయిన లక్ష్మి దేవిని మాత్రమే ఆరాధించుట 4) గర్వము లేకుండుట 5) శ్రియఃపతి భగవద్గుణ వైభవమును ప్రేమతో వినుట 6) శ్రియఃపతి గురించి చెప్పినా, విన్నా, ఆలోచించినా రోమాంఛనము వంటి శరీరానుభవములు కలుగుట 7) ఎల్లప్పుడూ భగవంతుని గురించే ఆలోచించుట 8) భగవంతుని ఆరాధించి తుచ్ఛమైనవైన లౌకిక కోరికలు కోరకుండుట.

ఇటువంటి గొప్ప గుణములు భగవద్రామానుజులు కలిగి ఉండుట చేత శ్రీయామునుల పంచ శిష్యులైన గోష్టిపూర్ణులు మొదలగువారు ఆచార్యుల రూపములో భగవద్రామానుజులతో సంబంధము పొందటమే గాక తమ పిల్లలను కూడా భగవద్రామానుజులకు శిష్యులను చేసి వారికి కూడా భగవద్రామానుజ సంబంధము కలిగించిరి. శ్రియఃపతి అనుగ్రహము చేత ఘంటాకర్ణునితో పాటు  అతని సోదరుడు ముక్తి పొందినట్టు, శ్రీ రాముని విభీషణుడు శరణు జొచ్చినప్పుడు శ్రీ రాముడు అతనితో పాటు అతనితో వచ్చిన నలుగురు రాక్షసులను కూడా అనుగ్రహించి నట్టు, శ్రియఃపతి అనుగ్రహము చేత ప్రహ్లాదాళ్వాన్ తో పాటు అతని వంశమంతా ఉద్ధరింపబడి నట్టు శ్రీ యామునుల శిష్యులైన గోష్టిపూర్ణులు మొదలగు ఆచార్యులు తమ పిల్లలను భగవద్రామానుజుల సంబంధము కలిగించుట చేత తామూ ఉద్ధరింప బడినట్టు భావించారు. సాక్షాత్ భగవంతుడే తనను శరణు పొందిన భక్తులతో పాటు వారి సంబంధీకులను కూడా అనుగ్రహిస్తే, మరి భగవద్రామానుజుల గూర్చి ఏమని చెప్పవలెను. స్వామి కరుణ అమృత సదృశము. వారిని శరణుపొందిన వారితో బాటు వారి సంబంధీకులు కూడా ఉద్ధరింపబడగలరు. శ్రీ యామునుల పంచ శిష్యరత్నాలు భగవద్రామానుజుల ఆచార్యులు అగుటకు నాథమునుల దివ్య వాక్కులే పునాది మరియు భగవద్రానుజుల ఆచార్యులు అగుట చేత భగవద్రామానుజులతో గురుపరంపరకు సంబంధము కలిగించారు ఈ ఐదుగురు ఆచార్యులు.

ఆళవందార్ల ఆజ్ఞ ప్రకారం భగవద్రామానుజుల గురువులైన ఐదుగురు ఆచార్యులు తమ ఆచార్యత్వమును ఉపకారక రూపమున నిర్వహించెను.

ఆచార్యత్వము రెండు విధములు

ఉత్తారక ఆచార్యత్వము – తాముగా శిష్యుని సంసారము నుంచి ఉద్ధరించుట.

ఉపకారక ఆచార్యత్వము – తాము తమ శిష్యునికి తమ ఆచార్య సంబంధము కలిగించి ఉపకారము చేయుట.

ఈ విధముగా వారు భగవద్రామానుజులకు తమ గురుపరంపర ద్వారా నమ్మాళ్వార్ల   శ్రీ చరణ సంబంధము కలిగించారు.

ఒకవేళ వారు ఉత్తారకత్వము వహించినట్లైతే తమ పిల్లలకు తామే సమాశ్రయణములు చేసి తమ శిష్యులుగా చేసుకునేవారు. కానీ వారు అలా చేయక తమ పిల్లలను ఉత్తారకత్వమునకు అధికారము కలిగిన భగవద్రామానుజులకు శరణాగతి చేయించినారు.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://granthams.koyil.org/2012/12/charamopaya-nirnayam-thirumudi/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు)– https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment