చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజ వైభవ ప్రశస్తి

పూర్వవ్యాసమందు (https://granthams.koyil.org/2016/06/14/charamopaya-nirnayam-ramanujar-avathara-rahasyam-telugu/) భగవద్రామానుజుల అవతార రహస్యము తెలుసుకొంటిమి! ఇక ఈ వ్యాసమందు భగవద్రామానుజుల ఉత్తారకత్వమును (జీవులను ఉద్ధరించగల ఉత్తమ తత్వము) పూర్వాచార్యులైన పెద్దల అమృత అనుభవముల మూలముగా తెలుసుకొనెదము!

 తిరువాయ్మొళి ప్రవర్తకాచార్యులు – నమ్మాళ్వార్లు, భగవద్రామానుజులు, స్వామి మణవాళ మహాముణులు – ఆళ్వార్ తిరునగరి

భగవద్రామానుజులు తమ అభిమాన శిష్యులైన తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ కు తిరువాయ్మొళి కాలక్షేపము గావిస్తున్న సమయమున “పొలిగ! పొలిగ! (తిరు-5-2-1)” దశకము రాగానే పిళ్ళాన్ హర్షాతిరేకముతో పులికితులై ఉండుట గమనించిన ఉడయవర్లు. “పిళ్ళాన్! ఏమి ఆ వైలక్షణ్యము?” అని ప్రశ్నించగా, వారు, “నమ్మాళ్వార్లు దేవరవారి యొక్క అవతారమును కటాక్షించి కదా ఈ దశకమునందు “కలియుమ్ కెడుమ్ కణ్డుకొణ్మిన్ – కలి నశిస్తుంది చూడండి!”” అని కీర్తించారు! అలాగే మీరు కూడా “దీనికి మేమే నిరూపణము!” అను విధముగా వేంచేసి ఉన్నారు! ఇదంతయు మనసులో తలచుకుని పులకితుడనై ఆళ్వార్లు అనుభవించిన రీతిలో దేవరవారు ఈ జీవులను ఉద్ధరించుటకు సర్వోత్తారకులుగా అవతరించినవారు! అటువంటి జన్మ విశేషము కలిగిన దేవరవారి తిరుముఖ మూలముగా తిరువాయ్మొళికి అర్థము తెలుసుకొను మహద్భాగ్యమును పొందితిని గదా అను విస్మయమొందు చుంటిని!”, అని బదులిచ్చెను. ఉడయవర్లు సంతోషించి పిళ్ళాన్ ను ఆనాటి రాత్రి పేరరుళాళన్ అయిన వరదరాజ స్వామి సన్నిధికి తోడ్కొని పోయి, తమ తిరువడిగళ్లను అతని శిరస్సుపై ఉంచి, “ఇక ఈ పాదములే మీకు రక్ష అని నమ్మండి! రాబోవు కాలమందు మిమ్ములను ఆశ్రయించిన వారికిన్నీ వీటినే రక్షకములుగా చూపించండి! రేపటి నుంచి వరదరాజ స్వామి సన్నిధిలో తిరువాయ్మొళికి విష్ణు పురాణ సాంఖ్యముగా (6000 శ్లోకములు గల విష్ణు పురాణమునకు సామ్యముగా) వ్యాఖ్యానమును రాయండి”, అని ఆదేశించిరి!

ఉడయవర్లు తమ శిష్యులైన కూరత్తాళ్వాన్, ముదలియాణ్డాన్ మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్ లతో కూడి భగవద్విషయమునకు వ్యాఖ్యాన సహిత కాలక్షేపములు గావిస్తున్న రోజులలో ఎందరో ఆచార్యులు ఉడయవర్లను ఆశ్రయించి శిష్యులయ్యారు ! అలా అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలగు వారు ఉడయవర్లను ఆశ్రయించిరి! అయితే ఉడయవర్లు వారిని అరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల చేత సమాశ్రయణము చేయించిరి! అంతట అరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ తమ శిష్యులతో, ” పిచ్చుక కంఠానికి తాటికాయ కట్టినట్టు మీ అందరి బాధ్యత మోయుటకు నాకు శక్తి లేదు! సర్వోత్తారకులైన ఉడయవర్ల శ్రీ చరణాలే మీకూ మాకూ మనందరికీ దిక్కు!!”. అని బోధించెను! ఉడయవర్లు కూడా వారితో, “మీకు మా మూలముగా భగవత్సంబంధము కలిగించలేదని దిగులు పడకండి! మీ అందరి యొక్క ఉత్తారక బాధ్యత మా మీదనే ఉన్నది! మా చరణాలనే నిత్యమూ ధ్యానించండి!” అని చెప్పెను!

ఉడయవర్లు వారి శిష్యులు తిరుమల వెళ్ళి  తిరువేంగడముడైయాన్ అయిన శ్రీనివాసునికి  మంగళశాసనము చేయుటకు వరదరాజ పెరుమాళ్ళ వద్ద అనుమతి పొంది బయలుదేరిరి! నమ్మాళ్వార్లు “విణ్ణోర్ వెర్పు (తిరు-1-8-3) నిత్యసూరులు నివసించు కొండ” అని కీర్తించినట్టు, నిత్యసూరులే నిత్యము వచ్చి స్వామి కైంకర్యము చేసుకునే మహిమాన్వితమైన ఆ తిరుమల పర్వతమును కాలితో తొక్కి అపవిత్రము చేసి కొండను అగౌరవ పరచరాదన్న అభిప్రాయము కలిగి ఉడయవర్లు తిరుపతిలోనే నిలిచిపోయినారు! “తానే తొళుమ్ అతిశయుత్తు నొక్కీయే (తిరు – 6-5-5)- తానే ఆ దిశను చూస్తూ నమస్కరిస్తున్నది” అన్నట్లుగా తిరుమలేశుడు వేంచేసిన దిశవైపు చేతులెత్తి నమస్కరించి వెళ్ళిపోదామని అనుకున్నారు ఉడయవర్లు! అయితే తాము అంతకు ముందే స్వామి కైంకర్యము కొరకు నియమించిన అనంతాళ్వాన్ మరియు తక్కిన శ్రీ వైష్ణవులు, “మీరు కొండ ఎక్కనిచో మేము కూడా ఎక్కము! ఇకపై ఎవరును ఎక్కజాలరు! కనుక దేవరవారు అవశ్యం తిరుమల కొండ ఎక్కవలెను!”, అని ప్రార్థించెను! వారి విన్నపము మన్నించి ఉడయవర్లు, “పాదేనాధ్యారోహతి (ఛాన్దోగ్యోపనిషత్) – ముక్తుడు పాదముతో ఎక్కుతున్నాడు”, శ్రీ వైకుంఠనాధుని ఆజ్ఞతో పాదపీఠం పై కాలుమోపి అధిరోహించినట్లే, తిరుమలేశుని ఆజ్ఞానుసారం ఉడయవర్లు తిరుమల కొండ ఎక్కినారు! “ముడియుడై వానవర్ ముఱై ముఱై ఎదిర్గొళ్ల (తిరు -10-9-5) – కిరీటధారులైన నిత్యసూరులు క్రమానుసారముగా ఎదురు వచ్చి ముక్తుని ఆహ్వానించగా”, అనునట్లు తిరుమలలో స్వామి కైంకర్యపరులైన తిరుమల నంబి శ్రీ వైష్ణవ పరివారముతో పెరుమాళ్ళ తీర్థ ప్రసాదములను గైకొని ఎదురు వచ్చి ఉడయవర్లను ఆహ్వానించెను! ఉడయవర్లు భక్తితో దండం సమర్పించి తీర్థ ప్రసాదములు స్వీకరించి వయో వృద్ధులైన తిరుమల నంబిని ఉద్దేశించి, “మీరు ఇంత శ్రమ తీసుకోవాలా? చిన్నవారు ఎవరూ లేరా? ” అని అడుగగా నంబి, “నాలుగు మాడ వీధులలో ఎంత వెదకినను నాకన్నా చిన్నవాడు ఎవరూ కనపడలేదు! సాక్షాత్ ఆ తిరుమలేశుడే వచ్చి స్వాగతం పలకాలి! సర్వ జీవ ఉద్ధారకులైన మీవంటి మహానుభావుని ఆహ్వానించుటకు నాకు ఏ మాత్రము అర్హత లేదు! అయినా పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞను అనుసరించి నేను రాక తప్పలేదు”, అని నిగర్వముగా సమాధానమిచ్చెను! వారి యొక్క నిర్మలమైన నిరహంకార మనస్సుకు పులకితులైన ఉడయవర్లు మరి మరి దండం సమర్పిస్తూ సన్నిధిలోకి వేంచేసి పెరుమాళ్ళకు దండం సమర్పించి మంగళాశాసనము చేసి నిలువగా, ఆ ఆనందనిలయవాసుడు పరమానందముతో అర్చకముఖేన ఇట్లనెను, “మేము మీకు మా దక్షిణ గృహమైన శ్రీ రంగములో ఉభయ విభుతి ఐశ్వర్యములను ప్రసాదించి జగత్తును ఉద్ధరించుటకు నియమించితిమి కదా! ఇక ఏమి కొరవ ఉన్నదో చెప్పండి! ప్రసాదించెదము!” !

అంతట ఉడయవర్లు పెరుమాళ్ళకు దండము సమర్పించి,”స్వామి! కిడందదోర్ కిడక్కై (తిరుమాలై-23) – శయనించిన రూపము అద్వితీయము” అనియు, మరియు, “పిరాన్ ఇరుందమై (తిరు-6-5-5) – స్వామి కూర్చున్న అందము” అనియు మరియు, “నిలైయార నిన్ఱార్ (పెరియ తిరు-6-9-8) – నిలుచున్న స్వామి అందము”, అనియు దేవరవారి శయన, ఉపవిశ్య, ఉత్తిష్ట భంగిమలు ఎంతో అందముగా ఉంటాయి! శయన సౌందర్యమును శ్రీ రంగములో అనుగ్రహించితివి! నిలిచి ఉన్న భంగిమలో నీయొక్క సౌందర్యము హస్తిగిరిలో (కాంచీ పురము) అనుభవించితిమి! “అమరర్ మునిక్కణంగళ్ విఱుమ్బుమ్ తిరువేంగడత్తానే! (తిరు – 6-10-10) – దేవతలు, మునులు ఎంతో ఇష్టపడే ఓ తిరుమలేశుడా! “, అనునట్లు, ఈ తిరుమలలో గుణనిష్టులు, నీ యొక్క కైంకర్యపరులకు నీ దర్శనమును అనుగ్రహించెడి సన్నివేశం కనులార వీక్షించవలెనన్న కాంక్షతో వరదరాజ స్వామి వద్ద అనుమతి గొని నీ సన్నిధికి వచ్చితిమి!”, అని భక్తి పూర్వకముగా బదులిచ్చెను! అంతట పెరుమాళ్ళు, “అయితే ఇచటకు రండి” అని తమ వద్దకు పిలిచి తమ శ్రీచరణముల వద్ద శిరస్సు వంచమని, “మా తిరువడిని నిత్యమూ స్మరించి దర్శనాన్ని నిర్వహించండి! ఉభయ విభూతులకున్నూ మీరే అధికారి! మీ అభిమానములో ఒదిగిన వారే మాకు ఆప్తులు! అందరిని మాకు దాసులు అయ్యే రీతిలో సంస్కరించండి! జగత్తును ఉద్ధరింపచేయుట కొరకే మిమ్ములను మేము అవతరింప చేసితిమి! మీతో సంబంధము కలవారికి ఏ కొరతా ఉండదు! “శూళల్ పల పల (తిరు -1-9-2) – చేసిన ఉపాయములు అనేకములు”, అనునట్లు ప్రపన్నుల కొరకు మేము ఎన్ని అవతారాలెత్తి వెదకినను లభించ లేదన్న కొరతతోనే శ్రీ వైకుంఠమునకు వెళ్ళి పోయాము! ఆ కొరతను మీరు తీరుస్తారని విశ్వసిస్తున్నాము! మా నమ్మకమును నిజము చేసి చూపించుము!”, అని తిరుమలేశుడు ఉడయవర్లకు బదులిచ్చెను! ఈ విధముగా తిరుమల పెరుమాళ్ళు కూడా ఉడయవర్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించెను!

అచట నుంచి ఉడయవర్లు వారి శిష్య గణము తిరుక్కురుంగుడి వెళ్ళిరి. అక్కడ వేంచేసి ఉన్న తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళు ఉడయవర్లను సాదరముగా ఆహ్వానించి, వారిని ఆశీర్వదించి వారితో ఇట్లనెను, “”బహూని మే జన్మాని వ్యతీతాని (భగవద్గీత 4-5) – నా జన్మలు అనేకములు గడిచినాయి”, అనునట్లు ఎన్ని జన్మలు లోక కళ్యాణార్థమైన మేము ఎత్తిననూ మాకు మావారని ఎవ్వరూ లభించక, “అసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని, మమ ప్రాప్యైవ కౌంతేయ! తతో యాంత్యధమాం గతిమ్ (భగవద్గీత 16-20) – దుష్ట యోనులలో ముఢులై ఎన్నో జన్మలు ఎత్తిన జీవులు నన్ను పొందకనే మరింత అధోగతి పాలవుతున్నారు”, అనునట్లు అసురప్రకృతి కలవారై అధోగతి పాలవుతున్నారు! కానీ ఇప్పుడు అదే జనులు మిమ్ములను ఆశ్రయించి తరించుచున్నారు! ఈ విధముగా మీరు వారిని ఆకర్షించుకున్న ఉపాయమేమి? ఆ ఉపాయము మీరు మాకు కూడా చెప్పవలెను!”, అని తిరుక్కురుంగుడి నంబి ఉడయవర్లను అడుగగా ఉడయవర్లు, “దేవరవారు సర్వజ్ఞులు! అయినా మీరు అడిగినారు కనుక చెప్పెదము! అయితే ఆ ఉపాయము తెలుసుకొనుటకు అడగవలసిన విధము కలదు! ఆ విధమున మీరు అడిగినచో ఆ దివ్య రహస్యమును మీకు చెప్పగలము!”, అని బదులివ్వ నంబి తమ మూల స్థానము నుంచి క్రిందకి వచ్చి కింద చిత్రాసనముపై కూర్చుని ఉడయవర్లను తమ సింహాసనముపై కూర్చుండ బెట్టి అందరిని బయటకి పంపించేసి, “ఇప్పుడు అషట్కకర్ణముగా ఉన్నది! అనుగ్రహించ వచ్చును!”, అని అనగా ఉడయవర్లు, “నివేశ్య దక్షిణే స్వస్య వినతాంజలి సంయుతం, మూర్ధ్ని హస్తం వినిక్షిప్య దక్షిణం జ్ఞాన దక్షిణం, సవ్యం తు హృది విన్యస్య కృపయా వీక్షయేత్ గురుః, స్వాచార్యం హృదయే ధ్యాత్వా జప్త్వా గురుపరంపరామ్, ఏవం ప్రపద్య దేవేశం ఆచార్యం కృపయా స్వయం, అధ్యాపయేన్మన్త్ర రత్నం సర్షిచ్ఛన్ధోధి దైవతం – వినయముతో అంజలి చేసిన శిష్యుని తన దక్షిణ దిక్కులో కూర్చొనపెట్టుకుని, అతని తలపై జ్ఞాన దక్షిణమైన కుడి చేతిని ఉంచి, ఎడమ చేతిని తన గుండెపై పెట్టుకుని, గురువు ఆ శిష్యుని కటాక్షించాలి! తన ఆచార్యుని హృదయమందు ధ్యానించి, గురుపరంపరను జపించి, భగవానుని, ఆచార్యుని శరణు వేడి, కృపతో స్వయముగా మంత్రరత్నమును, ఋషి – ఛందస్సు – అధిదేవతల సహితముగా మంత్రమును ఉపదేశించవలెను!”, అనువిధముగా తిరు మంత్రమును మరియు ద్వయ మంత్రమును నంబి యొక్క కుడి శ్రీ కర్ణ మందు ఉడయవర్లు ఉపదేశించిరి!

అంతట ఉపదేశము పొందిన నంబి పరమ సంతోషముతో, “మేము ఒకనాడు బదరికాశ్రమము నందు శిష్యాచార్య రూపేణ తిరు మంత్రమును బహిర్గతము చేసితిమి! అచట మేమే శిష్యునిగా మరియు ఆచార్యునిగా ఉండితిమి! కానీ అన్యుని ఆచార్యునిగా స్వీకరించి మేము శిష్యులమై ఉండి ఉపదేశము పొందుట ఇప్పటివరకు జరుగలేదే అనే పెద్ద కొరతతో ఉంటిమి ఇన్నాళ్ళున్నూ! ఆ కొరత నేడు మీమూలముగా తీరినదే! ఇక ఈనాటి నుంచి మేము కూడా రామానుజుల శిష్యులలో ఒకరిగా ఆవిర్భవించితిమి కదా! ఈ నాటి నుంచి మేము వైష్ణవ నంబి అయినాము! “, అని అనుగ్రహించిరి! అయితే నంబి యొక్క శిష్యత్వము వారి యొక్క స్వాతంత్ర్య గుణము యొక్క పరాకాష్ట అని తాత్పర్యము! అందరికి ఆదిగురువైన ఆ పరమాత్మ (తిరుక్కురుంగుడి నంబి) రామానుజుల వద్ద శిష్యరికము చేయుటలో ఉన్న ప్రభావమును గుర్తించి వారి వద్ద శిష్యరికమునకు ఆశపడుట కేవలం ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును లోకమునకు చాటుట కొరకే కదా!

నడాదూరు అమ్మాళ్  శ్రీ చరణాలను ఆశ్రయించి పన్నెండు మంది శిష్యులు శ్రీ భాష్యమును అధికరించుచున్న కాలమందు, “భక్తి ప్రపత్తులు దుశ్శకములు, స్వరూప విరుద్ధములు, విశ్వాస దుర్లభములు కనుక అవి ఆచరించలేని నిస్సహాయుడైన చేతనునికి ఇక ముక్తి ఏ విధంగా కలుగుతుంది? “, అను సంశయమును శిష్యులు అమ్మాళ్ వద్ద అడుగగా వారు, “ఇవి రెండూ లేని వారికి ఉడయవర్ల శ్రీ చరణములే దిక్కు! అంతకన్నా వేరే దారి లేదు! నేను నమ్మిన సత్యమూ అదే!”, అని బదులిచ్చెను! అమ్మాళ్ చరమదశలో శిష్యులు వద్దకు చేరి తాము తరించుటకు దారేదని అడుగగా వారు, “భక్తి ప్రపత్తులు ఆచరించండి! అవి దుష్కరములుగా తోచినచో రామానుజుల దివ్య చరణయుగళాన్ని పట్టి ఉండండి! అవే మీకు రక్షకములని విశ్వసించండి! ఇక మీ సంతోషమునకు కొరత రాదు!”, అని బదులిచ్చెను! “ప్రయాణకాలే చతురః స్వశిష్యాన్ పదాంతికస్థాన్, వరదో హి వీక్ష్య, భక్తిప్రపత్తీ యది దుష్కరే వో రామానుజార్యమ్ నమతేత్యవాదీత్!! – వరదులనబడే నడాదూరు అమ్మాళ్ తమ ప్రయాణకాల మందు తమ పాదాలను ఆశ్రయించిన శిష్యులను చూచి, “భక్తి ప్రపత్తులు మీకు ఆచరణ సాధ్యములు కాకున్నచో రామానుజులను శరణాగతి చేయండి!”- అని అన్నారు”, అని చెప్పిన అర్థము సుప్రసిద్ధము కదా!!

కారాంజి గ్రామస్థులైన సోమాసియాణ్డాన్ ఉడయవర్లకు అభిమాన శిష్యులు! చాలా రోజులు శ్రీ రంగములో  ఉండి ఆచార్య కైంకర్యము చేసుకొని తమ స్వగ్రామానికి వెళ్ళినారు! అయితే కొన్నాళ్ళకు భార్యాభిమానములో మునిగిన సోమాసియాణ్డాన్ ఆచార్య కైంకర్య విషయమును విస్మయించి ఉడయవర్లను సేవించుటకు శ్రీరంగము వెళ్ళలేదు! సోమాసియాణ్డాన్ తమ స్వగ్రామములో ఉడయవర్లకు ఆలయము కట్టించవలెనని సంకల్పించి విగ్రహము చేయించారు! అయితే విగ్రహము తమకు నచ్చినట్టు రానందున మరియొక శిల్పము చెక్కించవలెనని స్థపతికి చెప్పెను! ఆనాటి రాత్రి సోమాసియాణ్డాన్ కు స్వప్నములో ఉడయవర్లు సేవ సాయించి, “నీవు ఎందుకు నన్ను బాధించి నా విగ్రహము తయారు చేయుచుంటివి? నా పట్ల అభిమానమే ఉత్తారకమని గ్రహించని నీవు నా విగ్రహమునకు ఎట్లు శరణాగతి చేయగలవు?”, అని తెలుపగా ఉలిక్కిపడి లేచిన సోమాసియాణ్డాన్ తాను తప్పు చేయుచున్నట్లు గ్రహించి తమ భార్యను వెంటబెట్టుకుని శ్రీ రంగము వెళ్లి ఉడయవర్ల పాదాలపై బడి చంటి పిల్లవాని వలె విలపించెను! అంతట ఉడయవర్లు కారణమేమని అడుగగా సోమాసియాణ్డాన్ తమ స్వప్న వృత్తాన్తమును తెలిపి క్షమించమని ప్రార్థన చేసిరి! దానికి ఉడయవర్లు సమాధానమిస్తూ, “నీకున్న స్త్రీ ఆసక్తి ని వదిలించుట కొరకే మేము అటుల స్వప్నమందు దర్శనమిచ్చితిమి! అంతే కానీ నీ మీద మాకు కోపము లేదు! నీవెక్కడ ఉన్ననూ నీ బాధ్యత మాదే కదా!! నీ యొక్క భారములన్నియు మాపై ఉంచి నిర్భయముగా జీవించుము!!”, అని చెప్పినట్లు మన పెరియ వాచ్చాన్ పిళ్ళై గారు అనుగ్రహించిరి!!

కణ్ణియనూర్ ఆచ్చాన్ ధరించిన దుస్తులతోనే కావేరి యందు స్నానమాడి (సాధారణముగా స్నానము ధరించిన దుస్తులతో చేయరాదు! వేరే దుస్తులు ధరించి స్నానమాచరించ వలెను! చర్మ కైంకర్యము లందు, చక్ర స్నాన మందు మరియు సత్య ప్రమాణము చేయు సమయ మందు మాత్రమే ధరించిన దుస్తులతో స్నానము చేయవలెనని శాస్త్రము చెప్పుచున్నది !) పెరియ తిరుమండపమును నందు శ్రీవైష్ణవులందరిని రావించి, శ్రీ శఠకోపము తలపైనుంచుకొని ఇట్లు చెప్పిరి:

సత్యమ్ సత్యమ్ పునస్సత్యమ్ యతిరాజో జగద్గురుః |
స ఏవ సర్వ లోకానామ్ ఉద్ధర్తా నాస్తి సంశయః ||

అర్థము: ఇది సత్యము ! ఇది సత్యము !ఇదే సత్యము ! మన యతిరాజులే జగద్గురువులు!! వారు మాత్రమే సర్వ లోకములను ఉద్ధరించ గలవారు!! ఇది నిస్సంశయము!!

అక్కడ గుమిగూడిన అందరిని ఉద్దేశించి ఆచ్చాన్ ఇట్లు ఘోషించెను, “ప్రపన్న కులమునకు చెందిన అందరు శ్రీ వైష్ణవులకు భగవద్రామానుజులే రక్షకులు! వారి శ్రీ చరణాలు మనకు ఉద్ధారకము! నా మాటను నమ్మండి !”

వచ్చే అధ్యాయములో ఉడయవర్ల ఉత్తారకము గురించి మరిన్ని ఐతిహ్యములు తెలుసుకుందాం!!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

0 thoughts on “చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1”

Leave a Comment